మాట్లాడుతున్న డీకే అరుణ, పక్కన కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ
సాక్షి, అచ్చంపేట: రాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్ నియంతపాలన అంతమోందించాల్సిన అవసరం వచ్చిందని, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని మాజీమంత్రి డీకే అరుణ అన్నారు. సోమవారం అచ్చంపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన మహాకూటమి ప్రజాగర్జనకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు.
పేదల బతుకులు బాగుపడాలంటే కేసీఆర్, టీఆర్‌ఎస్, కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణలో విముక్తి రావాలని అందుకోసం ప్రజల్లో మార్పు రావాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఆ దిశగా పాలన జరగడం లేదన్నారు. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియాగాంధీ కాళ్లుకు దండాలు పెట్టిన కేసీఆర్ తర్వాత కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని, ఆయన రాజకీయ అవసరాల కోసం ఏమైన చేస్తారన్నారు.
గద్వాల సభలో రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు దఫాలుగా అన్ని ప్రాంతాలకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వస్తే బల్మూర్ నల్లచెరువును 2.5టీఎంసీల సామార్థ్యం గల రిజర్వాయర్‌గా మార్చి ఈ ప్రాంతానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. యురేనియం తవ్వకాలు నిలిపి వేయిస్తామని, అమ్రాబాద్, పదర మండలాల్లో అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎఫ్‌ఆర్ పట్టాలు అందజేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఈ ప్రాంతంలో ఆరాచాకాలు సృష్టిస్తున్నారని, కేసీఆర్ లాగే ఇక్కడ నియంత్రణ పాలన సాగుతుందని విమర్శించారు. గిరిజనులు, దివ్యాంగులను బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని, ఇది ఎన్ని రోజులు సాగదన్నారు. వంశీకృష్ణ పదవిలో లేకున్నా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారని, గెలిపిస్తే మిమల్ని కడుపులో పెట్టుకుని చూస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజల అకాంక్ష నెరవేర్చిందన్నారు.
రేవంత్‌ను నిర్బంధించారు
కొండగల్‌లో కేసీఆర్ సభ ఉండడం చేత పోలీసులు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిని అనేక ఇబ్బందులకు గురిచేస్తూ ఆయన ఇంటిపై దాడులు చేయిస్తున్నారని డీకే అరుణ అన్నారు. రాహుల్‌గాంధీ సభ తర్వాత తనతో పాటు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులందరినీ సోదాలు చేస్తూ.. అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.
ఇందుకు నిరసనగా ఈనెల4న కొండగల్ బంద్‌కు పిలుపునిస్తూ ధర్నా చేస్తామని చెప్పడంతో గృహనిర్బంధం చేయడం వల్లనే రేవంత్ అచ్చంపేట సభకు రాలేకపోయారని పేర్కొన్నారు. హెలికాప్టర్ రాకపోవడం వల్ల సభకు రావడం ఆలస్యమైందని, ప్రజలు ఇంత ఓపికగా ఉన్నారంటే వారికి కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానమే అన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈ నాలుగు రోజులు నిద్రపోకుండా విజయం కోసం కృషి చేయాలని కోరారు.
ఎవరి కోసం ముందస్తు..
కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ కుమ్మకైయ్యారని, అందుకే ముందుస్తు ఎన్నికల పోయారని డీకే అరుణ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వారికి సహకరించేందుకు ఈ ఎత్తుగడలన్నారు. కేసీఆర్ ఎన్నిక ఎత్తులు వేసినా రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దళిత, గిరిజన, మైనార్టీ, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారిని మోసం చేశారని అందుకే, అందుకే ఆయన్ను గద్దె దించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జెడ్పీటీసీలు కట్టా సరితా అనంతరెడ్డి, ధర్మానాయక్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, నాయకులు శ్రీనివాసరావు, జి.సుదర్శన్, నర్సింహారావు, డి. శ్రీపతిరావు, నర్సింగ్‌రావు, బి.గౌరిశంకర్, వంగా గిరివర్థన్‌గౌడ్, వై.శ్రీనివాసులు, మల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, జలంధర్‌రెడ్డి, సూరం రమేష్‌రెడ్డి, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment