
సాక్షి, నాగర్ కర్నూల్: ఊర్కొండపేటలో మహిళపై లైంగిక దాడి కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఇవాళ ఆరెస్టు చేశారు. గత శనివారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఏడుగురు నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాద్ తెలిపారు.
తన బంధువుతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారని వివరించారు. మొదట వారిద్దరి ఫోటోలు తీసి బెదిరించారని విషయం బయటికి చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలిపారు. వారిపై దాడి చేసి రూ.6 వేలు లాక్కున్నారని చెప్పారు. బీఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310, కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
నిందితులు ఊర్కొండ పేటకు చెందిన మరి పాకుల ఆంజనేయులు, సిద్ధిక్ బాబా, మొగుల్దాస్ మనీ అలియాస్ మణికంఠ, కార్తీక్, మట్టా మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులుగా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. దాహం వేసి నీళ్లు అడిగితే ఓ నిందితుడు మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. మళ్లీ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు.