
పోలీసుల అదుపులో సుమారు పదిమంది
ప్రత్యక్షంగా పాల్గొన్నది నలుగురేనా..
ఆర్థికంగా, పరోక్షంగా సహకరించింది ఎంతమంది.. ?
రెండు రోజులుగా విచారిస్తున్న పోలీసులు
కొత్త హరిబాబును అదుపులోకి తీసుకునేందుకు యత్నం
భూపాలపల్లి : దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. హత్యకు పాల్పడింది ప్రత్యక్షంగా నలుగురే అయినప్పటికి ఆర్థికంగా, పరోక్షంగా పలువురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. స్థానిక పోలీసులు తొలుత ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అందులో ఏ–1 రేణుకుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి శ్రీమాంత్(బబ్లూ)లను హత్య జరిగిన రోజే అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కుమార్ పట్టుకున్నారు. ఏ–5 రేణుకుంట్ల కొమురయ్యతోపాటు నిందితులకు కారు ఏర్పాటు చేసి, డ్రైవింగ్ చేసిన పట్టణంలోని సుభాష్‌కాలనీకి చెందిన ఓ డ్రైవర్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా, అనుమానితులైన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
హరిబాబు హస్తం ఉందా..?
రాజలింగమూర్తి హత్య కేసులో భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త హరిబాబు హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం నిందితులు.. ఓ వ్యక్తిని ఫోన్ అడిగి తీసుకొని హరిబాబుకు కాల్ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మేరకు హరిబాబును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి రెడ్డికాలనీలోని ఆయన ఇంటికి వెళ్లగా అందుబాటులో లేనట్లుగా తెలిసింది.
మరో వ్యక్తి ఆర్థిక సహకారం..
రాజలింగమూర్తి హత్యకు మరో వ్యక్తి ఆర్థికంగా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమి తనదేనంటూ కోర్టుకు వెళ్లిన ఒకరు ఆర్థికంగా నిందితులకు సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇతను కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
రేపు లేదా ఎల్లుండి అరెస్ట్..
రాజలింగమూర్తి హత్య కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితులు ఎంతమంది ఉన్నారన్నది గుర్తించాక, ఆధారాలతో రేపు(ఆదివారం), లేదా సోమవారం అరెస్ట్ చూపించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment