చేర్యాల మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం గౌడ్, సాక్షి ఇంటరర్వ్యూ
సాక్షి, వరంగల్: ‘విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తూ జనం సమస్యలు పట్టించుకున్నా.. రైతాంగం, యువత, కార్మికులతో అనుబంధం ఉండేది.. అప్పటి హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నా చురుకుదనాన్ని గమనించిన హయగ్రీవాచారి, దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు రాజకీయ అరంగ్రేటం చేయించారు.
ఈ ప్రాంతంలో పార్టీకి మరింత వన్నె తీసుకురావాలంటే బీసీ నేత సేవలు అవసరమని భావించి బతిమిలాడి ఉద్యోగానికి రాజీనామా చేయించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి మొదటిసారి 1981లో సమితి ప్రెసి డెంట్‌గా పోటీ చేసి విజయం సాధించానని’ చేర్యాల మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం గౌడ్ అన్నారు. నాటి, నేటి రాజకీయ పార్టీల్లో ఉన్న నైతిక విలువలు, తేడా, ఓటర్లు, ఇతరత్రా విషయాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
1999లో ఎమ్మెల్యేగా..
1981లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి సమితి ప్రెసిడెంట్‌గా గెలుపొందా. 1985, 1989, 1994లో సొంత, ఇతర పార్టీల పెద్దలు నాకు టికెట్ రాకుండా అడ్డుకోవడంతో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన. విజయం సాధించలేకపోయినా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం నేటికి మరవలేను. చందాలు వేసుకుని వాహనాలు, నామినేషన్ ఫీజు సైతం ప్రజలు భరించారు. నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయింది.
ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మూడు సార్లు గౌరవ ప్రదమైన ఓట్లు వచ్చాయి. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత చేర్యాలలో నా ప్రజాబలం చూసి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇప్పించారు. మొదటి సారి 1999లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఢిల్లీలో తెలంగాణ కోసం ప్రశ్నించాననే కోపంతో ఇక్కడ కూటమిగా ఏర్పడి 2004లో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. మహానుభావుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007(రెండేళ్లు), 2009(ఆరేళ్లు) రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాడు రాజకీయాలు వేరు. ప్రజలతో ఎవరు ఉంటే వారినే గౌరవించారు.
ఎన్నికల ఖర్చుకు 40 బస్తాల కందుల విక్రయం..
1999లో టికెట్ ఖరారు కాగానే సర్పంచ్‌కు పోటీ చే సే డబ్బు కూడా నా వద్ద లేదు. ఇంట్లో ఉన్న 40 బ స్తాల కందులు అమ్మితే రూ.38 వేలు వచ్చాయి. మిగతా డబ్బు ప్రజల నుంచి చందాల రూపంలో వస్తే, అతి తక్కువ ఖర్చుతో విజయం సాధించా.
ప్రస్తుతం నైతిక విలువలు కరువు..
నాటి రాజకీయాలు.. నేటి వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు నీలం సంజీవ రెడ్డి, అంజయ్యపై చిన్న ఆరోపణలు రాగానే పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని తమ నిజాయితీని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.
ప్రస్తుతం వేలకోట్లు దండుకున్నా.. అడిగే నాథులే కరువయ్యారు. జనాన్ని ఆకట్టుకునే పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచడం, భవిష్యత్ లేకుండా చేయడం ఆందోళన కలిగిస్తోంది. నైతిక విలువలు, ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులకు నేడు ఏ రాజకీయ పార్టీలు కూడా గౌరవం ఇవ్వడం లేదు. రూ.100 కోట్లు ఉన్న నాయకుడే టికెట్‌కు అర్హుడనే ట్రెండ్ తీసుకొచ్చారు. ప్రస్తుతం నైతిక విలువలు కనుమరుగయ్యాయి.
చేర్యాల నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధి విషయంలో నా మార్కు కనిపిస్తుంది. విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల నిర్మాణం ఇలా అనేక కార్యక్రమాలు నా హయాంలోనే జరిగాయి. 45 హైస్కూళ్లను అప్‌గ్రేడ్ చేయించా. బచ్చన్నపేట, చేర్యాల, నర్మెట, మద్దూరు, ఇతర ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయించా. అనేక గ్రామాల్లో నిరుపేదలకు స్థలాలు ఇప్పించి, ఇందిరమ్మ పథకంలో గృహాల నిర్మాణం చేపట్టాం. ఈ విషయంలో కోర్టుకు హాజరయ్యా. ఇప్పుడు ఆ స్థలాల ధరలు పెరగడమే కాకుండా ఊరికి ప్రధానంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment