gated community
-
హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ.. రూ.3,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగ సంస్థ హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ఆవిష్కరించింది. హానర్ సిగ్నాటిస్ పేరుతో హైటెక్‌సిటీ–కూకట్పల్లి మార్గంలో ఐడీఎల్ రోడ్డులో రూ.3,000 కోట్లతో ఈ భారీ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టింది. 27.5 ఎకరాల్లో ఒక్కొక్కటి 25 అంతస్తుల్లో 18 టవర్లు రానున్నాయి. మొత్తం 3,266 అపార్ట్మెంట్లను నిర్మిస్తారు. హానర్ సిగ్నాటిస్ ఇప్పటికే సుమారు 1,300 బుకింగ్స్ నమోదు చేసింది. రెరాకు సమర్పించిన ప్రణాళిక ప్రకారం 9 టవర్లతో కూడిన తొలి దశ ప్రాజెక్టు 2026 డిసెంబరుకల్లా పూర్తి కావాల్సి ఉంది. గడువు కంటే ముందుగా తొలి దశ పూర్తి చేస్తామని ప్రమోటర్–డైరెక్టర్ బాలు చౌదరి వెల్లడించారు. ప్రమోటర్–డైరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, స్వప్న కుమార్, రాజమౌళితో కలిసి ప్రాజెక్టు విశేషాలను గురువారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ధర రూ.3 కోట్ల వరకు.. ఒక్కో అపార్ట్మెంట్ 1,695–3,815 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 3.5, 4 బీహెచ్‌కే ఆఫర్ చేస్తారు. ధర రూ.1.25 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంది. 4 బీహెచ్‌కే అల్ట్రా ప్రీమియం అపార్ట్మెంట్స్ కోసం ప్రత్యేకంగా నాలుగు టవర్లు ఏర్పాటు చేస్తారు. 1.31 లక్షల చ.అ.విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌజులు ఉంటాయి. వీటిలో 20,000 చ.అ.విస్తీర్ణంలో జిమ్ నెలకొల్పుతారు. రెండు స్విమ్మింగ్ పూల్స్, సూపర్ మార్కెట్, క్లినిక్, అలాగే లాకర్ సౌకర్యంతో బ్యాంక్ వంటివి రానున్నాయి. ఈవీ చార్జింగ్ స్టేషన్, 5 ఎకరాల పార్క్ అదనపు ఆకర్షణ. స్కూల్ బస్‌లు వచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డు నిర్మిస్తారు. ఐజీబీసీ నుంచి ఈ ప్రాజెక్టు ప్రీ–సర్టిఫైడ్ గోల్డ్ ధ్రువీకరణ అందుకుంది. మరో కోటి చ.అ. విస్తీర్ణంలో.. హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులను 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేసింది. మూడవ ప్రాజెక్టు హానర్ రిచ్మాంట్లో భాగంగా 28.4 ఎకరాల్లో 12 లక్షల చ.అ. విస్తీర్ణంలో విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. నాల్గవ ప్రాజెక్టు అయిన హానర్ సిగ్నాటిస్ 78 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటవుతోంది. రానున్న రోజుల్లో మరో ఒక కోటి చ.అ.విస్తీర్ణం జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నాణ్యత, అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ రియల్టీ రంగంలో టాప్–10లో నిలవాలన్న లక్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెట్టినట్టు సంస్థ తెలిపింది. -
కరోనాకు ధైర్యమే మందు అంటూ...
హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూసాపేట డివిజన్ మోతీనగర్ కనకధార గోల్డ్ అపార్టుమెంట్ అసోసియేషన్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అపార్టుమెంట్ వాసులంతా కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తూ మహమ్మారి కట్టడికి సమష్టిగా కృషి చేస్తున్నారు. కరోనాకు ధైర్యమే మందు అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ తోడ్పాటునందించుకుంటున్నారు. అపార్టుమెంట్ పరిసరాలతో పాటు ఫ్లాట్లను నిత్యం శానిటైజేషన్ చేస్తున్నారు. అపార్టుమెంట్ గేట్ వద్ద శానిటైజర్‌ను ఏర్పాటు చేసి అపార్టుమెంట్‌కు వచ్చే వారు చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. మాస్కు ధరిస్తేనే అపార్టుమెంట్లోకి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్కీనింగ్ చేస్తున్నారు. అపార్టుమెంట్ వాసులకు కావాల్సిన సరుకులను డెలివరీ బాయ్ తీసుకువస్తే వాటిని సెక్యూరిటీ వారు శానిటైజ్ చేసి యజమానులుకు అందజేస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు బయట పడితే వారికి ధైర్యం చెబుతూ వైద్యులను సంప్రదించి మందులు తీసుకొచ్చి ఇస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆహారం వండిపెట్టేందుకు ఎవ్వరూ లేకపోతే ఆహారం కూడా అందిస్తున్నారు. అపార్టుమెంట్లో ఉండేవారిని కలిసేందుకు కుటుంబసభ్యులు, బంధు,మిత్రులు వస్తే ఫోన్ ద్వారా సంప్రదించి బయటే మాట్లాడి పంపిస్తున్నారు. ఏదో జరిగిపోద్దని ఊహించుకోరాదు కరోనా పాజిటివ్ అనగానే ఎవ్వరూ అధైర్య పడకూడదు. ధైర్యంగా ఉంటూ వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఏదో జరిగిపోద్దని ఊహించుకుంటూ ఆందోళన చెందరాదు. మా అపార్టుమెంట్లో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారికి వైద్యుల సలహా మేరకు మందులు అందజేసి ధైర్యం చెప్పా. వారు కోలుకున్నారు. మా అపార్టుమెంట్‌ను తరచూ శానిటైజేషన్ చేయిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. –నలమాల్పు అంజిరెడ్డి, అపార్టుమెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు -
అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం
హైదరాబాద్: విభిన్న వర్గాల ప్రజల సమైక్య జీవనం సాగించే ప్రాంతం అది. ఐక్యతతో ఒకే కుటుంబంలా ఉంటారు వారంత. ఎలాంటి ఉపద్రవం సంభవించినా వారంతా సమష్టిగా స్పందిస్తారు. అదే రహమత్‌నగర్ డివిజన్లోని ‘స్వామి వివేకానంద వెల్ఫేర్ సొసైటీ’. రహమత్‌నగర్ డివిజన్‌లోనే ఆదర్శంగా నిలిచింది ఈ సొసైటీ. తాజాగా కరోనా మహమ్మారిని నివారించడానికి సంఘం పలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కోవిడ్ సెకండ్ వేవ్‌లో తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు, నిర్ణయాలను సొసైటీ సెక్రటరీ సర్దార్ గురుదీప్ సింగ్ వివరించారు. ∙రహమత్‌నగర్‌లోని స్వామి వివేకానంద వెల్ఫేర్ సొసైటీలో 60కి పైగా అపార్ట్మెంట్స్, 20 ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నాయి. సుమారు 5 వేల జనాభా వరకు ఉంటుంది. ∙స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కార్యాలయం కూడా ఇదే సొసైటీలో ఉంది. అయితే నిత్యం కాలనీలో కార్పొరేటర్ ఏర్పాటు చేసిన శానిటేషన్ వాహనం ద్వారా శానిటైజ్ చేస్తుంటారు. ∙కాలనీలో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తుంటారు. ∙గత లాక్డౌన్, ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్‌లోనే ఈ కాలనీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ∙కోవిడ్ తీవ్రతపై కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు ప్రతివారం సమీక్షిస్తుంటారు. ∙మాస్క్‌లను తప్పనిసరిగా వాడాలని, ప్రతి అపార్ట్మెంట్లో మాస్క్‌లు లేకుండా ఎవరినీ రానివ్వొద్దని, శానిటైజర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ∙తరుచూ ఆరోగ్య సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ∙పండ్ల రసాలు, తాజా కూరగాయలు, పౌష్టికాహారం తీసుకోవాలని, కొన్ని రోజులు బయటి ఆహారం వాడరాదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ∙కోవిడ్ సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తుంది. ∙మనం తీసుకునే జాగ్రత్తలు, చర్యల వల్లే కరోనాను నియంత్రించగలమని, సొసైటీని కరోనా రహితంగా చేయడానికి సంఘం ప్రతిని«ధులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కోవిడ్ రహిత సొసైటీకి కృషి కోవిడ్ నియంత్రణకు సొ సైటీ ప్రతినిధులతో సమీక్షిస్తున్నాం. స్వీయ రక్షణ పాటించాలని స్థానికులను పదేపదే కోరుతున్నాం. లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. చిన్నపాటి జాగ్రత్తలతో కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టొచ్చు. ప్రతిఒక్కరినీ అప్రమత్తం చేస్తున్నాం. భయం వీడి కోవిడ్ రహిత సొసైటీగా చేసే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నాం. – సర్దార్ గురుదీప్ సింగ్, సొసైటీ సెక్రటరీ -
కోవిడ్ సంక్షోభ సమయంలో.. ఆదర్శం ఈ అపార్ట్మెంట్
సాక్షి, లంగర్‌హౌజ్: కోవిడ్ ఉధృతంగా విస్తరిస్తున్న వేళ.. స్వీయ నియంత్రణ చర్యలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు లంగర్‌హౌజ్‌లోని మధుపార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులు. అటు కరోనా విస్తరించకుండా క్రమశిక్షణగా వ్యవహరిస్తూ.. ఇటు కరోనా సోకిన వారికి సహాయం అందిస్తున్నారు. సొంతంగా ఐసోలేషన్ రూంలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనాను తరిమికొట్టడమే ధ్యేయంగా కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లేం చేశారంటే... ► కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 20 రోజులు గా వీరు స్వీయ నియంత్రణ చర్యల్ని చేపట్టారు. ► పిల్లల్ని ఫ్లాట్లకే పరిమితం చేశారు. ఇల్లు దాటి రాకుండా..ఒకే దగ్గర గుమిగూడకుండా చేశారు. ► అపార్ట్మెంట్లోనే అన్ని వసతులతో ఐసోలేషన్ గదులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతాయని వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు కూడా ఉంచారు. ► కరోనా సోకిన వారు సొంత ఫ్లాట్లలోనే స్వీయ క్వారంటైన్లో ఉండాలని భావిస్తే..వారికి ఉచితంగా ఆహారం కూడా అందిస్తున్నారు. ► వైద్యుల సూచనల మేరక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. ► కరోనా పరీక్షలు నిర్వహించే వైద్యురాలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో అవసరమైన వారికి అపార్ట్మెంట్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ► కోవిడ్ పేషెంట్ల వివరాలు తెలుసుకునేందుకు ఆన్లైన్లోనే మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఫంక్షన్లు, ప్రత్యక్ష మీటింగ్‌లు వాయిదా వేసుకున్నారు. సమూహాలకు సంబంధించిన అంశాలను ఆన్లైన్లోనే పర్యవేక్షిస్తున్నారు. ► దేశ విదేశాల్లో వ్యాపారాలు, వివిధ పనులు కలిగిన వారు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు వారి రాకపోకలను కట్టడి చేశారు. ఖచ్చితంగా రావా ల్సి వస్తే ఆన్లైన్ ద్వారా పాస్ పొందాలి. రోజుకు ఇలా కేవలం పది మందిని అనుమతిస్తున్నారు. ► వాకింగ్ సమయంలోనూ భౌతిక దూరం తప్పక పాటించాలి. మాస్క్ ధరించాలి. ► నిబంధనలు పాటించని వారికి జరిమానాలు సైతం విధిస్తూ కరోనా కట్టడికి మధుపార్క్ రిడ్జ్ గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కఠిన నిర్ణయాలు.. కరోనాను తరిమి కొట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మేం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. సిబ్బందిని విభజించి రోజు విడిచి రోజు ఒకరు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. జీహెచ్ఎంసీ సహకారంతో వారంలో రెండు రోజులు రసాయనాలు స్ప్రే చేయిస్తున్నాం. మా సిబ్బందితో ప్రతి ఫ్లోర్ శానిటైజింగ్ చేయిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ నలుగురు కరోనాతో చికిత్స పొందుతున్నారు.అందరూ క్రమశిక్షణతో ఉంటూ కరోనాను తరిమికొట్టేందుకు సహకరిస్తున్నారు. అత్యవసర సేవల కోసం వైద్య నిపుణులు, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. – సన్నీ బాబు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు నిజంగా గ్రేట్.. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లో వారు భయపడ్డారు. వెంటనే అపార్ట్మెంట్ నిర్వాహకులకు తెలిపాం. వారు నిత్యం ఫోన్ ద్వారా పరిస్థితుల్ని తెలుసుకుంటూ ధైర్యాన్ని నింపుతున్నారు. అపార్ట్మెంట్లో ఉండే అనేక మంది స్నేహితులు కూడా మాకు మనో ధైర్యం చెబుతూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇంట్లో వారికి ఇబ్బంది కలుగకుండా వారందరూ ప్రేమతో చేస్తున్న సహాయం నిజంగా గ్రేట్. ఇక్కడే ఉన్న డాక్టర్ కూడా నిత్యం పరీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. బయట ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే లేకపోవడం నిజంగా చాలా రిలీఫ్నిస్తోంది. – న్రిపెన్ సిక్దర్ (కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తి) నిరంతరం అప్రమత్తత ఇక్కడ ఇళ్లల్లో పని చేసే వారు రోజు బయటకు వెళ్లి వస్తుంటారు. వీరితో పాటు లిఫ్ట్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది.అందువల్లే..ప్రధాన ద్వారం వద్దనే పనివారికి థర్మల్ స్కానింగ్ చేసి శానిటైజర్ వేసి లోపలకు అనుమతిస్తున్నాం. లిఫ్టులలో ముఖ్యంగా పానెల్ బోర్డును రసాయనాలతో క్లీన్ చేస్తున్నాం. లిఫ్ట్‌లో ఒకేసారి ఎక్కువ మంది వెళ్లకుండా చూస్తున్నాం. డెలివరీ బాయ్స్‌ను లోనికి అనుమతించడం లేదు. – గౌతంరాయ్, సెక్యూరిటీ అధికారి ఒకరికే అనుమతి అపార్ట్మెంట్లో అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. హోం క్వారంటైన్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా డోర్ డెలివరీ ఏర్పా ట్లు చేశాం. వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్లోకి కేవలం ఒక్కరినే అనుమతిస్తున్నాం. ఆ వ్యక్తి బయటకు వెళ్లాకే మరొకరు లోపలికి వస్తారు. నేరు గా డబ్బులు తీసుకోకుండా పూర్తిగా ఆన్లైన్ ద్వా రానే లావాదేవీలు జరుపుతున్నాం. కోవిడ్ నిరోధా నికి మా వంతుగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభు, సూపర్ మార్కెట్ నిర్వాహకుడు మీరూ స్పందించండి.. ► కరోనా సెకండ్‌వేవ్ ఉద్ధృతితో మీ అపార్ట్మెంట్లో ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు? ► మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వినూత్నంగా, విభిన్నంగా ఎలా ముందుకెళ్తున్నారు? ► కోవిడ్‌కు ఎదురొడ్డి ఏ విధంగా నిలువరిస్తున్నారు? ► మీ అపార్ట్మెంట్లో ఎవరికైనా కోవిడ్ వస్తే ఎలా చేయూతనిస్తున్నారు? ► వారిలో ధైర్యాన్ని ఎలా నింపుతున్నారు? .... అయితే ‘సాక్షి’ మీకు తోడుగా నిలుస్తుంది. మీ మీ అపార్ట్మెంట్లలో చేపట్టిన కోవిడ్ కట్టడిని ఫొటోతో సహా మాతో పంచుకోండి. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. Satyasakshi@gmail.com Ph.no: 99121 99485 Hanumadris@gmail.com Ph.no: 91606 66866 -
చెట్టు కోడితే ‘వాల్టా’ వాతలు పెట్టుద్ది!
సాక్షి,హైదరాబాద్: నగరంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో అనుమతి లేకుండా 40 చెట్లను కొట్టివేసినందుకు వాల్టా చట్టం అతిక్రమణ కింద ఓ సంస్థకు అటవీ శాఖ రూ.53,900 జరిమానా విధించింది. దీంతోపాటుగా కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని షరతు విధించింది. కూకట్‌పల్లిలోని ఇందు ఫార్చూన్ ఫీల్డ్‌లో సంబంధిత శాఖల అనుమతి లేకుండా దాదాపు 40 చెట్లు కొట్టివేయడంపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని, కొట్టేసిన చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేశామని ఇందు ఫార్చూన్ ఇచ్చిన వివరణతో అటవీశాఖ అధికారులు సంతృప్తిచెందలేదు. ఈ చెట్ల నరికివేతకు సంబంధించి మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి, సిబ్బంది పరిశీలించి చెట్ల నరికివేత, మరోచోట వాటిని పెట్టడం శాస్త్రీయంగా జరగలేదని నిర్థారించారు. -
సోలార్ జిగేల్
గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్.. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధి హైదర్షాకోట్ పీరంచెరువులోని గేటెడ్ కమ్యూనిటీ ఇది. ఇక్కడ మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో పది బహుళ అంతస్తుల భవనాలు నిర్మించగా 518 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి వ్యక్తిగత, ఉమ్మడి అవసరాలు మొత్తం నెలవారీ విద్యుత్ బిల్లు రూ.12 లక్షలు వస్తుంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ఇంటి యజయానులంతా కలిసి రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామార్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ పలకను ఏర్పాటు చేశారు. ఫలితంగా నెలవారి విద్యుత్ ఖర్చు రూ.6 లక్షలకు తగ్గింది. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు కేవలం గిరిధారి వంటి గేటెడ్ కమ్యూనిటీలే కాదు.. ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలు సైతం సోలార్ విద్యుత్‌పై దృష్టి సారించాయి. ఫలితంగా ప్రస్తుతం గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3,186 మంది తమ బహుళఅంతస్తుల నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని 60.9 మెగావాట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగా నెలవారి విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడమే కాదు.. ఆయా యూనిట్ల నుంచి వచ్చిన విద్యుత్‌ను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సైతం విక్రయిస్తున్నాయి. రాజేంద్రనగర్లోనిఅగ్రికల్చర్ యూనివర్సిటీ పరిపాలనాభవనాలు సహా పరిశోధనా సంస్థలు, విద్యార్థి వసతిగృహాలకు ఏడాదికి రూ.కోటికి పైగా విద్యుత్ బిల్లు వచ్చేది. సోలార్ పలకలు ఏర్పాటు చేసిన తర్వాత వర్సిటీ ఏడాది విద్యుత్ బిల్లు రూ.40 లక్షలు తగ్గింది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో గేటెడ్ కమ్యూనిటీ నివాసాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్రాలుగా నిలుస్తున్నాయి. తమ ఇళ్లపై స్వయంగా సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుని, నెలవారీ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా సరఫరా భారం నుంచి డిస్కంకు ఊరటనిస్తున్నాయి. రూఫ్‌టాప్ పలకల ఏర్పాటు ఆర్థికంగా కొంత భారమే అయినప్పటికీ ఒకసారి ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల వరకు లబ్ది పొందే అవకాశం ఉండడంతో యజమానులు తమ బహుళ అంతస్తుల భవనాలపై సోలార్ పలకను బిగిస్తున్నారు. సొంత అవసరాలను తీర్చుకోవడమే కాదు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయించి సొమ్ము లాభాలు గడించడం గమనార్హం. ఇప్పటికే మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కేంద్ర కార్యాలయం, రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఉస్మానియా ఆస్పత్రి, బాలానగర్‌లోని మిథాని సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి బిల్లులు తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ గేటెడ్ కమ్యూనిటీతో పాటు శివారులోని శామీర్‌పేటలోని జినోమ్‌వ్యాలీలో 952 కిలోవాట్లు, అదేప్రాంతంలోని జవహర్‌నగర్‌లో 947 కిలోవాట్లు, కోకాపేట్ ఓపెన్ స్పేస్‌లో 100 కిలోవాట్లు, కిమ్స్ రెసిడెన్సీలో 275 కిలోవాట్లు, హిమయత్సాగర్ ఓనర్స్ అసోసియేషన్ 710 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ పలకలను ఏర్పాటు చేసి వారి నెలవారి విద్యుత్ బిల్లులను సగానికి తగ్గించుకున్నారు. నిథమ్ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పలకలను బిగించి నెలకు రూ.2.50 లక్షల విద్యుత్ బిల్లును ఆదా చేసుకుంటోంది. పైగా సోలార్ పవర్ ఉత్పత్తి ఇంటి అవసరాలకు వినియోగించుకుని కరెంటు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆదాయ మార్గంగా మారింది. దీంతో చాలామంది వ్యక్తిగత నివాసాలపైన కూడా సౌరపలకలను బిగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి బిగిస్తే 25 ఏళ్లు వినియోగం గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిఫ్లు, రెసిడెన్షియల్ కాలనీలకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వ్యక్తిగతంగా కాకుండా అందరికీ కలిపి ఒకే కనెక్షన్(హెచ్‌టీ) జారీ చేస్తుంది. తర్వాత వ్యక్తిగత మీటర్లు అమర్చుకుని బిల్లులు చెల్లిస్తుంటారు. ఇలా ఆయా కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, కాలనీల నుంచి యూనిట్ విద్యుత్‌కు రూ.6.30 చొప్పున వసూలు చేస్తుంది. వాటి యజమానులు తమ నిర్మాణాలపై ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు రూ.4.09 పైసలు చెల్లిస్తుంది. ఇంటిపై ఒకసారి ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఇంటి అవసరాలు తీరగా, మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయించి బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఇటీవల ఈ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. సాధారణ విద్యుత్ చార్జీలతో పోలిస్తే సోలార్ ప్లాంట్ ఏర్పాటు కొంత ఖరీదుతో కూడిన వ్యవహారం. కానీ ఒకసారి పెట్టుబడి పెడితే..ఎక్కువ కాలం లబ్ది చేకూరడంతో పాటు ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 25 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా ఇస్తుండడంతో వీటి ఏర్పాటుకు ఎక్కవ మంది ఆసక్తి చూపుతున్నారు. నిథమ్‌కు ఎంతో లాభం నిథమ్ క్యాంపస్‌కు విద్యుత్ బిల్లుల భారం ఎక్కువగా ఉండటంతో దాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని భావించాం. ఇటీవల 200 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. దీంతో నెలవారి విద్యుత్ బిల్లు రూ.2.50 లక్షల వరకు తగ్గింది. – ఎస్.చిన్నంరెడ్డి, నిథమ్ డైరెక్టర్ ప్రభుత్వ ప్రోత్సాహం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సౌరశక్తి ద్వారా రోజుకు సగటున 100 మెగవాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే 60 మెగవాట్లకు పైగా ఉత్పత్తి అవుతోంది. సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుండడంతో వీటిని ఏర్పాటు చేసేందుకు గృహ, వాణిజ్య వినియోగదారులు ముందుకు వస్తున్నారు. – రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్ఎస్పీడీసీఎల్ బిల్లు భారం సగం తగ్గింది గిరిధారి గేటెడ్ కమ్యూనిటీకి గతంలో నెలకు రూ.12 లక్షలు దాటి విద్యుత్ బిల్లు వచ్చేది. ఇటీవల రూ.3.76 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ప్రభుత్వం 1.16 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ నెలకు 85,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా ప్రస్తుతం నెలవారి విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది. – కె.యాదగిరిరెడ్డి,గిరిధారి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
నిర్వహణతోనే..
సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యముండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపవుతుంది. అందుకే సొసైటీ మెంబర్లు సక్రమంగా ఉండాలి. ప్రతి పైసా ఖర్చు లెక్కుండాలి. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సము దాయం బాగుంటుంది. రిపేర్ల విషయంలో నాణ్యమైన వస్తువులనే వినియోగించాలి. ఇంటి విలువ అనేది కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదు.. అందులోని సౌకర్యాలు, నిర్వహణతో కలిపుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేం దుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి. -
ఉప్పల్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
♦ ఎకరాల్లో శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్ ♦ ప్రారంభ ధర రూ.35 లక్షలు సాక్షి, హైదరాబాద్: ‘‘నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధర, గడువులోగా నిర్మాణం పూర్తి’’ ఇవే మా లక్ష్యమంటోంది శ్రీసాయి హరిహర ఎస్టేట్స్. పాతికేళ్ల రియల్టీ ప్రయాణంలో 50కి పైగా నివాస సముదాయాలను పూర్తి చేసిన ఈ సంస్థ ఉప్పల్‌లో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అందుబాటు ధరలో, ఆధునిక వసతులతో మధ్యతరగతి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమంటున్నారు సంస్థ ఎండీ ఏ యాదవ రెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఉప్పల్‌లోని చెన్నారెడ్డి ఎన్క్లేవ్ సమీపంలో 5.07 ఎకరాల్లో శ్రీసాయి ఆనందమయి పేరిట గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నాం. ఉప్పల్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇదే. 7 బ్లాకులు, ఒక్కో బ్లాక్ 2 లెవల్ పార్కింగ్+ ఐదంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 390 ఫ్లాట్లు. 1,155–1,200 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,600–1,800 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. 2 బీహెచ్‌కే ధర రూ.35 లక్షలు, 3 బీహెచ్‌కే రూ.50 లక్షలు. మొత్తం స్థలంలో 40 శాతం ఓపెన్ స్పేసే ఉంటుంది. ♦ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 20 నెలల్లో 70 శాతం నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే 155 ఫ్లాట్లు గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. వచ్చే నెలల్లో కొనుగోలుదారులకు అందించనున్నాం. 2019 ఏప్రిల్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. పీఎంఈవై, సీఎల్ఎస్ఎస్ వర్తింపు.. శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్ కొనుగోలుదారులు ప్రధాన్‌మంత్రి ఆవాస్‌యోజన (పీఎంఈవై), క్రెడిట్లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) పథకానికి అర్హులు. దీంతో కస్టమర్లు వడ్డీ రాయితీ కూడా పొందే వీలుంటుంది. వసతుల విషయానికొస్తే.. 15 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్‌పూల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, పవర్ బ్యాకప్, ల్యాడ్ స్కేపింగ్ వంటి వసతులన్నీ ఉంటాయి. విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్నాయ్.. ప్రాజెక్ట్ లొకేషన్ గురించి చెప్పాలంటే.. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి వరంగల్ హైవేలో 2 కి.మీ. దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకైతే కొదవేలేదు. కి.మీ. పరిధిలోనే బిగ్‌బజార్, డెకత్లాన్, ఏషియన్ సినీస్క్వేర్ షాపింగ్ సంస్థలు, స్పార్క్, ఆదిత్య, అంకుర వంటి ఆసుపత్రులు, గ్లోబల్ ఇండియన్, చైతన్య, ఆరోరా వంటి విద్యా సంస్థలున్నాయి. పోచారంలోని ఐటీ కేంద్రానికి 4 కి.మీ., ఘట్కేసర్ ఔటర్‌రింగ్ రోడ్డు జంక్షన్‌కు 7 కి.మీ. దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్. బెస్ట్ అఫడబుల్ హౌజింగ్ అవార్డు ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్‌ను రియల్టీ ఐకాన్స్ 2017 అవార్డుకు ఎంపిక చేసింది. ఈస్ట్ జోన్లో బెస్ట్ అప్‌కమింగ్ అఫడబుల్ హౌజింగ్ విభాగంలో ఈ అవార్డు వరించింది. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. నిర్మాణ రంగంలో 25 ఏళ్ల అనుభవం, నిర్మాణంలో నాణ్యత, గడువులోగా నిర్మాణం, అందుబాటు ధర ఇవే అవార్డు ఎంపికకు కారణాలని శ్రీసాయి హరిహర ఎస్టేట్స్ ప్రై.లి. ఎండీ యాదవ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సర్టిఫికెట్ కోసం కూడా దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. సైబర్సిటీకి బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అవార్డు సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి.ని టైమ్స్ రియల్టీ ఐకాన్స్ 2017 అవార్డు వరించింది. హైటెక్‌సిటీ సమీపంలో నిర్మిస్తున్న రెయిన్బో విస్టాస్–రాక్‌గార్డెన్ ప్రాజెక్ట్‌కు బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అవార్డు దక్కిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 13 టవర్లు, 20 అంతస్తుల్లో ఉంటుంది.