48 గంటలు నిషేధిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తరు: కేసీఆర్‌ | BRS Leader KCR Respond To Ban On His Election Campaign | Sakshi
Sakshi News home page

48 గంటలు నిషేధిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తరు: కేసీఆర్‌

Published Thu, May 2 2024 5:17 AM | Last Updated on Thu, May 2 2024 5:18 AM

మహబూబాబాద్‌లో రోడ్‌షో ముగిసిన అనంతరం ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన 48 గంటల ప్రచార నిషేధ ఉత్తర్వులను కేసీఆర్‌కు అందజేస్తున్న కురవి తహసీల్దార్‌ సునీల్‌రెడ్డి

లక్షలాదిగా ఉన్న బీఆర్‌ఎస్‌ బిడ్డలు పోరాడుతారు 

మానుకోట రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ 

నా పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకేస్తానన్న రేవంత్‌రెడ్డిపై నిషేధం లేదు 

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? 

ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు 

ఇలా అన్యాయం జరుగుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్య 

కాంగ్రెస్‌ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు

సాక్షి, మహబూబాబాద్‌: ‘‘నా మీద ఎలక్షన్‌ కమిషన్‌ నిషేధం పెట్టింది. 48 గంటలు కేసీఆర్‌ ప్రచారం చేయవద్దని నిషేధం విధించింది. అందరికీ మనవి చేస్తున్నా.. రేవంత్‌రెడ్డి నన్ను ఉద్దేశించి.. నీ పేగులు మెడలో వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఎలక్షన్‌ కమిషన్‌ నిషేధం పెట్టలేదు. నామీద నిషేధం పెట్టింది. 48 గంటలు నా ప్రచారం నిషేధిస్తే.. లక్షలాదిగా ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు 96 గంటలు అవిశ్రాంతిగా పనిచేస్తరు..’’అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మహబూబాబాద్‌ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ షోలో కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్‌ ఉన్నదే తెలంగాణ కోసం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నేనేం చేశానో మీ అందరికీ తెలుసు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లకాలంలో తెలంగాణ ఎలా ఉండేది? కాంగ్రెస్‌ సర్కారు ఐదు నెలల్లో తెలంగాణను ఆగం చేసింది. 

ఊరుకునే ప్రసక్తే లేదు.. 
సాగునీరు, తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వా త ఆగమైంది. ప్రధాని మోదీ గోదావరి జలాలు తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జలాలను కేఆర్‌ఎంబీకి అప్పగించారు. ఇంత జరిగినా సీఎం రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదు. వారేం చేస్తారో.. రాష్ట్రానికి ఏ నష్టం తీసుకొస్తారో..! ఎంతకాలం చూస్తాం? రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. 

అరచేతిలో వైకుంఠం చూపించి.. 
ఎన్నికల సమయంలో ఇది ఇస్తాం.. అది ఇస్తామంటూ కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసింది. ఒక్క ఉచిత బస్సు మినహా మరేదైనా వచ్చిందా? రైతుబంధు లేదు. కల్యాణలక్ష్మి లేదు. తులం బంగారం లేదు. రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన చొప్ప దొండి రైతు అక్కడ ఇబ్బందులకు తట్టుకోలేక గుండె ఆగి చనిపోయారు. 

కాంగ్రెస్‌ వచ్చింది.. కరువు వచ్చింది 
పదేళ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన వచ్చింది.. కరువు వచ్చింది. సాగు, తాగునీరు లేక రాష్ట్రం ఎడారిగా మారింది. కాళేశ్వరం నీళ్లు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. ఖమ్మం జిల్లాలో మురికి నీరు తాగుతున్నారు. మహ బూబాబాద్, నర్సంపేట, డోర్నకల్‌ నియోజకవర్గా ల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఇచ్చిన కరెంట్, మిషన్‌ భగీ రథ నీళ్లు ఎటుపోయాయి? ఆటో కార్మీకుల జీవితాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేసింది. వారి కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది.

గిరిజనులను అక్కున చేర్చుకున్నది బీఆర్‌ఎస్సే..
తరతరాలుగా వెనుకబడిన గిరిజనులను అక్కున చేర్చుకుని, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బీఆర్‌ఎస్‌ సర్కారు నిధులు కేటాయించింది. ఏడు దశాబ్దాలుగా ఏ పార్టీ చేయని విధంగా వారి అస్తిత్వానికి నిదర్శనమైన సేవాలాల్‌ బంజారా భవనం కట్టుకున్నాం. రిజర్వేషన్‌ పెంచి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాం. బీఆర్‌ఎస్‌కు గిరిజనులు, ఆదివాసీలు అండగా ఉండాలి. ప్రతీ క్షణం, ప్రతీ అడుగు, ప్రతీ మాట ప్రజల కోసమే పనిచేసే బీఆర్‌ఎస్‌ను దీవించాలి. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..’’అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement