longer house
-
కొరియర్ వచ్చిందని చెప్పి..
సాక్షి, లంగర్‌హౌస్: కొరియర్ వచ్చిందంటూ పలు మార్లు ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడిని లంగర్‌హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఐ ముజీబ్ ఉర్ రెహమాన్, డీఎస్సై రాఘవేంద్ర స్వామిలతో కలిసి ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివమారుతి వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన సయ్యద్ హమీద్ మెహిదీపట్నంలోని ఓ హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతను తన తమ్ముడి ఫీజు కట్టడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను డెలివరీ చేసే ప్రాంతాలను పరిశీలిస్తూ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. నెల రోజుల క్రితం మారుతీ నగర్‌లోని ఓ ఇంట్లో డెలివరీ ఇచ్చాడు. సదరు వృద్ధురాలు ఒక్కరే ఉండటంతో పలుమార్లు అక్కడ చోరీకి ప్రయత్నించిన విఫలమయ్యాడు. ఈ నెల 23న మరోసారి ఆమె ఇంటికి వెళ్లిన హమీద్ కొరియర్ వచ్చిందని చెప్పాడు. అయితే ఆమె డోర్ తీయకుండా తన కుమారుడు వచ్చాకే అతనికే ఇవ్వాలని చెప్పింది. అదే రోజు పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి కొరియర్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా ఆమె నిరాకరించింది. సాయంత్రం అతను వెళ్లిపోయాడని భావించిన వృద్ధురాలు తలుపులు తెరిచి చూడగా పక్కనే దాగి ఉన్న సయ్యద్ ఇంట్లోకి దూరి ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 29న అతడిని అదుపులోకి తీసుకుని, సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు రివార్డులు.... సయ్యద్ హెల్మెట్ ధరించి ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేసినా పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు మొహమ్మద్ మిన్హజుద్దీన్ ఖాన్, వల్లపు క్రిష్ణ, అరవింద్‌కుమార్‌లకు రివార్డులు అందించి అభినందించారు. (చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినా.. ) -
కోవిడ్ సంక్షోభ సమయంలో.. ఆదర్శం ఈ అపార్ట్మెంట్
సాక్షి, లంగర్‌హౌజ్: కోవిడ్ ఉధృతంగా విస్తరిస్తున్న వేళ.. స్వీయ నియంత్రణ చర్యలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు లంగర్‌హౌజ్‌లోని మధుపార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులు. అటు కరోనా విస్తరించకుండా క్రమశిక్షణగా వ్యవహరిస్తూ.. ఇటు కరోనా సోకిన వారికి సహాయం అందిస్తున్నారు. సొంతంగా ఐసోలేషన్ రూంలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనాను తరిమికొట్టడమే ధ్యేయంగా కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లేం చేశారంటే... ► కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 20 రోజులు గా వీరు స్వీయ నియంత్రణ చర్యల్ని చేపట్టారు. ► పిల్లల్ని ఫ్లాట్లకే పరిమితం చేశారు. ఇల్లు దాటి రాకుండా..ఒకే దగ్గర గుమిగూడకుండా చేశారు. ► అపార్ట్మెంట్లోనే అన్ని వసతులతో ఐసోలేషన్ గదులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతాయని వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు కూడా ఉంచారు. ► కరోనా సోకిన వారు సొంత ఫ్లాట్లలోనే స్వీయ క్వారంటైన్లో ఉండాలని భావిస్తే..వారికి ఉచితంగా ఆహారం కూడా అందిస్తున్నారు. ► వైద్యుల సూచనల మేరక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. ► కరోనా పరీక్షలు నిర్వహించే వైద్యురాలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో అవసరమైన వారికి అపార్ట్మెంట్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ► కోవిడ్ పేషెంట్ల వివరాలు తెలుసుకునేందుకు ఆన్లైన్లోనే మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఫంక్షన్లు, ప్రత్యక్ష మీటింగ్‌లు వాయిదా వేసుకున్నారు. సమూహాలకు సంబంధించిన అంశాలను ఆన్లైన్లోనే పర్యవేక్షిస్తున్నారు. ► దేశ విదేశాల్లో వ్యాపారాలు, వివిధ పనులు కలిగిన వారు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు వారి రాకపోకలను కట్టడి చేశారు. ఖచ్చితంగా రావా ల్సి వస్తే ఆన్లైన్ ద్వారా పాస్ పొందాలి. రోజుకు ఇలా కేవలం పది మందిని అనుమతిస్తున్నారు. ► వాకింగ్ సమయంలోనూ భౌతిక దూరం తప్పక పాటించాలి. మాస్క్ ధరించాలి. ► నిబంధనలు పాటించని వారికి జరిమానాలు సైతం విధిస్తూ కరోనా కట్టడికి మధుపార్క్ రిడ్జ్ గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కఠిన నిర్ణయాలు.. కరోనాను తరిమి కొట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మేం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. సిబ్బందిని విభజించి రోజు విడిచి రోజు ఒకరు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. జీహెచ్ఎంసీ సహకారంతో వారంలో రెండు రోజులు రసాయనాలు స్ప్రే చేయిస్తున్నాం. మా సిబ్బందితో ప్రతి ఫ్లోర్ శానిటైజింగ్ చేయిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ నలుగురు కరోనాతో చికిత్స పొందుతున్నారు.అందరూ క్రమశిక్షణతో ఉంటూ కరోనాను తరిమికొట్టేందుకు సహకరిస్తున్నారు. అత్యవసర సేవల కోసం వైద్య నిపుణులు, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. – సన్నీ బాబు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు నిజంగా గ్రేట్.. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లో వారు భయపడ్డారు. వెంటనే అపార్ట్మెంట్ నిర్వాహకులకు తెలిపాం. వారు నిత్యం ఫోన్ ద్వారా పరిస్థితుల్ని తెలుసుకుంటూ ధైర్యాన్ని నింపుతున్నారు. అపార్ట్మెంట్లో ఉండే అనేక మంది స్నేహితులు కూడా మాకు మనో ధైర్యం చెబుతూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇంట్లో వారికి ఇబ్బంది కలుగకుండా వారందరూ ప్రేమతో చేస్తున్న సహాయం నిజంగా గ్రేట్. ఇక్కడే ఉన్న డాక్టర్ కూడా నిత్యం పరీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. బయట ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే లేకపోవడం నిజంగా చాలా రిలీఫ్నిస్తోంది. – న్రిపెన్ సిక్దర్ (కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తి) నిరంతరం అప్రమత్తత ఇక్కడ ఇళ్లల్లో పని చేసే వారు రోజు బయటకు వెళ్లి వస్తుంటారు. వీరితో పాటు లిఫ్ట్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది.అందువల్లే..ప్రధాన ద్వారం వద్దనే పనివారికి థర్మల్ స్కానింగ్ చేసి శానిటైజర్ వేసి లోపలకు అనుమతిస్తున్నాం. లిఫ్టులలో ముఖ్యంగా పానెల్ బోర్డును రసాయనాలతో క్లీన్ చేస్తున్నాం. లిఫ్ట్‌లో ఒకేసారి ఎక్కువ మంది వెళ్లకుండా చూస్తున్నాం. డెలివరీ బాయ్స్‌ను లోనికి అనుమతించడం లేదు. – గౌతంరాయ్, సెక్యూరిటీ అధికారి ఒకరికే అనుమతి అపార్ట్మెంట్లో అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. హోం క్వారంటైన్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా డోర్ డెలివరీ ఏర్పా ట్లు చేశాం. వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్లోకి కేవలం ఒక్కరినే అనుమతిస్తున్నాం. ఆ వ్యక్తి బయటకు వెళ్లాకే మరొకరు లోపలికి వస్తారు. నేరు గా డబ్బులు తీసుకోకుండా పూర్తిగా ఆన్లైన్ ద్వా రానే లావాదేవీలు జరుపుతున్నాం. కోవిడ్ నిరోధా నికి మా వంతుగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభు, సూపర్ మార్కెట్ నిర్వాహకుడు మీరూ స్పందించండి.. ► కరోనా సెకండ్‌వేవ్ ఉద్ధృతితో మీ అపార్ట్మెంట్లో ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు? ► మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వినూత్నంగా, విభిన్నంగా ఎలా ముందుకెళ్తున్నారు? ► కోవిడ్‌కు ఎదురొడ్డి ఏ విధంగా నిలువరిస్తున్నారు? ► మీ అపార్ట్మెంట్లో ఎవరికైనా కోవిడ్ వస్తే ఎలా చేయూతనిస్తున్నారు? ► వారిలో ధైర్యాన్ని ఎలా నింపుతున్నారు? .... అయితే ‘సాక్షి’ మీకు తోడుగా నిలుస్తుంది. మీ మీ అపార్ట్మెంట్లలో చేపట్టిన కోవిడ్ కట్టడిని ఫొటోతో సహా మాతో పంచుకోండి. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. Satyasakshi@gmail.com Ph.no: 99121 99485 Hanumadris@gmail.com Ph.no: 91606 66866 -
అడ్రస్ అడిగి తెంచుకుపోయాడు!
సిటీబ్యూరో: ఒక పల్సర్ బైక్... ఇద్దరు దొంగలు... 45 సెకన్ల సమయం.. సీన్ కట్ చేస్తే మూడు తులాల బంగారు గొలుసు స్నాచింగ్. లంగర్‌హౌస్ ఠాణా పరిధిలోని మొఘల్ కా నాలా ప్రాంతంలో బుధవారం జరిగిన చైన్ స్నాచింగ్ తీరు ఇది. ఈ ఘటన మొత్తం బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ ఫీడ్‌ను నగర పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారా గురువారం విడుదల చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ తెలిస్తే వాట్సాప్ నెం:9490616555, లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్: 9490616124, ఎస్సై: 9490616461లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సీసీ కెమెరా ఫీడ్ ప్రకారం... ► జ్యోతి ముందు నుంచే బైక్‌పై వెళ్లిన ఇద్దరు దుండగులు ఆమె ఇల్లు దాటిన తర్వాత ఆగారు. ఒకడు బైక్ పైనే ఉండగా... వెనుక కూర్చున్న వ్యక్తి దిగి జ్యోతి వైపు నడుచుకుంటూ వచ్చాడు. ► జ్యోతి వెనుక నుంచి వేగంగా వచ్చాడు. ఆమె వెనక్కి తిరగడంతో ఆగి బైక్ వైపు రెండు అడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగాడు. ►జ్యోతికి సమీపంలోకి వచ్చి.. ఆమెను ఓ చిరునామా అడుగుతున్నట్లు నటించాడు. ► సమాధానం చెప్పిన ఆమె ఇంటి గేటు వద్దకు వెళ్తుండగా... వెనుక నుంచి మెడలోని పుస్తెలతాడు లాగేశాడు. అప్పటికే ఇంజిన్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న మరో దుండగుడు బైక్‌ను ముందుకు కదిలించగా... పరిగెత్తుకుంటూ వెళ్లి రెండోవాడు బైక్ ఎక్కాడు. ► జ్యోతి అరుస్తూ ఆ బైక్ వెంటపడింది. ఆమె అరుపులు విని ఇంట్లోంచి బయటకు వచ్చిన మరో యువకుడూ వెంబడించినా అప్పటికే స్నాచర్లు సందు దాటేశారు. ► దొంగలు 45 సెకన్ల కాలంలోనే ఈ ‘పని’ పూర్తి చేశారు. ఇదే సమయంలో నాలా వంతెనకు అవతలి వైపు హైదర్గుడలో జరిగిన మరో స్నాచింగ్ కూడా వీరి పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. -
నేను పోలీస్.. కాల్చేస్తా !
లంగర్‌హౌస్, న్యూస్‌లైన్: అన్నకొడుకు కదా అన్ని తక్కువ అద్దెకు ఇల్లు ఇచ్చిన పాపానికి ఆ ఇల్లే తనదని భీష్మించాడో కానిస్టేబుల్. చిన్నాన్న అని కూడా చూడగాకుండా దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. తాను పోలీసునని, తుపాకీతో కాల్చేస్తానని చిందులు తొక్కాడు. స్థానిక పోలీసులు స్పందించకపోవడంతో బాధితుడు జాయింట్ పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌కు చెందిన అబ్దుల్ అమీద్(60) కొన్నేళ్ల క్రితం విదేశాలకు వెళ్లాడు. ఇదే ప్రాంతంలో ఇతను 600 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి.. గోల్కొండ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన అన్న కుమారుడు అఫ్జల్‌కు తక్కువ అద్దెకు ఇచ్చాడు. అయితే అఫ్జల్ ఆ ఇంటికి నకిలీ పత్రాలు సృష్టించి సొంత చేసుకోవాలని యత్నిస్తున్నాడని తెలియడంతో ఇల్లు ఖాళీ చేయాలని అమీద్ కొద్ది రోజులుగా అతడ్ని కోరుతున్నాడు. పట్టించుకోని అఫ్జల్ చివరకు ఇల్లే తనదని, ఖాళీ చేయనని నాలుగు రోజుల క్రితం అమీద్‌పై దాడి చేశాడు. తాను పోలీసునని, తుపాకీతో కాల్చేస్తానని వీరంగం సృష్టించాడు. తీవ్ర గాయాలకు గురైన అమీద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పట్టించుకోలేదు. దీంతో బాధితుడు జాయింట్ సీపీ అమిత్గార్గ్ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అఫ్జల్‌ను గోల్కొండ ఠాణా నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసినట్లు ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్ తెలిపారు.