కత్తులతో పొడిచి.. బండరాళ్లతో మోది ఇద్దరి దారుణ హత్య
వివాహేతర సంబంధమే ప్రాణాలు తీసిందా?
నిందితుల కోసం పోలీసుల వేట
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యల ఘటన కలకలం రేపింది. వివాహితను, ఆమె ప్రియుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం గాలిపటాలు ఎగురవేసేందుకు పద్మనాభస్వామి గుట్టల వైపు వెళ్లిన యువకులకు అక్కడ రెండు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించడంతో జంట హత్యల ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బేమెతరా జిల్లా నమాగఢ్‌కు చెందిన బిందు బింజారె (27)కు, ఇదే రాష్ట్రం ముంగిలి జిల్లా బయక్‌కాంప గ్రామానికి చెందిన వ్యక్తితో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బిందు కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ఓ విల్లా ప్రాజెక్ట్‌లో మేస్త్రీ, కూలీలుగా భార్యాభర్తలు కొంత కాలం పని చేశారు. అనంతరం వనస్థలిపురం వచ్చారు.
ప్రియుడి మోజులో పడి.. కుటుంబాన్ని వదిలి..
గతంలో శంకర్‌పల్లి సైట్‌లో పని చేసినప్పుడు బిందుకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాకేత్ (27)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ప్రియుడి మోజులో పడిన బిందు తన కుటుంబాన్ని వదిలేసి ఈ నెల 4న అంకిత్ సాకేత్ ఉంటున్న నానక్‌రాంగూడకు వచ్చేసింది. తన వద్దకు వచ్చిన బిందును సాకేత్ తన స్నేహితుల గదిలో ఉంచాడు. ఈ క్రమంలో తన భార్య బిందు కనిపించడం లేదంటూ భర్త ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అదే రోజు పిల్లలను తీసుకుని స్వస్థలానికి వెళ్లిపోయాడు.
నిర్మానుష్య ప్రదేశంలో శవాలుగా బిందు, అంకిత్ సాకేత్..
నానక్‌రాంగూడలో ఉంటున్న అంకిత్ సాకేత్ కనిపించటం లేదని ఆయన తమ్ముడు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. కాగా.. పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశమైన పద్మనాభస్వామి ఆలయ పరిసరాల్లోని గుట్టల్లో బిందు, సాకేత్ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని కత్తులతో పొడిచి, ముఖాలు గుర్తించకుండా బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. జంట హత్యలు ఈ నెల 11, 12 తేదీల్లో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
భిన్న కోణాల్లో విచారణ ముమ్మరం..
జంట హత్యల ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. క్లూస్, డాగ్ స్క్వాడ్‌లతో వివరాలు సేకరించారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. బిందు, అంకిత్ సాకేత్‌లతో పాటు మరో ముగ్గురు అటుగా వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బిందును గదిలో ఉంచిన సాకేత్ మిత్రులా? లేదా గతంలో శంకర్‌పల్లిలో పని చేసిన సమయంలో బిందుతో పాటు పనిచేసిన వారా? లేక ఇతరులెవరైనా వారిని అక్కడ చూసి అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతురాలి శరీరంపై దుస్తులు లేకపోవటంతో
అత్యాచారం చేసి హతమార్చారా? బిందు, సాకేత్ ఏకాంతంగా ఉన్న సమయంలో హత్య చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం సమీపంలో సుమారు 10 ఖాళీ బీరు సీసాలు ఉన్నాయి. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment