Jaipal Reddy
-
‘పంచాయతీ’ మాదే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా కొన్ని సీట్లు గెలిచేదని.. కానీ వారికి ఆ అవకాశం లేకుండా పోయినట్టేనని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యతను నాయకులుగా తామే తీసుకుంటామని చెప్పారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సభలో రేవంత్ పాల్గొన్నారు. కల్వకుర్తి సమీపంలోని కొట్ర చౌరస్తాలో జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు మొదలైనట్టేనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు.ప్రజలెవరికీ ఎలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ కుటుంబానికే కష్టం వచ్చింది. ఆ కష్టాలను కప్పిపుచ్చుకునేందుకే పేదలపై నెడుతున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రారని, తామే వస్తామని ఈ నెల 24న బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ చెప్పారు. కానీ మరుసటి రోజు ఉదయమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు. తండ్రీ కొడుకుల మధ్యలోనే సమన్వయం లేదు. వారిలో అధికారం కోల్పోయిన బాధ కనిపిస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చినా బుద్ధి రాలేదు. కేటీఆర్ సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బా కోసమే గోదావరి వెంట ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్నాడు.కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరినట్టే!పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓ సన్నాసి సవాల్ విసిరిండు.. ఆ సవాల్ స్వీకరించి ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతుల రుణమాఫీ చేశాం. నెలాఖరులోపు రూ.1.5 లక్షలలోపు రైతుల రుణాలు మాఫీ చేయబోతున్నాం. వచ్చే నెల 2 నుంచి 14వ తారీఖు వరకు విదేశీ పర్యటనకు వెళుతున్నా.. తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం. కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరి తీరుతుందికల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్లుఆగస్ట్ 1న రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.100 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నాం. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.309 కోట్లు కేటాయిస్తున్నా.. హైదరాబాద్– కల్వకుర్తి– శ్రీశైలం జాతీయ రహదారిని హైదరాబాద్ నుంచి కల్వకుర్తి రోడ్ వరకు నాలుగు లేన్లుగా విస్తరిస్తాం..’’ అని రేవంత్ ప్రకటించారు.ప్రజాస్వామ్య విలువలతో కాంగ్రెస్ పాలన: మంత్రి దామోదరకాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య విలువలతో సాగుతోందని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రాజకీయ నేతగానే కాకుండా తత్వవేత్తగా ఎదిగారని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో జైపాల్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ సభలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణలో ఆనాడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాకపోవడానికి కారణాలేమిటని పార్టీ పెద్దలు ఇటీవల నన్ను అడిగారు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీఎం ఎవరన్నది చెప్పకపోవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని నేను వివరించాను. నాడు పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు అంతా గందరగోళం నెలకొంది. తెలంగాణ బిల్లు పాస్ చేసే సమయంలో.. పార్లమెంట్లో ఉన్న హౌస్ ఆఫ్ మూడ్‌ను బట్టి, పార్లమెంటు తలుపులు మూసి బిల్లుకు ఆమోదం తెలపాల్సిందిగా నాటి స్పీకర్ మీరాకుమారికి జైపాల్‌రెడ్డి సూచించారు.ఆయన సలహా మేరకే తెలంగాణ బిల్లు పాస్ అయింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా జైపాల్‌రెడ్డిని ప్రకటించి ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది. ఈ విషయంలో పార్టీ విధానపరమైన లోపంతో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లిందని నేను వివరించాను. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా..చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారు. పదవులకే గౌరవం తెచ్చేలా వ్యవహరించారు. – సీఎం రేవంత్‌రెడ్డి -
బీఆర్ఎస్ పార్టీలో 'ఆకర్ష్ మంత్రం' ! కొత్త జయపాల్‌రెడ్డి చేరిక..
కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. నియోజకవర్గస్థాయిల్లో పేరున్న నేతలతో పాటు అర్ధబలం, అంగబలం, సామాజికవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరడమే ఖాయమని భావించిన స్థానిక మైత్రి గ్రూప్ అధినేత కొత్త జయపాల్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకే మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్‌లు సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా సమ్మతించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణకే కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి జిల్లా నుంచి రానున్న ఎన్నికల్లో మరోసారి విజయ ఢంగా మోగించేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. జిల్లాకేంద్రంలో బలమైన సామాజిక వర్గం, గ్రానైట్, రియల్టర్, మీడియా గ్రూప్‌ల్లో భాగస్వామ్యుడైన కొత్త జయపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో మంతనాలు జరపడం, రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ చెప్పడం, వారం రోజుల్లోనే పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేయడంపై జిల్లాలో రాజకీయ చర్చ మొదలైంది. కొత్త జయపాల్‌రెడ్డి గతంలో నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ అగ్రనాయత్వంతో సంప్రదింపులు జరపడం, కరీంనగర్ బీజేపీ టికెట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు పూర్తయ్యాయని కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఖాయమైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కరీంనగర్ బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో రెండు పార్టీల్లో నుంచి సరియైన సంకేతాలు రాకపోవడంతో జయపాల్‌రెడ్డి గమ్ముగా ఉన్నారు. దీంతో మంత్రి గంగుల అధిష్టానంతో కొత్త జయపాల్‌రెడ్డి చేరికతో లాభనష్టాలపై పార్టీకి విన్నవించడంతో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. త్వరలో మరిన్ని చేరికలు.. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు కొద్ది రోజుల్లోనే ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల్లో స్తబ్దత నెలకొనడం.. అధికార బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తుండడంతో ఆయా పార్టీల్లో గుర్తింపు లేని లీడర్లు బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమయం వరకు చేరికలు భారీగా ఉంటాయని ఆ పార్టీ లీడర్లు పేర్కొంటున్నారు. -
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు. తాను, జైపాల్‌రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్‌రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర కీలకం: రేవంత్
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ, ప్రధానిని ఒప్పించడంలో దివంగత మాజీ కాంగ్రెస్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా బుధవారం పీవీమార్గ్‌లోని స్ఫూర్తి స్థల్ వద్ద పలు పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జేసీ దివాకర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీచంద్‌రెడ్డి, వినోద్, వివేక్, రాంచంద్రారెడ్డి, దయాకర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యులు జైపాల్‌రెడ్డికి అంజ లి ఘటించారు. కాగా, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తిత్వం జైపాల్‌రెడ్డిదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు నివాళులర్పించారు. -
జాతీయవాదమే భారతీయ ఆత్మ : ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత సాంస్కృతిక ఐక్యతే ఇవాళ దేశప్రజలను సమైక్యంగా మార్చిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాసిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తకం తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను వెంకయ్య నాయుడు ఆన్లైన్ ద్వారా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పువాటిల్లుతుందని గ్రహిస్తే.. ప్రజలంతా ఏకమై ఆ దాడిని ఎదుర్కునేందుకు సిద్ధపడతారని, ఇదే జాతీయవాదమన్నారు. భారతీయ ఆత్మలో జాతీయవాదం బలంగా ఉందని ఇటీవల ఎదురైన పరిణామాలు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు. ‘మతం, జాతి, భాష అనే వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదని నా అభిప్రాయం. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఈ విషయంలో మన దృష్టి కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని వెంకయ్య అన్నారు. (చదవండి: విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి) ప్రజాస్వామ్యం అనేది.. ఒక సామాజిక వ్యవస్థ పరిణామంలో పరిపక్వమైన పరిస్థితులకు సంకేతమన్నారు. ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాస్వామిక ప్రక్రియను ఉపయోగించుకుని తమ పరిపక్వతను ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామిక వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పటికీ.. ఈ లోపాలు పరిణామ క్రమంలో ఏర్పడినవే. వాటిపై చర్చిస్తూ, పరిష్కరించుకునే క్రమంలో ప్రజాస్వామ్యం తనను తాను మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విస్తృత అధ్యయనం చేసే ఆసక్తితో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారు. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకరణ సంబంధాలతో, లాజికల్‌గా ఆలోచించడం జైపాల్ రెడ్డి ప్రత్యేకత. వాదన పటిమ, లోతైన విశ్లేషణతో, అరుదైన రాజనీతిజ్ఞుడిగా అందరి మనసులు గెలిచిన జైపాల్ రెడ్డి తన ఆలోచనలను ‘టెన్ ఐడియాలజీస్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు’ అని తెలిపారు. (చదవండి: కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర) ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని స్వయంగా ఆయనే తనను కలిసి బహుకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. ‘ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని జైపాల్ రెడ్డి వివరించారు. భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు జైపాల్ రెడ్డి ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడం కాకుండా.. సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ‘వ్యవసాయిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వరకు’ మారే క్రమంలో వివిధ దేశాల్లో జరిగిన అనేక పరిణామాలను, అన్వేషణలను, ఆవిష్కారాలను, భావజాలాలను అన్వేషించారు. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాల్ని ఆయన పది భావజాలాలుగా వర్గీకరించారు. ఈ పది భావజాలాల్లో ప్రధానమైనది జాతీయవాదం’ అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. (చదవండి: వీవీని కాపాడండి: హృదయం చెమ్మగిల్లుతోంది) రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం తప్పని సరిగా ఉండాలని.. సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృథా అని ఆయన అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తాయన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశానికి బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పర్చేందుకు దీర్ఘకాలిక దృష్టిని, కార్యాచరణను అందించేదే ఒక సైద్ధాంతిక దృక్పథమన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరంను, ఈ పుస్తక ప్రచురణ కర్తలు ‘ఓరియంట్ బ్లాక్ స్వాన్’ సంస్థ వారిని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. -
రాష్ట్ర సాధనకు జైపాల్ కృషి
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు హైదరాబాద్ నగరం తెలంగాణకే చెందేలా నాడు కేంద్ర మంత్రి హోదాలో సూదిని జైపాల్‌రెడ్డి తీసుకున్న చొరవ, కృషి అభినందనీయమని పలు రాజకీయ పార్టీల నాయకులు కొనియాడారు. జైపాల్‌రెడ్డి 78వ జయంతి కార్యక్రమాన్ని గురువారం నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ ఘాట్ వద్ద నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు డి.శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీలు పల్లంరాజు, విశ్వేశ్వర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరై నివాళి అర్పించారు. రాష్ట్ర సాధనలో జైపాల్‌రెడ్డి కృషి మరువలేనిదని, ఆయన వల్లే తెలంగాణకు హైదరాబాద్ దక్కిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి గుర్తు చేశారు. పదేళ్లపాటు జైపాల్‌రెడ్డి ఎంపీగా తాను ఎమ్మెల్యేగా కలసి పనిచేశామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఖ్యాతిని పెంచి పార్లమెంట్, శాసన సభ, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అద్భుత ప్రసంగంతో ఆయన చెరగని ముద్రవేసుకున్నారన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టినప్పుడే ఆయనకు సరైన నివాళి ఆర్పించినట్లవుతుందన్నారు. విలువల కోసం జీవితాంతం నిజాయితీగా, సిద్దాంతాన్ని కఠినంగా అమలు చేసిన వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, ఆయన మరణం సెక్యులరిజానికి, సోషలిజానికి తీరని లోటని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడని, వామపక్షాలు బలంగా ఉండాలని కోరుకునే వారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. జయంతి కార్యక్రమంలో జైపాల్ కుమారుడు ఆనంద్‌రెడ్డి, సన్నిహితుడు వెంకట్రాంరెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, ఎన్ఆర్ఐ, ఆటా మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, దైవజ్ఞశర్మతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. -
ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి 78వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని జైపాల్ రెడ్డి మెమోరియల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, వీ హెచ్ హనుమంతులు, రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లు రవి,తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన జైపాల్‌రెడ్డి తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే నెక్లెస్ రోడ్లో మెమోరియల్ హాల్‌ను నిర్మించాలన్నారు. అదేవిధంగా సీపీఐ అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డికి నివాళులు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది జైపాల్ చొరవేనని ఆయన పేర్కొన్నారు. -
జైపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ: రేవంత్
మాడ్గుల: దివంగత కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని, ఆయన అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న సుష్మాస్వరాజ్, అద్వానీని ఒప్పించి రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి స్వగ్రామం మాడ్గుల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి అధ్యక్షతన జైపాల్‌రెడ్డి సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో జైపాల్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. చట్టసభల్లో ఆయన నిజాయితీగా, హుందాగా వ్యవహరించి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారని కొనియాడారు. ఈ సభకు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
మమ్మల్ని తిరుపతి వేంకటకవులనేవారు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తనను, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిని అందరూ తిరుపతి వేంకట కవులుగా పిలిచేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయకేంద్రంలో జైపాల్‌రెడ్డి సంస్మరణసభ ఏర్పాటు చేశారు. సభ లో వెంకయ్యతోపాటు ఆయన సతీమణి ఉశమ్మ, మాజీప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమం త్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి, కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్, కొప్పుల రాజు, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మమ్మ, కుమారులు అరవింద్, ఆనంద్, కుమార్తె అరుణ, ఇతర కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ తాను నమ్మిన ప్రజాస్వా మ్య విలువలకు ఎల్లప్పుడూ కట్టుబడిన నాయ కుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. తామిద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలకు ముందు ఇంట్లో కలుసుకొని ఆరోజు సభ అజెండాపై చర్చింకుకొనే వారిమని అన్నారు. సభ లో ఎల్లప్పుడూ పక్కనే కూర్చొనేవాళ్లమని, అన్ని విషయాలపట్ల జైపాల్‌రెడ్డికి సునిశిత పరిశీలన, జాతీయ, అంతర్జాతీయ అంశాలపట్ల పరిజ్ఞానం ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ జైపాల్ రెడ్డి మరణంతో దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా జైపాల్ పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి తనకు మార్గదర్శి అని, అనేక ఆంశాలను ఆయన్నుంచి నేర్చుకొనేవాడినని ఏచూరి చెప్పారు. జైపాల్ రెడ్డి మరణంతో వ్యక్తిగత స్నేహితుడ్ని కోల్పోయినట్లు మురళీ మనోహన్ జోషి, డి.రాజా విచారం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సీనియర్లు, ఇతర పార్టీల నేతలు ప్రసంగించారు. -
జైపాల్‌రెడ్డి మంచి పాలనాదక్షుడు
సాక్షి, న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మంచి పాలనాదక్షుడని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. సోమవారం ఇండియా ఇంటర్ నేషనల్ సెంటర్లో జైపాల్‌రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సభలో మన్మోహన్ సింగ్‌తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేయడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. పదేళ్లపాటు తన మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగారని చెప్పారు. ప్రసార భారతి బిల్లుతో దూరదర్శన్, ఆకాశవాణికి స్వయం ప్రతిపత్తి కల్పించారని చెప్పారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చినప్పటికీ అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో నిశ్శబ్దంగా చాలా కీలక పాత్ర పోషించారన్నారని, ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం తీసుకోవడానికి పార్టీ నాయకత్వాన్ని ఒప్పించారని మన్మోహన్ సింగ్ తెలిపారు. -
గొప్ప చదువరి, అరుదైన మేధావి
దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉంటూ మనకు తెలిసినట్టు అనిపించే వ్యక్తుల్లో కూడా మనకు తెలియని అద్భుతపార్శ్వాలు ఉంటాయి. అవి ఒక్కోసారి హఠాత్తుగా వెల్లడై ఆశ్చర్యం కలిగిస్తాయి. జైపాల్ రెడ్డిగారు అలాంటి వ్యక్తి. విద్యార్థినాయకునిగా, శాసనసభ్యునిగా, ఎంపీగా, గొప్ప వక్తగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానే కాక; విలువలకు అంకితమైన వ్యక్తిగా ఆయన రాజకీయజీవితం తెరచిన పుస్తకమే. ఈ రాజకీయ జీవితమనే దండలో దారంలా ఆయనకు ఎంతో లోతు, వైశాల్యం కలిగిన మేధోజీవితం ఉంది. ఒక ఏడాది పరిచయంలో అది అనేక రూపాలలో నాకు తెలిసివచ్చింది. జైపాల్ రెడ్డిగారు ఆంగ్లంలో వెలువరించిన ‘టెన్ ఐడియాలజీస్–ది గ్రేట్ ఎసిమెట్రీ బిట్వీన్ ఏగ్రేరియనిజం అండ్ ఇండష్ట్రియలిజం’ అనే పుస్తకం గురించి ప్రముఖపాత్రికేయులు కె. రామచంద్రమూర్తిగారు చెప్పి, మీరు దానిని తెలుగులోకి అనువదించాలని సూచించినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. ఆ సందర్భంలో ఆయనతో కలసి మొదటిసారి జైపాల్‌రెడ్డిగారిని కలిసినప్పుడు, కాంగ్రెస్‌లో ఉంటూ అప్పటికే అనేక ఉన్నతపదవులను నిర్వహించిన ఒక ప్రముఖనాయకుని గురించి జైపాల్ రెడ్డిగారు ప్రస్తావించి, ఆయన హిందుత్వవర్గాలకు దగ్గరవడంపై మీ అభిప్రాయమేమిటని అడిగారు. ఆయనే ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, గాంధీ–నెహ్రూ ప్రభావాల మత్తులో రాజకీయాల్లోకి వచ్చి, వారు ప్రాతినిధ్యం వహించిన విలువలను ఉగ్గడిస్తూ దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్నా, హిందూత్వాభిమానం ఆయనలో సుప్తావస్థలో ఉందనీ; బాహ్యవాతావరణం హిందూత్వకు అనుకూలంగా మారగానే అదిప్పుడు బయటపడుతోందని ఒక సామాజికశాస్త్రవేత్తలా విశ్లేషించారు. ఈ సందర్భంలోనే, అత్యున్నతపదవిని నిర్వహించిన ఇంకొక ప్రముఖ కాంగ్రెస్ నాయకునికి కూడా ఈ విశ్లేషణను ఆయన అన్వయించారు. దేశంలో ఇప్పుడు ప్రాబల్యం వహిస్తున్న రాజకీయశక్తుల గురించి మాట్లాడుతూ, విప్లవవ్యతిరేక మితవాదశక్తుల విజృంభణ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనంటూ, దీనినొక అవాంతరదశగా పేర్కొని చారిత్రిక ఆశావాదాన్ని ధ్వనింపజేశారు. అనువాదాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆయనతో కలసి మూలంతో దానిని బేరీజు వేసుకునే కార్యక్రమం కొన్ని రోజులపాటు సాగింది. అప్పుడే ఆయన వ్యక్తిత్వ, మేధోజీవితాల తాలూకు బహు పార్శ్వాలు నాకు పరిచయమయ్యాయి. రకరకాల భావజాలాల మీదుగా సాగిన ప్రపంచ చరిత్రగమనంపై, సంస్కృతీసాహిత్యాలపై తన అవగాహనను, అనుభూతిని ఎదుటివారితో పంచుకోవాలన్న నిరంతరోత్సాహం ఆయనలో ఉరకలు వేసేది. దాంతో ఒక్కోరోజున మా అనువాదపరిశీలన రెండు, మూడు పేజీలను మించి సాగేది కాదు. ఇంకోవైపు, ఆయన రాజకీయమార్గదర్శనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు, ఆయన స్వస్థలానికి చెందిన చిన్నా, పెద్దా నాయకులు, అభిమానుల రాకతో అంతరాయం కలుగుతూ ఉండేది. ఆవిధంగా ఆయన రాజకీయ, మేధోజీవితపార్శ్వాలను రెంటినీ ఒకేసారి, ఒకేచోట చూడగల అవకాశం ఏర్పడేది. గాంధీ, బుద్ధుడు, ఫ్రాన్సిస్ బేకన్, జాన్ మేనార్డ్ కీన్స్, డేవిడ్ రికార్డో వంటి పేర్లు ఒకపక్కన; స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికతో సహా పలు అంశాలకు సంబంధించిన మాటలు ఇంకోపక్కన దొర్లుతూ ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పించేవి. మరోవైపు, ఎన్ని రోజులు తీసుకుంటున్నాసరే, ఒక్క మాటను కూడా విడిచిపెట్టకుండా అనువాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంలో ఒక పండితునిలో మాత్రమే ఉండే ఓపిక, శ్రద్ధ, దీక్ష ఆయనలో ఉండేవి. అవసరమైనప్పుడల్లా తన ముందున్న ఆంగ్లనిఘంటువులను, విజ్ఞానసర్వస్వాలను శోధిస్తూ నిర్దుష్టతకు ప్రాధాన్యమిచ్చేవారు. కొన్ని పదప్రయోగాలను, వాక్యాలను స్వయంగా సవరించుకుంటూ, కొన్ని చోట్ల కత్తిరిస్తూ మూలానికి మెరుగులు దిద్దే ప్రయత్నమూ చేశారు. జైపాల్ రెడ్డిగారిలో ప్రత్యేకించి ఆకట్టుకునేది, ఆయన మౌలిక ఆలోచనా సరళి. ఆయన ప్రధానంగా జ్ఞానవాది. భాషాసాహిత్యాలలో పాండిత్యం గొప్పదే కానీ, జ్ఞానానికి దోహదం చేయడం అంతకన్నా గొప్పదనేవారు. ఈ సందర్భంలోనే భాషా,సాహిత్యవేత్తగా ప్రసిద్ధికెక్కిన ఒక ప్రముఖకాంగ్రెస్ నాయకుని గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఆ రెండింటిలోనూ కూరుకు పోకుండా ఉంటే, జ్ఞానమార్గంలో ముందుకు పోగలిగిన సమర్థుడేననేవారు. అదే సమయంలో కదిలించే ఒక కవితావాక్యానికి, లేదా కథనానికి కంట తడిపెట్టే ఆర్ద్రత ఆయనలో ఉండేది. మౌలిక చింతనతోపాటు, ఆయనలోని మరో ఆకర్షణ, చారిత్రికదృక్కోణం. ఆయన పుస్తకమే ఈ రెండింటికీ నిలువెత్తు ఉదాహరణ. ఉదారవాదం, లౌకికవాదం, పెట్టుబడిదారీ వాదం, సామ్యవాదంతో సహా నేటి భిన్న భిన్న భావజాలాల వేళ్ళు–సాంస్కృతిక పునరుజ్జీవనం, మానవవాదం, సంస్కరణవాదం, శాస్త్రవిజ్ఞానవిప్లవమనే నాలుగు ఉద్యమాలలోనూ; ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవాలలోనూ ఎలా ఉన్నాయో అందులో ఆయన చర్చిస్తారు. మళ్ళీ నేటి సమస్యలు, సంక్షోభాల మూలాలను కూడా వాటిలోనే నిరూపిస్తూ, పరిష్కారమార్గాన్ని సూచిస్తారు. వివిధ భావజాలాల మధ్య నేడున్న ఘర్షణ పరిస్థితిని అధిగమించవలసిన అవసరం ఉందనీ; ప్రస్తుత సంక్షోభాలను సక్రమంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలంటే చారిత్రికదృక్కోణాన్ని పెంపొందించుకోవాలనీ ఆయన అంటారు. మన జీవనవిధానంపై సాంకేతిక అభివృద్ధి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా; దానికి తగినట్టే ఆలోచనాసరళులలో వచ్చిన మార్పుల ప్రభావం మాత్రం కనిపించడం లేదంటారు. ఉదారవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి భావనలను ఆధునిక సందర్భంనుంచి తప్పించి పురాతనకాలంనుంచీ ఉన్నవిగా భావించడంలోని పొరపాటును ఎత్తిచూపుతారు. అలాగే, చారిత్రిక పాశ్చాత్యానికీ, ఆధునిక పాశ్చాత్యానికీ తేడా గమనించకపోవడం కూడా మనలోని అనేక అయోమయాలకు కారణమంటారు. వలసదేశాలకు విముక్తి కలిగించినమేరకు జాతీయవాదం ఆహ్వానించదగినదే కానీ; భాష, జాతి, మతం వంటివి దానికి ఆధారం కాకూడదంటారు. పెట్టుబడిదారీ విధానం నుంచి సంక్షేమరాజ్యం ఎలా అవతరించిందో, కమ్యూనిజానికి సోషలిజానికి ఉన్న తేడా ఎలాంటిదో ఆయన వివరించిన తీరు ఆసక్తికరమే కాక; ఎంతో అవగాహనాకరంగా ఉంటుంది. నేటి అనేక సవాళ్ళకు మూలాలు, మన వ్యావసాయిక గతంలో ఉన్నాయనీ, పారిశ్రామికవిప్లవం ఆవిష్కరించిన సాంకేతిక అద్భుతాలతో, వ్యావసాయికదశకు చెందిన కరడుగట్టిన మన మనస్తత్వం తులతూగలేకపోవడమే అసలు సమస్య అనీ ఆయన చేసిన నిర్ధారణ చారిత్రికకోణం నుంచి మరింత ఆసక్తినీ, ఆలోచననూ కలిగిస్తుంది. గాంధీ–నెహ్రూ–అంబేడ్కర్ల భావధార సన్నగిల్లుతున్నదనీ, భావజాలాలకు ప్రాధాన్యం అడుగంటిందనీ భావించే కాలంలో వెలువడడం ఆయన పుస్తకానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పిస్తూనే, ఒక శకం అంతరించిందన్న స్ఫురణ కలిగిస్తుంది. రచయితలే కానీ, రాజకీయనాయకులే కానీ తమ భావజాల పాక్షికతను ప్రకటించుకుని తీరాలంటూ తనను ప్రగతిశీల ఉదారవాదిగా, లేదా సామాజిక ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకున్న జైపాల్ రెడ్డి అంతర్జాతీయవాదిగానూ తనను ఎలుగెత్తి చాటుకుంటారు. మతతత్వరాజకీయాలతో ఎప్పటికీ రాజీపడని ఒక నిబద్ధుడు ఆయనలో చివరివరకూ ఉన్నాడు. తన పుస్తకం తెలుగు అనువాదం అచ్చుప్రతిని చూడకుండానే ఆయన కన్ను మూయడం కుటుంబసభ్యులకూ, అనువాదకునిగా నాకూ కూడా తీరని వెలితి, తీవ్ర బాధాకరం. కల్లూరి భాస్కరం వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
జైపాల్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా వీడ్కో లు పలికారు. సోమవారం ఉదయం ఆయన నివా సం నుంచి పార్థివదేహాన్ని 12:20 గంటల సమయం లో గాంధీభవన్‌కు తీసుకువచ్చారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన వేదికపై భౌతికకాయాన్ని ఉంచి పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఏఐసీసీ పక్షాన రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, మాజీ లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ సభ్యుడు పీసీ చాకో, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా తదితరులు జైపాల్ భౌతిక కాయం పై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గూడూరు నారాయణరెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీనివాస కృష్ణన్, జగ్గారెడ్డి, సీతక్క, వి.హనుమంతరావు, మధు యాష్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు నగేశ్, ఈరవత్రి అనిల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎమ్మార్జీ వినోద్‌రెడ్డి, బొల్లు కిషన్, కుమార్‌రావు తదితరులు జైపాల్ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గాంధీభవన్‌కు వచ్చిన ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ తనకు జైపాల్‌తో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ఆయనతో పరిచయం ఉందని, యునైటెడ్ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటులో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. అరుదైన రాజకీయ నాయకుల్లో జైపాల్ ఒకరని, ఆయన ఆకస్మిక మరణం తనను చాలా బాధించిం దని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నెక్లెస్‌రోడ్డులో జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు. సెక్యులర్ అంటే గుర్తొస్తారు: ఆజాద్ జైపాల్‌రెడ్డితో తనకు దశాబ్దాల పరిచయం ఉందని, ఇద్దరం వేరే పార్టీల్లో ఉన్నా మంచి మిత్రులుగా ఉన్నామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. సెక్యులర్ అంటే మొదట గుర్తొచ్చేది జైపాల్ రెడ్డేనని, సెక్యులరిజం, సోషలిజం మార్గంలో నడవడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. జైపాల్ ఉత్తమ పార్లమెంటేరియన్, బహుభాషా కోవిదుడని, ఏ శాఖ మంత్రిగా అయినా నిజాయతీతో పనిచేశారన్నారు. మన్మోహన్ మెచ్చిన నేత: ఖర్గే జైపాల్‌తో తనకు 1963 నుంచి పరిచయం ఉందని, తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే జైపాల్ తనకు తెలుసునని లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. మన్మోహన్సింగ్ మెచ్చిన నేత జైపాల్‌రెడ్డి అని, ఆయన మాట్లాడుతుంటే డిక్షనరీలు వెతుక్కునే వారమన్నారు. రాజ్యసభ సభ్యుడు చాకో మాట్లాడుతూ జైపాల్ రెడ్డితో కలిసి పనిచేశానని, నిబద్ధత, నిజాయతీకి ఆయన మారుపేరని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాట్లాడుతూ సోషలిజం, సెక్యులరిజంలకు జైపాల్ చాంపియన్ అని కొనియాడారు. కాంగ్రె స్ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భూమి పుత్రుడు జైపాల్‌రెడ్డి దేశరాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు. ఇక సెలవ్ సాక్షి, హైదరాబాద్ : సాగర తీరం శోకసంద్రమైం ది. తమ ప్రియతమ నేతకు వీడ్కోలు పలికేందు కు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చా రు. వీరందరి అశ్రునయనా ల సమక్షంలో.. నెక్లెస్‌రోడ్డు లోని పీవీ ఘాట్‌లో సోమ వారం మధ్యాహ్నం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాల తో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు జైపాల్‌రెడ్డి పెద్ద కొడుకు అరవింద్‌రెడ్డి చితికి నిప్పంటించారు. కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్.. జైపాల్ రెడ్డి భౌతికకాయా న్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భారీ ర్యాలీగా అంతిమ యాత్ర అంతకుముందు ఉదయం అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఆయన నివాసం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీల నేతలు, అభిమానుల మధ్య అంతిమయా త్ర ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర గాంధీభవన్‌కు చేరుకుంది. హోంమంత్రి మహమూద్ అలీ, స్పీక ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు జగదీ‹ష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల, నాగం జనార్దన్‌రెడ్డి, మల్లు రవి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాయిని, మధుయాష్కీ గౌడ్, గండ్ర వెంకట రమణారెడ్డి, నేతి విద్యాసాగర్, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. నివాళులు అర్పించిన ప్రముఖులు కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, మంత్రి తల సాని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ డీ ఎస్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేశవరావు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, గద్దర్ సహా పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన రాజ్యసభ సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డికి రాజ్యసభ నివాళులర్పించింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు జైపాల్‌రెడ్డి మరణంపై సంతాప ప్రకటన చేశారు. ‘ఈ సభ మాజీ సభ్యుడు ఎస్.జైపాల్‌రెడ్డి తన 77వ ఏట నిన్న ఉదయం మరణించారు. ఆయన మరణంతో దేశం ఒక సీనియర్ పార్లమెంటేరియన్‌ను, ఒక అత్యుత్తమ వక్తను, సమర్థవంతుడైన అడ్మినిస్ట్రేటర్‌ను కోల్పోయింది. ఏపీ అసెంబ్లీలో రెండు పర్యాయాలు ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఒకే బెంచిలో కూర్చునేవాళ్లం. ప్రజాసంబంధ అంశాలపై ఎవరి మార్గంలో వాళ్లం వాదించేవాళ్లం. నాలుగు దశాబ్దాలుగా ఆయన నాకు స్నేహితుడు. ఆయన కంటే నేను ఆరేళ్లు చిన్నవాడిని. అందువల్ల ఆయన అనేక సందర్భాల్లో నాకు మార్గదర్శనం చేసేవారు. జైపాల్ రెడ్డి మరణానికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం..’అని చైర్మన్ అన్నారు. జైపాల్‌రెడ్డి మరణానికి సంతాపం తెలిపేం దుకు సభ్యులు లేచి మౌనం పాటించారు. -
గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు కొనియాడారు. జైపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. గాంధీభవన్‌లో జైపాల్‌కు ఘన నివాళి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులు జైపాల్ రెడ్డికి ఘనంగా అంజలి ఘటించారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ...‘జైపాల్‌రెడ్డి మన మధ్య లేరు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అన్నారు. మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1964 నుంచి జైపాల్ రెడ్డి తనకు తెలుసునని, విద్యార్థి దశ నుంచే పరిచయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. కాగా ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌లోని జైపాల్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అనారోగ్యంతో ఆయన ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. -
ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు...
సాక్షి, సిటీబ్యూరో: ఆయన పేరు వింటేనే అప్పట్లో క్రేజ్.. ఆయన చెప్పే మాటలు వింటే ఇక మహాజోష్. ఇక్కడి నుండే స్టూడెంట్ లీడర్‌గా తన రాజకీయ తొలి అడుగులేసి, నగరం నుండే చివరి సారి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన సూదిని జైపాల్‌రెడ్డికి మహానగరంతో అరవై ఏళ్ల అనుబంధం. 1960లో నిజాం కాలేజీలో చేరిన జైపాల్‌రెడ్డి స్టూడెంట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ తొలి అధ్యక్షునిగా ఎన్నికై పలు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి నాయకునిగా విషయ పరిజ్ఞానం, ఆకట్టుకునే ప్రసంగంతో తక్కువ సమయంలోనే మాస్ ఆండ్ క్లాస్ స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిపోయారు. ఉస్మానియా పరిధిలోని అన్ని కళాశాలతో కలిపి జరిగిన తొలి ఎన్నికల్లోనే జైపాల్‌రెడ్డి అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో విజయం సాధించి దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. నిజాం కాలేజీ నుంచి మొదలైన జైపాల్‌రెడ్డి ప్రస్థానం అనేక మలుపులు, ఒడిదొడుకుల మధ్య తిరిగి 2009లో మహానగరానికే చేరింది. 2009లో చేవెళ్ల లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలవటంతో జైపాల్‌రెడ్డిని తొలిసారిగా నాయకుడిని చేసిన రికార్డు నిజాం కాలేజీకి చెందితే, చివరి సారి ఎంపీ చేసే అవకాశం సైతం నగరప్రాంతంలో కలిసిపోయిన చేవెళ్ల లోక్‌సభలో చోటు చేసుకోవటం విశేషం. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైల్‌కు కావాల్సిన అనుమతులన్నీ జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చకచకా ఇచ్చేశారు. ఓయూలో.. జైపాల్ తార్నాక: ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఆయన 1964లో ఎంఏ ఇంగ్లీష్‌లో చేరారు. ఆ తరువాత 1966–67లో బ్యాచ్‌లర్ ఆఫ్ జర్నలిజం కోర్సులో చేశారు. ఓయూలో చదువుతున్న రోజుల్లో బి–హాస్టల్లో ఉండేవారు. ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు... ఆరోజుల్లో ఓయూకు చాలా సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే వచ్చేవారు. అయితే అప్పట్లో ఓయూ క్యాంపస్‌లో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో జైపాల్‌రెడ్డి ఒకరుగా చెప్పవచ్చు. అయితే అందరితో పోలిస్తే ఆయన తీరువేరు. ఆయన మాట్లాడే భాష, అందులో వాడే పదాలు ఒక్కోసారి అధ్యాపకులనే తికమకపెట్టించేవి అని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. చురుకైన లీడర్.. జైపాల్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాలంలో ఆయన ఎన్ఎస్యూఐలో పనిచేశారు. వర్సిటీలో చురుకైన లీడరుగా ఆయనకు పేరుంది. విద్యార్థుల సమస్యలపట్ల స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఆ రోజుల్లో వర్సిటీకి జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి పోటీచేసి రెండు పర్యాయాలు ఓయూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేశారు. బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి ... 1969లో జరిగిన ఓయూలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం వహించగా, జైపాల్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అనుచరుడిగా కొనసాగారు. అప్పుడు తెలంగాణ జనసమితి చేస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతునివ్వలేదంటారు. బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా ఉంటూ యూత్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన తరువాత 1969లో కల్వకుర్తి నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఓయూనుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ చివరకు పార్లమెంటు వరకు తీసుకువెళ్లింది. బెస్ట్పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన మొదటి ఓయూ పూర్వవిద్యార్థిగా ఆయనకు పేరుంది. జర్నలిజం విభాగంతో అనుబంధం.. జైపాల్‌రెడ్డికి ఓయూ జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి ఆయన ఓయూ జర్నలిజం విభాగానికి వచ్చేవారని పలువురు అ«ధ్యాపకులు పేర్కొన్నారు. ఓయూ జర్నలిజం విభాగంలో జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు ఆయన హాజరయ్యేవారు. ఆయన పలుమార్లు జర్నలిజం విద్యార్థులకు గెస్ట్లెక్చర్ కూడా ఇచ్చారు. శతాబ్ది ఉత్సవాలకు హాజరు.. ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు. శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్బంగా జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆంగ్లంలో చేసిన ప్రసంగం, తాను ఓయూలో గడిపిన రోజుల గురించి మాట్లాడిన మాటలు ఉత్తేజపరిచాయి. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు ఆయనను స్పూర్తిగా తీసుకున్నారు. ఆయనతో విడదీయరాని అనుబంధం జైపాల్‌రెడ్డి నాకు ఐదేళ్లు సీనియర్.. ఆరోజుల్లో వర్సిటీలో ఇంగ్లీష్ మాట్లాడే అతికొద్ది మంది విద్యార్థుల్లో జైపాల్‌రెడ్డి ప్రముఖమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఆంగ్లభాషపై ఆయనకు మంచి పట్టు ఉండేది. అధికారులతో ఇంగ్లీష్‌లో అనర్గళంగా వాదించేవారు. ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తిచేశాక వెంటనే జర్నలిజం కోర్సులో చేరారు.జర్నలిజం విభాగం తొలి బ్యాచ్ విద్యార్థి. ఆయనకు జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. తీరిక దొరికితే జర్నలిజం లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివేవారు. నేను అధ్యాపకుడిగా ఉన్న కాలంలో మూడు సార్లు ఆయన జర్నలిజం విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇచ్చి వారిలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిన మహానుభావుడు. –ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, జర్నలిజం మాజీ అధ్యాపకులు ఓయూ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా ఉండి అసెంబ్లీకి.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌రెడ్డి 1969లో జరిగిన ఎన్నికల్లో ఓయూ నుంచే నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. రెండు పర్యాయాలు ఓయూ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఆయన భాష, మాట్లాడే తీరు అందరినీ కట్టిపడేసేవి. విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్రపోషించే వారు. –ప్రొఫెసర్ కృష్ణారావు, ఓఎస్డీ ఓయూ అందరికీ ఒక రోల్ మోడల్.. జైపాల్‌రెడ్డి అంటే అప్పుడూ...ఇప్పుడూ అందరికీ ఒక రోల్ మోడల్‌గా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజకీయ వేత్తగా ఎదిగిన గొప్ప నాయకుడు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తన భాషతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఉస్మానియా యూనివర్సిటీకే పేరు ప్రఖ్యాతులు తెచ్చారు.జైపాల్‌రెడ్డి లాంటి మేధావి, సమస్యలపై స్పందించే గొప్పవ్యక్తి ఈరోజుల్లో కనిపించరు.–ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షులు -
ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్’ చెరగని ముద్ర
సాక్షి, మిర్యాలగూడ : ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డితో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎనలేని అనుబంధం ఉంది. ఆయన మృతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా నుంచి ఎన్నికై పదేళ్ల పాటు జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వెంటనే మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. యూపీఏ– 1లో జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దేశంలోని కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సమాచార, సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మంత్రిగా పని చేశారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అయినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతోనూ ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. జైపాల్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు సూదిని జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీలకు భూగర్భ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అదే విధంగా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి విస్తరణకు కృషి చేశారు. విష్ణుపురం–జగ్గయ్యపేట రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీల్లో నాళాల ఆధునికీకరణ పనులకు నిధులు విడుదల చేశారు. 65వ జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణకు కృషి చేశారు. మిర్యాలగూడకు చివరి ఎంపీ.. మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గానికి జైపాల్‌రెడ్డి చివరి ఎంపీగా పని చేశారు. మిర్యాలగూడ పార్లమెంట్ 1962లో ఏర్పడగా 1999, 2004లో జైపాల్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. కాగా 2008లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని తొలగించారు. దాంతో మిర్యాలగూడకు ఆయన చివరి ఎంపీగా పని చేసిన వారుగా మిగిలిపోయారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం తాళ్లగడ్డ ( సూర్యాపేట ) : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి మృతికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో జైపాల్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి ఓనమాలు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాల చండూరు : సూదిని జైపాల్‌రెడ్డికి చండూరు మండలంలోని నెర్మటతో విడదీయరాని అనుబంధం ఉంది. గ్రామానికి చెం దిన బాణాల క్రిష్ణారెడ్డి, వెంకనర్సమ్మల మనుమడు సూదిన జైపాల్‌రెడ్డి. 1942 జనవరి 16న నెర్మటలోని అమ్మమ్మ ఇంట్లో జైపాల్‌రెడ్డి జన్మించాడు. నాలుగేళ్లు నిండిన తర్వాత స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్షరాలు నేర్చుకునే స మయంలో తండ్రి దుర్గారెడ్డి దేవరకొండ పాఠశాలలో చేర్పిం చినట్లు జైపాల్‌రెడ్డి బావమర్ది బాణాల నర్సిరెడ్డి చెప్పారు. జైపాల్‌రెడ్డి తండ్రి దుర్గారెడ్డి చాలా ఏళ్లు నెర్మటలో రైతులకు వర్తకాలు పెట్టేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. జైపాల్‌రెడ్డి మృతి తీరని లోటు -గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా, రాజకీయంగా తీరని లోటని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. చురుకైన ఆలోచన, మంచి వాగ్ధాటిగా పేరు తెచ్చుకొన్ని గొప్ప వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి చేసిన కృషి మరువులేనిదన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంతో మంది నాయకులకు జైపాల్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అయన మృతి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జైపాల్‌రెడ్డి ఇక లేరు..
అలుపెరగని రాజకీయ యోధుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి (77) కన్నుమూయడంతో ఆ పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జాతీయ రాజకీయాల్లో విశిష్ట గుర్తింపు పొందిన ఈయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై చెరగని ముద్ర వేసుకున్నారు. సుమారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలోని ప్రస్థానాన్ని జిల్లా నేతలు నెమరువేసుకున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జైపాల్‌రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో అదే పార్టీతో విభేదించి జనతా పార్టీలో చేరారు. తొలిసారిగా 1980లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరాగాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోనే చేరారు. జిల్లాపై చెరగని ముద్ర జాతీయ రాజకీయాల్లో విశిష్ట గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేసుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో స్థానిక సంస్థల నుంచి ఎంపీ వరకు ఏ ఎన్నికలయినా తాను నిశ్చయించుకున్న వారికే టిక్కెట్లు వచ్చేలా చక్రం తిప్పారు. తనను నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించారు. ఈ క్రమంలో నాలుగేళ్ల నుంచి సొంత పార్టీకి చెందిన జిల్లా నేతల నుంచే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే.. ఎంపీగా ఇక్కడ్నుంచే ప్రస్థానం సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగి.. కేంద్రంలోనూ తనదైన ముద్ర వేసుకున్న జైపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఉమ్మడి జిల్లా నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలిసారిగా 1969లో ఉమ్మడి జిల్లా పరిధిలోని కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన అప్పటి ఎస్.ఎస్.పి. అభ్యర్ధి బి.ఎస్.రెడ్డిపై 4,178 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించిన జైపాల్‌రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన ఇతర సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో 1984లో జనతా పార్టీ నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్‌పై 80,103 ఓట్లతో గెలిచారు. ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన జైపాల్‌రెడ్డి ఈ ఏడాది మార్చి 25న.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. అనారోగ్యం.. పై బడ్డ వయస్సే తన ఈ నిర్ణయానికి కారణమన్నారు. ఈ ప్రకటన.. కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 1965 నుంచి 2009 వరకు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మాడ్గుల (ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలిసింది) కు చెందిన సూదిని జైపాల్‌రెడ్డి.. 1942 జనవరి 16న అమ్మమ్మ ఊరైన నల్లగొండ జిల్లా చందూరు మండలం నెరమెట్టలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాపుచ్చుకున్న ఆయన విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారు. రెండుసార్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965 నుంచి 71 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1969–72 పీసీసీ జనరల్ సెక్రటరీగా, 1969–83 వరకు వరుసగా నాలుగుసార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలుపొందారు. 1990–98 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991–92 జూన్‌లో రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. 1999–2000లో సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి చైర్మన్‌గా సేవలందించారు. 1999, 2004లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2005 వరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా, 2006లో పట్టణాభివద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో చేవేళ్ల నుంచి ఎంపీ గెలుపొంది కేంద్రపట్టణాభివద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన జైపాల్‌రెడ్డి దక్షిణ భారతదేశంలోని యువ పార్లమెంటేరియన్లలో ప్రథముడిగా గుర్తింపు పొందారు. ఐకె గుజ్రాల్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. మన్మోహన్సింగ్ హయాంలో పెట్రోలియం, కేంద్ర పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖలకు మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర జైపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. అదే సమయంలో ఆంధ్రాలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించిన అధిష్టానం అదే నెల 24న తెలంగాణ ఏర్పాటు ప్రకటనను ఉపసంహరించుకుంది. దీంతో ఇక్కడా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉద్యమకారులు దాడులకు దిగారు. అధిష్టానం తీసుకున్న యూ టర్న్ నిర్ణయంపై కలతచెందిన జైపాల్‌రెడ్డి రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉన్న హోదాలో తెలంగాణ ఎంపీలందరితో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు నిర్వహించారు. అధిష్టానానికి తెలంగాణవాదం బలంగా వినిపించేలా కృషి చేశారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను సోనియాగాంధీకి వివరించి చివరకు ప్రకటన చేయించుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు తొలి సీఎం జైపాల్‌రెడ్డి అని కాంగ్రెస్‌లో జోరుగా చర్చలు కొనసాగాయి. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. ఈ ఏడాది మార్చి 25న ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికారు. -
20వ తేదీ రాత్రి ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్ : జైపాల్‌రెడ్డి ఆకస్మిక మర ణం ఆయన కుటుంబ సభ్యుల్ని, సన్నిహితులు, అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కలిచివేసింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా జ్వరం బారిన పడటం, అది కాస్త తీవ్రమై వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించడం అంతా కలలాగే ఉం దని ఆయన సన్నిహితులంటున్నారు. శనివారం 20వ తేదీ మధ్యాహ్నం తనకు జ్వరంగా ఉందని జైపాల్‌రెడ్డి ఇంట్లో వారికి చెప్పాడు. ఆ సమయంలో జైపాల్‌రెడ్డి అల్లుడు (కూతురి భర్త) డాక్టర్ ఆనంద్ అక్కడే ఉన్నాడు. జైపాల్ రెడ్డిని పరిశీలించిన ఆయన జ్వరం తగ్గేందుకు మాత్ర ఇచ్చారు. దాంతో జ్వరం తగ్గినట్లే తగ్గినా.. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎక్కువైంది. దీంతో అల్లుడు ఆనంద్, పెద్దకుమారుడు అరవింద్‌రెడ్డి హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏషియయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రికి తరలించారు. చదవండి: జైపాల్‌రెడ్డి ఇక లేరు.. ఆదివారం నాటికి జైపాల్‌రెడ్డికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దాంతో వైద్యులు ఆయన్ను ఆదివారం రాత్రి ఐసీయూకి మార్చారు. గుండె కొట్టుకునే రేటు నెమ్మదిగా ఉండటంతో వెంట నే వెంటిలేటర్ అమర్చారు. ఇదే సమయంలో ఆయనకు నిమోనియా అటాక్ అయింది. రెండురోజుల తర్వాత ఊపిరితిత్తుల్లో నీళ్లున్నాయ ని గుర్తించిన వైద్యులు చికిత్సనందించారు. గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయి. వీటికి చికిత్స జరుగుతుండగానే.. ఈ సమస్యలకు కాస్త ముదిరి శనివారం రాత్రి (ఆదివారం తెల్లవారుజామున) 1.08 నిమిషాలకు జైపాల్‌రెడ్డి కన్నుమూసారు. 20 ఏళ్లుగా ఓఎస్డీ, డ్రైవర్లు కీలకం జైపాల్‌రెడ్డి జీవితంలో కుటుంబ సభ్యులు కాకుండా ఇద్దరు వ్యక్తులు రెండు దశాబ్దాలుగా ఆయనతోనే ఉన్నారు. ఒకరు ఓఎస్డీ వెంకటరామిరెడ్డి, రెండో వ్యక్తి కారు డ్రైవర్ పాషా. వీరిద్ద రూ 20 ఏళ్లకుపైగా జైపాల్‌రెడ్డి వద్దే పనిచేస్తున్నారు. వెంకటరామిరెడ్డి.. జైపాల్‌రెడ్డికి వీరాభిమాని, శ్రేయోభిలాషి, వీరిద్దరిది గురుశిష్యుల అనుబంధమని సన్నిహితులు చెబుతారు. 1999లో ఆయన వద్ద వీరిద్దరూ చేరారు. అప్ప టి నుంచి ఆదివారం తుదిశ్వాస విడిచేవరకు వీరిద్దరూ జైపాల్‌రెడ్డి వెన్నంటే ఉన్నారు. ఆయనో స్టేట్స్‌మన్: నరసింహారెడ్డి జైపాల్‌రెడ్డి స్వా ర్థం లేని, ముక్కుసూటి మనిషని ఆయన సన్నిహితుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పి.నరసింహారెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి తో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. జైపాల్‌రెడ్డి దేశప్రయోజనాల గురించే ఆలోచించేవారని నరసింహారెడ్డి అన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. రిలయన్స్ కంపెనీ నుంచి రావాల్సిన వేల కోట్ల రూ పాయల బకాయిలను చెల్లించాల్సిందేనంటూ నోటీసులు పంపే విషయంలో జైపాల్‌రెడ్డి ఏమాత్రం సం శయించలేదని గుర్తుచేశారు. ఈ నిర్ణయం సంచనలమై ఆ తర్వాత వివా దం రేపి ఆయన మంత్రిత్వ శాఖ మార్పుకు కారణమైనప్పటికీ.. జైపా ల్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదన్నా రు. తెలంగాణ ఉద్య మ సమయంలో ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన స్థానంలో వేరేవరున్నా.. సీఎం కుర్చీపై ఆశతో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షల్ని తాకట్టు పెట్టి ఉండేవారన్నారు. నిత్యం ప్రజలు, ప్రజాస్వామ్య విలువల గురించే పరితపించే మహనీయుడని ప్రశంసించారు. ఎమర్జెన్సీలో పార్టీని వీడినా.. 1999లో మతశక్తులు బలపడటాన్ని చూసి సెక్యులర్ భావజాల పరిరక్షణకు ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారని వెల్లడించారు. పార్టీ, దేశప్రయోజనాలకోసం నిజాయతీగా పనిచేసిన సైనికుడని నరసింహారెడ్డి కొనియాడారు. మధ్యలోనే ఆగిన జీవిత చరిత్ర! జైపాల్‌రెడ్డి రాజకీయ చాణక్యుడు, నడిచే గ్రంథాలయంగా మిత్రులు, సన్నిహితులు అభివర్ణిస్తారు. ఈ విషయం పలుమార్లు పార్లమెంటు వేదికగా ఆయన నిరూపించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా జైపాల్ రెడ్డి సామర్థ్యాన్ని ప్రశంసించేవారు. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన జైపాల్‌రెడ్డి మంచి రచయిత కూడా. ఆయన తన రాజకీయ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలని ‘టెన్ ఐడియాలజీస్’అనే శీర్షికతో పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం అమేజాన్‌లో అందుబాటులో ఉంది. కొద్దికాలం క్రితమే ఆయన జీవిత చరిత్ర మొదలుపెట్టినట్లు సమాచారం. దురదృష్టవశాత్తూ ఈ పుస్తకం మధ్యలో ఉండగానే ఆయన కన్నుమూసారు. అదే చివరి రాజకీయ కార్యక్రమం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘటనలకు సాక్షీభూతంగా నిలిచిన జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో తన చివరి రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జూన్ 8,9 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ఇదే ఆయన చివరి రాజకీయ కార్యక్రమం. -
ఆ పుస్తకం.. ఆయన ఆలోచన
సాక్షి, హైదరాబాద్: ‘టెన్ ఐడియాలజీస్ ద గ్రేట్ అసిమెట్రీ బెట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజం’అనే పుస్తకం ద్వారా జైపాల్‌రెడ్డి తన ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రతిష్టాత్మకమైన పుస్తకం. పాత, కొత్త తరం రాజకీయాల్లో మునిగి ఉన్న నాయకుడు రచించినది. కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన సుదీర్ఘ అనుభవం పొందారు. ఒక సైద్ధాంతిక భావజాలం ఉన్న నాయకుడు జైపాల్‌రెడ్డి. ఆయన తన పుస్తకం ముందుమాటలో ’ఇటీవలి దశాబ్దాల్లో సైద్ధాంతిక చర్చలు మరుగునపడ్డాయి. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది’అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పునరుజ్జీవనం, మానవతావాదం, సంస్కరణలు, శాస్త్రీయ విప్లవం అనే 4 గొప్ప ఉద్యమాలు ఏయే దేశాలను ఎలా తీర్చిదిద్దాయో పుస్తకంలో విశదీకరించారు. అందులో భాగంగా పది భావజాలాలను ఆయన నొక్కిచెప్పారు. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, పరిణామాత్మక సోషలిజం, విప్లవాత్మక సోషలిజం, స్త్రీ వాదం, పర్యావరణ వాదం, అణు, శాంతి వాదం, ప్రపంచ వాదం వీటిపై తన అభిప్రాయాలను తెలిపారు. పారిశ్రామిక విధానం ఎలా వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిందో వివరించారు. జాతీయ వాదంపై రాసిన అధ్యాయంలో భారతదేశం ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ దేశాల సాంస్కృతిక, మత, భాష, జాతి, భౌగోళిక లేదా సామ్రాజ్య భావాలతో పురాతన కాలం నుంచీ మమేకమైపోయారని రాశారు. కాబట్టి పాత సాంస్కృతిక భావనలను ప్రస్తుత రాజకీయ ఆలోచనల నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకుంది జైపాలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) చేయాలన్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల డిమాండ్‌కు అడ్డుగోడగా నిలబడి దాన్ని అడ్డుకోవడంలో ఎస్.జైపాల్‌రెడ్డి పాత్ర మరువలేనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలు పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ– 2013 బిల్లును అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపేందుకు సమావేశమైన సందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. సీమాంధ్ర ప్రజలకు పూర్తిరక్షణ కవచంగా ఉంటామని జైపాల్ ఇచ్చిన ధీమాతో కేబినెట్ వెనక్కి తగ్గి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని యూటీగా ప్రకటిస్తే ఇబ్బంది ఉండదని అన్నారు. దీన్ని కేబినెట్లో ఉన్న ఒకే ఒక్క తెలంగాణ మంత్రి జైపాల్‌రెడ్డి తీవ్రంగా అడ్డుకున్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కుల మేరకు హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు రక్షణ ఉంటుంద న్నారు. యూటీ అవసరం లేకుండానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేర్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్(3) అధికరణ కేంద్రానికి సర్వాధికారాలను కల్పిస్తోందని చెప్పారు. జైపాల్ వాదనలతో ఏకీభవించిన కేబినెట్ యూటీకి మద్దతివ్వలేదు. -
ఓ ప్రజాస్వామ్యవాది అలుపెరుగని ప్రస్థానం
తనను తాను రాజకీయ మేరునగధీరుడిగా మలచుకున్న కృషీవలుడు జైపాల్‌రెడ్డి. దేశం గర్వించదగ్గ పార్లమెంటరీ నాయకుడిగా భారత రాజకీయాలపై ఆయనొక బలమైన ముద్ర. సమకాలీన రాజకీయాలు–మేధావిత్వాన్ని జతకలిపి ఆలోచించిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు గుర్తుకు రావాల్సిందే! ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమా సిద్ధాంతాలు, విలువల్లో రాజీపడకుండా ఓ సంపూర్ణ, సంతృప్తికర జీవితం గడిపారాయన. జైపాల్‌రెడ్డి ఎదుగుదలకు ఉపకరించిన అంశాలెన్నో ఉన్నా.. ప్రాథమికంగా ఆయన బలమైన ‘ప్రజాస్వామికవాది’కావడమే ఎదుగుదలకు ప్రధాన కారణం. ఇది మామూలు సందర్భాల్లోకన్నా సంక్లిష్ట సమయాల్లోనే ఎక్కువగా వెల్లడైంది. కాంగ్రెస్‌లో ఎదుగుదల, ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్‌ను వీడటం, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం, జనతాపార్టీలో చేరడం తిరిగి కాంగ్రెస్ గూటికి రావడం.. వరించి వచ్చిన పదవుల్నీ తృణప్రాయంగా నిరాకరించడం.. ఇలా ఏ పరిణామాన్ని తీసుకున్నా తన మౌలిక రాజకీయ సిద్ధాంత బలమే ఆయన్ని నడిపింది. అంతకుమించి ఆయన్ని నిరూపించింది. అందుకే, ఆయన్ని గమనిస్తున్న ఓ తరం రాజకీయ నేతలు, పరిశీలకులు ‘ఒక శకం ముగిసినట్టే’అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో వ్యక్తి అటువంటి రాజకీయ జీవితం గడపడం అసాధ్యమంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా విశ్వసించడమే కాకుండా దాని చుట్టే తన రాజకీయ మనుగడని అల్లుకొని, విలువల్ని వీడకుండా, అవకాశాల్ని వినియోగించుకుంటూ పైకెదిగిన నేత జైపాల్‌రెడ్డి. శారీరక వైకల్యం శాశ్వతమని గ్రహించిన క్రమంలోనే ఇతరులకన్నా తనని కాస్త విభిన్నంగా ఉంచగలిగిందేమిటనేదే ఆయనలోని మొదటి సంఘర్షణ. తెలివి, విజ్ఞానం కొంతమేర తన అవకాశాల్ని మెరుగుపరుస్తుందని విద్యార్థి దశలోనే నిర్ణయించుకొని, అందుకోసం ప్రత్యేకంగా కృషిచేశానని ఆయనే చెప్పేవారు. రేయింబవళ్లు విస్తృతంగా చదివేవారు. ఇంగ్లీష్‌పై మక్కువతో ఎమ్మే ఇంగ్లీష్ చదివినా, రాజకీయాలపై ఆసక్తితో చరిత్ర–రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసినా.. ఆ క్రమంలో తనకు తత్వశాస్త్రంపై మోజు పెరిగిందనేవారు. ఇటీవల ఆయన వెలువరించిన ‘టెన్ ఐడియాలజీస్’ఒక గొప్ప తత్వశాస్త్ర గని. తనకున్న సహజనాయకత్వ లక్షణాలకు విద్యార్థి దశలోనే పదునుపెట్టి భవిష్యత్ రాజకీయ మనుగడకు బాటలు వేసుకున్నారు. పీయూసీ చదివే రోజుల్లో, నిజాం కాలేజీ విద్యార్థిగా తెలివితేటలు పెంచుకోవడం, వీటిని ప్రదర్శించడం మొదలైంది. ఇతర కాలేజీల నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు కేవలం ఆయన ప్రసంగాల్లోని భాషా పటిమ, బలమైన భావాలు, పదునైన వ్యక్తీకరణ కోసమే నిజాం కాలేజీకి వచ్చేవారు. వేదికల మీద, కింద కూడా వక్తగా ఆయనొక ప్రభావశాలి! ఆయన ఎప్పుడు రెడ్డి హాస్టల్ సందర్శించినా.. అదొక చర్చావేదికయ్యేది. రహస్యమెరిగిన నిపుణుడు పార్లమెంటరీ ప్రసంగ నైపుణ్యమెరిగిన వాడు కనుకే సభ లోపలా, బయటా అధికుల్ని ఆకట్టుకునేలా జైపాల్‌రెడ్డి మాట్లాడేవారు. వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో ఒక ఓటు తేడాతో కూలిపోవడానికి ముందు, విపక్షం తరపున ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రసారమాధ్యమాలు ఆకాశానికెత్తాయి. ‘రాజ్యాంగ నిర్మాణ సభ’లో జరిగిన విస్తృత చర్చల్ని క్షుణ్ణంగా చదివేవారు. అందుకే, ఏదైనా అంశం సభలో వివాదాస్పదమైనపుడు, సదరు అంశానికి మూలాలు రాజ్యాంగంలో ఎక్కడున్నాయి? ఎందుకు? ఎలా పొందుపరిచారు? అప్పుడు ఏమనుకున్నారు? ఉటంకిస్తూ.. అదెలా తప్పో, ఒప్పో చెప్పే వారు. ఆయన ప్రసంగాలు సూటిగా, అతి ప్రభావవంతంగా ఉంటా యే తప్ప సుదీర్ఘంగా ఉండవు. దక్షిణాది నుంచి తొలి ఉత్తమపార్లమెంటేరియన్‌గా అవార్డు దక్కినపుడు, ఇంగ్లీష్ దినపత్రిక దిహిందూ ‘దేశంలోనే అత్యుత్తమ రాజకీయ పదసముచ్ఛయ కర్త’అని రాయడం ఆయనకు నిజమైన ప్రశంస. పదాల ఉచ్ఛరణ (ఫొనెటిక్స్) పైనా తగు అధ్యయనంతో ఆయన వాడే కొన్ని ఆంగ్ల పదాలకు చట్టసభ లేఖకులు, నేతలు, చివరకు జర్నలిస్టులు డిక్షనరీలు వెతకాల్సి వచ్చేది. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ దీన్ని సభలోనే అంగీకరించారు. జర్నలిస్టుల్లో అత్యధికులు ఆయనకు ఆత్మీయులు. ఢిల్లీలో ఏటా ఓరోజు జర్నలిస్టులకు విందు ఇచ్చేవారు. తరచూ నియోజకవర్గాలు మారుతారు అనే విమర్శను సున్నితంగా తిప్పికొడుతూ, ‘నిజానికి మీడి యా నా స్థిర నియోజకవర్గం’అని ఛలోక్తి విసిరేవారు. సిద్ధాంతాలు, పార్టీ విధానాలు, రాజకీయ విలువలు, వాస్తవిక పరిస్థితులపై ఆసక్తిగా చర్చించే వారు కలిస్తే, సుదీర్ఘంగా ముచ్చటించడానికి ఇష్టపడేవారు. ఆయనతో అప్పుడప్పుడు భేటీ అయ్యే అవకాశం లభించిన వారిలో నేనొకడ్ని! తను రచించిన ‘టెన్ ఐడియాలజీస్’తొలి పలుకుల్లో ఓ ప్రస్తావన చేస్తూ, ‘గరిష్ట సంక్షేమం, కనీస యుద్ధకాంక్షను సాధించడమే రాజకీయ సిద్ధాంతాల అసలు లక్ష్యం’అన్నారు. ప్రజాస్వామ్యవాదమే పరమావధిగా సిద్దాంతాలు, విలువలు, మేధస్సు నడిపిన నేత జైపాల్‌రెడ్డి. చెదరని మనోధైర్యం శారీరక వైకల్యం ఉన్నా ఇతరరేతర నైపుణ్యాల్ని వృద్ధి చేసుకొని శారీరక లోపాల్ని అధిగమించవచ్చని నిరూపించిన జైపాల్‌రెడ్డి ఒక స్ఫూర్తిదాత! శరీర భౌతిక ధర్మాన్నే కాక అంతర్గత రసాయన ధర్మాల పట్లా ఆయనది లోతైన అవగాహన. దశాబ్దాలుగా తనలో భాగమై ఉన్న మధుమేహాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచేవారు. నిమోనియా తో బాధపడుతూ, పలురకాల ఇన్ఫెక్షన్లతో ఆహారం అరుగుదల క్షీణించిన చివరి రోజుల్లోనూ, ‘ఇక గుండె ఆగడం ఏ నిమిషమైనా జరగొచ్చు’అని కుటుంబీకులతో సాదాసీదాగా మాట్లాడిన నిబ్బ రత్వం ఆయనది. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. 1942లో జన్మించిన ఆయన, దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి బాలుడే అయినా, స్వాతంత్య్రానంతర తొలి దశకాల ఆదర్శ వాతావరణ ప్రభావం ఆయన ‘ప్రజాస్వామ్య’ఆలోచనా సరళిని ఆవిష్కరించింది. గాంధీ, రాజగోపాలచారి, నెహ్రూ తననెంతో ప్రభావితం చేశారని చెప్పేవారు. స్థిరమైన సిద్ధాంత బలం ఆయన ఆస్తి! ‘రచయితలు, రాజకీయ నేతలు తమ ఆస్తులు–అప్పుల వెల్లడి కన్నా తమ సిద్ధాంత వైరుధ్యాల్ని ప్రకటించడం ముఖ్యం’అనేవారు. కాంగ్రెస్‌లో కీలకస్థాయికి ఎదిగి, ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని వ్యతిరేకించి పార్టీని వీడిన సాహసం ఆయన సిద్ధాంత బలమే! సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ను, వారి అవినీతిని వ్యతిరేకిస్తూ దేశవిదేశాల్లో పెరుతెచ్చుకొని కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారేమని జర్నలిస్టులడిగిన ప్రశ్నకు సమాధానమే ఆయన నిబద్ధతకు నిదర్శనం. ‘జనతాదళ్ విచ్ఛిన్నమవడం వల్ల బీజేపీ బలపడుతోంది, అందుకే, ఇన్నేళ్లు నేను సంపాదించుకున్న వ్యక్తిగత పేరు–ప్రతిష్టల్ని కూడా పణంగా పెట్టి, నా సిద్ధాంతమైన లౌకికవాద పరిరక్షణ కోసం కాంగ్రెస్‌లో చేరాల్సివస్తోందన్నా’రు. ఎన్టీఆర్‌ను అక్రమం గా గద్దె దించినపుడు జరిగిన ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన, ‘ఇది ఎన్టీయార్ కోసం కాదు, ప్రజాతీర్పు వక్రీకరణకు గుణపాఠం, ప్రజాభిప్రాయానికి పట్టం’అని తన ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెల్లడించారు. - దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి -
అలుపెరగని రాజకీయ యోధుడు
సాక్షి, హైదరాబాద్: అలుపెరుగని రాజకీయ యోధుడు.. సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో కొనసాగుతూ.. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ తనదైన ముద్రవేసిన విలక్షణ నాయకుడు ఎస్ జైపాల్‌రెడ్డి. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఐదుసార్లు ఎంపీగా గెలుపొంది.. కేంద్రంలో కీలక మంత్రులు నిర్వహించిన జైపాల్‌రెడ్డి తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారు. నిజాయితీ, నిర్భీతిగల నాయకుడిగా, అవినీతి మరక అంటని సచ్ఛీలుడిగా జాతీయ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్ రెడ్డికి విశిష్ట గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన జైపాల్‌రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీతో విభేదించి జనతా పార్టీలో చేరారు. అనంతర కాలంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి.. అనేక పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని అంటారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా, నిరంతర కార్యశీలిగా, రాజకీయ దిగ్గజంగా పేరొందిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయిందని రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వ్యక్తమవుత్నునాయి. ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే రాజకీయంగా తెలంగాణలోని మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో ప్రత్యక్ష పరిచయాలున్న జైపాల్ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిట్రేచర్లో పట్టా పొందారు. విద్యార్థి దశనుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జైపాల్‌రెడ్డి.. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. ఆ సమయంలో 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జన్సీ అనంతరం 1980లో ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి జైపాల్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా.. ఇందిరకు దీటైన పోటీని ఇచ్చారు. అంతకుముందు 1969లో తొలిసారి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1998, 1999, 2004 2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1977లో కాంగ్రెస్‌ను వీడిన జైపాల్ తిరిగి 1999లో మళ్లీ అదే గూటికి చేరారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్సింగ్ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఉద్యమం ఉదృతం సాగుతున్న సమయంలో కేంద్రమంత్రిగా కీలక బాధ్యతల్లో జైపాల్.. కేంద్రంచే బిల్లును ఆమోదం పొందించుటలో కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో నేతలు తెలంగాణ ఏర్పాటుకు ఒప్పిండంలో సఫలమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. డీకేతో విభేదాలు.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. అవే ఆయన ప్రత్యక్షంగా పొల్గొన్న చివరి ఎన్నికలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీని నడిపించడంతో జైపాల్ ముందున్నారు. అయితే కాంగ్రెస్‌కు చావోరేవోగా మారిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీమంత్రి డీకే అరుణతో విభేదాలు పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చాయి. జిల్లాపై పట్టుకు ఇద్దరు నేతలు పోటీపడి.. ఉన్న కార్యకర్తలను దూరం చేసుకున్నారు. జైపాల్ కొంత వెనక్కి తగ్గినా.. ఎన్నికల అనంతరం డీకే కాంగ్రెస్‌ను వీడారు. కాగా దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొత్తం ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. -
హ్యాట్రిక్ విన్
సాక్షి,సిటీబ్యూరో: ఎంఐఎంకు కంచుకోటగా నిలిచిన హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత సలావుద్దీన్ ఒవైసీ, ఆయన తనయుడు అసదుద్దీన్ ఒవైసీ వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్‌సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ప్రత్యర్థులను మట్టికరిపించి,తిరుగులేని నేతలుగా రాణించారు. సలావుద్దీన్ ఒవైసీ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించి,డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ♦ సలావుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీని స్థాపించి నగరంలో అత్యంత ప్రభావితమైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ఎంఐఎం వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్దుల్ వాహెద్ ఒవైసీ తనయుడు సలావుద్దీన్ తండ్రికి రాజకీయ వారసుడిగా నిలిచారు. 1958 నుంచే నగర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగా రు. వాహెద్ మరణానంతరం ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1960లో తొలిసారి మల్లేపల్లి నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. 1962లో పత్తర్‌గట్టి, 1967లో యాకుత్‌పురా, 1972లో పత్తర్‌గట్టి అసెంబ్లీ స్థానాల నుంచి, 1978, 1983లలో చార్మినార్ నుంచి గెలిచారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 38.13 శాతం మెజారిటీతో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 1989 ఎన్నికల్లో 45.91 శాతం, 1991లో 46.18 శాతం మెజారిటీ సొంతం చేసుకున్నారు. 1996 ఎన్నికల్లో 34.57 శాతం, 1998లో 44.65 శాతం, 1999లో 44.36 శాతం మెజారిటీతో గెలిచారు. వరుసగా ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అనారోగ్యం కారణంగా 2004లో రాజకీయాలకు దూరమైన సలావుద్దీన్ 2008 సెప్టెంబర్‌లో మరణించారు. ♦ అసదుద్దీన్ ఒవైసీ సలావుద్దీన్ తర్వాత ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసదుద్దీన్ ఒవైసీ 1994 నుంచి వరుసగా మూడుసార్లు చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004లో తన తండ్రి సలావుద్దీన్ క్రియాశీలక రాజకీయాల కు దూరం కావడంతో హైదరాబాద్ పార్లమెంట్ సానం పోటీ చేసి విజయం సాధించారు. 2009లో అసద్‌ను ఓడించేందుకు టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలన్నీ ఏకమయ్యాయి. అసద్‌కు వ్యతిరేకంగా సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ ను బరిలోకి దింపాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొంది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హైదరాబాద్ ఎంపీగా తిరుగులేని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం నాలుగో పోటీకి సిద్ధమవుతున్నారు. ♦ సూదిని జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన సూదిని జైపాల్‌రెడ్డి అపర మేధావి. ఆయన పార్లమెంట్లో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాల్సిన పరిస్థితి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థుడిగా పేరొందిన జైపాల్‌రెడ్డికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కీలకమైన పదవులే లభించాయి. కాంగ్రెస్‌లో గొప్ప నేతగా ఎదిగిన జైపాల్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు. మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశారు. శాస్త్ర సాంకేతిక, ప్రసార, సమాచార శాఖలు చూశారు. యూపీఏలో కీలకమైన నేతగా ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ తన కర్తవ్యాన్ని నిర్వహించారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో మిర్యాలగూడ రద్దయింది. కొత్తగా చేవెళ్ల నియోజకవర్గం ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి జైపాల్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొందారు. మన్మోహన్ కేబినెట్లోనూ కేంద్రమంత్రిగాసేవలందించారు. -
సీట్ల లొల్లి!
సాక్షి, నాగర్‌కర్నూల్: పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నప్పటికీ నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై ఎటూ తేలడం లేదు. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఒక్కో పార్లమెంట్ స్థానానికి నాలుగు నుంచి, ఐదుగురి ఆశావహులతో కూడిన జాబితాను ప్యానెల్ ఖరారు చేసింది. ఈ జాబితాలో తమకు అనుకూలమైన వారి పేర్లు లేకపోవడంపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే మరోసారి సీనియర్ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో పోటీకి జైపాల్ అనాసక్తి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంíపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీపట్ల విధేయత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారిలో పీఏసీ జాబితా తయారు చేసి పంపినట్లు సమాచారం. ఈ జాబితాలో జైపాల్‌రెడ్డి పేరు లేకపోవడంపై మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. గాంధీభవన్ వేదికగా నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయపడ్డాయి. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపకపోగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా మరోసారి మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో ఆయనే ఉంటారని చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మక్తల్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంలోనూ, నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డికి కాంగ్రెస్ తరఫున టికెట్ రాకుండా చూడడం, దేవరకద్ర నియోజకవర్గం ఆలస్యంగా పవన్‌కుమార్‌కు కేటాయించడం వంటి అంశాల్లో జైపాల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు పోటీచేయకుండా తప్పుకుంటున్నారని డీకే అరుణ వంటి సీనియర్ నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. జైపాల్‌రెడ్డి లేదా రేవంత్‌రెడ్డి వారు ఇరువురు కాకుంటే మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, అనిరుధ్రెడ్డిలను పోటీలో ఉంచాలని ఆమె ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోసారి నంది ఎల్లయ్య? తెలంగాణలోనే ఏకైక కాంగ్రెస్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్య మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నంది ఎల్లయ్య పోటీ చేయాలని భావిస్తే సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన పోటీ చేయకపోతే దరఖాస్తు చేసుకున్న వారిలోనే అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించినప్పటికీ అవకాశ రాలేదని ఈ సారైన అవకాశం ఇవ్వాలని కోరుతున్న వికారాబాద్ కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ పాటు సతీష్ మాదిగ పేర్లను డీకే అరుణ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరితో పాటు నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణకూడా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. వీరందరితో పాటు డీసీసీ సెక్రెటరీ బాలకిషన్ పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది వేచి చూడాలి. మొత్తంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మరోసారి కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. -
పరీకర్.. మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి?!
పనాజి : తాను పదవిలో కొనసాగడం కోసం గోవా సీఎం మనోహర్ పరీకర్ ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పరీకర్ అనారోగ్యం కారణంగా గోవా అభివృద్ధి కుంటుపడిందని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ‘జన్‌ఆక్రోష్’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాటి ర్యాలీలో జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైతికత గురించి మాట్లాడే మనోహర్ పరీకర్ స్వప్రయోజనాల కోసం సీఎం కుర్చీని జలగలా పట్టుకున్నారని విమర్శించారు. ‘ నాకు తెలిసి ఆయన తన సీటు కోసం ప్రధాని మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో? ఇందుకోసం రఫేల్ డీల్ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారేమో’ అంటూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన పరీకర్ అక్టోబర్‌లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన పరీకర్ ఆ సమయంలో తాను తెలుసుకున్న విషయాల ఆధారంగా మోదీజీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. -
కేసీఆర్ శక్తి ఎంత..?
సాక్షి, హైదరాబాద్: కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసిన దుర్మార్గం అనుపమానమైందని, గతంలో ఇలాంటి దుష్టాంతాలు ఎప్పుడూ లేవని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు దొంగల్లా వెళ్లి రేవంత్ బెడ్రూం తలుపు పగులగొట్టి అరెస్టు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున రేవంత్ భార్య, తన తమ్ముడి కూతురు తనకు ఫోన్ చేసి విషయం చెప్పిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి నోటీసుల్లేకుండా కేసీఆర్ కూతురు ఇంటి బెడ్రూం తలుపులు పగులగొడితే ఒప్పుకుంటారా.. నువ్వు ఒప్పుకున్న రాజ్యాంగం, సమాజం ఒప్పుకుంటుందా అని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ మీడియా ఇన్చార్జి మెహ్రోజ్ఖాన్, న్యాయవాది జంధ్యాల రవి శంకర్‌లతో కలసి జైపాల్‌రెడ్డి మాట్లాడారు. కొడంగల్‌లో రాహుల్ బహిరంగసభ అనంతరం పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి వారంట్లు లేకుండా తలుపులు పగులగొట్టి భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. దీనికి ప్రతిగానే రాజ కీయ నిరసనల్లో భాగంగా బంద్‌కు పిలుపునిచ్చారని, సీఎం కార్యక్రమం ఉన్నందున బంద్‌ను ఉపసంహరించుకున్నారని చెప్పారు. కేసీఆర్ తన పోలీసు బలగాలతో కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భాగంగా చేసిన రాజకీయ కార్యక్రమమే తప్ప ఇందులో అభ్యంతరకరమేదీ లేదన్నారు. దీన్ని నెపంగా పెట్టి పిల్లలు, భార్యతో బెడ్రూంలో ఉండగా అరెస్టు చేయడమేం టని దుయ్యబట్టారు. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు.. తాను 4 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా పనిచేశానని, ఇలాంటి చర్యను తానెప్పుడూ చూడలేదని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆపద్ధర్మ సీఎంకి ఇంతటి అధికారాలు ఎక్కడివని, అసలు సీఎం కంటే ఎక్కువ అధికారాలు చెలాయించడం గర్హనీయమని మండిపడ్డారు. ఓడిపోతాననే భయం పట్టుకున్నందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. ‘లేకలేక సీఎం అయితేనే ఇంత నికృష్టంగా నియంతలా వ్యవహరిస్తున్నాడు. అసలు నీ శక్తి ఎంత? అసలు ఎవరు నువ్వు?’ అని కేసీఆర్‌పై మండిపడ్డారు. రేవంత్ అరెస్టుపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని, పోలీసు యంత్రాంగం చెప్రాసీల్లా ఎందుకు తిరుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపద్ధర్మ సీఎం ఎమర్జె న్సీ సీఎంగా పనిచేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రేవంత్ అరెస్ట్ నీచం.. రేవంత్ అరెస్టు అక్రమమని, పోలీసుల నీచమైన చర్య అని కుంతియా మండిపడ్డారు. నోటీసులు, వారంట్ లేకుండా రేవంత్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖం డిస్తున్నామని, ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారన్నారు. రేవంత్ నలుగురు అన్నదమ్ములు, 140 మంది నేతలను అరెస్టు చేశారని, దీని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన లు తెలపాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థు లు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ నేతలు, కార్యకర్తల ను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్‌కు తెలుసన్నారు. రానున్న మూడు రోజులు కీలకమైనవని, అధికార పార్టీ డబ్బు పంపిణీ పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు పహారాతో, ఎన్నికల సంఘం సహకారంతో కొడంగల్‌లో గెలిచేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది రవిశంకర్ అన్నారు.