investigating case
-
‘నయీమ్’ కేసును సీబీఐకి అప్పగించాలి
-
‘నయీమ్’ కేసును సీబీఐకి అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గదర్శి సభ్యుడు కె.నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్ (న్యాయవాదితో సంబం ధం లేకుండా తానే వాదనలు వినిపించుకునే వ్యక్తి) హోదాలో ఆయన ఈ వ్యాజ్యాన్ని వేశారు. సోమవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన ఆయన... దీనిపై లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరారు. ఈ కేసులో పోలీసులు, రాజకీయ నాయకులకు సంబంధం ఉందని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. దీనిపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా, కౌంటర్లు కోరకుండా నేరుగా ఎలా ఉత్తర్వులు జారీ చేయగలమంది. లంచ్‌మోషన్ రూపంలో విచారించలేమని, సాధారణ పద్ధతిలో వచ్చినప్పుడే విచారణ చేపడుతామని తేల్చి చెప్పింది. దీంతో ఆయన కోర్టు నుంచి వెనుదిరిగారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అతని అక్రమ సంపాదన, అరాచకాలు, అతనికి ఉన్న సంబంధాలు తదితర వాటిని తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, దానివల్ల ప్రయోజనం ఉండదని నారాయణ తన పిటిషన్లో వివరించారు. ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారంలో వివిధ ప్రాంతాల్లో 62 కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
రోజుకో కొత్తముఖం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో లెక్కలేనన్ని బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా అనేక కొత్త ముఖాలు బయటపడుతున్నాయి. వీరందరూ దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో.. ఎంసెట్ మాఫియా చైన్ లింక్‌ను చూసి సీఐడీ అధికారులు నివ్వెరబోతున్నారు. ఇప్పటి వరకు నిందితుల జాబితా 54కు చేరగా, అరెస్టయిన వారి సంఖ్య 26కు చేరింది. వీరిలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిందితులున్నారు. దీంతో సీఐడీ మరింత లోతుగా ఆరా తీస్తోంది. ఈ నిందితులంతా ఎలా కలిశారనే దానిపై దృష్టి సారించి మూలాలను ఛేదించే పనిలో నిమగ్నమైంది. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీల పేరుతో దగా.. ఎంసెట్-2ను దర్యాప్తు చేస్తున్న సీఐడీకి అనేక కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంసెట్-1ను ఈ ఏడాది మే 2న నిర్వహించగా.. ఎంసెట్-2ను జూలై 9న నిర్వహించారు. 2 నెలల వ్యవధిలో నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకవడం అది కూడా 12 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల చేతికి వెళ్లడం అధికారులను విస్మయపరుస్తోంది. ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా కూడా వివిధ చోట్ల ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలనే నిర్వహిస్తున్నారు. దీంతో విద్యాసంస్థల పేరుతో ఓ మాఫియా దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నట్లు సీఐడీ అనుమానిస్తోంది. ఎంసెట్-2కు అతి తక్కువ సమయంలో 200 మందికి పైగా విద్యార్థులను సేకరించడం, వారిని నమ్మించి ‘ప్రత్యేక’ శిక్షణకు ఒప్పించడం అంత మామూలు విషయం కాదు. ఈ వ్యవస్థ ఎంత కాలం నుంచి ఎక్కడెక్కడ ఎలా పని చేస్తున్నదనే దానిపై సీఐడీ ఆరా తీస్తోంది. తాజాగా మరో వ్యక్తి అరెస్టు.. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మరో వ్యక్తి అరెస్టయ్యాడు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రాజేశ్ రాజశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరుగురు విద్యార్థులను సమీకరించి కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘ప్రత్యేక’ శిక్షణ శిబిరంలో నిందితుడు తర్ఫీదు ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. కుంభకోణంలో మిగిలిన వారి పాత్రపై విచారణ చేస్తున్నామని, త్వరలో కీలక వ్యక్తులను అరెస్టు చేస్తామని సౌమ్యా మిశ్రా వెల్లడించారు. -
కస్టోడియన్లతో కలసి కాజేశారు!
♦ ‘ఏటీఎం ఫ్రాడ్’ కేసులో సీసీఎస్ దర్యాప్తు ముమ్మరం ♦ ఆర్సీఐ సంస్థ యాజమాన్యం పాత్రపైనా ఆధారాలు ♦ ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు ♦ సూత్రధారులు, ఓ క్రికెట్ బుకీ కోసం కొనసాగుతున్న వేట సాక్షి, హైదరాబాద్: ఎస్బీఐకి చెందిన ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.9.98 కోట్ల గోల్మాల్ కేసు దర్యాప్తును సీసీఎస్ అధికారులు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి సబ్-కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ యాజమాన్యం పాత్రపైనా ఆధారాలు సేకరించారు. వీరు తమ వద్ద పని చేసే కస్టోడియన్లతో కలసి భారీ మొత్తం కాజేసినట్లు గుర్తించారు. మంగళవారం నాటికి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ అధికారులు పరారీలో ఉన్న ఆర్సీఐ యజమానులతో పాటు ఓ క్రికెట్ బెట్టింగ్ బుకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. నగరంలో ఉన్న తమ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని 20 నెలల క్రితం కాంట్రాక్టు పద్ధతిన ఫైనాన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్(ఎఫ్ఎస్ఎస్)కు ఎస్బీఐ అప్పగించింది. 116 ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని ఎఫ్ఎస్ఎస్ సంస్థ ముంబైకి చెందిన ఆర్సీఐకి సబ్-కాంట్రాక్ట్ ఇచ్చింది. బ్యాంకునకు చెందిన కార్యాలయం నుంచి నగదు తీసుకుని, దాన్ని ఏటీఎం కేంద్రాల్లో నింపడానికిఆర్సీఐ కస్టోడియన్లను నియమించుకుంది. కస్టోడియన్లతో కలసి.. ఆర్సీఐ సంస్థను సుధీర్‌కుమార్, పవన్‌గుప్తా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించి ఈ సంస్థ కార్యాలయం మహేంద్రహిల్స్ త్రిమూర్తి కాలనీలో ఉంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సుధీర్, పవన్ కొన్ని నెలలుగా తమ వద్ద పని చేస్తున్న వారికి జీతాలు సైతం చెల్లించట్లేదు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో కస్టోడియన్లుగా పనిచేస్తున్న లోకేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌ను సంప్రదించారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన సొమ్ములో రూ.2.5 కోట్లు తీసుకువచ్చి తమకు అప్పగించాలని, ఆ మొత్తాన్ని ఏటీఎం కేంద్రాల్లో నింపినట్లు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. దీంతో లోకేశ్వర్, ప్రవీణ్ అలానే చేశారు. ఈ మార్గంలో డబ్బు సంపాదించడం తేలికని భావించిన ఆ ఇద్దరూ మరికొందరు కస్టోడియన్లతో కలసి నగదు కాజేయడం ప్రారంభించారు. బెట్టింగ్స్‌లో రూ.కోట్లు నష్టపోయి.. లోకేశ్ తాను కాజేసిన డబ్బుతో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్స్ కాయడం ప్రారంభించాడు. తొలుత రూ.5 లక్షలు లాభం వచ్చినా.. క్రమంగా రూ.4.5 కోట్ల వరకు బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. మొత్తం రూ.6.5 కోట్ల వరకు కాజేసిన ఇతడు మిగిలిన మొత్తంతో వాహనాలు, పొరుగు జిల్లాల్లో స్థిరాస్తులు కూడబెట్టాడు. లోకేశ్ మెట్టుగూడకు చెందిన ప్రేమ్ అనే బుకీ వద్ద పందాలు కాసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇతడిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఏడుగురు ఏటీఎంల్లో పెట్టాల్సిన నగదు గల్లంతుకు సంబంధించి పది రోజుల క్రితమే ఎస్బీఐ అధికారులు ఎఫ్ఎస్ఎస్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. నోటీసు అందుకున్న ఎఫ్ఎస్ఎస్ నిర్వాహకులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీసీఎస్ అధికారులు ప్రాథమికంగా కస్టోడియన్ల కోణంలో దర్యాప్తు చేపట్టారు. లోకేశ్, ప్రవీణ్, అజయ్, నర్సింగ్, నాగరాజు తదితరుల పాత్ర ఉన్నట్లు తేల్చి మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్సీఐకి చెందిన సుధీర్, పవన్ పాత్ర వెలుగులోకి వచ్చింది. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి రూ.1.2 కోట్లు రికవరీ చేశారు. మిగిలిన మొత్తం రికవరీతో పాటు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.