నయీమ్‌ను పెంచి పోషించింది బాబే
* బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపణ
* 18 ఏళ్ల అజ్ఞాతం నుంచి బయటకు
సాక్షి, హైదరాబాద్/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడేనని బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం తన సోదరి బెల్లి లలితను 1999లో అతికిరాతకంగా చంపించారని దుయ్యబట్టారు. అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి ఆదేశాల మేరకు లలితను నమూమ్ హత్య చేయించారని, ఆపై మృతదేహాన్ని అతికిరాతకంగా 17ముక్కలు చేయించాడన్నారు.
శనివారమిక్కడ బెల్లి కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తన సోదరి సహా మరికొందరు కుటుంబ సభ్యులు హత్యలకు గురికావడంతో ప్రాణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వివరించారు. తెలంగాణ కోసం పోరాడే వారందరినీ నక్సలైట్లుగా చిత్రీకరించి చంపేశారన్నారు. తన సోదరితోపాటు మిగతా కుటుంబ సభ్యుల హత్యలపై సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించాలని కృష్ణ డిమాండ్ చేశారు. దాదాపు 18 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న కాలంలో ఏడాదిపాటు తెలంగాణ బయట తిరిగానని, ఆ తర్వాత హైదరాబాద్‌లోనే సీసాలు ఏరుకుంటూ బతికానన్నారు. తన కుటుంబ సభ్యుల హత్య కేసులకు సంబంధించి సిట్‌ను కలసి వివరాలు అందిస్తానన్నారు. నయీమ్ అనుచరులు ఇంకా చాలా మంది దర్జాగా బయటే తిరుగుతున్నారన్న కృష్ణ... నయీమ్ కుటుంబం మొత్తం నరరూప రాక్షసులేనన్నారు.
కుటుంబమంతా చిన్నాభిన్నం...
బెల్లి లలిత 1999 మే 26న భువనగిరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ మరికొందరు హత్యచేశారు. అయితే నాటి తెలుగుదేశం ప్రభుత్వమే తెలంగాణకు అనుకూలంగా ఉన్న బెల్లి లలితను హత్య చేయించిందని పెద్దఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. అలీమొద్దీన్ బెల్లి లలిత కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగా నయీమ్ అనుచరులు 2002లో బెల్లి కృష్ణ బావలు కరుణాకర్, శ్రీరాములు యాదవ్, బత్తుల మల్లేష్‌యాదవ్‌లతోపాటు ఆలేరు మండలంలోని టంగుటూర్‌కు చెందిన ఈకి రి సిద్దులును అతికిరాతకంగా హతమార్చారు. కృష్ణనూ హతమార్చేందుకు ప్రయత్నించగా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.