మరో ఆరు ఇళ్లు గుర్తింపు
విచారణలో వివరాలు వెల్లడించిన నయీమ్ సోదరి అస్మత్ బేగం
నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని కుటుంబ సభ్యుల పేరిట నల్లగొండ పరిసరాల్లో ఖరీదైన భవనా లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లగొండ పట్టణంలో నాలుగు భవనాలు, కనగల్ మండలం పర్వతగిరిలో ఒక ఇల్లు ఉన్నట్లు కనుగొన్నారు. నయీమ్ చిన్నమ్మ కూతురు అస్మత్ బేగం ఇచ్చిన సమాచారం మేరకు ఆ స్తుల చిట్టాను బయటకు తీస్తున్నారు. బేగం పేరిట చైతన్యపురి కాలనీలో ఇల్లు, శ్రీనగర్ కాలనీలో నయీమ్ తల్లి తాహెరా బేగం పేరిట, మరదలు నేహా పేరిట ఇళ్లు, బావమరిది కూతురు నీలోమ పేరిట భవనం, కనగల్ మండలం పర్వతగిరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె మహెల్లా పేరిట ఇల్లు ఉన్నట్లు గుర్తించారు.
నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె మహెల్లాకు అస్మత్‌బేగం కుమారుడు సప్రాజ్‌తో గతేడాది నిశ్చితార్థం జరిగింది. అల్లుడు సప్రాజ్ కూడా నయీ మ్ గ్యాంగ్‌లోనే పని చేసినట్లు తేలింది.
పుప్పాలగూడలో మరొకటి
పుప్పాలగూడలో నయీమ్ మరో ఇంటిని పోలీసులు గుర్తిం చారు. నయీమ్ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు.. నార్సింగి పోలీ సులతో పాటు సిట్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు.డాక్యుమెంట్‌లు, బంగారం, నాలుగు దేశీయ పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఐదుగురి అరెస్ట్: భూ దందాలు, హత్యలు, సెటిల్‌మెంట్లతో సంబంధం ఉన్న నల్లగొండకు చెందిన నయీమ్ అనుచరులు అస్మత్ బేగం, యూనుస్, టమాట శ్రీను, జహంగీర్, జానీలను పోలీసులు అరెస్టు చేశారు.