జంట హత్యల కేసులో నిందితుల కోడ్ లాంగ్వేజ్
హతుడికి వార్నింగ్ ఇచ్చేందుకు ఫ్రెండ్స్ సహాయం కోరిన ప్రధాన నిందితుడు
సిమ్ కార్డులను ఘటనాస్థలంలోనే పారేసిన నిందితులు
ప్రైవేట్ వీడియో డిలీట్ చేశాడనే హతుడిపై కక్ష
ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించిన నార్సింగి పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: పుప్పాలగూడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులోని ముగ్గురు నిందితులను నార్సింగి పోలీసులు శనివారం ఉదయం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 14రోజుల రిమాండ్‌కు తరలించారు. హతుడు అంకిత్ సాకేత్, నిందితులు రాహుల్ కుమార్, రాజ్‌కుమార్, సుఖేంద్ర కుమార్‌లు మధ్యప్రదేశ్‌కు చెందినవారు కాగా, మరో హతురాలు బిందు బింజారె ఛత్తీస్‌గఢ్‌వాసి. వారు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. అయితే ఈ హత్య కేసు విచారణలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది .
సెక్స్ వర్కర్‌గా మారిన బిందు బింజారె(25)తో గడిపిన ‘ప్రైవేట్’వీడియోను డిలీట్ చేశాడనే కారణంతో అంకిత్ సాకేత్(27)పై రాహుల్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంకిత్‌కు ‘ఫైన్’(హత్య) వేయాలని నిర్ణయించుకున్నాడు. అంకిత్‌కు వార్నింగ్ ఇవ్వాలని, ఇందుకోసం సహాయం కావాలని తన స్నేహితులైన రాజ్ కుమార్, సుఖేంద్ర కుమార్‌ల సహాయం కోరగా వారు అంగీకరించారు. అయితే అప్పటికే ‘ప్రైవేట్’వీడియోపై వాగ్వాదం జరగడంతో అంకిత్‌ను ఒంటరిగా పిలిస్తే రాడని గ్రహించిన రాహుల్ పక్కా పథకం వేశాడు. బిందుతో గడపాలని ఉందని సుఖేంద్ర కుమార్‌తో అంకిత్‌కు ఫోన్ చేయించాడు. రూ.4 వేలకు డీల్ కుదుర్చుకుని ఈ నెల 11న బిందును తీసుకొని అంకిత్ పద్మనాభ స్వామి దేవాలయం గుట్టలకు వచ్చాడు.
రాహుల్, రాజ్, సుఖేంద్రలు ఆటోలో సంఘటనాస్థలానికి వచ్చారు. సుఖేంద్ర, బిందు ఏకాంతంలో ఉండగా కొంతదూరంలో రాహుల్, రాజ్, అంకిత్ మద్యం సేవిస్తున్నారు. ఈ సమయంలో మరోసారి వీడియో డిలీట్ అంశంపై అంకిత్‌తో రాహుల్ వాగ్వాదానికి దిగాడు. కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. అంకిత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో రాహుల్, రాజ్‌ల శరీరాలపై కూడా గాయాలయ్యాయి. పలుమార్లు కత్తితో దాడి చేయగా అంకిత్ మృతి చెందాడు. ఇతరులెవరూ మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖంపై బండరాళ్లతో మోదారు. అంకిత్ అరుపులు విని బిక్కుబిక్కుమంటున్న బిందు వద్దకు వచ్చిన రాహుల్, రాజ్ ఆమెపై కూడా దాడి చేసి హత్య చేశారు.
సిమ్‌కార్డ్ తీసేస్తే లొకేషన్ రాదని..
అంకిత్, బిందులను హత్య చేసిన తర్వాత వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను నిందితులు తీసుకున్నారు. ఫోన్లలోంచి సిమ్‌కార్డులను తీసేస్తే పోలీసులు లొకేషన్ గుర్తించలేరని భావించిన నిందితులు వాటిని తొలగించి ఘటనాస్థలంలోనే పారేసి వెళ్లిపోయారు. 12న తెల్లవారుజామున సెల్‌ఫోన్లను తీసుకొని మధ్యప్రదేశ్‌కు పారిపోయారు. అయితే ఐఎంఈఐ నంబర్లు, ఇతరత్రా సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు హంతకుల లొకేషన్‌ను గుర్తించారు. వెంటనే నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు మధ్యప్రదేశ్‌కు వెళ్లి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment