
కోస్గి ‘రైతు మహాధర్నా’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
గత 14 నెలల పాలనలో రైతులు, మహిళల కోసం సీఎం ఒక్క పని కూడా చేయలేదు
కుటుంబసభ్యులు, అదానీ కోసం దోచుకునే పనిలో పడ్డారు.. కొడంగల్ గిరిజన ఆడ బిడ్డలను తండాల నుంచి ఉరికిచ్చారు
ఉప ఎన్నికల్లో మా పార్టీకి మెజార్టీ 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటా
సాక్షి, నాగర్‌కర్నూల్/నారాయణపేట: గత 14 నెలల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం ఒక్క పని కూడా చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఎనుముల అన్నదమ్ముల కోసం, అల్లుడు, అదాని కోసం, బావమరిది, కుటుంబసభ్యుల కోసం దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. ‘నీ నియోజకవర్గం నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.
ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తరో చూద్దాం. మేం బయటకు రాము. ఇంట్లోనే కూర్చుంటాం. మా సోదరుడు నరేందర్‌రెడ్డి కూడా బయటకు రాడు. మా పార్టీకి 50 వేల మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాజకీయాల్లో ఉండను..’అని సవాల్ విసిరారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బొంద పెట్టాలని ప్రజలు చూస్తున్నారని, రాష్ట్రం మొత్తం ఇదే ముఖచిత్రం ఉందని అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘రైతు మహాధర్నా’లో కేటీఆర్ మాట్లాడారు.
దుర్యోధనుడి తరహాలో పాలన
‘రాష్ట్రంలో గత ఏడాది కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన కౌరవుల రాజు దుర్యోధనుడి తరహాలో సాగుతోంది. ముఖ్యమంత్రి దుర్మార్గపు, అరాచక పాలనతో ఇక్కడి బిడ్డల పోరాటం కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. దుర్యోధనుడు తన రాజ్యం నుంచి పాండవులను బయటకు పంపినట్టుగానే.. రేవంత్ కూడా కొడంగల్‌లోని గిరిజన ఆడ బిడ్డలను అవమానిస్తూ తండాల నుంచి జంగిల్‌కు ఉరికిచ్చారు. ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 70 మందిపై కేసులు పెట్టి 40 మందిని జైలుకు పంపారు. కొడంగల్ ఆడబిడ్డలను గోసపెట్టిన రేవంత్‌ను చిత్తుగా ఓడించి ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు..’అని కేటీఆర్ చెప్పారు.
రేవంత్ మోసం దేశమంతా తెలిసింది
‘సీఎం స్థాయిలో ఉండి కూడా అబద్ధాలు చెబుతారా? టకీ టకీమని డబ్బులు పడ్డాయంటే నిజమని అనుకున్నా కానీ రేవంత్ మోసం దేశమంతా తెలిసింది. రైతుబంధు, రుణమాఫీ, వరికి బోనస్, మహిళలకు రూ.2,500, తులం బంగారం, బాలికలకు స్కూటీలు.. ఎంత మందికి ఇచ్చారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా, తన కాంట్రాక్టర్ మంత్రి కోసం రూ.4,350 కోట్లతో కొత్త ప్రాజెక్టు తెస్తానంటూ మోసం చేస్తున్నారు. అల్లుడికి కట్నం కింద ఇచ్చేందుకు లగచర్ల, హకీంపేట భూములపై కన్నేశారు. ఎన్నికల సందర్భంగా అడ్డగోలు హామీలు ఇచ్చిన రేవంత్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. చికెన్ దావత్‌లు ఇస్తామని, పైసలు తీసుకోమని కాంగ్రెసోళ్లు వస్తారు..వారి దగ్గర పైసలు తీసుకుని కారు గుర్తుకే ఓటు వేయాలి..’అని కేటీఆర్ అన్నారు. కొడంగల్ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని మాట్లాడిన రేవంత్‌కు.. ఇక్కడి తాండూరు కందిపప్పునకు జియోలాజికల్ ఇండెక్స్ గుర్తింపు లభించిందని తెలియదా? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
జ్యోతి–ప్రవీణ్ దంపతుల బిడ్డకు ‘భూమి’గా నామకరణం
దుద్యాల్: కోస్గి మండల పరిధిలోని హకీంపేట మీదుగా కేటీఆర్ వెళ్తున్న క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గ్రామ శివారు నుంచి ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. లగచర్ల బాధిత రైతులను పరామర్శించిన కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జ్యోతి, ప్రవీణ్ దంపతుల కుమార్తెకు భూమి అని నామకరణం చేశారు. తిరుగు ప్రయాణంలో పారిశ్రామికవాడ
ఏర్పాటుతో కోల్పోతున్న భూములను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment