‘నయీమ్’ కేసును సీబీఐకి అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గదర్శి సభ్యుడు కె.నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్ (న్యాయవాదితో సంబం ధం లేకుండా తానే వాదనలు వినిపించుకునే వ్యక్తి) హోదాలో ఆయన ఈ వ్యాజ్యాన్ని వేశారు. సోమవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన ఆయన...
దీనిపై లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరారు. ఈ కేసులో పోలీసులు, రాజకీయ నాయకులకు సంబంధం ఉందని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. దీనిపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా, కౌంటర్లు కోరకుండా నేరుగా ఎలా ఉత్తర్వులు జారీ చేయగలమంది. లంచ్‌మోషన్ రూపంలో విచారించలేమని, సాధారణ పద్ధతిలో వచ్చినప్పుడే విచారణ చేపడుతామని తేల్చి చెప్పింది. దీంతో ఆయన కోర్టు నుంచి వెనుదిరిగారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తరువాత అతని అక్రమ సంపాదన, అరాచకాలు, అతనికి ఉన్న సంబంధాలు తదితర వాటిని తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, దానివల్ల ప్రయోజనం ఉండదని నారాయణ తన పిటిషన్‌లో వివరించారు. ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారంలో వివిధ ప్రాంతాల్లో 62 కేసులు నమోదయ్యాయని తెలిపారు.