Gangster Nayeem
-
నయీం కేసులో ఖాకీలందరికీ క్లీన్చిట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీంతో పోలీసులెవరూ అంటకాగలేదట. అత నితో పోలీసులెవరికీ ఎలాంటి సంబంధాలు లేవట. నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత పోలీసుశాఖ ఇదే విషయాన్ని తేల్చింది. నయీంతో కలిసి పలు భూ సెటిల్మెంట్లు, అక్రమ దందాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులందరికీ డిపార్ట్ మెంట్ క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన రాజకీయ నేతలంతా ఇప్పటికే ఊపిరి పీల్చు కోగా.. తాజాగా అడిషనల్ ఎస్పీ నుంచి కానిస్టేబుల్ దాకా 25 మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తోన్న ఐజీ నాగిరెడ్డి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిస్తూ క్లీన్చిట్ విషయాన్ని వెల్లడించారు. 2016 ఆగస్టులో షాద్‌నగర్ సమీపంలోని మిలీనియం టౌన్షిప్ వద్ద జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతని నేరాలు, అకృత్యాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను వేసింది. నయీం నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పాల్పడిన పలు భూసెటిల్మెంట్లు , కిడ్నాపులు, హత్యలకు రాజకీయ నాయకులు, పోలీసులు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. నయీంను కలిసిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల ఫొటోలను అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సిట్ వారిని విచారించింది. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతోపాటు హెడ్ కానిస్టేబుల్ల వరకు మొత్తం 25 మందికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందుకే వీరిని కేసు నుంచి తప్పిస్తున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసుకున్న ఆర్టీఐ దరఖాస్తుకు సిట్ చీఫ్ ఐజీ నాగిరెడ్డి సమాధానమిచ్చారు. క్లిన్‌చిట్ పొందింది వీరే.. అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస్ రావు, చంద్రశేఖర్. డీఎస్పీలు ఈజి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, సాయి మనోహర్, ప్రకాష్ రావు, వెంకట నరసయ్య, అమరేందర్ రెడ్డి తిరుపతన్నలు ఉన్నారు. ఇక ఇన్స్పెక్టర్లు మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస్ నాయుడు, కిషన్, ఎస్ శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి, మజీద్, వెంకట సూర్య ప్రకాష్, రవి కిరణ్ రెడ్డి, బలవంతయ్య , నరేందర్ గౌడ్, రవీందర్ ఉన్నారు. కేసును సీబీఐకి అప్పగించండి నయీం కేసుల నుంచి పోలీసుల పేర్లను తొలగించడంపై ఎఫ్‌జీజీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసు విచారణ సరిగా జరగడం లేదని, వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకి ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నా... బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 240 కేసులు నమోదు చేస్తే.. ఇప్పటివరకు 173 కేసుల్లోనే చార్జిషీట్లు నమోదు చేశారని, నయీం ఇంటి వద్ద లభించిన డబ్బు విషయంలోనూ నిజాలు దాస్తున్నారని ఆరోపించారు. -
మరోసారి ఉలిక్కిపడ్డ షాద్‌నగర్
షాద్‌నగర్‌టౌన్: షాద్‌నగర్ మరోసారి ఉలిక్కిపడింది. మూడేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనే దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నయీంను షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్ ఇళ్ళ మధ్య ఎన్కౌంటర్ చేయగా..దిశ హత్యకేసు నిందితుల్ని చటాన్‌పల్లి శివారులో జాతీయ రహదారి పక్కన కాల్చిపారేశారు. ఈ రెండు ఘటనలు పోలీసుల చెర నుంచి నిందితులు తప్పించుకుని వెళ్తున్నప్పుడు జరిగినవే. ఈ రెండు ఘటనలు కూడా షాద్‌నగర్ ప్రాంత వాసులకు ఉదయం 7గంటల ప్రాంతంలో తెలిశాయి. తాజాగా ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో షాద్‌నగర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. -
గ్యాంగ్‌స్టర్ సీక్రెట్స్
-
‘నయీం’ భూ విక్రేతల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీం బినామీల పేర్లపై ఉన్న భూ విక్రయానికి కొందరు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా భువనగిరిలోని 5 ఎకరాల భూమిని జిరాక్స్ సేల్ డీడ్‌తో విక్రయించారు. ఈ డాక్యుమెంట్లు తీసుకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన ఐదుగురిని రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. నయీం అనుచరులు పాశం శ్రీనివాస్, మహమ్మద్ అబ్దుల్ నాజర్, నయీం తమ్ముడు మహమ్మద్ అబ్దుల్ ఫహే, భార్య హసీనా బేగమ్, బినామీ తుమ్మ శ్రీనివాస్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.88,37,000, మూడు కార్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్వోటీ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ సురేందర్‌రెడ్డి, భువనగిరి ఏసీపీ భుజంగరావుతో కలసి పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. సిట్ చేతిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా... భూమి యజమానులను బెదిరించి బినామీ పేర్ల మీద ఆ స్థలాలను నయీం రాయించుకున్న ఘటనలు కోకొల్లలు. అప్పట్లో నయీం వెంట దందాల్లో పాశం శ్రీనివాస్ పాల్గొనేవాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయా ఆస్తుల డాక్యుమెంట్లు, భూముల ఒరిజినల్ సేల్ డీడ్లను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) స్వాధీనం చేసుకుంది. ఆయా భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపింది. నయీం ఎన్కౌంటర్ అనంతరం అరెస్టైన శ్రీనివాస్ రెండేళ్లు జైల్లో ఉన్నాడు. బయటికి వచ్చిన తరువాత భువనగిరిలోని నయీం బినామీ ఆస్తులపై దృష్టి సారించాడు. నయీం సోదరుడు అబ్దుల్ ఫహే, భార్య హసీనా బేగమ్, అనుచరుడు అబ్దుల్ నాజర్, బినామీ తుమ్మ శ్రీనివాస్‌తో కలసి భువనగిరిలోని సర్వే నంబర్ 730లో ఉన్న ఐదెకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించాడు. నయీం బాధితుడైన డీవీఆర్ కంపెనీ ఎండీ వెంకటేశ్వరరావు.. ఈ భూమికి రూ.88,37,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. భూమి తుమ్మ శ్రీనివాస్ పేరుపై ఉండటంతో అతనికి రూ.5 లక్షలు ఇస్తానని పాశం శ్రీనివాస్ బేరం కుదుర్చుకున్నాడు. 5 ఎకరాల భూమిని మండపల్లి వెంకటేశ్వరరావుకు తుమ్మ శ్రీనివాస్ సేల్ కమ్ జీపీఏ అగ్రిమెంట్ చేయగా, తర్వాత ఇదే భూమిని వెంకటేశ్వరరావు బెంగళూరులోని మోక్ష డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ ఎస్వోటీ పోలీసులు రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకునేందుకు వచ్చిన సమయంలో వారిని అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. జిరాక్స్ సేల్‌డీడ్‌తో రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల పాత్రపై కూడా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ తెలిపారు. పోలీసుల అదుపులో నయీం భార్య హసీనా బేగమ్, ఇతర నిందితులు -
నయీమ్ కేసులో వారికి ఊరట
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సస్పెండ్‌కు గురయిన పోలీసు అధికారులకు ఊరట లభించింది. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం ఆతనితో కలసి పలువురు పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నయీమ్‌కు అండగా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్‌తోపాటు ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. తాజాగా వీరిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో వారు శుక్రవారం డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు. -
నలుగురు ఎస్కార్ట్ పోలీసుల సస్పెన్షన్
సాక్షి, యాదాద్రి/వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం సస్పెండ్ చేశారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతడికి సహకరించిన పాశం శ్రీనివాస్‌పై పీడీ యాక్టు పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు గత ఏడాది జూలైలో తరలించారు. 2016 జూలై 15న పీడీ యాక్టు నమోదు కాగా.. 2017 జూలై 14తో ముగిసి పోయింది. తాజాగా పోలీసుల ఫోన్‌తో జైలులో ఉన్న శ్రీనివాస్ తనను బెదిరించినట్లు బాధితులు రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు రమేష్, పాషా, రమేష్, లక్ష్మీనారాయణల సెల్ఫోన్లతో శ్రీనివాస్ కాల్స్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వీరిపై కమిషనర్ సస్పెండ్ చేశారు. కాగా పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్న అతని అనుచరులైన అందె సాయి కృష్ణ, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్, పాశం అమర్నా«థ్లపై కేసులు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇదిలాఉండగా.. పాశంను వరంగల్ సెంట్రల్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచినందున సెల్ఫోన్లు వినియోగించే అవకాశం లేదని జైలు అధికారులు చెబుతున్నారు. -
నయీమ్‌ను పెంచి పోషించింది బాబే
* బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపణ * 18 ఏళ్ల అజ్ఞాతం నుంచి బయటకు సాక్షి, హైదరాబాద్/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడేనని బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం తన సోదరి బెల్లి లలితను 1999లో అతికిరాతకంగా చంపించారని దుయ్యబట్టారు. అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి ఆదేశాల మేరకు లలితను నమూమ్ హత్య చేయించారని, ఆపై మృతదేహాన్ని అతికిరాతకంగా 17ముక్కలు చేయించాడన్నారు. శనివారమిక్కడ బెల్లి కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తన సోదరి సహా మరికొందరు కుటుంబ సభ్యులు హత్యలకు గురికావడంతో ప్రాణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వివరించారు. తెలంగాణ కోసం పోరాడే వారందరినీ నక్సలైట్లుగా చిత్రీకరించి చంపేశారన్నారు. తన సోదరితోపాటు మిగతా కుటుంబ సభ్యుల హత్యలపై సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించాలని కృష్ణ డిమాండ్ చేశారు. దాదాపు 18 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న కాలంలో ఏడాదిపాటు తెలంగాణ బయట తిరిగానని, ఆ తర్వాత హైదరాబాద్‌లోనే సీసాలు ఏరుకుంటూ బతికానన్నారు. తన కుటుంబ సభ్యుల హత్య కేసులకు సంబంధించి సిట్‌ను కలసి వివరాలు అందిస్తానన్నారు. నయీమ్ అనుచరులు ఇంకా చాలా మంది దర్జాగా బయటే తిరుగుతున్నారన్న కృష్ణ... నయీమ్ కుటుంబం మొత్తం నరరూప రాక్షసులేనన్నారు. కుటుంబమంతా చిన్నాభిన్నం... బెల్లి లలిత 1999 మే 26న భువనగిరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ మరికొందరు హత్యచేశారు. అయితే నాటి తెలుగుదేశం ప్రభుత్వమే తెలంగాణకు అనుకూలంగా ఉన్న బెల్లి లలితను హత్య చేయించిందని పెద్దఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. అలీమొద్దీన్ బెల్లి లలిత కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగా నయీమ్ అనుచరులు 2002లో బెల్లి కృష్ణ బావలు కరుణాకర్, శ్రీరాములు యాదవ్, బత్తుల మల్లేష్యాదవ్లతోపాటు ఆలేరు మండలంలోని టంగుటూర్‌కు చెందిన ఈకి రి సిద్దులును అతికిరాతకంగా హతమార్చారు. కృష్ణనూ హతమార్చేందుకు ప్రయత్నించగా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
‘నయీమ్’ కేసును సీబీఐకి అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గదర్శి సభ్యుడు కె.నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్ (న్యాయవాదితో సంబం ధం లేకుండా తానే వాదనలు వినిపించుకునే వ్యక్తి) హోదాలో ఆయన ఈ వ్యాజ్యాన్ని వేశారు. సోమవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన ఆయన... దీనిపై లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరారు. ఈ కేసులో పోలీసులు, రాజకీయ నాయకులకు సంబంధం ఉందని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. దీనిపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా, కౌంటర్లు కోరకుండా నేరుగా ఎలా ఉత్తర్వులు జారీ చేయగలమంది. లంచ్‌మోషన్ రూపంలో విచారించలేమని, సాధారణ పద్ధతిలో వచ్చినప్పుడే విచారణ చేపడుతామని తేల్చి చెప్పింది. దీంతో ఆయన కోర్టు నుంచి వెనుదిరిగారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అతని అక్రమ సంపాదన, అరాచకాలు, అతనికి ఉన్న సంబంధాలు తదితర వాటిని తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, దానివల్ల ప్రయోజనం ఉండదని నారాయణ తన పిటిషన్లో వివరించారు. ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారంలో వివిధ ప్రాంతాల్లో 62 కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
ఆడవేషంలో విమానయానం!
మారువేషాల్లో రాయ్‌పూర్-శంషాబాద్ మధ్య తిరిగిన నయీమ్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ లీలలు సినిమాను తలపిస్తున్నాయి! శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు నయీమ్ తరచూ లేడీ గెటప్ ధరించేవాడట. రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడ పార్క్ చేసిన తన వెహికల్లోకి ఎక్కగానే చీర విప్పేసి టీషర్ట్, ప్యాంట్ వేసుకొని మగాడిలా ఇంటికి వెళ్లేవాడని తేలింది. ఇలా మారువేషాల్లో ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ వెహికల్స్‌ను నయీమ్ అక్కడే పార్క్ చేసేవాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నయీమ్ అల్లుడు అబ్దుల్ ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌ల విచారణలో ఈ అంశాలు వెలుగుచూశాయి. నయీమ్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, శంషాబాద్ మధ్య ఎక్కువగా విమానాల్లో ప్రయాణాలు చేసేవాడని సమాచారం. బాధితులను అక్కడికి రప్పించుకుని, బెదిరించి భూ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించేవాడని తెలిసింది. నయీమ్‌తో కలిసే నేరాలు ... నయీమ్‌తో కలసి నేరాలు చేశామని ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌లు పోలీసు విచారణలో అంగీకరించారు. నదీమ్, నస్రీమ్ హత్య కేసుల్లో తాము సహకరించామని, వారి మృతదేహాలను నగర శివారులో దహనం చేసినట్టు తెలిపారు. తన పేరిట రాజమండ్రి, విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ఇతర ప్రాంతాల్లో నయీమ్ ఇళ్లను కొనుగోలు చేశాడని షాహీన్ ఒప్పుకుంది. కాగా, వీరిద్దరిని పది రోజుల పాటు కస్టడీకివ్వాలన్న పిటిషన్ విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న ఫర్హానా, ఆఫ్షాలను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ కూడా బుధవారానికి వాయిదా పడింది. -
నయీమ్ కంప్యూటర్లలో అందరి జాతకాలూ!
* 4 వేల సినిమాలకు సమానమైన ఫుటేజీ స్వాధీనం * ఏకంగా 7 టెరాబైట్స్.. విస్తుపోయిన అధికారులు * అంటకాగిన వారందరి జాతకాలూ వాటిలో నిక్షిప్తం! * నక్సల్‌గా ఉన్నప్పటి నుంచే డైరీ రాసిన నయీమ్ * తర్వాత టెక్నాలజీ సాయంతో వీడియో రికార్డులు * నయీమ్, కుటుంబీకుల పేరిట 250 బ్యాంకు ఖాతాలు * లావాదేవీల వివరాల కోసం బ్యాంకులకు సిట్ లేఖలు సాక్షి, హైదరాబాద్: ఏకంగా 7 టెరాబైట్స్! అంటే సుమారు 4 వేల సినిమాల నిడివికి సమానమైన డేటా!! గ్యాంగ్‌స్టర్ నయీమ్ అడ్డాల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌ల్లో ఇంతటి డేటా నిక్షిప్తమై ఉంది!!! దాంతో సిట్ అధికారులు విస్తుపోయారు. నయీమ్ అడ్డాల్లోని సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలతో పాటు అతనిచ్చిన విందుల వీడియోలు, ఫోన్ సంభాషణలన్నీ ఈ డేటాలో ఉన్నట్లు తెలుస్తోంది!! నయీమ్ వ్యూహాత్మకంగానే వీటన్నింటినీ భద్రపరిచినట్టు భావిస్తున్నారు. అంతేకాదు, అతను తన చావును కూడా ముందే ఊహించాడన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘‘కత్తి పట్టిన ప్రతివాడూ దానికే బలవుతాడు. అందుకు నేను కూడా అతీతమేమీ కాదు. నా వల్ల నష్టం, లేదా లాభం పొందిన వారినుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదు. ముఖ్యంగా పోలీసులను, నేతలను నమ్మకూడదు’’ అని నయీమ్ తన అనుచరులకు పదేపదే చెప్పేవాడని తెలిసింది. అందుకే ఎందుకైనా మంచిదని వీలైన ప్రతి అంశాన్నీ అతను రికార్డు చేయించి భద్రపరిచేవాడట. మావోయిస్టు ఉద్యమంలో చేరినప్పటి నుంచీ డైరీ రాసుకోవడం అలవాటు చేసుకున్న నయీమ్, అనంతరం టెక్నాలజీ సాయంతో ఆడియో, వీడియో రికార్డులకు దిగాడు. ఇప్పుడు వాటన్నింటినీ పరిశీలిస్తే అతనితో అంటకాగిన వారి బాగోతాలన్నీ బయటపడవచ్చని సిట్ అధికారులు అంటున్నారు. నయీమ్ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు రోజుకో తీరుగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అతనికి ఒకటీ రెండూ కాదు. ఏకంగా 250 బ్యాంకు ఖాతాలున్నాయి! ఇవన్నీ సొంత, కుటుంబీకుల పేర్లతో ఉన్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. వీటిలో అత్యధికంగా నయీమ్ సోదరి సమీరా, భార్య హసీనా, వంటమనిషి ఫర్హానాల పేరిట ఉన్నట్టు తేలింది. వాటి లావాదేవీల వివరాలు కోరుతూ ఆయా బ్యాంకులకు సిట్ లేఖలు రాసింది. కొన్ని ప్రత్యేక లాకర్లు కూడా వెలుగు చూశాయి. నయీమ్ బెదిరింపుల ద్వారా తాను సాగించిన డబ్బు లావాదేవీల్లో చాలావరకు ఆన్లైన్ బ్యాంకింగ్ విధానంలోనే నిర్వహించినట్లు సమాచారం. అతని డెన్ల నుంచి ఇప్పటిదాకా వందల కొద్దీ బ్యాంకు చెక్‌బుక్కులు లభించాయి. నయీమ్, అతని కుటుంబీకులతో పాటు ముఖ్య అనుచరులవి కూడా ఉన్నాయి. ఇంకా పలువురికి సంబంధించిన బ్లాంక్ చెక్‌లు లభ్యమైనట్లు సమాచారం. వారిని విచారించాలని సిట్ యోచిస్తోంది. 2 శాతం ‘ఎన్ఎం’ ట్యాక్స్! నయీమ్ తన సామ్రాజ్య విస్తరణ కోసం అనేక వికృత క్రీడలు అవలంబించినట్లు అతని అడ్డాల్లో దొరికిన డైరీల ద్వారా తేలింది. తనకు పట్టున్న ప్రాంతాల నుంచి, టార్గెట్ల నుంచి వసూళ్లకు కొత్త పథకం రూపొందించినట్టు సిట్ గుర్తించింది. ‘ఎన్-ఎం (నయీమ్)’ ట్యాక్స్ పేరిట లావాదేవీలు నిర్వహించడమే గాక సమన్వయానికి కొందరిని నియమించాడని తెలిసింది. ప్రతి లావాదేవీకీ 2 శాతం వసూలు చేసేవాడని గుర్తించారు. ‘‘కత్తి పట్టిన ప్రతివాడూ దానికే బలవుతాడు. నేనూ అందుకు అతీతమేమీ కాదు. నా వల్ల నష్టం, లేదా లాభం పొందిన వారినుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదు. ముఖ్యంగా పోలీసులను, రాజకీయ నాయకులను నమ్మకూడదు’’ - అనుచరులతో నయీమ్ మా ఆస్తులు గుంజుకున్నాడు ముందుకొస్తున్న నయీమ్ బాధితులు.. పోలీసులకు ఫిర్యాదులు హైదరాబాద్/భువనగిరి: నయీమ్ బాధితులు ఒక్కొక్కరు ముందుకొస్తున్నారు. నయీమ్ ముఠా సభ్యులు తమను బెదిరించి ఆస్తులను గుంజుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆదిభట్లకు చెందిన పలువురు బాధితులు ఎల్బీ నగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2002లో నయీమ్, సామ సంజీవరెడ్డి, శ్రీహరిలు తమను బెదిరించి నాలుగున్నర ఎకరాల భూమి గుంజుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో మామిడితోట ఉందని, తమకు న్యాయం చేసి భూమిని తిరిగి ఇప్పించాలని కోరారు. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మరోవైపు నయీమ్ త నను బెదిరించి లక్షల రూపాయలు తీసుకున్నాడని నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని ఖిల్లానగర్కు చెందిన చెన్నోజు బ్రహ్మచారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నయీమ్ తన అనుచరులు పాశం శ్రీను, కత్తుల జంగయ్యను మా వద్దకు పంపాడు. నయీమ్ ఇంటికి రమ్మన్నాడని చెప్పారు. మా కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయూరు. మా ఇద్దరు కొడుకులను గన్‌తో కాలుస్తామని, కుటుంబాన్ని లేకుండా చేస్తామని బెదిరిం చారు. పాశం శ్రీనుకు రూ.20 లక్షలు ఇవ్వాలని నయూమ్ చెప్పాడు. దీంతో భయపడి మాకు బోడుప్పల్లో ఉన్న ఇంటిని అమ్మి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాశం శ్రీను, అతడి డ్రైవర్‌కు డబ్బు ఇచ్చాం’’ అని చెప్పారు. అలాగే పదేళ్ల కిందట తమను బెదిరించి రూ.20 లక్షల విలువ చేసే ఇంటి కి రూ.2 లక్షలు ఇచ్చి నయీమ్ అక్క పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నారు. -
మరో ఆరు ఇళ్లు గుర్తింపు
విచారణలో వివరాలు వెల్లడించిన నయీమ్ సోదరి అస్మత్ బేగం నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని కుటుంబ సభ్యుల పేరిట నల్లగొండ పరిసరాల్లో ఖరీదైన భవనా లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లగొండ పట్టణంలో నాలుగు భవనాలు, కనగల్ మండలం పర్వతగిరిలో ఒక ఇల్లు ఉన్నట్లు కనుగొన్నారు. నయీమ్ చిన్నమ్మ కూతురు అస్మత్ బేగం ఇచ్చిన సమాచారం మేరకు ఆ స్తుల చిట్టాను బయటకు తీస్తున్నారు. బేగం పేరిట చైతన్యపురి కాలనీలో ఇల్లు, శ్రీనగర్ కాలనీలో నయీమ్ తల్లి తాహెరా బేగం పేరిట, మరదలు నేహా పేరిట ఇళ్లు, బావమరిది కూతురు నీలోమ పేరిట భవనం, కనగల్ మండలం పర్వతగిరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె మహెల్లా పేరిట ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె మహెల్లాకు అస్మత్‌బేగం కుమారుడు సప్రాజ్తో గతేడాది నిశ్చితార్థం జరిగింది. అల్లుడు సప్రాజ్ కూడా నయీ మ్ గ్యాంగ్‌లోనే పని చేసినట్లు తేలింది. పుప్పాలగూడలో మరొకటి పుప్పాలగూడలో నయీమ్ మరో ఇంటిని పోలీసులు గుర్తిం చారు. నయీమ్ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు.. నార్సింగి పోలీ సులతో పాటు సిట్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు.డాక్యుమెంట్లు, బంగారం, నాలుగు దేశీయ పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐదుగురి అరెస్ట్: భూ దందాలు, హత్యలు, సెటిల్మెంట్లతో సంబంధం ఉన్న నల్లగొండకు చెందిన నయీమ్ అనుచరులు అస్మత్ బేగం, యూనుస్, టమాట శ్రీను, జహంగీర్, జానీలను పోలీసులు అరెస్టు చేశారు. -
నీకు నేను.. నాకు నువ్వు!
ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన ఓ ‘ముఖ్య నేత’ తమ్ముడి కోసం 400 ఎకరాల వివాదాన్ని నయీమ్ సెటిల్ చేశాడు. అందుకు బదులుగా ‘ముఖ్య నేత’ ఇతడికి అనేక విధాలుగా సాయం అందించాడు. నయీమ్‌తో పెనవేసుకున్న పోలీసు బంధం * ఎస్సై స్థాయి నుంచి డీఎస్పీల దాకా డీలింగ్స్ * విలువైన స్థలాలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన గ్యాంగ్‌స్టర్ * డైరీలు, పత్రాలు, పుస్తకాల పరిశీలనలో విస్మయకర అంశాలు సాక్షి, హైదరాబాద్: నయీమ్ కోసం పోలీసులు.. పోలీసుల కోసం నయీమ్.. ఇలా ఒకరి కోసం ఒకరు పనిచేశారు! రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సైతం ఈ కరుడుగట్టిన నేరగాడితో అంటకాగారు. ఏపీలోని సీఆర్డీఏ పరిధిలోనూ నయీమ్ దందాలు జరిపాడని తెలిసింది. ఇతడి నుంచి అనేక విధాలుగా లబ్ధి పొందిన వారిలో ఎస్సై నుంచి అధికారి వరకు వివిధ హోదాలకు చెందిన వారు ఉన్నారు. నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌తోపాటు నయీమ్‌కు చెందిన స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, డైరీలు, పుస్తకాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇందులో విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లావాదేవీలన్నీ బినామీ పేర్లతోనే జరగడంతో వాటికి సంబంధించిన ఆధారాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. అవి లభించిన తర్వాత సదరు పోలీసులు, నేతలు, వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన నయీమ్ దందాలివీ... ≈ కొన్నేళ్ల క్రితం ఎన్నికల ప్రచారం కోసం ప్రయాణిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సినీ నటికి నగర శివార్లలో ఆరెకరాల భూమి ఉండేది. దీనిని నయీమ్ ఆక్రమించాడు. దీనికి సహకరించిన ఓ ఎస్సైకి (ప్రస్తుతం ఇన్స్పెక్టర్) మణికొండ పంచవటి కాలనీలో ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఓ ఫంక్షన్ హాల్‌ను నయీమ్ తన అడ్డాగా మార్చుకున్నాడు. దీని యజమానికి చెందిన 15 ఎకరాలు భూ వివాదాన్ని సెటిల్ చేశాడు. ప్రతిఫలంగా అత్యంత ఖరీదైన కారును తీసుకున్నాడు ≈ వికారాబాద్‌లో ఫామ్‌హౌస్, కూకట్పల్లి ప్రాంతంలోని ఓ సొసైటీలో 60 ప్లాట్లు, అత్తాపూర్‌లో ఐదు ఖరీదైన ప్లాట్లు, ఆరె మైసమ్మ వద్ద ఓ వెంచర్ నయీమ్ కబ్జాలో ఉన్నట్లు తేలింది ≈ సిటీ, సైబరాబాద్‌ల్లో ఎస్సై నుంచి వివిధ హోదాల్లో పని చేసిన ఓ అధికారి నయీమ్‌కు అనేక విధాలుగా సహకరించారు. దీంతో ఆయనకు అమీర్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, శివరామ్‌పల్లిలో 10 ఎకరాల స్థలం, దానిలో 100 గజాల గెస్ట్‌హౌస్ ముట్టజెప్పాడు ≈ మెదక్ జిల్లాలో రెండెకరాల స్థలానికి సంబంధించి మాట వినని ఓ న్యాయవాదిని హత్య చేయాలని నయీమ్ నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన ప్లాన్‌ను ఆ జిల్లాకు చెందిన ఓ ఇన్స్పెక్టర్ వేసినట్లు తెలిసింది ≈ నగర శివార్లలో నార్త్‌జోన్‌లో ఏసీపీగా పని చేసిన ఓ అధికారికి నయీమ్ రూ.70 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సౌత్జోన్లో పని చేసిన ఓ అధికారికి మలక్‌పేటలో రెండు ఫ్లాట్లు ముట్టజెప్పాడు ≈ శివార్లలో నయీమ్‌తోపాటు కొందరు పోలీసు అధికారులూ ఉమ్మడిగా బినామీ పేర్లతో 50 ఎకరాల మామిడి తోటను కబ్జాలో పెట్టుకున్నారు ≈ పలు విభాగాల్లో పని చేసిన/చేస్తున్న నలుగురు డీఎస్పీలను తనకు అనుకూలంగా వాడుకున్న నయీమ్ వారికి మక్తల్‌లో 200 ఎకరాలు ఇచ్చాడు ≈ ఓ ఉన్నతాధికారి కుమార్తె బర్త్‌డే వేడుకలకు వెళ్లిన నయీమ్ జూబ్లీహిల్స్‌లో వెయ్యి గజాల స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు ≈ సంగారెడ్డిలో 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఓ సీఏను నయీమ్ హత్య చేశాడు. ఈ కేసులో తనకు సహకరించిన పోలీసు అధికారికి రూ.2.5 కోట్లు ఇచ్చాడు ≈ ఓ అత్యున్నత అధికారికి శివారు జిల్లాల్లో 150 ఎకరాల వరకు కట్టబెట్టిన నయీమ్.. అనేక సందర్భాల్లో ఆయన పరపతిని వినియోగించుకున్నాడు ≈ నల్లగొండ జిల్లాలో పని చేసి, ప్రస్తుతం నగరంలోనే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారికి రూ.35 లక్షల విలువైన 2 లగ్జరీ కార్లను నయీమ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ డీఐజీ స్థాయిలో పని చేసిన ఓ అధికారికి ఫిల్మ్‌సిటీ సమీపంలో 12 ఎకరాలు ఇచ్చాడు. దీనికి సమీపంలోనే నయీమ్ కబ్జాలో మరో 15 ఎకరాలు ఉంది ≈ ఓ ఉన్నతాధికారితో పాటు నలుగురు అధికారులకు కలిపి బినామీ పేర్లతో శివార్లలో 380 ఎకరాలు కట్టబెట్టాడు ≈ నయీమ్‌కు అనేక విధాలుగా సహకారం అందించిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు టెలికాం నగర్లో ఇళ్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ మల్కాజ్గిరి భూ వివాదానికి సంబంధించి నయీమ్ ఓ హత్య చేశాడు. దీన్ని మాఫీ చేసిన అధికారికి రంగారెడ్డి జిల్లాలో ఫామ్‌హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ నగరానికి చెందిన ఓ భూ వివాదాన్ని ఓ మీడియా ఛానల్‌కు చెందిన కీలక వ్యక్తి.. నయీమ్ వద్దకు తీసుకువెళ్లాడు. దీన్ని సెటిల్ చేయించినందుకు సదరు మీడియా వ్యక్తి భూ యజమాని నుంచి రూ.10 కోట్లు తీసుకున్నాడని తెలిసింది ≈ ఏపీలో రాజధాని ప్రకటన తర్వాత సీఆర్డీఏలోని ప్రాంతంలోకి నయీమ్ అడుగుపెట్టాడు. గుంటూరులోని భూ దందాకు సహకరించినందుకు ఓ ఉన్నతాధికారికి రూ.5 కోట్లు సమర్పించినట్లు తెలిసింది ≈ ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు పోలీసు అధికారులతో కలిసి దుబాయ్‌లో సూట్‌కేస్ కంపెనీలు స్థాపించాడని సమాచారం. ‘ఎన్-కంపెనీ’ ఏర్పాటు తర్వాత వీటి ఆధారంగా నగదును ఇక్కడకు తరలించాలని పథకం వేశాడు ♦ నయీమ్ నక్సలైట్ నుంచి ‘జనజీవన స్రవంతి’లో కలిసిన తర్వాత మావోయిస్టులకు సంబంధించిన సమాచారం అధికారులకు అందించాడు. ఈ నేపథ్యంలోనే కొందరు అధికారులతో కలిసి ఓ డంప్‌పై దాడి చేశాడు. అక్కడ దొరికిన రూ.1.5 కోట్ల నగదును అంతా పంచుకుని ఆయుధాలు, తూటాలు తదితరాలను మాత్రమే రికవరీ చూపించారు. ♦ సుదీర్ఘకాలంగా నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉండి, అనేక అంశాల్లో సాయం అందించిన నగరానికి చెందిన అధికారికి మద్యం వ్యాపారం అప్పగించాడు. నయీమ్ బినామీల పేర్లతో ఉన్న 16 వైన్ షాపులు, 4 బార్లను ఈయనే పర్యవేక్షిస్తున్నారు. ♦ సరూర్‌నగర్ ప్రాంతంలో ఉన్న విలువైన స్థలానికి సంబంధించి ఇద్దరు బడా బిల్డర్ల మధ్య వివాదాన్ని సెటిల్ చేసే బాధ్యతల్ని ఆ ప్రాంతంలో పని చేసిన ఓ డీఎస్పీ స్థాయి అధికారికి నయీమ్ అప్పగించాడు. తర్వాత అతడికి ఎల్బీనగర్ ప్రాంతంలో 2,500 గజాల స్థలాన్ని కబ్జా చేసి, షాపింగ్ కాంప్లెక్స్‌గా మార్చి గిఫ్ట్‌గా ఇచ్చాడు. -
బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్
భీమవరం టౌన్: ఏపీ సీఎం చంద్రబాబు పెంచిన నల్లతాచు గ్యాంగ్‌స్టర్ నయీమ్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. నయీమ్ బతికున్నప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇప్పుడెందుకు నాట కాలు అంటూ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా కేబినెట్ మొత్తం గతంలో టీడీపీలోనే ఉండేవారని, పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించే రామలింగారెడ్డి ఆ వ్యాఖ్యలు చేసుంటారని చెప్పారు.