Puppalaguda
-
HYD: అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో, అపార్ట్‌మెంట్‌వాసులు బయటకు పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. దీంతో, భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న మరో ఇంటికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గ్యాస్ లీక్ కావడమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం కారణంగాలో అపార్ట్మెంట్లో పలువురి విలువైన వస్తువులు, దుస్తులు కాలిపోయాయి. దాదాపు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
Hyderabad: ముదురుతున్న మణికొండ పుప్పాలగూడ ‘రోడ్డు వార్’
సాక్షి, హైదరాబాద్: ప్రజావసరాల నిమిత్తం రోడ్డు వేయాలని హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) పనులు చేపట్టింది. తమ హౌసింగ్ సొసైటీ స్థలంలోనుంచి సదరు పనులను అనుమతించేది లేదని ఇండియన్ సర్వీసెస్ విశ్రాంత అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య రోడ్డు వార్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ రెవెన్యూలో సర్వే నెంబర్ 454లో 2007 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ‘ఆదర్శ్‌నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’కి 57 ఎకరాలను కేటాయించింది. హౌసింగ్ సొసైటీలకు భూమి కేటాయింపు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. కాగా, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం ల్యాంకోహిల్స్ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2.35 కిలోమీటర్ల వంద అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని రెండేళ్లకిందట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా టెండర్లు పిలిచింది. కొంత మేర పనులు పూర్తి చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు శనివారం పునఃప్రారంభించారు. దీంతో.. తమ స్థలంలో పనులు చేపట్టనివ్వబోమని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ భీషి్మంచింది. అయినా పనులను కొనసాగించారు. ఆదివారం రాత్రి తిరిగి పనులు.. మరునాడు ఆదివారం సొసైటీవాసులు పనులను అడ్డుకుంటారని భావించి రోజంతా పనులను చేయలేదు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో హెచ్ర్డీసీఎల్ సీఈ సరోజ ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడకు చేరుకుని పనులు ప్రారంభించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇండియన్ సరీ్వసెస్ విశ్రాంత అధికారులు తమ న్యాయవాదులు, సిబ్బందితో పాటు అక్కడే ఉండి పనులను అడ్డుకున్నారు. తమ స్థలంలోకి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమకు హైకోర్టు నుంచి స్టే ఉందని, శనివారం కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సైతం వేశామని అధికారులతో వాదనలకు దిగారు. తమ పిటిషన్‌కు కోర్టులో సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా పనులు చేపట్టడం ఏమిటని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాంనారాయణ్‌రెడ్డి, రాయుడు, వెంకట్రాంరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్జీ మురళి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఎంజీ అక్బర్లు ప్రశ్నించారు. తమ స్థలంలో పనులు చేస్తే అడ్డుకుంటామని అధికారులు, ఎలాగైనా పనులు చేస్తామని హెచ్ఆర్డీసీఎల్ అధికారులు బీష్మించడంతో ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి వరకు సొసైటీ స్థలంలో కాకుండా వేరేచోట పనులను కొనసాగించారు. కోర్టు నుంచి సోమవారం వచ్చే ఆదేశాలకోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
Hyderabad: పుప్పాలగూడలో విషాదం, గోడకూలి ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ఆవరణలో సెల్లార్ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న కూలీలపై గోడపడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. -
పుప్పాలగూడ భూముల వ్యవహారం.. హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సర్వే నంబరు 335, 336, 338, 340, 341, 342లో 80.25 ఎకరాల కాందిశీకులకు సంబంధించిన భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఈ భూమిపై కాందిశీకులకు హక్కులు ఉన్నాయంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని, ఆ తీర్పులో జోక్యం చేసుకోమంటూ ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాందిశీకులకు 1956లో కేటాయించిన భూమిని మిగులు భూమిగా పేర్కొంటూ ఏపీఐఐసీకి కేటాయిస్తూ 2008లో రెవెన్యూ శాఖ జీవో జారీచేసింది. ఈ జీవోను సవాల్‌చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. చదవండి👉🏻ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు! ‘వాసుదేవ్‌కు 1956లో ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. తర్వాత వాసుదేవ్ పలువురికి ఈ భూమిని విక్రయించారు. ఇందులో 11.05 ఎకరాలను 1968లో ఇద్దరు వ్య క్తులు అతని నుంచి కొనుగోలు చేశారు. అయితే ఈ భూమి యూఎల్సీ పరిధిలో ఉందంటూ 2006లో ప్రభుత్వం ఆ మేరకు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వాసుదేవ్‌కు 2006లో నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ చిరునామాలో లేరని రెవె న్యూ అధికారులు పేర్కొన్నారు. 1998లోనే వాసుదేవ్ చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టబద్దంగా కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా మిగులు భూమిగా చూపించడం, పట్టాదారుకు నోటీసులు ఇవ్వకుండా ఆ కేటాయింపులను రద్దు చేయడం చట్టవిరుద్ధం. ఈ మేరకు ఏపీఐఐసీకి కేటాయిస్తూ ఇచ్చిన జీవోను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తున్నాం. కేటాయింపులు రద్దు చేస్తున్నాం’అని సింగిల్ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. చదవండి👉 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన -
బెలూన్ తెరుచుకున్నా దక్కని ప్రాణం
సాక్షి, హైదరాబాద్: వేగంగా దూసుకొచ్చిన ఓ బెంజ్ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన శ్రీనివాస్‌రావు శనివారం రాత్రి 11.30 గంటలకు బెంజ్ (ఏపీ 39 సీఎస్ 9999) కారులో పుప్పాలగూడ టోల్గేట్ సర్వీస్ రోడ్డు మీదుగా వేగంగా వచ్చాడు. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన నాగేశ్వర్రావు(40) తన కారు(ఐ–20)లో నార్సింగి వైపు వస్తున్నాడు. ఇదే సమయంలో అదుపుతప్పిన శ్రీనివాస్‌రావు బెంజ్.. నాగేశ్వర్రావు కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బెంజ్ వేగానికి అతడి కారు పల్టీ కొట్టి రోడ్డు మధ్యలో పడిపోయింది. ఈ ఘటనలో నాగేశ్వర్రావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కారులోని బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఆయన బతకలేదు. బెంజ్ కారులోని బెలూన్లన్నీ తెరుచుకోవడంతో శ్రీనివాస్‌రావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌రావును ఆదివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాస్‌రావు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించామని పోలీసులు స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామన్నారు. (బంధువులకు కుళ్లిపోయిన అనాధ శవాలు!) -
పుప్పాలగూడ భూములు సర్కారువే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాందిశీకులకు భూముల కేటాయింపు వివాదంపై సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో రూ. కోట్ల విలువైన 198.30 ఎకరాలను రమేష్ పరశరాం మలాని తదితరులకు కేటాయిస్తూ 2003లో ఉమ్మడి ఏపీ సీసీఎల్ఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 2016లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కాందిశీకుల భూములను కేటాయించే అధికారం సీసీఎల్ఏకి లేదని పునరుద్ఘాటించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేష్ మలాని దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. కాందిశీకుల భూములను ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేసిన తర్వాత ఆ భూములను ఇతరులకు కేటాయించే అధికారం రాష్ట్ర పరిధిలోని మేనేజింగ్ అధికారి లేదా సెటిల్మెంట్ కమిషనర్‌కు మాత్రమే ఉందంది. 13 ఏళ్ల పాటు కోర్టుల్లో నడచిన ఈ కేసులో ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ భూములు ఎకరా రూ. 35 కోట్లు పలుకుతోంది. మొత్తం ఎకరాలను పరిగణనలోకి తీసుకుంటే దీని విలువ రూ.7 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే భూముల అమ్మకం ద్వారా రూ. 10 వేల కోట్లను సేకరించాలని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం హక్కులు దక్కించుకున్న భూములను వేలం వేసే వీలుంది. కేసు పూర్వాపరాలు ఇవీ.. పశ్చిమ పాకిస్తాన్ నుంచి మన దేశానికి శరణార్థునిగా వచ్చిన పరశరాం రాంచంద్ మలాని అనే వ్యక్తికి రంగారెడ్డి జిల్లాలో అప్పటి హయత్‌నగర్ మండలం బాటసింగారం, హైదరాబాద్ బోయిన్‌పల్లిలో మొత్తం 323.10 ఎకరాలను 60 ఏళ్ల క్రితం కేటాయించారు. బాటసింగారంలో 262.11 ఎక రాలు, బోయిన్‌పల్లిలో 60.39 ఎకరాలిచ్చారు. పాక్‌లో ఆయనకున్న 83.11 ఎకరాలను విడిచిపెట్టి వచ్చినందుకు బదులుగా హైదరాబాద్‌లో 200 ఎకరాలు ఇవ్వాలని కోరగా సదరు భూమిని పంపిణీ చేశారు. కొద్దికాలం తర్వాత సదరు భూమిని ఇతరులకు విక్రయించిన రాంచంద్... 1988లో మరణించారు. ఆయన బతికినన్ని రోజు లు సదరు భూమిపై ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత 13 ఏళ్లకు అంటే 2001లో అసలు కథ మొదలైంది. పాక్‌లో తాము విడిచిపెట్టి వచ్చిన 83.11 ఎకరాల్లో.. 40.4 ఎకరాలకు సమానమైన ఆస్తిని మాత్రమే తమకు కేటాయించారని రాంచంద్ వారసులైన రమేష్ పరశ రాం మలాని, మరికొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన 43.7 ఎకరాలకు సమానమై న ఆస్తిని కేటాయించలేదని, ఆ మేరకు భూమిని పంపిణీ చేయాలని 2001లో కోరారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి సీసీఎల్ఏ తీసుకెళ్లగా స్పందన రాలేదు. మరోసారి పిటిషనర్ సీసీఎల్ఏకు దరఖాస్తు చేయగా పుప్పాలగూడలో 301 నుంచి 308, 325 నుంచి 328, 331 సర్వే నంబర్లలో 2003 ఫిబ్రవరి 26న 148.3 ఎకరాలు, ఇత రులకు మరో 50 ఎకరాలను కేటాయించింది. అయితే ఈ కేటాయింపులను అదే సంవత్సరం మార్చి 20న ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇదే సమయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి పిటిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్టే, షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషనర్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా రివిజినల్ విభాగాన్ని సంప్రదించాలని కోర్టు సూచించింది. దీంతో అక్కడికి వెళ్లిన పిటిషనర్‌కు అనుకూలంగా సదరు విభాగం వ్యవహరిం చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి హైకోర్టులో 2016 ఫిబ్రవరి 16న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలం గా తీర్పు చెప్పడంతో భూ కేటాయింపులను రద్దు చేసింది. 50 ఎకరాలు పొందిన ఇతరులు కేసు ఉపసంహరించుకున్నారు. సదరు భూములను ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమవుతుండగా దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. అయితే కేసు తేలే వరకు భూములను విక్రయించకూడదని, యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. తాజాగా ఈ కేసుపై వాదనలు జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు తుది తీర్పును మంగళవారం వెలువరించింది. దీంతో ప్రభుత్వానికి ఊరట కలిగింది. ప్రస్తుతం ఈ భూమిలో 150 ఎకరాలు ఖాళీగా ఉండగా దీని చుట్టూ యంత్రాంగం ఫెన్సింగ్ వేసింది. మరో 40కి పైగా ఎకరాలను వివిధ అవసరాలకు వినియోగించింది. ఈ భూమిని 2006లోనే అప్పటి హుడా (ప్రస్తుత హెచ్ఎండీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. -
రాళ్ల గుట్టల్ని కూడా వదలరా?
సాక్షి, హైదరాబాద్: ‘చిమ్మ చీకట్లో తడుముకోవద్దు. కానీ మనం చీకట్లో తడుముకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. హైదరాబాద్ మహానగర స్వరూపాన్ని 1956 నుంచి అంచనా వేసిన నిపుణులు ఉన్నారు. అలాంటి వాళ్ల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోండి. ప్రకృతిపరంగా ఏర్పడిన శిలాసంపదను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి’అని రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని బాబా ఫకృద్దీన్ ఔలియా దర్గా (ఫకృద్దీన్ గుట్ట)లో ప్రకృతిసిద్ధమైన శిలా సంపద, ఏక శిలా రూపాలను ధ్వంసం చేస్తున్నారనే ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫకృద్దీన్ గుట్టను పేల్చి రాళ్లు కొడుతున్నారని, ఆ గుట్టను వారసత్వ సంపదగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ‘సొసైటీ టు సేవ్ రాక్’సంస్థ కార్యదర్శి ఫరూక్ ఖాదర్ దాఖలు చేసిన పిల్‌ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘ఇప్పటికే చెరువుల్ని మాయం చేశామని, ఇక రాళ్లను కూడా వదిలిపెట్టమా’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండల్ని పేల్చి ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటూపోతే ప్రకృతి వికృతరూపం దాల్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఏకశిల, శిలా సంపదలను కాపాడేందుకు తీసుకునే చర్యల్ని వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫకృద్దీన్ గుట్టపై పేలుళ్లను ఆపేశామని, కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. -
మరో ఆరు ఇళ్లు గుర్తింపు
విచారణలో వివరాలు వెల్లడించిన నయీమ్ సోదరి అస్మత్ బేగం నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని కుటుంబ సభ్యుల పేరిట నల్లగొండ పరిసరాల్లో ఖరీదైన భవనా లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లగొండ పట్టణంలో నాలుగు భవనాలు, కనగల్ మండలం పర్వతగిరిలో ఒక ఇల్లు ఉన్నట్లు కనుగొన్నారు. నయీమ్ చిన్నమ్మ కూతురు అస్మత్ బేగం ఇచ్చిన సమాచారం మేరకు ఆ స్తుల చిట్టాను బయటకు తీస్తున్నారు. బేగం పేరిట చైతన్యపురి కాలనీలో ఇల్లు, శ్రీనగర్ కాలనీలో నయీమ్ తల్లి తాహెరా బేగం పేరిట, మరదలు నేహా పేరిట ఇళ్లు, బావమరిది కూతురు నీలోమ పేరిట భవనం, కనగల్ మండలం పర్వతగిరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె మహెల్లా పేరిట ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె మహెల్లాకు అస్మత్‌బేగం కుమారుడు సప్రాజ్తో గతేడాది నిశ్చితార్థం జరిగింది. అల్లుడు సప్రాజ్ కూడా నయీ మ్ గ్యాంగ్‌లోనే పని చేసినట్లు తేలింది. పుప్పాలగూడలో మరొకటి పుప్పాలగూడలో నయీమ్ మరో ఇంటిని పోలీసులు గుర్తిం చారు. నయీమ్ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు.. నార్సింగి పోలీ సులతో పాటు సిట్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు.డాక్యుమెంట్లు, బంగారం, నాలుగు దేశీయ పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐదుగురి అరెస్ట్: భూ దందాలు, హత్యలు, సెటిల్మెంట్లతో సంబంధం ఉన్న నల్లగొండకు చెందిన నయీమ్ అనుచరులు అస్మత్ బేగం, యూనుస్, టమాట శ్రీను, జహంగీర్, జానీలను పోలీసులు అరెస్టు చేశారు. -
రేపు పుప్పాలగూడలో శ్రీనివాస కల్యాణం
హైదరాబాద్: పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీపద్మావతి అలివేలుమంగా సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య ఆచార్యుల నిర్దేశంతో శృంగేరి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా సేవా సమితి అధ్యక్షుడు వంగల కేశవ భట్ కోరారు.