ఈసారి బీఆర్‌ఎస్‌కు చాన్స్ లేనట్టే.. కల్వకుర్తిలో జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్
కాంగ్రెస్ కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి
గెలిపించే బాధ్యతను నాయకులుగా మేం తీసుకుంటాం..
బీఆర్‌ఎస్ ప్రతిపక్షంగా బాధ్యత సరిగ్గా నిర్వర్తించి ఉంటే పంచాయతీలో కొన్నిసీట్లయినా వచ్చేవి
తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్‌ల మధ్యే సమన్వయం లేదు
కాంగ్రెస్ సర్కారుతో ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు
కష్టాలు వచ్చింది కేసీఆర్ కుటుంబానికే..
సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బా కోసమే కేటీఆర్ ప్రాజెక్టుల సందర్శన
ఈ నెలాఖరు నాటికి రూ.1.50 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడి
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ నాయకుడు జైపాల్‌రెడ్డి అని వ్యాఖ్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రతిపక్షంగా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా కొన్ని సీట్లు గెలిచేదని.. కానీ వారికి ఆ అవకాశం లేకుండా పోయినట్టేనని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యతను నాయకులుగా తామే తీసుకుంటామని చెప్పారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సభలో రేవంత్ పాల్గొన్నారు. కల్వకుర్తి సమీపంలోని కొట్ర చౌరస్తాలో జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు మొదలైనట్టేనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు.
ప్రజలెవరికీ ఎలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ కుటుంబానికే కష్టం వచ్చింది. ఆ కష్టాలను కప్పిపుచ్చుకునేందుకే పేదలపై నెడుతున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రారని, తామే వస్తామని ఈ నెల 24న బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ చెప్పారు. కానీ మరుసటి రోజు ఉదయమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు. తండ్రీ కొడుకుల మధ్యలోనే సమన్వయం లేదు. వారిలో అధికారం కోల్పోయిన బాధ కనిపిస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చినా బుద్ధి రాలేదు. కేటీఆర్ సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బా కోసమే గోదావరి వెంట ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్నాడు.
కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరినట్టే!
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓ సన్నాసి సవాల్ విసిరిండు.. ఆ సవాల్ స్వీకరించి ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతుల రుణమాఫీ చేశాం. నెలాఖరులోపు రూ.1.5 లక్షలలోపు రైతుల రుణాలు మాఫీ చేయబోతున్నాం. వచ్చే నెల 2 నుంచి 14వ తారీఖు వరకు విదేశీ పర్యటనకు వెళుతున్నా.. తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం. కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరి తీరుతుంది
కల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్లు
ఆగస్ట్ 1న రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.100 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నాం. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.309 కోట్లు కేటాయిస్తున్నా.. హైదరాబాద్– కల్వకుర్తి– శ్రీశైలం జాతీయ రహదారిని హైదరాబాద్ నుంచి కల్వకుర్తి రోడ్ వరకు నాలుగు లేన్లుగా విస్తరిస్తాం..’’ అని రేవంత్ ప్రకటించారు.
ప్రజాస్వామ్య విలువలతో కాంగ్రెస్ పాలన: మంత్రి దామోదర
కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య విలువలతో సాగుతోందని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రాజకీయ నేతగానే కాకుండా తత్వవేత్తగా ఎదిగారని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో జైపాల్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ సభలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఆనాడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది
2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాకపోవడానికి కారణాలేమిటని పార్టీ పెద్దలు ఇటీవల నన్ను అడిగారు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీఎం ఎవరన్నది చెప్పకపోవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని నేను వివరించాను. నాడు పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు అంతా గందరగోళం నెలకొంది. తెలంగాణ బిల్లు పాస్ చేసే సమయంలో.. పార్లమెంట్‌లో ఉన్న హౌస్ ఆఫ్ మూడ్‌ను బట్టి, పార్లమెంటు తలుపులు మూసి బిల్లుకు ఆమోదం తెలపాల్సిందిగా నాటి స్పీకర్ మీరాకుమారికి జైపాల్‌రెడ్డి సూచించారు.
ఆయన సలహా మేరకే తెలంగాణ బిల్లు పాస్ అయింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా జైపాల్‌రెడ్డిని ప్రకటించి ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది. ఈ విషయంలో పార్టీ విధానపరమైన లోపంతో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లిందని నేను వివరించాను. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా..చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారు. పదవులకే గౌరవం తెచ్చేలా వ్యవహరించారు. – సీఎం రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment