12కు పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ధీమా | BRS will get 12 seats in 2024 Lok Sabha polls: KCR | Sakshi
Sakshi News home page

12కు పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ధీమా

Published Tue, May 14 2024 3:04 AM | Last Updated on Tue, May 14 2024 6:18 AM

BRS will get 12 seats in 2024 Lok Sabha polls: KCR

ఆ పార్టీ ప్రాథమిక అంచనా

తగ్గిన పోలింగ్‌ శాతం పార్టీకి అనుకూలిస్తుందనే లెక్కలు

ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో లబ్ధి జరుగుతుందనే అంచనాలు

పోలింగ్‌ సరళిపై అధినేత కేసీఆర్‌ ఆరా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డజనుకు పైగా లోక్‌సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు బీఆర్‌ఎస్‌ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. సోమవారం ఉదయం నుంచి పోలింగ్‌ సరళిని విశ్లేషించిన పార్టీ.. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పోగా మిగతా 16 స్థానాలకు గాను అరడజను స్థానాల్లో కాంగ్రెస్‌తో, మరో నాలుగు స్థానాల్లో బీజేపీతో ప్రధానంగా తలపడినట్లు లెక్క లు వేస్తోంది. ఆరు చోట్ల త్రిముఖ పోటీ నెలకొనగా వీటిలో కనీసం మూడుచోట్ల రెండు జాతీయ పార్టీ లపై బీఆర్‌ఎస్‌ పైచేయి సాధించే అవకాశమున్నట్లు భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం తగ్గడం తమకు అనుకూలిస్తుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది.

శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు దూరమై కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపిన వర్గాలు, ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు భావిస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ వ్యతి రేక ఓటు భారీగా బీఆర్‌ఎస్‌కు బదిలీ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్‌ ప్రారంభ మైన కొద్ది గంటల తర్వాత బీఆర్‌ఎస్‌ ఓటు బీజేపీకి క్రాస్‌ అవుతున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసిందని పలువురు నేతలు కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అయితే అన్ని లోక్‌సభ ని యోజకవర్గాల్లోనూ పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండటం కలిసి వచ్చే అంశంగా బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీకి పోలైన ఓట్లతో కాంగ్రెస్‌ పార్టీ కే నష్టమని కూడా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందినట్లు బీఆర్‌ఎస్‌ కీలక నేతలు చెప్తున్నారు. 

అర డజను సీట్లలో కాంగ్రెస్‌తో పోటీ
కాంగ్రెస్‌తో ఆరు స్థానాల్లో ముఖాముఖి పోటీ జరి గినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్‌ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, మహబూబ్‌నగర్, చేవెళ్ల, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొన గా, వీటిలో కనీసం మూడు నుంచి నాలుగు స్థానా ల్లో గెలుస్తామనే ధీమా బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ అధినేత కేసీ ఆర్‌ బస్సుయాత్ర, క్షేత్ర స్థాయిలో పార్టీ ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు సమన్వయంతో పని చేయడం తదితరాలు పార్టీకి అనుకూలించినట్లు భావిస్తున్నారు. రైతులు, మహిళలు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రధా నంగా అనుకూల ఓట్లు వేసినట్లు పార్టీ అంచనాకు వచ్చింది. అయితే క్రాస్‌ ఓటింగ్‌తో బీజేపీకి భారీగా లబ్ధి జరుగుతుందనే వార్తల నేపథ్యంలో బూత్‌ల వారీగా పార్టీ పోలింగ్‌ ఏజెంట్లు, కేడర్‌ నుంచి సమాచారం సేకరించి ఓ అంచనాకు రావాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశించారు.

కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌ భేటీ
స్వగ్రామం చింతమడకలో ఓటు వేసిన తర్వాత ఎర్రవల్లి నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ సరళిపై పార్టీ నేతలకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. కాగా పోలింగ్‌ ముగిసిన తర్వాత సోమవారం రాత్రి కేటీఆర్, హరీశ్‌రావులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement