సాక్షి, హైదరాబాద్ : నామినేషన్లకు సోమవారం గడువు ముగియనుండటంతో కాంగ్రెస్‌లో మిగిలిన ఆరు స్థానాలపై ప్రతిష్టంబన నెలకొంది. పార్టీ ముఖ్యనేతల ఆధిపత్య పోరుతో స్క్రీనింగ్ కమిటీ ఎటు తేల్చుకోలేకపోతుంది. మిర్యాలగూడ, నారాయణపేట, నారాయణ్‌ఖేడ్, కోరుట్ల, హుజూరాబాద్, దేవరకద్ర అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించనుంది. అయితే నారాయణపేట్, దేవరకద్ర నియోజకవర్గాల విషయంలో సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, డీకే అరుణల మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. తమ అభ్యర్థులకే ఈ సీట్లు కేటాయించాలని ఇద్దరు నేతలు పట్టుబడుతుండటంతో అధిష్టానం ఇప్పటి వరకు ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచింది. గత ఎన్నికలప్పుడు ఈ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం తాజా ఎన్నికల నేపథ్యంలో తారాస్థాయికి చేరినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాలు మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయని, ఇక్కడి నుంచి తాను పోటీచేస్తాను కాబట్టి తమ వారికే ఇవ్వాలని జైపాల్‌రెడ్డి వాదిస్తున్నారు. మరోవైపు తమ అభ్యర్థులకే గెలిచే అవకాశం ఉందని డీకే అరుణ పట్టుబడుతున్నారు.
దేవరకద్ర నుంచి తన అనచురుడైన పవన్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేస్తుండగా.. ప్రదీప్ గౌడ్‌కు ఇవ్వాలని జైపాల్ రెడ్డి కోరుతున్నారు. ప్రదీప్ గౌడ్ బలహీనమైన అభ్యర్థిగా భావిస్తే.. పరమేశ్వర్ గౌడ్‌కు ఇవ్వాలని అడుగుతున్నారు. ఆయనకు కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకుంటే టీడీపీకి కేటాయించి అక్కడి నుంచి బరిలోకి దింపేలా జైపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారు. నారాయణపేట టికెట్‌ను టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన, తన బంధువైన శివకుమార్ రెడ్డికి ఇవ్వాలని డీకే అరుణ కోరుతున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని, అతను గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె అధిష్టానం ముందు వాపోయినట్లు తెలుస్తోంది. జైపాల్ రెడ్డి తన అనుచరుడు కృష్టకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు.
ఇక మిగిలిన నాలుగుస్థానాల్లోను అదిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుంది. హుజురాబాద్ నుంచి కౌశిక్ రెడ్డికి ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఇక సీనియర్ నేత జానారెడ్డి తన కొడుకు కోసం మిర్యాలగూడను.. నారాయణ్‌ఖేడ్ కోసం మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌లు పట్టుబడుతున్నారు. కోరుట్లలో జువ్వాడి నర్సింగ్ రావు, కొమిరెడ్డి రాములు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. హైకమాండ్ బుజ్జగింపు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment