నయీమ్ కంప్యూటర్లలో అందరి జాతకాలూ! | Nayeem Computers In Horoscope for everyone! | Sakshi
Sakshi News home page

నయీమ్ కంప్యూటర్లలో అందరి జాతకాలూ!

Published Wed, Aug 17 2016 2:07 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

నయీమ్ కంప్యూటర్లలో అందరి జాతకాలూ! - Sakshi

నయీమ్ కంప్యూటర్లలో అందరి జాతకాలూ!

* 4 వేల సినిమాలకు సమానమైన ఫుటేజీ స్వాధీనం
* ఏకంగా 7 టెరాబైట్స్.. విస్తుపోయిన అధికారులు
* అంటకాగిన వారందరి జాతకాలూ వాటిలో నిక్షిప్తం!
* నక్సల్‌గా ఉన్నప్పటి నుంచే డైరీ రాసిన నయీమ్
* తర్వాత టెక్నాలజీ సాయంతో వీడియో రికార్డులు
* నయీమ్, కుటుంబీకుల పేరిట 250 బ్యాంకు ఖాతాలు
* లావాదేవీల వివరాల కోసం బ్యాంకులకు సిట్ లేఖలు

సాక్షి, హైదరాబాద్: ఏకంగా 7 టెరాబైట్స్! అంటే సుమారు 4 వేల సినిమాల నిడివికి సమానమైన డేటా!!

గ్యాంగ్‌స్టర్ నయీమ్ అడ్డాల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌ల్లో ఇంతటి డేటా నిక్షిప్తమై ఉంది!!! దాంతో సిట్ అధికారులు విస్తుపోయారు. నయీమ్ అడ్డాల్లోని సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలతో పాటు అతనిచ్చిన విందుల వీడియోలు, ఫోన్ సంభాషణలన్నీ ఈ డేటాలో ఉన్నట్లు తెలుస్తోంది!! నయీమ్ వ్యూహాత్మకంగానే వీటన్నింటినీ భద్రపరిచినట్టు భావిస్తున్నారు. అంతేకాదు, అతను తన చావును కూడా ముందే ఊహించాడన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘‘కత్తి పట్టిన ప్రతివాడూ దానికే బలవుతాడు. అందుకు నేను కూడా అతీతమేమీ కాదు.

నా వల్ల నష్టం, లేదా లాభం పొందిన వారినుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదు. ముఖ్యంగా పోలీసులను, నేతలను నమ్మకూడదు’’ అని నయీమ్ తన అనుచరులకు పదేపదే చెప్పేవాడని తెలిసింది. అందుకే ఎందుకైనా మంచిదని వీలైన ప్రతి అంశాన్నీ అతను రికార్డు చేయించి భద్రపరిచేవాడట. మావోయిస్టు ఉద్యమంలో చేరినప్పటి నుంచీ డైరీ రాసుకోవడం అలవాటు చేసుకున్న నయీమ్, అనంతరం టెక్నాలజీ సాయంతో ఆడియో, వీడియో రికార్డులకు దిగాడు. ఇప్పుడు వాటన్నింటినీ పరిశీలిస్తే అతనితో అంటకాగిన వారి బాగోతాలన్నీ బయటపడవచ్చని సిట్ అధికారులు అంటున్నారు. నయీమ్ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు రోజుకో తీరుగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అతనికి ఒకటీ రెండూ కాదు.

ఏకంగా 250 బ్యాంకు ఖాతాలున్నాయి! ఇవన్నీ సొంత, కుటుంబీకుల పేర్లతో ఉన్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. వీటిలో అత్యధికంగా నయీమ్ సోదరి సమీరా, భార్య హసీనా, వంటమనిషి ఫర్హానాల పేరిట ఉన్నట్టు తేలింది. వాటి లావాదేవీల వివరాలు కోరుతూ ఆయా బ్యాంకులకు సిట్ లేఖలు రాసింది. కొన్ని ప్రత్యేక లాకర్లు కూడా వెలుగు చూశాయి.

నయీమ్ బెదిరింపుల ద్వారా తాను సాగించిన డబ్బు లావాదేవీల్లో చాలావరకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానంలోనే నిర్వహించినట్లు సమాచారం. అతని డెన్‌ల నుంచి ఇప్పటిదాకా వందల కొద్దీ బ్యాంకు చెక్‌బుక్కులు లభించాయి. నయీమ్, అతని కుటుంబీకులతో పాటు ముఖ్య అనుచరులవి కూడా ఉన్నాయి. ఇంకా పలువురికి సంబంధించిన బ్లాంక్ చెక్‌లు లభ్యమైనట్లు సమాచారం. వారిని విచారించాలని సిట్ యోచిస్తోంది.
 
2 శాతం ‘ఎన్‌ఎం’ ట్యాక్స్!
నయీమ్ తన సామ్రాజ్య విస్తరణ కోసం అనేక వికృత క్రీడలు అవలంబించినట్లు అతని అడ్డాల్లో దొరికిన డైరీల ద్వారా తేలింది. తనకు పట్టున్న ప్రాంతాల నుంచి, టార్గెట్ల నుంచి వసూళ్లకు కొత్త పథకం రూపొందించినట్టు సిట్ గుర్తించింది.
 ‘ఎన్-ఎం (నయీమ్)’ ట్యాక్స్ పేరిట లావాదేవీలు నిర్వహించడమే గాక సమన్వయానికి కొందరిని నియమించాడని తెలిసింది. ప్రతి లావాదేవీకీ 2 శాతం వసూలు చేసేవాడని గుర్తించారు.
 
‘‘కత్తి పట్టిన ప్రతివాడూ దానికే బలవుతాడు. నేనూ అందుకు అతీతమేమీ కాదు. నా వల్ల నష్టం, లేదా లాభం పొందిన వారినుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదు. ముఖ్యంగా పోలీసులను, రాజకీయ నాయకులను నమ్మకూడదు’’     
- అనుచరులతో నయీమ్
 
మా ఆస్తులు గుంజుకున్నాడు
ముందుకొస్తున్న నయీమ్ బాధితులు.. పోలీసులకు ఫిర్యాదులు

హైదరాబాద్/భువనగిరి: నయీమ్ బాధితులు ఒక్కొక్కరు ముందుకొస్తున్నారు. నయీమ్ ముఠా సభ్యులు తమను బెదిరించి ఆస్తులను గుంజుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆదిభట్లకు చెందిన పలువురు బాధితులు ఎల్బీ నగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2002లో నయీమ్, సామ సంజీవరెడ్డి, శ్రీహరిలు తమను బెదిరించి నాలుగున్నర ఎకరాల భూమి గుంజుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో మామిడితోట ఉందని, తమకు న్యాయం చేసి భూమిని తిరిగి ఇప్పించాలని కోరారు.

ఈ కేసులను సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మరోవైపు నయీమ్ త నను బెదిరించి లక్షల రూపాయలు తీసుకున్నాడని నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని ఖిల్లానగర్‌కు చెందిన చెన్నోజు బ్రహ్మచారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నయీమ్ తన అనుచరులు పాశం శ్రీను, కత్తుల జంగయ్యను మా వద్దకు పంపాడు. నయీమ్ ఇంటికి రమ్మన్నాడని చెప్పారు. మా కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయూరు.

మా ఇద్దరు కొడుకులను గన్‌తో కాలుస్తామని, కుటుంబాన్ని లేకుండా చేస్తామని బెదిరిం చారు. పాశం శ్రీనుకు రూ.20 లక్షలు ఇవ్వాలని నయూమ్ చెప్పాడు. దీంతో భయపడి మాకు బోడుప్పల్‌లో ఉన్న ఇంటిని అమ్మి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాశం శ్రీను, అతడి డ్రైవర్‌కు డబ్బు ఇచ్చాం’’ అని చెప్పారు. అలాగే పదేళ్ల కిందట తమను బెదిరించి రూ.20 లక్షల విలువ చేసే ఇంటి కి రూ.2 లక్షలు ఇచ్చి నయీమ్ అక్క పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement