కొడంగల్/జడ్చర్ల: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని సోమవారం హైడ్రామా మధ్య పోలీ సులు అరెస్టు చేశారు. కొడంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతోపాటు మంగళవారం కోస్గిలో సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటానంటూ ఆయన ప్రకటించడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో పోలీసులు రేవంత్ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గేటు తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు, బెడ్రూంలో నిద్రిస్తున్న రేవంత్‌ను బయటకు రావాల్సిందిగా పిలిచారు. ఆయన బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో తలుపును బలవంతంగా నెట్టివేశారు. దీంతో బెడ్రూం గొళ్లెం విరిగిపోయింది. అనంతరం రేవంత్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుకు సహకరించలేదు.
వారెంట్ చూపకుండా అరెస్టు్ట చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నిస్తూ పోలీసులను బయటకు వెళ్లాలని గదమాయించారు. ఈసీ ఆదేశాలను అమలు చేయాలంటూ రేవంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు. తన భర్తను అరెస్టు చేయడంపై రేవంత్ సతీమణి గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము ఏమైనా టెర్రరిస్టులమా? అని ప్రశ్నించారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు తన భర్తను లాక్కెళ్లడం దారుణమన్నారు. కేసీఆర్ తమ కుటుంబంపై కక్షగట్టారని ఆరోపించారు. కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లోని కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ముగిశాక 6 గంటల ప్రాంతంలో రేవంత్‌ను తిరిగి ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. కాగా, రేవంత్ అరెస్టు నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
అక్రమ అరెస్టులతో సీఎం సభ: రేవంత్
అక్రమ అరెస్టులు నిర్వహిస్తూ పోలీసుల పహారాలో కేసీఆర్ కోస్గిలో సభ నిర్వహించుకున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం పోలీసులు రేవంత్‌ను విడిచిపెట్టిన అనంతరం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్గి సభలో తన పేరు ప్రస్తావించడానికి భయపడిన కేసీఆర్.. ఇంక తననేం ఓడిస్తారని ప్రశ్నించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌లను కేసీఆర్ తొత్తులుగా మార్చుకొని నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటుకు రూ. 5 వేల చొప్పున కొడంగల్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లతో కేసీఆర్ ప్రజలపై యుద్ధం ప్రకటించారన్నారు. ‘‘ఎన్నికలకు ఇంకా 48 గంటల సమయం ఉంది. ముగ్గురూ రండి కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం’’ అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment