సాక్షి, సిటీబ్యూరో: ఆయన పేరు వింటేనే అప్పట్లో క్రేజ్.. ఆయన చెప్పే మాటలు వింటే ఇక మహాజోష్. ఇక్కడి నుండే స్టూడెంట్ లీడర్‌గా తన రాజకీయ తొలి అడుగులేసి, నగరం నుండే చివరి సారి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన సూదిని జైపాల్‌రెడ్డికి మహానగరంతో అరవై ఏళ్ల అనుబంధం. 1960లో నిజాం కాలేజీలో చేరిన జైపాల్‌రెడ్డి స్టూడెంట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ తొలి అధ్యక్షునిగా ఎన్నికై పలు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి నాయకునిగా విషయ పరిజ్ఞానం, ఆకట్టుకునే ప్రసంగంతో తక్కువ సమయంలోనే మాస్ ఆండ్ క్లాస్ స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిపోయారు. ఉస్మానియా పరిధిలోని అన్ని కళాశాలతో కలిపి జరిగిన తొలి ఎన్నికల్లోనే జైపాల్‌రెడ్డి అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో విజయం సాధించి దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. నిజాం కాలేజీ నుంచి మొదలైన జైపాల్‌రెడ్డి ప్రస్థానం అనేక మలుపులు, ఒడిదొడుకుల మధ్య తిరిగి 2009లో మహానగరానికే చేరింది. 2009లో చేవెళ్ల లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలవటంతో జైపాల్‌రెడ్డిని తొలిసారిగా నాయకుడిని చేసిన రికార్డు నిజాం కాలేజీకి చెందితే, చివరి సారి ఎంపీ చేసే అవకాశం సైతం నగరప్రాంతంలో కలిసిపోయిన చేవెళ్ల లోక్‌సభలో చోటు చేసుకోవటం విశేషం. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైల్‌కు కావాల్సిన అనుమతులన్నీ జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చకచకా ఇచ్చేశారు.
ఓయూలో.. జైపాల్
తార్నాక: ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఆయన 1964లో ఎంఏ ఇంగ్లీష్‌లో చేరారు. ఆ తరువాత 1966–67లో బ్యాచ్‌లర్ ఆఫ్ జర్నలిజం కోర్సులో చేశారు. ఓయూలో చదువుతున్న రోజుల్లో బి–హాస్టల్‌లో ఉండేవారు.
ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు...
ఆరోజుల్లో ఓయూకు చాలా సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే వచ్చేవారు. అయితే అప్పట్లో ఓయూ క్యాంపస్‌లో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో జైపాల్‌రెడ్డి ఒకరుగా చెప్పవచ్చు. అయితే అందరితో పోలిస్తే ఆయన తీరువేరు. ఆయన మాట్లాడే భాష, అందులో వాడే పదాలు ఒక్కోసారి అధ్యాపకులనే తికమకపెట్టించేవి అని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు.
చురుకైన లీడర్..
జైపాల్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాలంలో ఆయన ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. వర్సిటీలో చురుకైన లీడరుగా ఆయనకు పేరుంది. విద్యార్థుల సమస్యలపట్ల స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఆ రోజుల్లో వర్సిటీకి జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి పోటీచేసి రెండు పర్యాయాలు ఓయూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేశారు.
బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి ...
1969లో జరిగిన ఓయూలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం వహించగా, జైపాల్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అనుచరుడిగా కొనసాగారు. అప్పుడు తెలంగాణ జనసమితి చేస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతునివ్వలేదంటారు.
బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా ఉంటూ యూత్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన తరువాత 1969లో కల్వకుర్తి నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఓయూనుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ చివరకు పార్లమెంటు వరకు తీసుకువెళ్లింది. బెస్ట్‌పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన మొదటి ఓయూ పూర్వవిద్యార్థిగా ఆయనకు పేరుంది.
జర్నలిజం విభాగంతో అనుబంధం..
జైపాల్‌రెడ్డికి ఓయూ జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి ఆయన ఓయూ జర్నలిజం విభాగానికి వచ్చేవారని పలువురు అ«ధ్యాపకులు పేర్కొన్నారు. ఓయూ జర్నలిజం విభాగంలో జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు ఆయన హాజరయ్యేవారు. ఆయన పలుమార్లు జర్నలిజం విద్యార్థులకు గెస్ట్‌లెక్చర్ కూడా ఇచ్చారు.
శతాబ్ది ఉత్సవాలకు హాజరు..
ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు. శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్బంగా జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన ఆంగ్లంలో చేసిన ప్రసంగం, తాను ఓయూలో గడిపిన రోజుల గురించి మాట్లాడిన మాటలు ఉత్తేజపరిచాయి. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు ఆయనను స్పూర్తిగా తీసుకున్నారు.
ఆయనతో విడదీయరాని అనుబంధం
జైపాల్‌రెడ్డి నాకు ఐదేళ్లు సీనియర్.. ఆరోజుల్లో వర్సిటీలో ఇంగ్లీష్ మాట్లాడే అతికొద్ది మంది విద్యార్థుల్లో జైపాల్‌రెడ్డి ప్రముఖమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఆంగ్లభాషపై ఆయనకు మంచి పట్టు ఉండేది. అధికారులతో ఇంగ్లీష్‌లో అనర్గళంగా వాదించేవారు. ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తిచేశాక వెంటనే జర్నలిజం కోర్సులో చేరారు.జర్నలిజం విభాగం తొలి బ్యాచ్ విద్యార్థి. ఆయనకు జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. తీరిక దొరికితే జర్నలిజం లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివేవారు. నేను అధ్యాపకుడిగా ఉన్న కాలంలో మూడు సార్లు ఆయన జర్నలిజం విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇచ్చి వారిలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిన మహానుభావుడు. –ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, జర్నలిజం మాజీ అధ్యాపకులు ఓయూ
యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా ఉండి అసెంబ్లీకి..
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌రెడ్డి 1969లో జరిగిన ఎన్నికల్లో ఓయూ నుంచే నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. రెండు పర్యాయాలు ఓయూ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఆయన భాష, మాట్లాడే తీరు అందరినీ కట్టిపడేసేవి. విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్రపోషించే వారు. –ప్రొఫెసర్ కృష్ణారావు, ఓఎస్‌డీ ఓయూ
అందరికీ ఒక రోల్ మోడల్..
జైపాల్‌రెడ్డి అంటే అప్పుడూ...ఇప్పుడూ అందరికీ ఒక రోల్ మోడల్‌గా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజకీయ వేత్తగా ఎదిగిన గొప్ప నాయకుడు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తన భాషతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఉస్మానియా యూనివర్సిటీకే పేరు ప్రఖ్యాతులు తెచ్చారు.జైపాల్‌రెడ్డి లాంటి మేధావి, సమస్యలపై స్పందించే గొప్పవ్యక్తి ఈరోజుల్లో కనిపించరు.–ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment