మీడియాతో మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసిన దుర్మార్గం అనుపమానమైందని, గతంలో ఇలాంటి దుష్టాంతాలు ఎప్పుడూ లేవని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు దొంగల్లా వెళ్లి రేవంత్ బెడ్రూం తలుపు పగులగొట్టి అరెస్టు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున రేవంత్ భార్య, తన తమ్ముడి కూతురు తనకు ఫోన్ చేసి విషయం చెప్పిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి నోటీసుల్లేకుండా కేసీఆర్ కూతురు ఇంటి బెడ్రూం తలుపులు పగులగొడితే ఒప్పుకుంటారా.. నువ్వు ఒప్పుకున్న రాజ్యాంగం, సమాజం ఒప్పుకుంటుందా అని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి మెహ్రోజ్‌ఖాన్, న్యాయవాది జంధ్యాల రవి శంకర్‌లతో కలసి జైపాల్‌రెడ్డి మాట్లాడారు.
కొడంగల్‌లో రాహుల్ బహిరంగసభ అనంతరం పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి వారంట్‌లు లేకుండా తలుపులు పగులగొట్టి భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. దీనికి ప్రతిగానే రాజ కీయ నిరసనల్లో భాగంగా బంద్‌కు పిలుపునిచ్చారని, సీఎం కార్యక్రమం ఉన్నందున బంద్‌ను ఉపసంహరించుకున్నారని చెప్పారు. కేసీఆర్ తన పోలీసు బలగాలతో కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భాగంగా చేసిన రాజకీయ కార్యక్రమమే తప్ప ఇందులో అభ్యంతరకరమేదీ లేదన్నారు. దీన్ని నెపంగా పెట్టి పిల్లలు, భార్యతో బెడ్రూంలో ఉండగా అరెస్టు చేయడమేం టని దుయ్యబట్టారు.
ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు..
తాను 4 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా పనిచేశానని, ఇలాంటి చర్యను తానెప్పుడూ చూడలేదని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆపద్ధర్మ సీఎంకి ఇంతటి అధికారాలు ఎక్కడివని, అసలు సీఎం కంటే ఎక్కువ అధికారాలు చెలాయించడం గర్హనీయమని మండిపడ్డారు. ఓడిపోతాననే భయం పట్టుకున్నందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. ‘లేకలేక సీఎం అయితేనే ఇంత నికృష్టంగా నియంతలా వ్యవహరిస్తున్నాడు. అసలు నీ శక్తి ఎంత? అసలు ఎవరు నువ్వు?’ అని కేసీఆర్‌పై మండిపడ్డారు. రేవంత్ అరెస్టుపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని, పోలీసు యంత్రాంగం చెప్రాసీల్లా ఎందుకు తిరుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపద్ధర్మ సీఎం ఎమర్జె న్సీ సీఎంగా పనిచేస్తున్నాడని నిప్పులు చెరిగారు.
రేవంత్ అరెస్ట్ నీచం..
రేవంత్ అరెస్టు అక్రమమని, పోలీసుల నీచమైన చర్య అని కుంతియా మండిపడ్డారు. నోటీసులు, వారంట్ లేకుండా రేవంత్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖం డిస్తున్నామని, ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారన్నారు. రేవంత్ నలుగురు అన్నదమ్ములు, 140 మంది నేతలను అరెస్టు చేశారని, దీని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన లు తెలపాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థు లు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ నేతలు, కార్యకర్తల ను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్‌కు తెలుసన్నారు. రానున్న మూడు రోజులు కీలకమైనవని, అధికార పార్టీ డబ్బు పంపిణీ పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు పహారాతో, ఎన్నికల సంఘం సహకారంతో కొడంగల్‌లో గెలిచేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది రవిశంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment