కోడి రెక్కల కింద పిల్లల్ని దాచుకున్నట్టు ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం..
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్
కాళేశ్వరంపై బద్నాం చేసే కుట్ర.. ఫోన్ ట్యాపింగ్‌పై గోబెల్స్ ప్రచారం
బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినందుకే కవిత అరెస్టు
కష్టాలకోర్చి తెలంగాణ సాధించా.. నా గుండెధైర్యం చెక్కుచెదరదు
బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాలకు బ్రేక్ తాత్కాలికమే..
కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం
‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి సీఎం రేవంత్ తప్పించుకోలేరు
ధరణి, ల్యాండ్ టైట్లింగ్ చట్టాలు ప్రపంచంలోనే ఉత్తమం
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు 12కుపైగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా
కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు.
బీఆర్‌ఎస్ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్‌ఎస్ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.
(కల్వల మల్లికార్జున్‌రెడ్డి)
కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు 12కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారు
కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్‌ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు.
కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం
మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూటమి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్‌ఎస్‌కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి.
మోదీ మేనియా అంతా గ్యాస్
ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్ అని తేలిపోయింది. ఆయన నినాదాలన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్‌లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.
పెట్రోల్ ‘చార్ సౌ’ దాటుతుంది
కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్ ‘చార్ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.
రేవంత్ తప్పించుకోలేడు
ప్రధాని మోదీని రేవంత్ బడేభాయ్ అనడం వంటి వాటిపై కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్‌ఎస్ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్‌కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్‌తో తెలంగాణకు ఫైనల్ మ్యాచ్ అనేది బుద్ధిలేని వాదన.
బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు
అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.
నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం..
ఫోన్ ట్యాపింగ్ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.
జగన్ మళ్లీ సీఎం అవుతారు
వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.
మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా?
ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్ మాఫ్’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది.
ధరణి, ల్యాండ్ టైటిల్ వంటివి ఉత్తమ విధానాలు
చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్‌లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్ టైటిల్ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్ కమిషన్‌కు ఇంజనీరింగ్ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ
కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకు
అంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.
పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా
సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్‌కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా..
Comments
Please login to add a commentAdd a comment