రెండ్రోజుల క్రితం ఆనందంగా బంధు మిత్రులను పిలుచుకుని గృహ ప్రవేశం చేశారు. సొంతింటి కల నెరవేరిందని సంబరపడ్డారు. అంతలోనే కలల సౌధం కాలిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈఐపీఎల్ కార్నర్‌స్టోన్ గేటెడ్ కమ్యూనిటీలోకి కొందరు చేరుతున్నారు. అందులోని 8వ అంతస్తు 804 ఫ్లాట్‌ను ఐటీ ఉద్యోగి సంతోష్ కొనుగోలు చేశారు.
రెండు నెలలుగా ఇంటిరీయర్ పనులు చేయించారు. సోమవారం గృహ ప్రవేశం చేశారు. మూడు రోజుల పాటు కొత్త ఫ్లాట్‌లోనే నిద్ర చేశాక పూర్తి స్థాయిలో సామాన్లతో ఇక్కడకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. కిచెన్‌లో పూజ చేసి వెలిగించిన దీపం బుధవారం దాని కింద ఉన్న దుస్తులకు అంటుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు దీపాన్ని ఆర్పకుండా భయంతో బయటికి పరుగులు తీశారు. దీంతో మంటలు వ్యాపించడంతో ఫ్లాట్ మొత్తం కాలిపోయింది.
మంటలను ఆర్పిన సిబ్బంది...
కిచెన్‌లో మొదలైన మంటలను చూసి బయటకు పరుగులు తీసిన ఇంటి యజమాని, బంధువులు మెయింటెనెన్స్ వారికి అగ్ని ప్రమాదం విషయం చెప్పారు. సెక్యూరిటీ, మెయింటెనెన్స్ సిబ్బంది వెంటనే నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఫ్లాట్ మొత్తం వుడ్ వర్క్‌తో పాటు కాలి బూడిదయ్యింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మరోసారి నీటిని చల్లారు.
చదవండి: సరోగసీ కోసం వచ్చి.. ఆపై పారిపోదామనుకొని..
పది రోజుల క్రితం పక్క గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో ఇదే మాదిరిగా అగ్ని ప్రమాదం జరగటంతో ఇందులోని నివాసితులకు అలాంటి పరిస్థితి ఎదురయినపుడు మంటలను ఎలా ఆర్పాలి? ఫైర్ గ్యాస్‌ను ఎలా ఉపయోగించాలి? నీటి లభ్యత ప్రతి ఫ్లాట్‌కు ఎలా వస్తుంది? అనే విషయంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. అయినా బుధవారం వాటిని పట్టించుకోకపోవటంతో ప్రమాదం సంభవించిందని మెయింటెనెన్స్ ఇన్‌చార్జి గిరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment