అధిక పరిహారం చెల్లించే భూములు తీసుకున్నాం
హైకోర్టుకు నివేదించిన పెన్నా, పయనీర్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు మార్కెట్ ధర కంటే ఎక్కువ పరిహారం చెల్లించే భూములు తీసుకున్నామని పెన్నా సిమెంట్స్, పయనీర్ హోల్డింగ్ కంపెనీల తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గురుకృష్ణ కుమార్ హైకోర్టుకు నివేదించారు. అందులో ఎటువంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదని స్పష్టంచేశారు. కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో మైనింగ్ లీజుల్లో చట్ట ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్న సీబీఐ.. అందుకు సంబంధించి ఆధారాలను చూపలేదన్నారు.
చార్జిషీట్‌లోని అంశాలను చూడకుండానే విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ పెన్నా గ్రూప్ చైర్మన్ సి.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ సోమవారం విచారించారు. వాదనల అనంతరం విచారణను శనివారానికి వాయిదా వేశారు.