సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి తాగునీరు అందిస్తోన్న జలమండలి త్వరలో సౌరకాంతులు సంతరించుకోనుంది. వాటర్‌బోర్డుకు చెందిన 59 రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల వద్ద టీఎస్‌రెడ్‌కో(తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో 30 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సౌరఫలకలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుతో జలమండలికి యూనిట్‌కు రూ.3 లోపే విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. దీంతో బోర్డుపై విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం జలమండలికి పరిశ్రమల కేటగిరి కింద విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో యూనిట్‌కు రూ.5.60 చెల్లించాల్సి వస్తోంది. మార్చి రెండోవారంలోగా కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ అనుమతితో ఈప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను టీఎస్‌రెడ్‌కో పూర్తి చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ టెండర్‌ను దక్కించుకున్న సంస్థ ఆధ్వర్యంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తారు.
దానకిశోర్ చొరవతో..
సోలార్ ప్రాజెక్టుకు జలమండలి అనుమతి సాధించడంతో దేశంలో పలు మహానగరాల్లోని జలబోర్డులకు జలమండలి ఆదర్శంగా నిలవనుంది. ప్రభుత్వ రంగ జలబోర్డుల పరిధిలో సౌరవిద్యుత్ ప్రాజెక్టును సాకారం చేసి విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందడంలో బోర్డు సరికొత్త రికార్డు సృష్టించనుంది. ప్రభుత్వరంగ సంస్థలో ఇలాంటి ప్రాజెక్టును సాకారం చేసిన ఘనత బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్‌కు దక్కనుంది. ప్రతీనెలా విద్యుత్‌బిల్లుల భారంతో కుదేలవుతోన్న బోర్డుకు సౌరవిద్యుత్ సరైన ప్రత్యామ్నాయమని గుర్తించిన ఆయన టీఎస్‌రెడ్‌కో సౌజన్యంతో ఈ సోలార్‌పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో జలమండలిపై ఎలాంటి ఆర్థికభారం ఉండదని బోర్డు వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
జలమండలికివిద్యుత్ బిల్లుల కష్టాలు
ఇప్పటికే రూ.140 కోట్ల పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక వాటర్‌బోర్డు ఆపసోపాలు పడుతోంది. దీనికితోడు ప్రతినెలా రూ.70 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా,గోదావరి జలాల పంపింగ్, స్టోరేజి రిజర్వాయర్ల నుంచి నల్లా కనెక్షన్లకు నీటిసరఫరాకు నెలకు సుమారు 120 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. మరోవైపు జలమండలికి నెలవారీగా నీటిబిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.100 కోట్ల మేర సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.114 కోట్లు మించుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.70 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటిశుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.44 కోట్లు వ్యయం చేస్తున్నారు. ప్రతినెలా బోర్డు దాదాపు రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికితోడు కొన్ని నెలలుగా రూ.140 కోట్ల మేర విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో బోర్డు ఖజానాకు షాక్‌లా పరిణమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment