గుంపుమేస్త్రీ ఇంటికి పయనం అవుతారు
కల్వకుర్తి, అచ్చంపేట,గద్వాల రోడ్‌షోల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హా మీలకు ఆశపడి మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని..రెండోసారి కూడా మోసపోతే తప్పు మనదే అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా బుధవారం కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలిస్తే ఆరు నెలల్లోనే కేసీఆర్ తిరిగి రాష్ట్రాన్ని శాసిస్తారని.. ఆ తర్వాత గుంపుమేస్త్రీ రేవంత్‌రెడ్డి ఇంటికి పయనం కావడం తప్పదని చెప్పారు.
కాంగ్రెస్ రాగానే కన్నీళ్లు వచ్చాయి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రైతులకు కన్నీళ్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని నడపడం పాన్‌డబ్బా నడిపినట్టు కాదని, అందుకు పరిపాలనాదక్షత, దమ్మూధైర్యం ఉండాలని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపి, మోసపు డైలాగులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
రేవంత్‌రెడ్డికి గ్యారంటీలు అమలు చేయడం చేతకాక కేసీఆర్‌పై, తిట్లు.. దేవుడిపై ఓట్లు పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వృద్ధులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు రాసిచ్చిన బాండ్లు బౌన్స్ అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు.
నమో అంటే నమ్మించే మోసగాడు
పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమిట ని ప్రశ్నించారు. కృష్ణాజలాల్లో వాటా తేల్చాలని అడిగితే ఒక్క ఉత్తరానికి సమాధానం చెప్పలేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వని మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాముడి గుడి కట్టినందుకే మోదీ ఓట్లు అడిగితే.. యాదాద్రి దేవాలయంతో పాటు ఆధునిక దేవాలయాలైన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను కట్టిన కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని చెప్పారు.
నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఉండి అద్భుతాలు సృష్టించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఇలాంటి వ్యక్తి మళ్లీ దొరకరని చెప్పారు. ప్రవీణ్‌కుమార్‌ను పార్లమెంట్‌కు పంపితే తెలంగాణ గొంతు అక్కడ వినిపిస్తారని, ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని, ప్రశ్నించే గొంతుకను గెలిపిస్తే అన్ని పనులు అవుతాయని పేర్కొన్నారు. ఆయా రోడ్‌షోల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అచ్చంపేట, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment