పీరం చెరువులోని గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ గేటెడ్ కమ్యూనిటీ నివాసాలపై అమర్చిన సోలార్ ప్యానళ్లు
గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్.. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధి హైదర్‌షాకోట్ పీరంచెరువులోని గేటెడ్ కమ్యూనిటీ ఇది. ఇక్కడ మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో పది బహుళ అంతస్తుల భవనాలు నిర్మించగా 518 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి వ్యక్తిగత, ఉమ్మడి అవసరాలు మొత్తం నెలవారీ విద్యుత్ బిల్లు రూ.12 లక్షలు వస్తుంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ఇంటి యజయానులంతా కలిసి రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామార్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ పలకను ఏర్పాటు చేశారు. ఫలితంగా నెలవారి విద్యుత్ ఖర్చు రూ.6 లక్షలకు తగ్గింది. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు కేవలం గిరిధారి వంటి గేటెడ్ కమ్యూనిటీలే కాదు.. ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలు సైతం సోలార్ విద్యుత్‌పై దృష్టి సారించాయి. ఫలితంగా ప్రస్తుతం గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3,186 మంది తమ బహుళఅంతస్తుల నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని 60.9 మెగావాట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగా నెలవారి విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడమే కాదు.. ఆయా యూనిట్ల నుంచి వచ్చిన విద్యుత్‌ను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సైతం విక్రయిస్తున్నాయి.
రాజేంద్రనగర్‌లోనిఅగ్రికల్చర్ యూనివర్సిటీ పరిపాలనాభవనాలు సహా పరిశోధనా సంస్థలు, విద్యార్థి వసతిగృహాలకు ఏడాదికి రూ.కోటికి పైగా విద్యుత్ బిల్లు వచ్చేది. సోలార్ పలకలు ఏర్పాటు చేసిన తర్వాత వర్సిటీ ఏడాది విద్యుత్ బిల్లు రూ.40 లక్షలు తగ్గింది.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో గేటెడ్ కమ్యూనిటీ నివాసాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్రాలుగా నిలుస్తున్నాయి. తమ ఇళ్లపై స్వయంగా సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుని, నెలవారీ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా సరఫరా భారం నుంచి డిస్కంకు ఊరటనిస్తున్నాయి. రూఫ్‌టాప్ పలకల ఏర్పాటు ఆర్థికంగా కొంత భారమే అయినప్పటికీ ఒకసారి ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల వరకు లబ్ది పొందే అవకాశం ఉండడంతో యజమానులు తమ బహుళ అంతస్తుల భవనాలపై సోలార్ పలకను బిగిస్తున్నారు. సొంత అవసరాలను తీర్చుకోవడమే కాదు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయించి సొమ్ము లాభాలు గడించడం గమనార్హం. ఇప్పటికే మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కేంద్ర కార్యాలయం, రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఉస్మానియా ఆస్పత్రి, బాలానగర్‌లోని మిథాని సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి బిల్లులు తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ గేటెడ్ కమ్యూనిటీతో పాటు శివారులోని శామీర్‌పేటలోని జినోమ్‌వ్యాలీలో 952 కిలోవాట్లు, అదేప్రాంతంలోని జవహర్‌నగర్‌లో 947 కిలోవాట్లు, కోకాపేట్ ఓపెన్ స్పేస్‌లో 100 కిలోవాట్లు, కిమ్స్ రెసిడెన్సీలో 275 కిలోవాట్లు, హిమయత్‌సాగర్ ఓనర్స్ అసోసియేషన్ 710 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ పలకలను ఏర్పాటు చేసి వారి నెలవారి విద్యుత్ బిల్లులను సగానికి తగ్గించుకున్నారు. నిథమ్ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పలకలను బిగించి నెలకు రూ.2.50 లక్షల విద్యుత్ బిల్లును ఆదా చేసుకుంటోంది. పైగా సోలార్ పవర్ ఉత్పత్తి ఇంటి అవసరాలకు వినియోగించుకుని కరెంటు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆదాయ మార్గంగా మారింది. దీంతో చాలామంది వ్యక్తిగత నివాసాలపైన కూడా సౌరపలకలను బిగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఒకసారి బిగిస్తే 25 ఏళ్లు వినియోగం
గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిఫ్‌లు, రెసిడెన్షియల్ కాలనీలకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వ్యక్తిగతంగా కాకుండా అందరికీ కలిపి ఒకే కనెక్షన్(హెచ్‌టీ) జారీ చేస్తుంది. తర్వాత వ్యక్తిగత మీటర్లు అమర్చుకుని బిల్లులు చెల్లిస్తుంటారు. ఇలా ఆయా కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, కాలనీల నుంచి యూనిట్ విద్యుత్‌కు రూ.6.30 చొప్పున వసూలు చేస్తుంది. వాటి యజమానులు తమ నిర్మాణాలపై ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు రూ.4.09 పైసలు చెల్లిస్తుంది. ఇంటిపై ఒకసారి ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఇంటి అవసరాలు తీరగా, మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయించి బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఇటీవల ఈ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. సాధారణ విద్యుత్ చార్జీలతో పోలిస్తే సోలార్ ప్లాంట్ ఏర్పాటు కొంత ఖరీదుతో కూడిన వ్యవహారం. కానీ ఒకసారి పెట్టుబడి పెడితే..ఎక్కువ కాలం లబ్ది చేకూరడంతో పాటు ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 25 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా ఇస్తుండడంతో వీటి ఏర్పాటుకు ఎక్కవ మంది ఆసక్తి చూపుతున్నారు.
నిథమ్‌కు ఎంతో లాభం
నిథమ్ క్యాంపస్‌కు విద్యుత్ బిల్లుల భారం ఎక్కువగా ఉండటంతో దాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని భావించాం. ఇటీవల 200 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. దీంతో నెలవారి విద్యుత్ బిల్లు రూ.2.50 లక్షల వరకు తగ్గింది. – ఎస్.చిన్నంరెడ్డి, నిథమ్ డైరెక్టర్
ప్రభుత్వ ప్రోత్సాహం
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సౌరశక్తి ద్వారా రోజుకు సగటున 100 మెగవాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే 60 మెగవాట్లకు పైగా ఉత్పత్తి అవుతోంది. సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుండడంతో వీటిని ఏర్పాటు చేసేందుకు గృహ, వాణిజ్య వినియోగదారులు ముందుకు వస్తున్నారు. – రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్
బిల్లు భారం సగం తగ్గింది
గిరిధారి గేటెడ్ కమ్యూనిటీకి గతంలో నెలకు రూ.12 లక్షలు దాటి విద్యుత్ బిల్లు వచ్చేది. ఇటీవల రూ.3.76 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ప్రభుత్వం 1.16 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ నెలకు 85,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా ప్రస్తుతం నెలవారి విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది. – కె.యాదగిరిరెడ్డి,గిరిధారి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment