తొలిసారి నాగర్‌కర్నూల్ ఎంపీ సెగ్మెంట్‌లో త్రిముఖ పోటీ
సిట్టింగ్ స్థానంపై బీఆర్‌ఎస్ గురి
ఆది నుంచీ కాంగ్రెస్‌దే ఆధిపత్యం
సిట్టింగ్ ఎంపీని చేర్చుకొని బలం పెంచుకున్న బీజేపీ
గెలుపులో మాదిగ సామాజికవర్గ ఓట్లే కీలకం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఓవైపు నల్లమల అభయారణ్యం, మరోవైపు కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న నాగర్‌కర్నూల్ ఎంపీ సెగ్మెంట్‌లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్‌కర్నూల్‌పై పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్‌ప్రసాద్, బీఆర్‌ఎస్ తరఫున ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ పోటీలో ఉన్నారు. . 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా, 1962లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పడింది.
8 సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, ఒక్కోసారి తెలంగాణ ప్రజాసమితి, బీఆర్‌ఎస్ గెలిచాయి. 4.5 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఈ స్థానంలో గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో అగ్రభాగం మాదిగ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి.
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్‌ఎస్
సిట్టింగ్ స్థానంపై బీఆర్‌ఎస్ పట్టు
సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్ శ్రమిస్తోంది. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను రంగంలోకి దింపి తమ అభ్యర్థి గెలుపునకు వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అలంపూర్‌కే చెందిన తాను విద్యావంతుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఒకసారి తనకు అవకాశం కల్పించాలని ఆర్‌ఎస్.ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12స్థానాల్లో కాంగ్రెస్ గెలి చింది. అలంపూర్, గద్వాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, ఈ రెండు నియోజకవర్గాలు నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోనే ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది.
పోతుగంటి భరత్‌ప్రసాద్ బీజేపీ
బలం పెంచుకున్న బీజేపీ..
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానంలో 13.03 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతికి 1,29,021 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములును తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ, ఆయన కొడుకుభరత్‌ప్రసాద్‌కు పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది.
నియోజకవర్గంలోని కల్వకుర్తి, నాగర్‌క ర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మా ణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రహదారి నిర్మాణ పను లు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బ లాన్ని పెంచుకున్న బీజేపీ మోదీ చరిష్మాతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచా రం నిర్వహించి ఈ స్థానంలో పాగా వేసేందుకు పట్టుదలతో ఉంది.
మల్లు రవి కాంగ్రెస్
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు గెలిచింది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నంది ఎల్లయ్య ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
ఈసారి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మల్లు రవిని మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కాగా, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇవీ ప్రభావితం చూపే అంశాలు
సాగునీటి కోసం చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి నీరందించాలన్న డిమాండ్ ఉంది.
పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి.
గద్వాల నుంచి ఏపీలోని మాచర్ల వరకు నూతన రైల్వేలేన్ ప్రతిపాదనలకు 20 ఏళ్లుగా మోక్షం కలగడం లేదు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికీ విద్యారంగంలో వెనుకబాటే కన్పిస్తోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ఇప్పటికీ కలగానే మారింది.
నల్లమలలోని చెంచులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవు. వీరి జీవనోపాధికి పరిశ్రమలు స్థాపించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు.
నల్లమల అటవీప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాలు ఉన్నా పర్యా టకంగా అభివృద్ధి లేదు. పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న డిమాండ్ ఉంది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
టీఆర్‌ఎస్: పోతుగంటి రాములు
ఓట్లు: 4,99,672 – 50.48 శాతం
కాంగ్రెస్: మల్లు రవి
ఓట్లు: 3,09,924 – 31.31 శాతం
బీజేపీ: బంగారు శ్రుతి
ఓట్లు: 1,29,021 – 13.03 శాతం
Comments
Please login to add a commentAdd a comment