మీర్‌పేట్‌ గ్యాంగ్‌రేప్‌ నిందితుల అరెస్ట్‌ | Accused Arrested In Mirpet Girl Molestation Case | Sakshi
Sakshi News home page

మీర్‌పేట్‌లో అమానుషం.. గ్యాంగ్‌రేప్‌ నిందితుల అరెస్ట్‌

Published Tue, Aug 22 2023 7:31 PM | Last Updated on Tue, Aug 22 2023 11:40 PM

Accused Arrested In Mirpet Girl Molestation Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన అమానుషం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందనవనం కాలనీలో గంజాయి బ్యాచ్‌ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. అయితే.. ఈ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఆరుగురి నిందితులను అరెస్ట్‌ చేశారు. అబేద్ లాల్ అనే రౌడీషీటర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో  కీలక నిందితుడు పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ చౌహన్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

బాలికను బెదిరించడంతో పాటు, దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు గంజాయి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1 అబేద్‌ బిన్‌ ఖాలీద్‌, ఏ2 తెహసీన్‌, ఏ3 మంకాల మహేష్‌ కీలక నిందితులు కాగా, వీరికి ఏ4 నర్సింగ్ ఏ5 అశ్రఫ్, ఏ6 ఫైజల్, ఏ7 ఇమ్రాన్ సహకరించారు.

చదవండి: మీర్‌పేట గ్యాంగ్‌ రేప్ ఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి


ఘాతుకం జరిగిందిలా..
హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోయారు. దీంతో రెండువారాల కిందట.. తన తమ్ముడితో(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టారు. 

భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. మొత్తం ఏడు బృందాలలో గాలింపు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో యాక్టు, సెక్షన్‌ 5జీ రెడ్‌విత్‌ 6 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్‌హాట్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడని సీపీ తెలిపారు.

పారిపోయే క్రమంలో..
‘‘ అష్రఫ్‌, చిన్నా, మహేశ్‌, తహిసీన్‌ అనే నలుగురు అత్యాచారానికి పాల్పడిన తర్వాత రేసుకోర్సు వెనకవైపు ఉన్న ఫైజల్‌, ఇమ్రాన్‌ దగ్గరికి వెళ్లారు. వారి మొబైల్స్‌ తీసుకొని రెండు మూడు కాల్స్‌ చేసుకొని డిలీట్‌ చేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉమ్నాబాద్‌ వరకు వెళ్లిపోయారు. అక్కడ రెండు పోలీసు బృందాలు గస్తీ నిర్వహిస్తుండటం చూసి.. తిరిగి వెనక్కి వచ్చేశారు. హైదరాబాద్‌ నగరంపై వారికి పూర్తి అవగాహన ఉండటంతో వారిని పట్టుకోవడానికి మొత్తం 12 బృందాలను వినియోగించాం. ఈ క్రమంలో వివిధ చోట్ల వారు పోలీసులకు చిక్కారు.’’ చౌహాన్‌ మీడియాకు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement