rajalingam
-
'ప్రజలు చందాలు పోగేసి గెలిపించారు' : మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం
సాక్షి, వరంగల్: ‘విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తూ జనం సమస్యలు పట్టించుకున్నా.. రైతాంగం, యువత, కార్మికులతో అనుబంధం ఉండేది.. అప్పటి హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నా చురుకుదనాన్ని గమనించిన హయగ్రీవాచారి, దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు రాజకీయ అరంగ్రేటం చేయించారు. ఈ ప్రాంతంలో పార్టీకి మరింత వన్నె తీసుకురావాలంటే బీసీ నేత సేవలు అవసరమని భావించి బతిమిలాడి ఉద్యోగానికి రాజీనామా చేయించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మొదటిసారి 1981లో సమితి ప్రెసి డెంట్‌గా పోటీ చేసి విజయం సాధించానని’ చేర్యాల మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం గౌడ్ అన్నారు. నాటి, నేటి రాజకీయ పార్టీల్లో ఉన్న నైతిక విలువలు, తేడా, ఓటర్లు, ఇతరత్రా విషయాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 1999లో ఎమ్మెల్యేగా.. 1981లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి సమితి ప్రెసిడెంట్‌గా గెలుపొందా. 1985, 1989, 1994లో సొంత, ఇతర పార్టీల పెద్దలు నాకు టికెట్ రాకుండా అడ్డుకోవడంతో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన. విజయం సాధించలేకపోయినా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం నేటికి మరవలేను. చందాలు వేసుకుని వాహనాలు, నామినేషన్ ఫీజు సైతం ప్రజలు భరించారు. నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మూడు సార్లు గౌరవ ప్రదమైన ఓట్లు వచ్చాయి. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత చేర్యాలలో నా ప్రజాబలం చూసి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇప్పించారు. మొదటి సారి 1999లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఢిల్లీలో తెలంగాణ కోసం ప్రశ్నించాననే కోపంతో ఇక్కడ కూటమిగా ఏర్పడి 2004లో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. మహానుభావుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007(రెండేళ్లు), 2009(ఆరేళ్లు) రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాడు రాజకీయాలు వేరు. ప్రజలతో ఎవరు ఉంటే వారినే గౌరవించారు. ఎన్నికల ఖర్చుకు 40 బస్తాల కందుల విక్రయం.. 1999లో టికెట్ ఖరారు కాగానే సర్పంచ్‌కు పోటీ చే సే డబ్బు కూడా నా వద్ద లేదు. ఇంట్లో ఉన్న 40 బ స్తాల కందులు అమ్మితే రూ.38 వేలు వచ్చాయి. మిగతా డబ్బు ప్రజల నుంచి చందాల రూపంలో వస్తే, అతి తక్కువ ఖర్చుతో విజయం సాధించా. ప్రస్తుతం నైతిక విలువలు కరువు.. నాటి రాజకీయాలు.. నేటి వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు నీలం సంజీవ రెడ్డి, అంజయ్యపై చిన్న ఆరోపణలు రాగానే పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని తమ నిజాయితీని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రస్తుతం వేలకోట్లు దండుకున్నా.. అడిగే నాథులే కరువయ్యారు. జనాన్ని ఆకట్టుకునే పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచడం, భవిష్యత్ లేకుండా చేయడం ఆందోళన కలిగిస్తోంది. నైతిక విలువలు, ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులకు నేడు ఏ రాజకీయ పార్టీలు కూడా గౌరవం ఇవ్వడం లేదు. రూ.100 కోట్లు ఉన్న నాయకుడే టికెట్‌కు అర్హుడనే ట్రెండ్ తీసుకొచ్చారు. ప్రస్తుతం నైతిక విలువలు కనుమరుగయ్యాయి. చేర్యాల నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధి విషయంలో నా మార్కు కనిపిస్తుంది. విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల నిర్మాణం ఇలా అనేక కార్యక్రమాలు నా హయాంలోనే జరిగాయి. 45 హైస్కూళ్లను అప్‌గ్రేడ్ చేయించా. బచ్చన్నపేట, చేర్యాల, నర్మెట, మద్దూరు, ఇతర ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయించా. అనేక గ్రామాల్లో నిరుపేదలకు స్థలాలు ఇప్పించి, ఇందిరమ్మ పథకంలో గృహాల నిర్మాణం చేపట్టాం. ఈ విషయంలో కోర్టుకు హాజరయ్యా. ఇప్పుడు ఆ స్థలాల ధరలు పెరగడమే కాకుండా ఊరికి ప్రధానంగా మారాయి. -
తల్లిని చంపిన తనయుడు
కరీంనగర్: బీర్పూర్ మండలం రేకులపల్లిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సవ్వను ఆమె కుమారుడు రాజలింగం హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సవ్వ నాలుగో కుమారుడు రాజలింగం ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. కొంత కాలంగా ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉండకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని కుమారుడికి నర్సవ్వ అనడంతో ఆగ్రహం తెచ్చుకున్న రాజలింగం తన తల్లిని బండరాయికేసి మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి నర్సవ్వ(80) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రాజలింగాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైకోర్టును తక్షణం విభజించాలి
ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి తెలంగాణకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ రాజలింగం, జగన్ యువ సేన జిల్లా సంయుక్త కార్యదర్శి మేదరి విజయ్ కోరారు. ఆదివారం వారు పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజన జాప్యం కారణంగా ఈ ప్రాంత న్యాయధికారులకు, న్యాయ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు అల్లాడి రాజశేఖర్, మేదరి ప్రవీణ్, మధు, తిరుపతి, శ్రీను, ఆకుల రాజు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్
వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి చిక్కారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి శుక్రవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వివరాలు..మహబూబాబాద్ కు చెందిన ఓంజీ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. అనుమతి కావాలంటే రూ. 50 వేలు లంచం ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం గత ఆరు నెలలుగా సాగుతున్నట్లు సమాచారం. దీంతో విసుగు చెందిన ఓంజీ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం వేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ కార్యాలయంలో ఒంజీ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రాజలింగ్ నుపట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మహబూబాబాద్) -
బంగారు తెలంగాణ కోసమే మద్దతు
* సభలో విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీల వివరణ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు వెల్లడించారు. శాసనమండలి నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు. మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయడాన్ని వారు సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నవ తెలంగాణ హీరోగా అభివర్ణించారు. తెలంగాణ హక్కులను కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అవసరమైతే సభ్యత్వానికి రాజీనామా చేసేందుకూ సిద్ధంగా ఉన్నామని జగదీశ్వర్‌రెడ్డి సభలోనే ప్రకటించారు. 20 రోజుల కిందటే టీఆర్ఎస్కు అండగా ఉండాలని నిర్ణయించామని రాజలింగం తెలిపారు. స్పీకర్ ఎన్నిక సమయంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన డీఎస్.. ఇప్పుడు చైర్మన్ ఎన్నికప్పుడు ఎందుకు రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదని యాదవరెడ్డి వ్యాఖ్యానించారు. -
నరకానికి కేరాఫ్ అడ్రస్ గాంధీభవన్
బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకే తాము టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్సీలు రాజలింగం, భానుప్రసాదరావులు స్పష్టం చేశారు. తాము పదవులు ఆశించి టీఆర్పార్టీలో చేరలేదని... తమకు పార్టీలో ఎటువంటి పదవులు తీసుకోమని వారు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తాము ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరింది విలేకర్ల సమావేశంలో వివరించారు. కాంగ్రెస్ పార్టీలో దోపిడీదారులు ఎక్కువయ్యారని ఎమ్మెల్సీలు రాజలింగం, భానుప్రసాదరావు ఆరోపించారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, డీఎస్‌లు ఇద్దరు దోపిడి దారులేనని వారు అభివర్ణించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని నేత పైరవీ ద్వారా పదవులు తెచ్చుకున్నారని విమర్శించారు. గాంధీభవన్ నరకలోకానికి కేరాఫ్ అడ్రాస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. -
పదవి కోసం పెద్ద లోల్లి
రసాభాసగా సీఎల్పీ భేటీ డీఎస్, షబ్బీర్‌కు మద్దతుగా రెండుగా చీలిపోయిన ఎమ్మెల్సీలు అధిష్టానం దూతల ముందే దూషణలపర్వం డీఎస్ ఒక్కో ఎమ్మెల్సీకి రూ.10 లక్షలు ఆఫర్ చేశారన్న రాజలింగం ఆరోపణలను ఖండించిన డీఎస్ వర్గం హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కోసం మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీ సవ్యంగానే జరిగినట్టు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం పెద్ద గొడవే జరిగింది. ఎమ్మెల్సీలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపైకి ఒకరు దూషణలపర్వానికి దిగారు. దీంతో అధిష్టానం పెద్దలు బిత్తరపోవాల్సి వచ్చింది. చివరికి వారు ఇరువర్గాలను శాంతింపజేసి ఎంపిక ప్రక్రియను మమ అనిపించారు. తనకు మద్దతివ్వాలంటూ ఒక్కో ఎమ్మెల్సీకి డి.శ్రీనివాస్ రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం ఏకంగా సీఎల్పీ సమావేశంలోనే ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్తో కుమ్మక్కైన డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి ఎట్లా ఇస్తారంటూ నిలదీసిన రాజలింగంకు... మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మద్దతు పలికారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్సీలూ డీఎస్‌పై ఆరోపణలు చేశారు. వీటిని ఖండిస్తూ డీఎస్ వర్గం.. షబ్బీర్ అలీపై ప్రత్యారోపణలు చేయడంతో సమావేశం ఒకదశలో రసాభాసగా మారింది. భేటీ అదుపు తప్పిందని గ్రహించిన హైకమాండ్ దూతలు వయలార్, దిగ్విజయ్‌సింగ్‌లు... ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరిని పిలిచి బుజ్జగింపు యత్నాలు ప్రారంభించారు. డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి, షబ్బీర్ అలీకి ఉపనేత పదవి ఇస్తామని ప్రతిపాదించారు. ఇందుకు షబ్బీర్ అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ ఆయన పేరును ప్రకటించారు. డీఎస్, షబ్బీర్ అలీ ఇద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒకే జిల్లాకు రెండు పదవులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బేరసారాలు బయటకు పొక్కడం, ఈ విషయం ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ మరింత చులకన అవుతుందనే ఉద్దేశంతోనే షబ్బీర్ అలీకి ఉపనేత పదవిని కట్టబెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 17 మంది.. రెండున్నర గంటల సినిమా! కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం సస్పెన్స్ సినిమాను తలపించింది. మండలిలో అధికార టీఆర్ఎస్తో పోలిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. డీఎస్, షబ్బీర్ గత వారం రోజులుగా ఎమ్మెల్సీలతో ముఖాముఖి సమావేశమై మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపారు. అభిప్రాయ సేకరణ సమయంలోనూ ఇద్దరు నేతలు ఎవరికి వారే తమకే మండలి ప్రతిపక్ష నేత పదవి దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్సీలుండగా మంగళవారంనాటి సమావేశానికి 16 మంది మాత్రమే హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ తన సమీప బంధువు చనిపోవడంతో రాలేదు. సమావేశానికి హాజరైన వారిలో ఏడుగురు (కేఆర్ ఆమోస్, యాదవరెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి, పీర్ షబ్బీర్ అహ్మద్) షబ్బీర్ అలీకి మండలి ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే సమయంలో డీఎస్ పేరును ఏడుగురు (పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, నేతి విద్యాసాగర్, డి.రాజేశ్వర్, ఎమ్మెస్ ప్రభాకర్, బి.వెంకట్రావు, మాగం రంగారెడ్డి) ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు. చివర్లో తాను డీఎస్‌కు మద్దతిస్తున్నట్లు సంతోష్‌కుమార్ లేఖ పంపడంతో హైకమాండ్ పెద్దలు డీఎస్ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో రాజలింగం డీఎస్‌పై చేసిన ఆరోపణలు సమావేశంలో కలకలం రేపాయి. డీఎస్ రూ.10 లక్షలు ఇవ్వబోయారు: రాజలింగం సమావేశానంతరం రాజలింగం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక్కో ఎమ్మెల్సీకి డీఎస్ రూ.10 లక్షలు ఇచ్చారు. నాకు కూడా ఆఫర్ చేస్తే వద్దని తిరస్కరించాను. టీఆర్ఎస్తో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వంలో లోపాయికారీ పనులు చేసుకునేందుకే డీఎస్ మండలి ప్రతిపక్షనేత పదవిని ఆశించి అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. 8 మంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా హైకమాండ్ పెద్దలు ఆయన పేరునే ఖరారు చేశారు’’ అని అన్నారు. కాగా, రాజలింగం చేసిన ఆరోపణలకు విలువ లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. షబ్బీర్‌కు హ్యాండిచ్చిన ప్రభాకర్! మండలి ప్రతిపక్షనేత పదవిపై గంపెడాశలు పెట్టుకున్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. తనకు 8 మంది ఎమ్మెల్సీలు మద్దతు ఇస్తారని షబ్బీర్ భావించారు. వీరిలో ప్రభాకర్ కూడా ఉన్నట్లు షబ్బీర్ అలీ చెబుతున్నారు. అయితే సమావేశం ప్రారంభం వరకు తమతోనే ఉన్న ప్రభాకర్ చివరి నిమిషంలో డీఎస్వైపు వెళ్లారని షబ్బీర్ వాపోయారు. ఎన్నిక ఏకగ్రీవమే: వయలార్ మండలి ప్రతిపక్షనేతగా డీఎస్, ఉపనేతగా షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వయలార్ రవి ప్రకటించారు. ఎమ్మెల్సీల సమావేశానంతరం దిగ్విజయ్‌సింగ్, వయలార్, పొన్నాల, డీఎస్ మీడియా ముందుకొచ్చారు. ఆ సమయంలో షబ్బీర్‌ను సైతం మీడియా ముందుకు రావాలని హైకమాండ్ పెద్దలు కోరినా ఆయన పట్టించుకోలేదు. తాను రానని పేర్కొంటూ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. కుంతియా, తిరునావక్కరసార్ ఆయనను బతిమిలాడి మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. షబ్బీర్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఆ తర్వాత షబ్బీర్‌ను మాట్లాడాలని దిగ్విజయ్ కోరగా.. ‘ఇదేమైనా సంతోషకరమైన సమయమా? మాట్లాడటానికేముంది?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 30న టీ-కాంగ్రెస్‌లో సమీక్ష డీఎస్‌పై ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం: దిగ్విజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు నెలాఖరులో రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 30, వచ్చే నెల 1న సమావేశం కానున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్సీలను డబ్బులతో ప్రభావితం చేయడం వల్లే మండలి ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత డీఎస్ ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీ రాజలింగం చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో గాంధీభవన్‌లో దిగ్విజయ్ సమావేశమయ్యారు. ఈ విషయంలో పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలవారీగా ఫలితాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.