ప్రజాకూటమిదే విజయం | Revanth reddy press meet | Sakshi
Sakshi News home page

ప్రజాకూటమిదే విజయం

Published Sat, Dec 8 2018 4:39 AM | Last Updated on Sat, Dec 8 2018 8:15 AM

Revanth reddy press meet - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

కొడంగల్‌/వంగూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కొడంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం కొడంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. కొడంగల్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాకూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రలోభాలకు జనం లొంగలేదన్నారు. కొడంగల్‌ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుందని ప్రకటించారు.

ఈ నెల 11వ తేదీన వచ్చే ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్‌కు చీకటిరోజులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్‌ ఫాంహౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. 11వ తేదీ నుంచి టీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా హరీశ్‌రావు ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మామ, బావమరిది తెలంగాణను వదిలిపెట్టి పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ కుటుంబానికి అమావాస్య చీకటి చుట్టుకుందన్నారు.

ఇన్నాళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపిన కేసీఆర్‌ తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కొడంగల్‌ ప్రజలు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొడంగల్‌కు అన్యాయం చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్‌కు ముస్లింలు తగిన తీర్పు ఇస్తారని చెప్పారు. ఎమ్‌ఐఎం ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహ్మద్‌ యూసుఫ్, విజయకుమార్, ప్రశాంత్, బాన్‌సింగ్, నాగులపల్లి నరేందర్, కష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

ఓటు వేసిన రేవంత్‌
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లు నిరంకుశ పాలన సాగించిన కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయమని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో శక్రవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement