
కస్టోడియన్లతో కలసి కాజేశారు!
♦ ‘ఏటీఎం ఫ్రాడ్’ కేసులో సీసీఎస్ దర్యాప్తు ముమ్మరం
♦ ఆర్‌సీఐ సంస్థ యాజమాన్యం పాత్రపైనా ఆధారాలు
♦ ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు
♦ సూత్రధారులు, ఓ క్రికెట్ బుకీ కోసం కొనసాగుతున్న వేట
సాక్షి, హైదరాబాద్: ఎస్‌బీఐకి చెందిన ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.9.98 కోట్ల గోల్‌మాల్ కేసు దర్యాప్తును సీసీఎస్ అధికారులు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి సబ్-కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న ఆర్‌సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ యాజమాన్యం పాత్రపైనా ఆధారాలు సేకరించారు. వీరు తమ వద్ద పని చేసే కస్టోడియన్లతో కలసి భారీ మొత్తం కాజేసినట్లు గుర్తించారు. మంగళవారం నాటికి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ అధికారులు పరారీలో ఉన్న ఆర్‌సీఐ యజమానులతో పాటు ఓ క్రికెట్ బెట్టింగ్ బుకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. నగరంలో ఉన్న తమ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని 20 నెలల క్రితం కాంట్రాక్టు పద్ధతిన ఫైనాన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్(ఎఫ్‌ఎస్‌ఎస్)కు ఎస్‌బీఐ అప్పగించింది. 116 ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని ఎఫ్‌ఎస్‌ఎస్ సంస్థ ముంబైకి చెందిన ఆర్‌సీఐకి సబ్-కాంట్రాక్ట్ ఇచ్చింది. బ్యాంకునకు చెందిన కార్యాలయం నుంచి నగదు తీసుకుని, దాన్ని ఏటీఎం కేంద్రాల్లో నింపడానికిఆర్‌సీఐ కస్టోడియన్లను నియమించుకుంది.
కస్టోడియన్లతో కలసి..
ఆర్‌సీఐ సంస్థను సుధీర్‌కుమార్, పవన్‌గుప్తా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించి ఈ సంస్థ కార్యాలయం మహేంద్రహిల్స్ త్రిమూర్తి కాలనీలో ఉంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సుధీర్, పవన్ కొన్ని నెలలుగా తమ వద్ద పని చేస్తున్న వారికి జీతాలు సైతం చెల్లించట్లేదు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో కస్టోడియన్లుగా పనిచేస్తున్న లోకేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌ను సంప్రదించారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన సొమ్ములో రూ.2.5 కోట్లు తీసుకువచ్చి తమకు అప్పగించాలని, ఆ మొత్తాన్ని ఏటీఎం కేంద్రాల్లో నింపినట్లు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. దీంతో లోకేశ్వర్, ప్రవీణ్ అలానే చేశారు. ఈ మార్గంలో డబ్బు సంపాదించడం తేలికని భావించిన ఆ ఇద్దరూ మరికొందరు కస్టోడియన్లతో కలసి నగదు కాజేయడం ప్రారంభించారు.
బెట్టింగ్స్‌లో రూ.కోట్లు నష్టపోయి..
లోకేశ్ తాను కాజేసిన డబ్బుతో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్స్ కాయడం ప్రారంభించాడు. తొలుత రూ.5 లక్షలు లాభం వచ్చినా.. క్రమంగా రూ.4.5 కోట్ల వరకు బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. మొత్తం రూ.6.5 కోట్ల వరకు కాజేసిన ఇతడు మిగిలిన మొత్తంతో వాహనాలు, పొరుగు జిల్లాల్లో స్థిరాస్తులు కూడబెట్టాడు. లోకేశ్ మెట్టుగూడకు చెందిన ప్రేమ్ అనే బుకీ వద్ద పందాలు కాసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇతడిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు.
పోలీసుల అదుపులో ఏడుగురు
ఏటీఎంల్లో పెట్టాల్సిన నగదు గల్లంతుకు సంబంధించి పది రోజుల క్రితమే ఎస్‌బీఐ అధికారులు ఎఫ్‌ఎస్‌ఎస్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. నోటీసు అందుకున్న ఎఫ్‌ఎస్‌ఎస్ నిర్వాహకులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీసీఎస్ అధికారులు ప్రాథమికంగా కస్టోడియన్ల కోణంలో దర్యాప్తు చేపట్టారు. లోకేశ్, ప్రవీణ్, అజయ్, నర్సింగ్, నాగరాజు తదితరుల పాత్ర ఉన్నట్లు తేల్చి మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్‌సీఐకి చెందిన సుధీర్, పవన్ పాత్ర వెలుగులోకి వచ్చింది. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి రూ.1.2 కోట్లు రికవరీ చేశారు. మిగిలిన మొత్తం రికవరీతో పాటు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.