రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్‌ | BRS Leader KCR Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్‌

Published Sun, Apr 28 2024 4:23 AM | Last Updated on Sun, Apr 28 2024 4:23 AM

BRS Leader KCR Fires On CM Revanth Reddy

మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయి?
 

కోతలు పూర్తయి 20 రోజులైనా ధాన్యం కొనే దిక్కులేదు: కేసీఆర్‌ 

భోజనం చేస్తున్నంత సేపట్లో రెండు సార్లు కరెంట్‌ పోయింది 
 

ఈ బాధలన్నీ ఎందుకు వచ్చాయి? 
 

మీ తరఫున నిలబడి, ప్రభుత్వం మెడలు వంచేలా బలం ఇవ్వండి 
 

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు 
 

సీఎం రేవంత్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్‌ 
 

నాగర్‌కర్నూల్‌ రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లలో మాజీ సీఎం కేసీఆర్‌ 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రం ఇప్పుడు భగ్గుమంటోంది. నా బస్సును కదలనివ్వనంత జనం.. వారి పూల స్వాగతమే చెప్తున్నాయి భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే నని.. కాంగ్రెస్‌ బలుపు దించాలి’’ అని వ్యాఖ్యా నించారు. కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర ఐదో రోజు శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ఏప్రిల్‌ 27.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శంకుస్థాపన జరిగిన రోజు. 23 ఏళ్ల కింద తెలంగాణ సాధన కోసం పిడికెడు మందితో ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రోజు.. బీఆర్‌ఎస్‌ పుట్టిన రోజు. కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మీరు ఇచ్చిన మద్దతు.. అప్పటి ఘటనలు యాది చేసుకుంటే.. అదో ఉప్పెన, బ్రహ్మాండమైన సన్నివేశం. నేను మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఈ గౌరవం చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. 

రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి 
అడ్డగోలు హామీలిచ్చి, దు్రష్పచారం చేసి కేవలం 1.5 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కొనే దిక్కులేదు. మేం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల పాటు అందించాం. ఇప్పుడు కాంగెస్‌ పాలనలో మళ్లీ రాత్రిపూట కరెంటు కోసం తిప్పలు, బావుల వెంట పరుగులు, కరెంటు షాకులు, తేళ్లు, పాములు.. ఈ బాధలు మళ్లీ ఎందుకు వచ్చాయి? రోజు సీఎం, మంత్రులు మీటింగ్‌లు పెట్టి 24 గంటల కరెంటు ఇస్తున్నామని అంటున్నారు. మరి ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో నేను భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది. రోజుకు పది సార్లు ఇలానే పోతోందని చెప్తున్నారు. మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయో ఆలోచించండి. 

ప్రభుత్వ మెడలు వంచే బలం ఇవ్వండి 
గ్రామాల్లో పాలోళ్ల మధ్య పంచాయతీ జరిగితే పంచులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీలో ప్రజల తరపున యుద్ధం చేసే పంచు ఈ కేసీఆర్‌. ప్రాణం పోయినా తెలంగాణ తెస్తానని మాట ఇచ్చి.. తెచ్చి చూపించా. ఇప్పుడు మీ తరఫున వాదన వినిపించడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి మీరే బలం ఇవ్వాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీయే గెలుస్తుంది. అప్పుడేం లాభం ఉండదు. ఈ రోజు ఉదయమే రిపోర్టు వచ్చింది. మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్‌లలో బీఆర్‌ఎస్‌దే గెలుపు. 

రేవంత్‌రెడ్డివి సంస్కారం లేని మాటలు 
సీఎం రేవంత్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు. నా గుడ్లు పీకి గోటీలు ఆడుతడట. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. పదిహేనేళ్లు పోరాటం చేసిన తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణను పదేళ్లలో తెల్లగ చేసిన, ప్రజల కష్టాలను చూసి తండ్లాడిన వ్యక్తిని అలా అనొచ్చా. ఇది «న్యాయమా ప్రజలే చెప్పాలి. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి..’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
పంటలు కావాలా.. మోదీ గత్తర కావాలా? 
బీజేపీ అక్కరకు రాని చుట్టం. మోదీ ఇచ్చిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం అయిందా? మొన్న నాగర్‌ కర్నూల్‌కు గుజరాత్‌ సీఎం వచ్చారట. 1,500 మంది కూడా రాలే. మనకు గుజరాత్‌ నుంచి సీఎంలు రావాలా? మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా పెట్టబోనని చెప్పిన. నేను రైతును.. నాకు వారి బాధలు తెలుసు. ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా.. మోదీ వచ్చి మీటర్లు పెడతా అంటడు. పచ్చని పంటలు కావాలా? మోదీ గత్తర కావాలా? ఆలోచించండి. 
 
ఆర్‌ఎస్పీ లాంటి వాళ్లు మళ్లీ దొరకరు 
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అల్లాటప్పా వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్‌ అధికారి. అలంపూర్‌ బిడ్డ. నేను సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలకు ఎంత బడ్జెట్‌ కావాలో తీసుకోవాలని చెప్పిన. నేడు తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇంటర్నేషనల్‌ స్కూళ్లతో సమానం. ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. ఎవరెస్ట్‌ ఎక్కిన బిడ్డలను గురుకులాల నుంచి పంపినది ప్రవీణ్‌కుమారే. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఇలాంటి వారు మళ్లీ దొరకరు. చదువుకున్నోళ్లు వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement