‘2జీ’. ఈ రెండు అక్షరాలు వింటే డీఎంకే శ్రేణుల గుండెల్లో గత ఆరేళ్లుగా రైళ్లు పరుగెడుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి రూ.1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణం,
ఆరేళ్లుగా సాగుతున్న సీబీఐ, ఈడీ కేసుల విచారణే వారి భయానికి కారణం. ఈ కేసులో గురువారం తీర్పు వెలువడనుండగా రాజా, కనిమొళి దోషులుగా జైలుకా, నిర్దోషులుగా ఇంటికా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.
ఓవైపు 2జీ స్పెక్ట్రం కేసులో తీర్పు.. ఇదే రోజు ఆర్కే నగర్ ఉప ఎన్నిక.. 2జీ కేసులో శిక్ష పడితే ఆర్కే నగర్ పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని డీఎంకే నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
సాక్షి, చెన్నై: పదేళ్ల కిత్రం జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి గురువారం ముగింపు కార్డు పడనుంది. డీఎంకే నాయకులు రాజా, కనిమొళి ఈ కేసులో చిక్కుకుని ఉండడం.. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఇదే రోజు కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈరెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు.
ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్‌ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది.
కరుణ సహధర్మచారిణిని ప్రశ్నించాలనుకున్న సీబీఐ
స్వాన్ టెలికం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు ప్రతిఫలంగా డీఎంకేకి సొంతమైన కలైంజర్ టీవీ, టీపీ గ్రూపు సంస్థలకు రూ.200 కోట్లు లంచం ఇచ్చిన కేసును సైతం అసలు కేసులోనే చేర్చారు. ఈ కేసులను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టారు. రిలయన్స్ టెలికం, స్వాన్ టెలికం, యూనీటెక్ వైర్‌లెస్ సంస్థలు సైతం కేసు విచారణలను ఎదుర్కొన్నారు. కలైంజర్ టీవీ డైరక్టర్ వ్యవహరిస్తున్న కరుణ సహధర్మచారిణి దయాళుఅమ్మాళ్‌ను కూడా సీబీఐ ప్రశ్నించాలని భావించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆమెకు జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందని, ఏమీ మాట్లాడుతారో ఆమె తెలియదని కరుణ కుటుంబీకులు నిరాకరించారు.
సీబీఐ సిఫార్సు మేరకు కేంద్రం నుంచి వైద్యులు బృందం సైతం చెన్నైకి వచ్చి దయాళుఅమ్మాళ్‌ను పరీక్షించింది. 2జీ కేసులో మిత్రపక్షం డీఎంకే అని కూడా చూడకుండా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహించిన కరుణానిధి యూపీఏ నుంచి వైదొలిగారు. ఆ తరువాత దయాళూఅమ్మాళ్‌ను విచారించే అంశం మరుగున పడింది. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి రూ.30,984 కోట్లు నష్టం సంభవించినట్లు ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఆరేళ్లు సాగినకేసు
గత ఆరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగియగా, 21వ తేదీన తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ఓపీ సైనీ ఇటీవల ప్రకటించారు. గురువారం చెప్పబోయే తీర్పుతో పదేళ్ల కిత్రం జరిగిన కుంభకోణానికి ముగింపు కార్డు పడనుంది. తీర్పు చెప్పుతున్నందున కోర్టుకు హాజరుకావాల్సిందిగా రాజా, కనిమొళిలకు ఆదేశాలు అందాయి. పదేళ్ల క్రితం నాటి 2 జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పదేళ్ల క్రితం నాటి కుంభకోణం, ఆరేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న కేసుపై గురువారం తీర్పు వెలువడనుంది. రాజా, కనిమొళిలను కోర్టు దోషులుగా నిర్ధారించి జైలు బాటపట్టిస్తుందా, నిర్దోషులుగా పేర్కొని ఇంటికి పంపుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఒకే రోజు రెండు టెన్షన్లు
దురదృష్టమో, కాకతాళీయమో తెలియదు కానీ కరుణానిధి, స్టాలిన్ సహా డీఎంకే శ్రేణులు గురువారం రెండు టెన్షన్లను ఎదుర్కొంటున్నారు. 2 జీ కేసులో శిక్ష పడితే పార్టీకి చెరగని మచ్చగా మారి ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని భయం. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుంది. అన్నాడీఎంకేకి రాబోయే ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment