ఇసుర్రాయిలో తెలంగాణ నలిగిపోయింది | PM Modi Comments On KCR and BRS Party | Sakshi
Sakshi News home page

ఇసుర్రాయిలో తెలంగాణ నలిగిపోయింది

Published Sun, Mar 17 2024 5:53 AM | Last Updated on Sun, Mar 17 2024 5:53 AM

PM Modi Comments On KCR and BRS Party - Sakshi

శనివారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రజల స్వప్నాలను ఛిద్రం చేశాయి 

నాగర్‌కర్నూల్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ఫైర్‌ 

ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది 

వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం నాశనం కాకుండా 

ఉండాలంటే 17 సీట్లలో బీజేపీని గెలిపించండి 

కాంగ్రెస్‌ అవినీతి, దుష్ట పాలనను అడ్డుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం 

గత ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్‌ శాతాన్ని డబుల్‌ చేశారు 

ఈసారి రెండంకెల సీట్లలో గెలిపించి ఆశీర్వదించండి 

అవినీతికి పాల్పడిన ఎవరినీ శిక్షించకుండా వదిలిపెట్టబోమని వ్యాఖ్య  

ఏఐ టెక్నాలజీతో ‘ఎక్స్‌’లో తన ప్రసంగాలను తెలుగులో వినాలని ప్రధానమంత్రి మోదీ విజ్ఞప్తి 

నాగర్‌కర్నూల్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య తెలంగాణ ఇసుర్రాయిలో పడిన మాదిరిగా నలిగిపోయిందని.. ఆ రెండూ పార్టీలు కలసి తెలంగాణకు సంబంధించిన ప్రతీ స్వప్నాన్ని ఛిద్రం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లూటీకి పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు భూములు, ఇతర ఆస్తుల కైంకర్యానికి దిగుతోందని ఆరోపించారు.

ఇప్పుడు రాష్ట్ర ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టు తయారైందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటింగ్‌ శాతాన్ని రెండింతలు చేశారని.. ఈ ఎన్నికల్లో బీజేపీని రెండంకెల సీట్లలో గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప    సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు..’అంటూ తెలు గులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ఎన్నికల కమిషన్‌ లోక్‌సభ ఎన్నికల నగారా మోగిస్తోందని సాయంత్రమే టీవీల్లో చూశా. కానీ దేశ ప్రజలు ఇప్పటికే అబ్‌కీ బార్‌.. మోదీ సర్కార్‌.. 400 పార్‌ (మళ్లీ మోదీ సర్కార్‌.. ఈసారి 400 సీట్లపైనే..) అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నాగర్‌కర్నూల్‌లో జన సునామీని.. నిన్న మల్కాజిగిరిలో రోడ్‌షోకు వచి్చన అద్భుత స్పందనను చూస్తే.. మోదీనే మరోసారి ప్రధాని అని తెలంగాణ చెబుతున్నట్టు ఉంది. 

ఏ ఒక్క అవినీతిపరుడు తప్పించుకోలేడు 
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరూ శిక్ష పడకుండా తప్పించుకోలేరని తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. అవినీతిపరులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో మాకు తెలంగాణ ప్రజలు, యువత, మహిళల ఆశీర్వాదం కావాలి. 

కాంగ్రెస్‌ చేసేది మోసాలు, దోపిడీయే.. 
ఏడు దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో మోసాలు, దోపిడీ తప్ప ఏమీ లేవు. గరీబీ హఠావో అని నినాదమిచ్చి మోసానికి, లూటీకి దిగింది. పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చాకే దేశంలో మార్పు ప్రారంభమైంది. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారు. మార్పు అనేది మోదీ గ్యారంటీగా అమల్లోకి వచి్చంది. ఇప్పుడు మనందరం కలసి తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి.

మోదీ మీ ఓట్లతో గెలిచి కుటుంబ సభ్యులకో, పరివారానికో పదవులు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు ఏర్పాటు చేయడు. మొత్తం 140 కోట్ల మంది భారతీయులు మోదీ కుటుంబ సభ్యులే. 23 ఏళ్ల నుంచి సీఎంగా, ప్రధానిగా ప్రజలకు సేవచేసే అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఒక్కరోజు కూడా నా కోసం సెలవు తీసుకోలేదు. పేదలకు లబ్ధి చేకూర్చడం కోసం జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు, బీమా, ముద్రా రుణాలు, ఆయుష్మాన్‌ భారత్‌ వంటివి తెచ్చాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ మొదలైంది. దీనిని పూర్తి చేయడం మోదీ గ్యారంటీ. 

అట్టడుగు వర్గాలను కాంగ్రెస్‌ అవమానిస్తోంది 
కేందప్రభుత్వ పథకాల ద్వారా అత్యధికప్రయోజ నం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, రైతులకే అందుతోంది. ఇది సామాజిక న్యాయం. ఈ పథకాలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వంటి అవినీతి, కుటుంబ పార్టీలు వ్యతిరేకిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అవమానిస్తోంది. గతంలో అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించింది. ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి కాకుండా ఓడించాలని చూసింది. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి అవమానించింది.

కేసీఆర్‌ కూడా కొత్త రాజ్యాంగం కావాలంటూ అంబేడ్కర్‌ను అవమానించారు. దళితబంధు ఇస్తామని మోసం చేశారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి దగా చేశారు. కాంగ్రెస్‌ 2జీ స్కామ్‌కు పాల్పడితే.. బీఆర్‌ఎస్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవినీతికి దిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ భూముల కుంభకోణాలకు దిగాయి..’’అని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీ తరఫున బరి లో ఉన్న పి.భరత్‌ప్రసాద్‌ (నాగర్‌కర్నూల్‌), డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌) శానంపూడి సైదిరెడ్డి (నల్గొండ)లను వేదికపై నుంచి సభికులకు మోదీ పరిచయం చేశారు. పార్టీ తరఫున ప్రజలకు సేవ బాధ్యతను వారికి అప్పగించానని, వారిని గెలిపించి మద్దతివ్వాలని కోరారు.

దొంగలు పోతే గజదొంగలు వచ్చారు: కిషన్‌రెడ్డి 
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అవినీతి, దొంగల పాలన పోవాలనుకుంటే.. గజ దొంగలు అధికారంలోకి వచ్చారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘‘గతంలో కాంగ్రెస్‌ హయాంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు గ్యారంటీల పేరిట గారడీ చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోంది. గ్యారంటీలు అమలు చేస్తున్నామని ప్రచారం చేస్తోందే తప్ప క్షేత్రస్థాయిలో అవి పేదలకు ఏమాత్రం అందడం లేదు. గత పదేళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంది. రాష్ట్రంలో సరిపోక ఢిల్లీలో కూడా లిక్కర్‌ వ్యాపారంలో అవినీతికి పాల్పడ్డారు. తాజా అరెస్టులు, ఇతర పరిణామాలకు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలకు సిగ్గుండాలి..’’అని పేర్కొన్నారు. తెలంగాణలో నిజమైన మా ర్పు రావాలంటే రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.  

‘ఎక్స్‌’లో నా ప్రసంగాలను తెలుగులో వినండి 
‘‘నా ప్రసంగాలను, ఆలోచనలను, నాకు–ప్రజలకు మధ్య సంభాషణలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లేందుకు, ప్రతి పౌరుడు వినేందుకు కృత్రిమ మేధ ద్వారా అందుబాటులో ఉంచాం. ఎక్స్‌ (ట్విటర్‌)లో ‘నమో ఇన్‌ తెలుగు’హ్యాండిల్‌ ద్వారా చూడొచ్చు. ఏఐని ఉపయోగించి నాతో జతకలవొచ్చు. ప్రసంగాలను అంతా వినండి..’’అని ప్రధాని మోదీ కోరారు. ఇక తన ప్రసంగాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ రాకా సుధాకర్‌రావు తెలుగులోకి అనువదిస్తుంటాన్ని చూసి.. ‘‘ఇంత బాగా ట్రాన్స్‌లేట్‌ చేస్తున్నారు. పదిరోజులు మీరు నాతో ఉంటే నాకు తెలుగు వచ్చేస్తుంది..’’అని నవ్వుతూ పేర్కొన్నారు. 

17 సీట్లలో కమలం వికసించాలి 
తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఐదేళ్లు చాలు. దేశవ్యాప్తంగా బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే కాంగ్రెస్‌ పార్టీ తమ ఇష్టానుసారం చేయడం సాధ్యం కాదు. అందువల్ల తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో కమలం పువ్వును వికసించేలా చేయండి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్‌ శాతాన్ని రెండింతలు చేశారు. ఈసారి రెండంకెల సీట్లలో గెలిపించండి. అలా చేస్తే తెలంగాణ ప్రజల నుంచి ఎంపీల ద్వారా నాకు నేరుగా సందేశం చేరుతుంది. మీకు మరింత సేవచేసే అవకాశం నాకు లభిస్తుంది. మీ కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలు తెలుసుకుని.. వాటిని తీర్చేందుకు రాత్రీపగలూ శ్రమిస్తా.. – ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement