హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగ సంస్థ హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ఆవిష్కరించింది. హానర్ సిగ్నాటిస్ పేరుతో హైటెక్‌సిటీ–కూకట్‌పల్లి మార్గంలో ఐడీఎల్ రోడ్డులో రూ.3,000 కోట్లతో ఈ భారీ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టింది. 27.5 ఎకరాల్లో ఒక్కొక్కటి 25 అంతస్తుల్లో 18 టవర్లు రానున్నాయి. మొత్తం 3,266 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు.
హానర్ సిగ్నాటిస్ ఇప్పటికే సుమారు 1,300 బుకింగ్స్ నమోదు చేసింది. రెరాకు సమర్పించిన ప్రణాళిక ప్రకారం 9 టవర్లతో కూడిన తొలి దశ ప్రాజెక్టు 2026 డిసెంబరుకల్లా పూర్తి కావాల్సి ఉంది. గడువు కంటే ముందుగా తొలి దశ పూర్తి చేస్తామని ప్రమోటర్–డైరెక్టర్ బాలు చౌదరి వెల్లడించారు. ప్రమోటర్–డైరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, స్వప్న కుమార్, రాజమౌళితో కలిసి ప్రాజెక్టు విశేషాలను గురువారమిక్కడ మీడియాకు వెల్లడించారు.
ధర రూ.3 కోట్ల వరకు..
ఒక్కో అపార్ట్‌మెంట్ 1,695–3,815 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 3.5, 4 బీహెచ్‌కే ఆఫర్ చేస్తారు. ధర రూ.1.25 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంది. 4 బీహెచ్‌కే అల్ట్రా ప్రీమియం అపార్ట్‌మెంట్స్ కోసం ప్రత్యేకంగా నాలుగు టవర్లు ఏర్పాటు చేస్తారు. 1.31 లక్షల చ.అ.విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌజులు ఉంటాయి. వీటిలో 20,000 చ.అ.విస్తీర్ణంలో జిమ్ నెలకొల్పుతారు. రెండు స్విమ్మింగ్ పూల్స్, సూపర్ మార్కెట్, క్లినిక్, అలాగే లాకర్ సౌకర్యంతో బ్యాంక్ వంటివి రానున్నాయి. ఈవీ చార్జింగ్ స్టేషన్, 5 ఎకరాల పార్క్ అదనపు ఆకర్షణ. స్కూల్ బస్‌లు వచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డు నిర్మిస్తారు. ఐజీబీసీ నుంచి ఈ ప్రాజెక్టు ప్రీ–సర్టిఫైడ్ గోల్డ్ ధ్రువీకరణ అందుకుంది.
మరో కోటి చ.అ. విస్తీర్ణంలో..
హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులను 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేసింది. మూడవ ప్రాజెక్టు హానర్ రిచ్‌మాంట్‌లో భాగంగా 28.4 ఎకరాల్లో 12 లక్షల చ.అ. విస్తీర్ణంలో విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. నాల్గవ ప్రాజెక్టు అయిన హానర్ సిగ్నాటిస్ 78 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటవుతోంది. రానున్న రోజుల్లో మరో ఒక కోటి చ.అ.విస్తీర్ణం జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నాణ్యత, అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ రియల్టీ రంగంలో టాప్–10లో నిలవాలన్న లక్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెట్టినట్టు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment