సాక్షి, లంగర్‌హౌజ్: కోవిడ్ ఉధృతంగా విస్తరిస్తున్న వేళ.. స్వీయ నియంత్రణ చర్యలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు లంగర్‌హౌజ్‌లోని మధుపార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ వాసులు. అటు కరోనా విస్తరించకుండా క్రమశిక్షణగా వ్యవహరిస్తూ.. ఇటు కరోనా సోకిన వారికి సహాయం అందిస్తున్నారు. సొంతంగా ఐసోలేషన్ రూంలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనాను తరిమికొట్టడమే ధ్యేయంగా కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారు.
వీళ్లేం చేశారంటే...
► కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 20 రోజులు గా వీరు స్వీయ నియంత్రణ చర్యల్ని చేపట్టారు.
► పిల్లల్ని ఫ్లాట్‌లకే పరిమితం చేశారు. ఇల్లు దాటి రాకుండా..ఒకే దగ్గర గుమిగూడకుండా చేశారు.
► అపార్ట్‌మెంట్‌లోనే అన్ని వసతులతో ఐసోలేషన్ గదులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతాయని వీల్‌చైర్లు, స్ట్రెచ్చర్లు కూడా ఉంచారు.
► కరోనా సోకిన వారు సొంత ఫ్లాట్లలోనే స్వీయ క్వారంటైన్‌లో ఉండాలని భావిస్తే..వారికి ఉచితంగా ఆహారం కూడా అందిస్తున్నారు.
► వైద్యుల సూచనల మేరక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు.
► కరోనా పరీక్షలు నిర్వహించే వైద్యురాలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో అవసరమైన వారికి అపార్ట్‌మెంట్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
► కోవిడ్ పేషెంట్ల వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లోనే మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఫంక్షన్లు, ప్రత్యక్ష మీటింగ్‌లు వాయిదా వేసుకున్నారు. సమూహాలకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షిస్తున్నారు.
► దేశ విదేశాల్లో వ్యాపారాలు, వివిధ పనులు కలిగిన వారు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు వారి రాకపోకలను కట్టడి చేశారు. ఖచ్చితంగా రావా ల్సి వస్తే ఆన్‌లైన్ ద్వారా పాస్ పొందాలి. రోజుకు ఇలా కేవలం పది మందిని అనుమతిస్తున్నారు.
► వాకింగ్ సమయంలోనూ భౌతిక దూరం తప్పక పాటించాలి. మాస్క్ ధరించాలి.
► నిబంధనలు పాటించని వారికి జరిమానాలు సైతం విధిస్తూ కరోనా కట్టడికి మధుపార్క్ రిడ్జ్ గేటెడ్ అపార్ట్‌మెంట్ వాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కఠిన నిర్ణయాలు..
కరోనాను తరిమి కొట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మేం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. సిబ్బందిని విభజించి రోజు విడిచి రోజు ఒకరు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. జీహెచ్‌ఎంసీ సహకారంతో వారంలో రెండు రోజులు రసాయనాలు స్ప్రే చేయిస్తున్నాం. మా సిబ్బందితో ప్రతి ఫ్లోర్ శానిటైజింగ్ చేయిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ నలుగురు కరోనాతో చికిత్స పొందుతున్నారు.అందరూ క్రమశిక్షణతో ఉంటూ కరోనాను తరిమికొట్టేందుకు సహకరిస్తున్నారు. అత్యవసర సేవల కోసం వైద్య నిపుణులు, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
– సన్నీ బాబు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు
నిజంగా గ్రేట్..
వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లో వారు భయపడ్డారు. వెంటనే అపార్ట్‌మెంట్ నిర్వాహకులకు తెలిపాం. వారు నిత్యం ఫోన్ ద్వారా పరిస్థితుల్ని తెలుసుకుంటూ ధైర్యాన్ని నింపుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉండే అనేక మంది స్నేహితులు కూడా మాకు మనో ధైర్యం చెబుతూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇంట్లో వారికి ఇబ్బంది కలుగకుండా వారందరూ ప్రేమతో చేస్తున్న సహాయం నిజంగా గ్రేట్. ఇక్కడే ఉన్న డాక్టర్ కూడా నిత్యం పరీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. బయట ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే లేకపోవడం నిజంగా చాలా రిలీఫ్‌నిస్తోంది.
– న్రిపెన్ సిక్దర్ (కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తి)
నిరంతరం అప్రమత్తత
ఇక్కడ ఇళ్లల్లో పని చేసే వారు రోజు బయటకు వెళ్లి వస్తుంటారు. వీరితో పాటు లిఫ్ట్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది.అందువల్లే..ప్రధాన ద్వారం వద్దనే పనివారికి థర్మల్ స్కానింగ్ చేసి శానిటైజర్ వేసి లోపలకు అనుమతిస్తున్నాం. లిఫ్టులలో ముఖ్యంగా పానెల్ బోర్డును రసాయనాలతో క్లీన్ చేస్తున్నాం. లిఫ్ట్‌లో ఒకేసారి ఎక్కువ మంది వెళ్లకుండా చూస్తున్నాం. డెలివరీ బాయ్స్‌ను లోనికి అనుమతించడం లేదు. – గౌతంరాయ్, సెక్యూరిటీ అధికారి
ఒకరికే అనుమతి
అపార్ట్‌మెంట్‌లో అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. హోం క్వారంటైన్‌లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా డోర్ డెలివరీ ఏర్పా ట్లు చేశాం. వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్‌లోకి కేవలం ఒక్కరినే అనుమతిస్తున్నాం. ఆ వ్యక్తి బయటకు వెళ్లాకే మరొకరు లోపలికి వస్తారు. నేరు గా డబ్బులు తీసుకోకుండా పూర్తిగా ఆన్‌లైన్ ద్వా రానే లావాదేవీలు జరుపుతున్నాం. కోవిడ్ నిరోధా నికి మా వంతుగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభు, సూపర్ మార్కెట్ నిర్వాహకుడు
మీరూ స్పందించండి..
► కరోనా సెకండ్‌వేవ్ ఉద్ధృతితో మీ అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు?
► మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వినూత్నంగా, విభిన్నంగా ఎలా ముందుకెళ్తున్నారు?
► కోవిడ్‌కు ఎదురొడ్డి ఏ విధంగా నిలువరిస్తున్నారు?
► మీ అపార్ట్‌మెంట్‌లో ఎవరికైనా కోవిడ్ వస్తే ఎలా చేయూతనిస్తున్నారు?
► వారిలో ధైర్యాన్ని ఎలా నింపుతున్నారు? .... అయితే ‘సాక్షి’ మీకు తోడుగా నిలుస్తుంది.
మీ మీ అపార్ట్‌మెంట్లలో చేపట్టిన కోవిడ్ కట్టడిని ఫొటోతో సహా మాతో పంచుకోండి. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. Satyasakshi@gmail.com Ph.no: 99121 99485
Hanumadris@gmail.com Ph.no: 91606 66866
Comments
Please login to add a commentAdd a comment