ఆడవేషంలో విమానయానం!
మారువేషాల్లో రాయ్‌పూర్-శంషాబాద్ మధ్య తిరిగిన నయీమ్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ లీలలు సినిమాను తలపిస్తున్నాయి! శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు నయీమ్ తరచూ లేడీ గెటప్ ధరించేవాడట. రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడ పార్క్ చేసిన తన వెహికల్‌లోకి ఎక్కగానే చీర విప్పేసి టీషర్ట్, ప్యాంట్ వేసుకొని మగాడిలా ఇంటికి వెళ్లేవాడని తేలింది. ఇలా మారువేషాల్లో ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ వెహికల్స్‌ను నయీమ్ అక్కడే పార్క్ చేసేవాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
నయీమ్ అల్లుడు అబ్దుల్ ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌ల విచారణలో ఈ అంశాలు వెలుగుచూశాయి. నయీమ్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, శంషాబాద్ మధ్య ఎక్కువగా విమానాల్లో ప్రయాణాలు చేసేవాడని సమాచారం. బాధితులను అక్కడికి రప్పించుకుని, బెదిరించి భూ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించేవాడని తెలిసింది.
నయీమ్‌తో కలిసే నేరాలు ...
నయీమ్‌తో కలసి నేరాలు చేశామని ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌లు పోలీసు విచారణలో అంగీకరించారు. నదీమ్, నస్రీమ్ హత్య కేసుల్లో తాము సహకరించామని, వారి మృతదేహాలను నగర శివారులో దహనం చేసినట్టు తెలిపారు. తన పేరిట రాజమండ్రి, విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ఇతర ప్రాంతాల్లో నయీమ్ ఇళ్లను కొనుగోలు చేశాడని షాహీన్ ఒప్పుకుంది. కాగా, వీరిద్దరిని పది రోజుల పాటు కస్టడీకివ్వాలన్న పిటిషన్ విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న ఫర్హానా, ఆఫ్షాలను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ కూడా బుధవారానికి వాయిదా పడింది.