s jaipal reddy
-
జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అవినీతి మచ్చలేని గొప్ప నాయకుడని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించడంలో జైపాల్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. జూలై 28నఅనారోగ్యంతో కన్నుమూసిన జైపాల్‌రెడ్డి సంస్మరణ సభ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో జరిగింది. ఈ సభకు మన్మోహన్సింగ్తోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డితో వారికున్న అనుబంధాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు. మన్మోహన్సింగ్ మాట్లాడుతూ.. భారత రాజకీయాలు గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన క్రీయాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతాలపై ఎన్నడూ రాజీపడలేదని కొనియాడారు. ఏపీ విభజనలో ఆయన కీలక భూమిక పోషించారని చెప్పారు. పేద, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి గొప్ప పార్లమెంటరీయన్ అని అన్నారు. ఆయన ప్రసంగాలు ఇప్పటికీ ఎంతో విలువైనవని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో తమను తిరుపతి వెంకట కవులు అని పిలిచేవారని గుర్తుచేశారు. మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడని వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. అనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పడంలో ఆయన వెనక్కి తగ్గేవారు కాదన్నారు. భిన్న శక్తుల మధ్య ఎప్పుడూ చర్చ జరగాలని చెప్పారు. కొన్ని అంశాలపై పార్టీలు రాజకీయాలు పక్కనపెట్టి దేశహితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సెక్యూలర్ పదానికి జైపాల్‌రెడ్డి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయనకు శత్రువులు ఎవరు లేరని అన్నారు. అవినీతిమయమైన ప్రపంచంలో ఆయన ఒక ఆశా కిరణమని పేర్కొన్నారు. అవినీతిని ఎదురించే క్రమంలో ఆయన చాలా కోల్పోయారని వ్యాఖ్యానించారు. శరద్‌యాదవ్ మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి ఎక్కడ ఉన్నా నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదని గుర్తుచేశారు. పార్లమెంట్లో ఆయన అద్భుత ప్రసంగాలు చేశారని తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డిని వామపక్షాల స్నేహితుడిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఉన్న నాయకులు ఆయన స్పూర్తిని కొనసాగించాలన్నారు. ఆయన గొప్ప ప్రజాస్వామ్యమవాదని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి గొప్ప మానవతావాది అని అభివర్ణించారు. -
జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
-
ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..
-
జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డువరకు సాగిన జైపాల్‌రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, కేఆర్ రమేశ్‌కుమార్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు. మరోసారి కన్నీటి పర్యంతమైన కేఆర్ రమేశ్.. జైపాల్‌రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనైన రమేశ్‌కుమార్.. ఆదివారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే ఈ రోజు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్‌కుమార్ అక్కడున్న ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ రమేశ్‌కుమార్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. చదవండి : ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు.. కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్ -
ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, అభిమానుల, పలువురు రాజకీయ నాయకులు కడసారి ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు. అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయనకు గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా, జైపాల్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్‌కు ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అనంతరం అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డు వరకు జైపాల్‌రెడ్డి అంతిమయాత్ర సాగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, సిద్ధరామయ్య, కేఆర్ రమేశ్‌కుమార్, మల్లికార్జున ఖర్గేలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, మధుయాష్కి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హారయ్యారు. -
గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు కొనియాడారు. జైపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. గాంధీభవన్‌లో జైపాల్‌కు ఘన నివాళి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులు జైపాల్ రెడ్డికి ఘనంగా అంజలి ఘటించారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ...‘జైపాల్‌రెడ్డి మన మధ్య లేరు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అన్నారు. మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1964 నుంచి జైపాల్ రెడ్డి తనకు తెలుసునని, విద్యార్థి దశ నుంచే పరిచయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. కాగా ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌లోని జైపాల్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అనారోగ్యంతో ఆయన ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. -
ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు...
సాక్షి, సిటీబ్యూరో: ఆయన పేరు వింటేనే అప్పట్లో క్రేజ్.. ఆయన చెప్పే మాటలు వింటే ఇక మహాజోష్. ఇక్కడి నుండే స్టూడెంట్ లీడర్‌గా తన రాజకీయ తొలి అడుగులేసి, నగరం నుండే చివరి సారి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన సూదిని జైపాల్‌రెడ్డికి మహానగరంతో అరవై ఏళ్ల అనుబంధం. 1960లో నిజాం కాలేజీలో చేరిన జైపాల్‌రెడ్డి స్టూడెంట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ తొలి అధ్యక్షునిగా ఎన్నికై పలు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి నాయకునిగా విషయ పరిజ్ఞానం, ఆకట్టుకునే ప్రసంగంతో తక్కువ సమయంలోనే మాస్ ఆండ్ క్లాస్ స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిపోయారు. ఉస్మానియా పరిధిలోని అన్ని కళాశాలతో కలిపి జరిగిన తొలి ఎన్నికల్లోనే జైపాల్‌రెడ్డి అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో విజయం సాధించి దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. నిజాం కాలేజీ నుంచి మొదలైన జైపాల్‌రెడ్డి ప్రస్థానం అనేక మలుపులు, ఒడిదొడుకుల మధ్య తిరిగి 2009లో మహానగరానికే చేరింది. 2009లో చేవెళ్ల లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలవటంతో జైపాల్‌రెడ్డిని తొలిసారిగా నాయకుడిని చేసిన రికార్డు నిజాం కాలేజీకి చెందితే, చివరి సారి ఎంపీ చేసే అవకాశం సైతం నగరప్రాంతంలో కలిసిపోయిన చేవెళ్ల లోక్‌సభలో చోటు చేసుకోవటం విశేషం. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైల్‌కు కావాల్సిన అనుమతులన్నీ జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చకచకా ఇచ్చేశారు. ఓయూలో.. జైపాల్ తార్నాక: ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఆయన 1964లో ఎంఏ ఇంగ్లీష్‌లో చేరారు. ఆ తరువాత 1966–67లో బ్యాచ్‌లర్ ఆఫ్ జర్నలిజం కోర్సులో చేశారు. ఓయూలో చదువుతున్న రోజుల్లో బి–హాస్టల్లో ఉండేవారు. ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు... ఆరోజుల్లో ఓయూకు చాలా సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే వచ్చేవారు. అయితే అప్పట్లో ఓయూ క్యాంపస్‌లో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో జైపాల్‌రెడ్డి ఒకరుగా చెప్పవచ్చు. అయితే అందరితో పోలిస్తే ఆయన తీరువేరు. ఆయన మాట్లాడే భాష, అందులో వాడే పదాలు ఒక్కోసారి అధ్యాపకులనే తికమకపెట్టించేవి అని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. చురుకైన లీడర్.. జైపాల్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాలంలో ఆయన ఎన్ఎస్యూఐలో పనిచేశారు. వర్సిటీలో చురుకైన లీడరుగా ఆయనకు పేరుంది. విద్యార్థుల సమస్యలపట్ల స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఆ రోజుల్లో వర్సిటీకి జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి పోటీచేసి రెండు పర్యాయాలు ఓయూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేశారు. బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి ... 1969లో జరిగిన ఓయూలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం వహించగా, జైపాల్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అనుచరుడిగా కొనసాగారు. అప్పుడు తెలంగాణ జనసమితి చేస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతునివ్వలేదంటారు. బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా ఉంటూ యూత్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన తరువాత 1969లో కల్వకుర్తి నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఓయూనుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ చివరకు పార్లమెంటు వరకు తీసుకువెళ్లింది. బెస్ట్పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన మొదటి ఓయూ పూర్వవిద్యార్థిగా ఆయనకు పేరుంది. జర్నలిజం విభాగంతో అనుబంధం.. జైపాల్‌రెడ్డికి ఓయూ జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి ఆయన ఓయూ జర్నలిజం విభాగానికి వచ్చేవారని పలువురు అ«ధ్యాపకులు పేర్కొన్నారు. ఓయూ జర్నలిజం విభాగంలో జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు ఆయన హాజరయ్యేవారు. ఆయన పలుమార్లు జర్నలిజం విద్యార్థులకు గెస్ట్లెక్చర్ కూడా ఇచ్చారు. శతాబ్ది ఉత్సవాలకు హాజరు.. ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు. శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్బంగా జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆంగ్లంలో చేసిన ప్రసంగం, తాను ఓయూలో గడిపిన రోజుల గురించి మాట్లాడిన మాటలు ఉత్తేజపరిచాయి. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు ఆయనను స్పూర్తిగా తీసుకున్నారు. ఆయనతో విడదీయరాని అనుబంధం జైపాల్‌రెడ్డి నాకు ఐదేళ్లు సీనియర్.. ఆరోజుల్లో వర్సిటీలో ఇంగ్లీష్ మాట్లాడే అతికొద్ది మంది విద్యార్థుల్లో జైపాల్‌రెడ్డి ప్రముఖమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఆంగ్లభాషపై ఆయనకు మంచి పట్టు ఉండేది. అధికారులతో ఇంగ్లీష్‌లో అనర్గళంగా వాదించేవారు. ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తిచేశాక వెంటనే జర్నలిజం కోర్సులో చేరారు.జర్నలిజం విభాగం తొలి బ్యాచ్ విద్యార్థి. ఆయనకు జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. తీరిక దొరికితే జర్నలిజం లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివేవారు. నేను అధ్యాపకుడిగా ఉన్న కాలంలో మూడు సార్లు ఆయన జర్నలిజం విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇచ్చి వారిలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిన మహానుభావుడు. –ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, జర్నలిజం మాజీ అధ్యాపకులు ఓయూ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా ఉండి అసెంబ్లీకి.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌రెడ్డి 1969లో జరిగిన ఎన్నికల్లో ఓయూ నుంచే నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. రెండు పర్యాయాలు ఓయూ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఆయన భాష, మాట్లాడే తీరు అందరినీ కట్టిపడేసేవి. విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్రపోషించే వారు. –ప్రొఫెసర్ కృష్ణారావు, ఓఎస్డీ ఓయూ అందరికీ ఒక రోల్ మోడల్.. జైపాల్‌రెడ్డి అంటే అప్పుడూ...ఇప్పుడూ అందరికీ ఒక రోల్ మోడల్‌గా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజకీయ వేత్తగా ఎదిగిన గొప్ప నాయకుడు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తన భాషతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఉస్మానియా యూనివర్సిటీకే పేరు ప్రఖ్యాతులు తెచ్చారు.జైపాల్‌రెడ్డి లాంటి మేధావి, సమస్యలపై స్పందించే గొప్పవ్యక్తి ఈరోజుల్లో కనిపించరు.–ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షులు -
ఓయూ నుంచి హస్తినకు..
ఆమనగల్లు : క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పనిచేసిన చోటల్లా తనదైన ముద్ర వేసిన నాయకుడు, పార్టీలకు అతీతంగా అందరితోనూ అపర చాణక్యుడనిపించుకున్న మహనీయుడు సూదిని జైపాల్ రెడ్డి. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలను ఒంటబట్టించుకున్న ఆయన.. నాలుగుసార్లు శాసనసభకు, ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన జైపాల్ రెడ్డి.. దక్షిణాది నుంచి చిన్న వయసులోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మధ్యలో జనతా పార్టీలో చేరి అక్కడా అగ్రనాయకుడిగా వెలుగొందిన ఆయన.. మళ్లీ హస్తం పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కీలక పాత్ర పోషించారు. 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా.. చిన్న వయసులోనే పోలియోతో అంగవైకల్యానికి గురైనా ఆయన ఆత్మవిశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆయన తపనకు వైకల్యం ఏమాత్రం అడ్డుకా లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో చురుకుగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి.. 1965లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కల్వకుర్తి అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1969లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1972, 1978, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1975లో దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో చేరి అగ్రనేతగా ఎదిగారు. 1984లో ఎంపీగా ఎన్నిక 1980లో తొలిసారిగా మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1984లో మహబూబ్‌నగర్ పార్లమెంటు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో బరిలో దిగి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1998లోనూ పాలమూరు నుంచి విజయం సాధించారు. అయితే 1999లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. 2004లోనూ మిర్యాలగూడ నుంచి, 2009 చేవెళ్ల నుంచి జైపాల్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయితే.. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి.. జితేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1990–1998 మధ్యలో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997లో ఐకే గుజ్రాల్ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రి (సమాచార ప్రసార శాఖ)గా పనిచేసే అవకాశం లభించింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో 2004, 2009ల్లోనూ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. కొన్నేళ్లు ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు అయ్యారు. చేవెళ్ల ఎంపీగా.. జైపాల్‌రెడ్డికి చేవెళ్లతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. చేవెళ్ల పార్లమెంట్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో వికారాబాద్‌ను శాటిలైట్ టౌన్‌షిప్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. చేవెళ్ల ప్రాంతంలో రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు జైపాల్‌రెడ్డి ఎంతో సహకరించారు. జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే.. ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకుడిగా జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 1963–64మధ్య ఉస్మానియా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 1966–67లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే సమయంలో యూత్ కాంగ్రెస్ జాతీయ సభ్యుడిగానూ కొనసాగారు. 1971 వరకు జాతీయ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 1969లో తొలిసారి కల్వకుర్తి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వరుసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలిచారు. ఈ సమయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నుంచి బయటికొచ్చారు. అనంతరం 1979లో జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 1988 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి 60వేల పైచిలుకు ఓట్లతో ఓటమిపాలయ్యారు. 1984, 98లో మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999–2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991–1992 వరకు రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా ఉన్నారు. 2004–2014 మధ్య పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి నిలిచారు. -
20వ తేదీ రాత్రి ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్ : జైపాల్‌రెడ్డి ఆకస్మిక మర ణం ఆయన కుటుంబ సభ్యుల్ని, సన్నిహితులు, అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కలిచివేసింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా జ్వరం బారిన పడటం, అది కాస్త తీవ్రమై వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించడం అంతా కలలాగే ఉం దని ఆయన సన్నిహితులంటున్నారు. శనివారం 20వ తేదీ మధ్యాహ్నం తనకు జ్వరంగా ఉందని జైపాల్‌రెడ్డి ఇంట్లో వారికి చెప్పాడు. ఆ సమయంలో జైపాల్‌రెడ్డి అల్లుడు (కూతురి భర్త) డాక్టర్ ఆనంద్ అక్కడే ఉన్నాడు. జైపాల్ రెడ్డిని పరిశీలించిన ఆయన జ్వరం తగ్గేందుకు మాత్ర ఇచ్చారు. దాంతో జ్వరం తగ్గినట్లే తగ్గినా.. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎక్కువైంది. దీంతో అల్లుడు ఆనంద్, పెద్దకుమారుడు అరవింద్‌రెడ్డి హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏషియయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రికి తరలించారు. చదవండి: జైపాల్‌రెడ్డి ఇక లేరు.. ఆదివారం నాటికి జైపాల్‌రెడ్డికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దాంతో వైద్యులు ఆయన్ను ఆదివారం రాత్రి ఐసీయూకి మార్చారు. గుండె కొట్టుకునే రేటు నెమ్మదిగా ఉండటంతో వెంట నే వెంటిలేటర్ అమర్చారు. ఇదే సమయంలో ఆయనకు నిమోనియా అటాక్ అయింది. రెండురోజుల తర్వాత ఊపిరితిత్తుల్లో నీళ్లున్నాయ ని గుర్తించిన వైద్యులు చికిత్సనందించారు. గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయి. వీటికి చికిత్స జరుగుతుండగానే.. ఈ సమస్యలకు కాస్త ముదిరి శనివారం రాత్రి (ఆదివారం తెల్లవారుజామున) 1.08 నిమిషాలకు జైపాల్‌రెడ్డి కన్నుమూసారు. 20 ఏళ్లుగా ఓఎస్డీ, డ్రైవర్లు కీలకం జైపాల్‌రెడ్డి జీవితంలో కుటుంబ సభ్యులు కాకుండా ఇద్దరు వ్యక్తులు రెండు దశాబ్దాలుగా ఆయనతోనే ఉన్నారు. ఒకరు ఓఎస్డీ వెంకటరామిరెడ్డి, రెండో వ్యక్తి కారు డ్రైవర్ పాషా. వీరిద్ద రూ 20 ఏళ్లకుపైగా జైపాల్‌రెడ్డి వద్దే పనిచేస్తున్నారు. వెంకటరామిరెడ్డి.. జైపాల్‌రెడ్డికి వీరాభిమాని, శ్రేయోభిలాషి, వీరిద్దరిది గురుశిష్యుల అనుబంధమని సన్నిహితులు చెబుతారు. 1999లో ఆయన వద్ద వీరిద్దరూ చేరారు. అప్ప టి నుంచి ఆదివారం తుదిశ్వాస విడిచేవరకు వీరిద్దరూ జైపాల్‌రెడ్డి వెన్నంటే ఉన్నారు. ఆయనో స్టేట్స్‌మన్: నరసింహారెడ్డి జైపాల్‌రెడ్డి స్వా ర్థం లేని, ముక్కుసూటి మనిషని ఆయన సన్నిహితుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పి.నరసింహారెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి తో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. జైపాల్‌రెడ్డి దేశప్రయోజనాల గురించే ఆలోచించేవారని నరసింహారెడ్డి అన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. రిలయన్స్ కంపెనీ నుంచి రావాల్సిన వేల కోట్ల రూ పాయల బకాయిలను చెల్లించాల్సిందేనంటూ నోటీసులు పంపే విషయంలో జైపాల్‌రెడ్డి ఏమాత్రం సం శయించలేదని గుర్తుచేశారు. ఈ నిర్ణయం సంచనలమై ఆ తర్వాత వివా దం రేపి ఆయన మంత్రిత్వ శాఖ మార్పుకు కారణమైనప్పటికీ.. జైపా ల్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదన్నా రు. తెలంగాణ ఉద్య మ సమయంలో ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన స్థానంలో వేరేవరున్నా.. సీఎం కుర్చీపై ఆశతో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షల్ని తాకట్టు పెట్టి ఉండేవారన్నారు. నిత్యం ప్రజలు, ప్రజాస్వామ్య విలువల గురించే పరితపించే మహనీయుడని ప్రశంసించారు. ఎమర్జెన్సీలో పార్టీని వీడినా.. 1999లో మతశక్తులు బలపడటాన్ని చూసి సెక్యులర్ భావజాల పరిరక్షణకు ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారని వెల్లడించారు. పార్టీ, దేశప్రయోజనాలకోసం నిజాయతీగా పనిచేసిన సైనికుడని నరసింహారెడ్డి కొనియాడారు. మధ్యలోనే ఆగిన జీవిత చరిత్ర! జైపాల్‌రెడ్డి రాజకీయ చాణక్యుడు, నడిచే గ్రంథాలయంగా మిత్రులు, సన్నిహితులు అభివర్ణిస్తారు. ఈ విషయం పలుమార్లు పార్లమెంటు వేదికగా ఆయన నిరూపించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా జైపాల్ రెడ్డి సామర్థ్యాన్ని ప్రశంసించేవారు. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన జైపాల్‌రెడ్డి మంచి రచయిత కూడా. ఆయన తన రాజకీయ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలని ‘టెన్ ఐడియాలజీస్’అనే శీర్షికతో పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం అమేజాన్‌లో అందుబాటులో ఉంది. కొద్దికాలం క్రితమే ఆయన జీవిత చరిత్ర మొదలుపెట్టినట్లు సమాచారం. దురదృష్టవశాత్తూ ఈ పుస్తకం మధ్యలో ఉండగానే ఆయన కన్నుమూసారు. అదే చివరి రాజకీయ కార్యక్రమం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘటనలకు సాక్షీభూతంగా నిలిచిన జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో తన చివరి రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జూన్ 8,9 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ఇదే ఆయన చివరి రాజకీయ కార్యక్రమం. -
నిజాయతీ, నిస్వార్థ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది
నిజాయతీ, నిస్వార్థ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. పదవులు, స్వార్థం కన్నా దేశ ప్రయోజనాలు, ప్రజల సెంటిమెంటే గొప్పదని గుర్తించి.. ఆ దిశగా అలుపెరగక పనిచేసిన ఓ మేరునగం కుప్పకూలింది. సమకాలీన దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పరమపదించారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరి ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. వైకల్యం శరీరానికేనని.. మనసుకు కాదంటూ రాజకీయాలు, చరిత్ర, ఆంగ్ల భాషపై అసమానమైన రీతిలో పట్టు సంపాదించిన ఆయన.. సన్నిహితులు, పార్టీ నేతలకు ఓ ‘ఎన్సైక్లోపీడియా’. విద్యార్థి దశనుంచే చురుగ్గా రాజకీయాల్లో భాగస్వామ్యుడైన జైపాల్ రెడ్డి.. చివరి నిమిషం వరకు నమ్మిన సిద్ధాంతం కోసం ముక్కుసూటిగా వ్యవహరించారు. ఎమర్జెన్సీలో ఇందిరను వ్యతిరేకించినా.. లౌకిక శక్తుల ఏకీకరణ పేరిట జనతాదళ్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా తన ప్రతి అడుగునూ హుందాగా సమర్ధించుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం పెల్లుబికిన సమయంలో కేంద్ర కేబినెట్లో ఉంటూనే.. ఎన్నో ఒత్తిళ్లలోనూ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారు. దేశానికి దక్షిణాది అందించిన రాజకీయ ఆణిముత్యాల్లో జైపాల్‌రెడ్డి ఒకరు. పీవీ తర్వాత ఢిల్లీలో ఆ స్థాయిలో చక్రం తిప్పిన తెలుగువారిలో తొలి వరసలో ఉండే వ్యక్తి. నిరంతరం దేశ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే జైపాల్ రెడ్డి ఇకలేరనే వార్త.. తెలంగాణకు, తెలుగు వారికి తీరని లోటే. సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ రాజకీయాలపై తనదైన ముద్రవేసిన సూదిని జైపాల్‌రెడ్డి (77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరం, నిమోనియాతో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యా స్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజాము న తుదిశ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా చం డూరు మండలం నర్మట గ్రామంలో దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు 1942 జనవరి 16న ఆయన జన్మించారు. వీరి స్వగ్రామం ఉమ్మడి పాలమూరు జిల్లా మాడు గుల. ఆయనకు 18 నెలలున్నప్పుడే కాలికి పోలియో సోకింది. జైపాల్ రెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లీష్ లిట్రేచర్) సహా బీసీజే పూర్తిచేశారు. విద్యార్థి దశనుంచే జైపాల్‌రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. కాగా, జైపాల్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్ పక్కన జైపాల్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌కు తీసుకొస్తారు. 11 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి ఏఐసీసీ తరఫు నుంచి లోక్‌సభలో పార్టీ పక్ష మాజీ నేత మల్లికార్జున ఖర్గే, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి హాజరుకానున్నట్టు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేస్తోంది. నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌కు పశ్చిమం వైపు బతుకమ్మ కుంట హెలిప్యాడ్ పక్కనున్న హెచ్ఎండీఏకు చెందిన 1.4 ఎకరాల భూమిలో కొంత స్థలాన్ని కేటాయించారు. దీంతో హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ, రెవెన్యూ అధికారులు అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సంజీవయ్య పార్కులోని టెన్నిస్ కోర్టు ప్రాంగణం, హెలిప్యాడ్ పక్కనే ఉండే పార్కు స్థలాన్ని రెండింటిని పరిశీలించారు. ముందుగా సంజీవయ్య పార్కు స్థలంలో కలుపు మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. అయితే సాయంత్రం హెలిప్యాడ్ పక్కననున్న స్థలాన్ని కేటాయించారు. ప్రముఖుల సంతాపం జైపాల్‌రెడ్డి పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంఐంఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు గుత్తా సుఖేం దర్‌రెడ్డి, జి.వివేక్, కల్వకుంట్ల కవిత, వినోద్, సురవరం సుధాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, బీసీ కమిషనర్ చైర్మన్ రాములు, ఇనుగాల పెద్దిరెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, నల్లగొండ మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, జర్నలిస్టు సంఘాల నాయకులు దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళు లు అర్పించారు. దేశం గొప్ప పార్లమెంటేరీయన్ను కోల్పొయిందన్నారు. ఆయనతో తమకు న్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆలోచనా పరుడైన నాయకుడు: రాష్ట్రపతి సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ‘జైపాల్ రెడ్డి ఇక లేరన్న వార్త బాధ కలిగించింది. ఆయనొక ఆలోచనాపరుడైన రాజకీయ నాయకుడు, అద్భుతమైన పార్లమెంటేరియన్. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’అని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి మంచి వక్త: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జైపాల్‌రెడ్డి ప్రజాజీవితంలో అనేక సంవత్సరాలు గడిపారు. ప్రతి ఒక్కరూ గౌరవించగలిగే మంచి వ్యక్తి. మంచి వాక్చాతుర్యం కలిగిన నేత. ఆయన సమర్థవంతమైన పాలకుడు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ’’అని ప్రధాని నరేంద్రమోదీ తన ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. ‘‘జైపాల్ రెడ్డి మృతి చెందడం చాలా విషాదకరం’’ – కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘‘జైపాల్ రెడ్డి ఓ విజ్ఞాన గని. మేధావి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మరణం కలచివేసింది: సోనియా సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఆకస్మిక మరణం తనను కలచివేసిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ పేర్కొన్నారు. ‘‘ఐదు సార్లు ఎంపీగా పనిచేసి జాతీయ స్థాయిలో అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ఆయన మంచి వక్త అని, పార్టీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పడూ ముందుండే వారు.’’అని సోనియా ఆదివారం జైపాల్ సతీమణి లక్ష్మికి సంతాప లేఖలో పేర్కొన్నారు. నమ్మకమైన సహచరుడిని, గౌరవప్రదమైన సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని తెలిపారు. ‘‘జైపాల్‌రెడ్డి మృతితో తెలంగాణ తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్. తన జీవితాన్నంతటినీ ప్రజల కోసమే వెచ్చించారు.’’ – కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది: గవర్నర్ జైపాల్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి తెలంగాణకు చెందిన అసాధారణ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. అద్భుతమైన పాలనాదక్షత, ప్రతిభావంతుడైన వక్త అయిన జైపాల్‌రెడ్డి మరణంతో తెలంగాణ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందన్నారు. అంకితభావం గల ప్రజాసేవకుడిని రాష్ట్రం కోల్పోయిందని తన సంతాప సందేశంలో తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు నరసింహన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల కేసీఆర్ సంతాపం కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని సీఎం ఆదేశించారు. మంచి రాజకీయవేత్తను కోల్పోయాం: జగన్ సాక్షి, అమరావతి : ప్రముఖ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మంచి వాగ్ధాటి గల జైపాల్‌రెడ్డి పార్లమెంటు, అసెంబ్లీలలో తనకంటూ సముచితమైన స్థానాన్ని పొందారని జగన్ నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి మృతిపై తీవ్రమైన విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను. ఒక మంచి రాజకీయవేత్తను మనం కోల్పోయాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంతాపం జైపాల్‌రెడ్డి ఆకస్మిక మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా, వీపీ సింగ్, మన్మోహన్సింగ్ మంత్రివర్గాల్లో కేబినెట్ మంత్రిగా పని చేసిన సీనియర్ నేత, ప్రజా నాయకుడు మృతి చెందడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి మరణం బాధాకరం: కేటీఆర్ ‘‘సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ట్వీట్ చేశారు. మాకు తీరని లోటు: ఉత్తమ్ జైపాల్‌రెడ్డి మృతి తనకు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు లోక్‌సభ, రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, మాజీ కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన తెలంగాణ ముద్దుబిడ్డల్లో ఒకరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి వక్తను, మేధావిని కోల్పోయిందని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో ప్రజ్ఞాశాలి: చిరంజీవి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. రాజకీయ దురంధరుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్‌రెడ్డి మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ‘దేశ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి. ఆయన వాగ్దాటి, రాజకీయ పరిజ్ఞానం నాకు ఆయన పట్ల గౌరవాన్ని పెంచాయి. జైపాల్ మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు. ఆయ న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’అని పేర్కొన్నారు. అన్మాస్‌పల్లితో ఆత్మీయ అనుబంధం కడ్తాల్ (కల్వకుర్తి) : కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి తన అత్తగారి ఊరైన అన్మాస్‌పల్లితో ఆత్మీయ అనుబంధముంది. అన్మాస్‌పల్లికి చెందిన కోర్పోలు నారాయణరెడ్డి, యశోదమ్మ దంపతుల కూతురు లక్ష్మమ్మను వివాహం చేసుకున్న జైపాల్‌రెడ్డి.. ఆ తర్వాత గ్రామంలో బంధువుల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా హాజరయ్యే వారు. అన్మాస్‌పల్లికి వచ్చినప్పుడు గ్రామస్తులతో ఆప్యాయంగా మాట్లాడేవారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవారు. ఆయన ఒక వ్యక్తిని ఒకసారి చూసి పలకరిస్తే మళ్లీ ఆ వ్యక్తి ఎక్కడ తారసపడినా పేరుపెట్టి ఆప్యాయంగా పిలిచి మాట్లాడేవారు. ఆయన్ను తమ ఊరి అల్లుడిగా గ్రామస్తులు ఎంతో అభిమానించేవారు. ఈ గ్రామస్తులకు వివిధ సందర్భాల్లో ఆయన సాయం చేశారు. -
జైపాల్ రెడ్డి సతీమణికి సోనియా లేఖ
సాక్షి, న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) మృతి పట్ల యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు జైపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీకి సోనియా గాంధీ సంతాప లేఖ రాశారు. జైపాల్‌రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఆయన పార్టీకి, దేశానికి నిస్వార్ధంతో సేవ చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన నమ్మిన బంటు అని, ఆయన స్థానాన్ని పార్టీలో మరెవరూ భర్తీ చేయలేరని లేఖలో పేర్కొనారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి.. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్
బెంగళూరు : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ జైపాల్‌రెడ్డి మరణవార్త విని దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జైపాల్‌రెడ్డి నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉండేవారు. ఆయన నాకు గురువుతో సమానం. నాకు ఆయన 1980 నుంచి తెలుసు.. నేను ఆయన్ని అన్నయ్యలా భావిస్తాను. ఆయన గొప్ప పార్లమెంటరీయన్. మంచి మనస్సు ఉన్నవాడు. జీవితంలో జైపాల్‌రెడ్డి లాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం నా అదృష్టం. ఆయనకు నేను వందనం చేస్తున్నాను. ఇది నాకు చాలా విషాదకరమైన రోజు’ అని తెలిపారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన జైపాల్‌రెడ్డి అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీలకు అతీతంగా పలువురు నేతలు జైపాల్‌రెడ్డికి నివాళులర్పించేందకు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. -
జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ కేకే సంతోష్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. -
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) మృతి పట్ల సినీ నటుడు, కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతాప సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ‘రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్ రెడ్డి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి. ఆయన వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం ఆయన పట్ల నాకు గౌరవాన్ని పెంచింది. అభిమాన పాత్రుడిని చేసింది. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’అని తన సందేశంలో చిరంజీవి తెలిపారు. ఇద్దరం కలిసి ఒకే యూనివర్సీటీలో కలిసి చదువుకున్నాం : సురవరం జైపాల్‌రెడ్డి మరణం తనను దిగ్బ్రాంతి కలిగించిందని సీపీఐ మాజీ జాత్యీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రాజకీయంగా భిన్న ధృవాలలో ఉన్నా తమ దోస్తాన మాత్రం అలాగే కొనసాగిందని చెప్పారు. ఇద్దరం కలిసి ఉస్మానియా యూనివర్సీటీలో కలిసి చదువుకున్నామని గుర్తుచేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంత్రి పదవులు నిర్వహించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి గొప్ప ప్రజ్ఞశాలి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. -
‘జైపాల్, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిచెందినట్లు తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సంతాపం తెలిపారు. రాజకీయ జీవితంతో మచ్చలేని నాయకుడిగా జైపాల్ ఎదిగారని కొనియాడారు. ఇద్దరం కలిసి దేవరకొండ హైస్కూల్లో కలిసి చదుకున్నామని, ఒకేసారి ఎమ్మెల్యేలుగా శాసనసభకు వెళ్లామని గుర్తు చేశారు. జైపాల్ మరణం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన నా రాజకీయ గురువు జైపాల్‌రెడ్డి మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. విద్యార్థి దశ నుంచే తనను ప్రొత్సహించారని, ఆయనే తన రాజకీయ గురువు అని పేర్కొన్నారు. ఆయన వల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరనన్నారు. ఏ పార్టీలో ఉన్న ఆయనతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించానన్నారు. నిజమాబాద్‌కు మంచినీటి, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులకోసం మొదట 100 కోట్లు ఇచ్చింది జైపాల్ రెడ్డినేనని గుర్తుచేశారు. ఆయన మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలిపారు. జైపాల్ రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలి : ఉత్తమ్ జైపాల్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. జైపాల్‌రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేపు అంతిమ యాత్ర ఆయన ఇంటి నంచి ఉంటుందన్నారు. నెక్లెస్ రోడ్లో దహనకార్యక్రమాలు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. -
ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయంగా ఎన్నో పదవులు నిర్వహించి.. దేశానికిని, రాష్ట్రానికి వన్నె తెచ్చిన, తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
జైపాల్‌రెడ్డి మృతి ; ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన ప్రజాసేవకే అంకితమయ్యారని, మంచి వక్తగా, పాలనాధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. జైపాల్‌రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించిన గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతిపట్ల చింతిస్తున్నాను. ఆయనొక అసాధారణమైన పార్లమెంటేరియన్. తెలంగాణ ముద్దబిడ్డ. జీవితాన్నంతా ప్రజాసేవకే ధారపోసిన గొప్ప నాయకుడు. ఆయన కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. I’m sorry to hear about the sad demise of former Union Minister & veteran Congress leader Shri Jaipal Reddy Garu. An outstanding parliamentarian, great son of Telangana, he dedicated his entire life towards public service. My deepest condolences to his family & friends. — Rahul Gandhi (@RahulGandhi) July 28, 2019 (చదవండి : కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత) -
జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అక్కడే..!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జైపాల్‌రెడ్డి భౌతిక కాయానికి ఎంపీ రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పీవీ ఘాట్ వద్ద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. (చదవండి : కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత) -
జైపాల్‌రెడ్డి మృతి.. ప్రముఖుల నివాళి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వైఎస్ జగన్ సంతాపం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి మృతితో గొప్ప నాయకున్ని కోల్పోయామని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ట్వీట్ చేశారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా జైపాల్‌రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డితో 25ఏళ్లుగా అనుబంధం జైపాల్‌రెడ్డితో తనకు 25ఏళ్లుగా అనుబంధం ఉందని వైఎస్ఆర్సీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జైపాల్‌రెడ్డి.. ప్రజాప్రతినిధులకు ఆదర్శనీయమన్నారు. ఆయన రాస్తున్న జీవితచరిత్ర పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయాలని కోరారు. జైపాల్‌రెడ్డి లేకపోవడం చాలా బాధాకరమని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. (కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత) ప్రభుత్వమే అంత్యక్రియలు జరపాలి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జైపాల్‌రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయన పార్థవ దేహన్ని సందర్శించడానికి వస్తారని తెలిపారు. అంత్యక్రియలకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని, మహాప్రస్థానం ప్రాంతం ఎక్కువ మందికి సరిపోదని అభిప్రాయపడ్డారు. ‘ఆయన పార్లమెంటులో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయేవారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వాడే పదాలు, భాష గొప్పగా ఉండేది. ఆయన మరణం కాంగ్రెస్‌పార్టీకే కాదు. రాజకీయాలకే తీరని లోటు . జైపాల్‌రెడ్డి నాకు తండ్రిలాంటి వారు’ అన్నారు. వ్యక్తిగతంగా తీరని లోటు.. జైపాల్‌రెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోశించారని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ శోక సముద్రంలోమునిగిపోయిందని చెప్పారు. తనతో జైపాల్‌రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేవారని.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. వ్యక్తిగతంగా ఆయన మృతి తనకు తీరని లోటని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జైపాల్రెడ్డినీతికి నిజాయితీకి మారుపేరైన వ్యక్తి. రాజకీయ నాయకుల్లో అలాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు’ అన్నారు. నివాళులర్పించిన ప్రముఖులు.. జైపాల్‌రెడ్డి మృతిపట్ల విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, వినోద్ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సంతాపం తెలియజేశారు. జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీ హనుమంతారావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి జైపాల్‌రెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఉత్తమ పార్లమెంటేరియన్, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజకీయ నాయకుడే కాదు.. తాత్విక మేధావి జైపాల్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయం అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి తొలి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు తీసుకుని పాలమూరు జిల్లాకు పేరు తెచ్చారని కొనియాడారు. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు చాలా నిబద్దతతో ప్రజాస్వామ్యస్ఫూర్తికి ప్రతిరూపంగా ఉండేవని గుర్తు చేశారు. చాలా హుందాగా చర్చల్లో పాల్గొనేవారని, జైపాల్‌రెడ్డి రాజకీయ నాయకుడే కాదు తాత్విక మేధావి అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధించారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే.. ఐదుసార్లు ఎంపీగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగులలో 1942 జనవరి 16న జైపాల్‌రెడ్డి జన్మించారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందిన జైపాల్‌రెడ్డి.. 1969లో తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. కేంద్రమంత్రిగా సేవలు.. ఐకే గుజ్రాల్, మన్మోహన్సింగ్ కేబినెట్లలో జైపాల్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. గుజ్రాల్ హయాంలో కేంద్ర సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్సింగ్ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇదిలాఉండగా.. జైపాల్‌రెడ్డి భౌతిక కాయానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాళుర్పించి, ఆయన కుంటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ అర్బన్: ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత సూదిని జైపాల్‌రెడ్డి ప్రకటించారు. ఇకముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు దూరంగా ఉంటానని రెండు నెలల క్రితమే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనారోగ్యం.. వయసుపైబడడమే తన ఈ నిర్ణయానికి కారణమన్నారు. అందుకే తన బదులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని డీకే అరుణను కోరినప్పటికీ ఆమె అడిగిన ప్యాకేజీ కుదరనందుకే పార్టీని వీడారని విమర్శించారు. 2014లో డీకే అరుణ వల్లనే తాను ఓడిపోయానని వెల్లడించారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం.. కళ్లు మూసుకొని గుంతలో పడ్డట్లేనని ఎద్దేవా చేశారు. ఇతరులపై నిందలు మోపే బదులు కొత్త పార్టీలో పరిస్థితి చక్కబెట్టుకోవాలని అరుణకు హితవు పలికారు. డబ్బులు, పదవుల కోసం పార్టీలు మారడం ఆమె నైజమని విమర్శించారు. అధిష్టానం పొరపాట్లతోనే ఓటమి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ అధిష్టానంచేసిన కొన్ని పొరపాట్ల వల్లనే 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలైందని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదని వెల్లడించారు. ముకేశ్ అంబానీకి రూ. 7వేల కోట్ల జరిమానా విధించిన ఏకైక కేంద్ర మంత్రినని అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సిద్దిపేటలో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన కేసీఆర్ 24 గంటలకే ముగించేశారని అన్నారు. ఖమ్మం దీక్ష సందర్భంగా నిమ్స్‌లో చేరి రోజుకు 750 కేలరీల ద్రవాహారం తీసుకున్నారని, అలా చేస్తే ఏళ్ల తరబడి జీవించవచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అవరోధం కలుగుతుందని.. ఆయన చేసిన మోసాలు, దొంగ దీక్షల రహస్యాలు సోనియమ్మకు చెప్పలేదని అన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు, విద్యార్థులకు ఫీజులు లేవని, కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ రానుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ డబ్బులున్న అభ్యర్థులకు గాలం వేసి టికెట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్కు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. -
ఆయనతో విభేదాలు నిజమే: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్‌రెడ్డితో విభేదాలున్నాయని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ అంగీకరించారు. వయసు అంతరం కారణంగానే ఆయనతో రాజకీయ విభేధాలున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీభవన్‌లో విలేకరులతో గురువారం ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డికి మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్ ఇవ్వకూడదని, బీసీల నుంచి బలమైన నేత ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్ రెడ్డితో విభేదాలు లేవని చెప్పారు. రేవంత్ వర్గంపై దాడులను పీసీసీ కాచుకోవాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏఐసీసీ పదవులు తనకు వద్దని, తన సేవలు అవసరం ఉన్నచోట పనిచేసేందుకు సిద్ధమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇతర చోట్ల పనిచేయాల్సిన సమయం ఇది కాదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్కు వ్యతిరేకత ఉందని, దీన్ని క్యాష్ చేసుకోవడానికి పీసీసీ స్పీడ్ పెంచాలని సూచించారు. అభ్యర్థుల ప్రకటనతో ఒకరిద్దరు ఇబ్బంది పడొచ్చని, వారిని సముదాయించి ముందుకు పోవాలని సూచించారు. తన కుమార్తెకు టికెట్ ఇమ్మని ఇప్పటివరకు అడగలేదన్నారు. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇతర పార్టీల నుంచి కొంత మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని చెప్పారు. -
కేసీఆర్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం: జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, భారతీయ జనతా పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రగతిశీలశక్తులు, అల్ప సంఖ్యాక వర్గాలను మోసం చేసేందుకే కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతోపాటు అనేక అంశాల్లో కేసీఆర్ బీజేపీకి మద్దతిచ్చారని, సిద్ధాంతపరంగా వారి మధ్య రహస్య అవగాహన ఉందన్నారు. 2014లోనే బీజేపీతో సర్దుకుపోయేందుకు ప్రయత్నించారని, అయినా టీడీపీ, బీజేపీలు టీఆర్ఎస్ను తిరస్కరించాయని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీతో విడిపోయినా ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో కచ్చితంగా కలుస్తారని జోస్యం చెప్పారు. ఏకవచనంతో మాట్లాడటం కేసీఆర్‌కు అలవాటేనని, మోదీనే కాదు రాహుల్‌గాంధీని కూడా ఆయన ఏకవచనంతోనే సంబోధించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తానెప్పుడూ బయట మాట్లాడలేదని, ఆ అలవాటు తనకు లేదని చెప్పిన జైపాల్ తాను ఈసారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తానని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
మార్పునకు సంకేతం
హైదరాబాద్: ప్రజాదరణతో కాంగ్రెస్ పునర్వైభవం సంపాదించుకుంటుండగా, అధికార బీజేపీ పతనం దిశగా పయనిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ జైపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవలి గుర్దాస్పూర్, వెంగరలో జరిగిన ఉప ఎన్నికలు, నాందేడ్-వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గుర్దాస్పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తమ పార్టీ ఘన విజయం దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతమన్నారు. ఈ ఎన్నికలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాఖర్ దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా కేరళలోని వెంగరలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలపరిచిన ఐయూఎంఎల్ అభ్యర్థి గెలుపుసాధించారన్నారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని చెప్పారు. తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అధికార ఎన్డీఏ పక్షానికి శరాఘాతం వంటిదని పేర్కొన్నారు. ఇదే ఒరవడి హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
పెట్రో వినియోగదారులే భారాన్ని మోయాలా?
సాక్షి, హైదరాబాద్: మధ్య తరగతి నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్న కేంద్ర ప్రభుత్వం ఆ ఆదాయాన్ని ప్రాజెక్టులపై పెడతామనటం సబబుకాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి అన్నారు. పెట్రో వినియోగదారులు మాత్రమే ఆ భారాన్ని ఎందుకు మోయాలని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు పెరిగిన సమయాల్లో దాదాపు రూ.1.2 లక్షల కోట్లు సబ్సిడీగా ఇచ్చామని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.40వేల కోట్ల సబ్సిడీ ఇస్తోందన్నారు. సబ్సిడీని ఆదా చేస్తున్న ప్రభుత్వం.. ఆదాయాన్ని పెంచుకుంటూ పోతోందని చెప్పారు. చాలా మధ్యతరగతి కుటుంబాలకు స్కూటర్, చిన్న కారు వంటి వాహనాలు మాత్రమే ఉన్నాయని.. పెట్రో ధరల కారణంగా వాటి యజమానులపై భారం పడుతోందన్నారు. అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం దేశంలో కనిపించకుండా పోతోందన్నారు. పెట్రో ధరలను తగ్గించి సగటు పౌరుడి కష్టాలను తగ్గించాలని కోరారు. దేశంలో రైళ్లు, రోడ్లు, వంతెనలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి వసతుల కల్పనకు పెద్ద ఎత్తున అవసరమైన నిధులను పెట్రో ఆదాయం నుంచే ఖర్చు చేస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారని గుర్తు చేశారు. పెట్రోలియం ఉత్పతులను కూడా జీఎస్టీలోకి తీసుకురావటమే దీనికి పరిష్కారమని జైపాల్‌రెడ్డి అన్నారు. అయితే, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. దీనికి బదులుగా అనేక రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ విధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ధరల పెంపును ప్రధాన ఆదాయ మార్గంగా మలుచుకున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తక్కువగా ఉన్న సమయంలోనూ ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా పెంచి కేవలం ఆదాయ పెంపుపైనే కేంద్రం దృష్టి పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని జైపాల్‌రెడ్డి అన్నారు. -
‘రామ్‌నాథ్ కోవింద్ అజ్ఞాత వ్యక్తి’
హైదరాబాద్: మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన రామ్‌నాథ్ కోవింద్‌కు కేసీఆర్ మద్దతు తెలపడమంటే ముస్లింలకు అన్యాయం చేయడమే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు గాంధీ భవన్లో విలేకరుల ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. గతంలో రామ్‌నాథ్ కోవింద్ ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్ మైనారిటీలకు 5 శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించిన రంగనాథ్ మిశ్రా నివేదికను తిరస్కరించారు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ మద్దతు తెలపడమేంటో? తెలంగాణ ఎంపీలు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పిచ్చపాటిగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు, మీరాకుమారి స్వచ్ఛమైన రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీక. రామ్‌నాథ్ కోవింద్ అజ్ఞాత వ్యక్తి. ఆయన రెండు సార్లు ఎంపీ అయినా నేను ఎరుగను. ఆరెస్సెస్ స్కూల్లో రాజకీయ పాఠాలు నేర్చుకున్నవాడు. అలాంటి వాడు ఈ పదవిలో ఉండటం ప్రమాదకరం. మీరా కూమారి జగ్జీవన్ రామ్ కూతురుగానే కాక వ్యక్తిగతంగా కూడా చాలా ప్రతిభావంతురాలు. మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారు. అభ్యర్థి ఎవరో తెలియకముందే మద్ధతు తెలిపారు. ఏ కారణంతో ఎన్డీయే అభ్యర్థిని సమర్ధించారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ బీజేపీ అనుకూలభావాలు కలిగిన వ్యక్తి’ అని అన్నారు. -
'ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా'
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ గురించి సోనియా గాంధీతో జైపాల్ రెడ్డి ఎప్పుడైనా చర్చించారా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంతో రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నేతలు పారిపోయారని, ఆ విషయం జైపాల్ రెడ్డికి తెలియదా అని నిలదీశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ఉపవాస దీక్ష ఒట్టి బూటకం అని జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై తెలంగాణ జేఏసీ విషప్రచారం చేస్తోందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. -
'కశ్మీర్ నిర్ణయంలో శ్యామా ప్రసాద్ భాగస్వామే'
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి అప్పగిస్తూ నిర్ణయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా భాగస్వాముడేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీ నేతల చరిత్రను ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలుసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి హితవు పలికారు. కశ్మీర్ అంశంపై నిర్ణయాన్ని జవహర్లాల్ నెహ్రూ నే తృత్వంలోని కేబినెట్ తీసుకుందని, అందులో ముఖర్జీ కూడా సభ్యుడేనని ఆయన చెప్పారు. కశ్మీర్‌పై నిర్ణయ సమయంలో ముఖర్జీ అభ్యంతరం చెప్పలేదని, ఆనాటి పత్రికల్లో కూడా అలాంటి వార్తలేమీ రాలేదన్నారు. అందువల్ల కశ్మీర్ నిర్ణయంలో ముఖర్జీ కూడా భాగస్వామేనని తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాపై నిర్ణయ సమయంలోను నెహ్రూ కేబినెట్లో ముఖర్జీ సభ్యుడేనన్నారు. అప్పటి కశ్మీర్ పాలకుడిగా ఉన్న షేక్ అబ్దుల్లా పరిపాలనపై అసంతృప్తితోనే ముఖర్జీ రాజీనామా చేశారని చెప్పారు. -
'మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది కాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమం సందర్భంగాకేసీఆర్ చేసింది దొంగ దీక్షని, నిమ్స్ లో కేసీఆర్ రోజూ 750 కేలరీల టోటల్ పెరటల్ న్యూట్రిషన్ ఇంజక్షన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇదంతా నిమ్స్ రికార్డుల్లో ఉందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మంచి వ్యాపారి, లాభం ఉంటే తప్పా సోనియా గాంధీని పొగడరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. మోదీతో బాహాటంగా కలిస్తే మైనారిటీలు, ప్రగతిశీల వర్గాలు దూరమవుతాయని కేసీఆర్ జంకుతున్నారని అన్నారు. మోదీ తెలంగాణ వ్యతిరేకి, అలాంటి ఆయనతో కేసీఆర్ రహస్య మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన ఫలితాలు కాంగ్రస్ పార్టీకే కాదు, రాష్ట్రంలో ఏ వర్గానికి దక్కలేదని జైపాల్ రెడ్డి అన్నారు. -
'వైఎస్ఆర్ సహకారంతో హైదరాబాద్ అభివృద్ధి చేశాం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీనే కానీ... మాటల పార్టీ కాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎస్ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.... తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు రూ. 4 వేల కోట్లను వివిధ పథకాల కింద మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఆ నిధులతో అప్పటి ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. పేదలకు 76 వేల ఇళ్లు నిర్మించి ఇచ్చామని.... కృష్ణా జలాలు భాగ్యనగరానికి రప్పించేందుకు రూ. 600 కోట్లు ఇచ్చామని ఆయన వివరించారు. ఆర్టీసీ ద్వారా నగరానికి 1400 బస్సులు కూడా ఇచ్చామని చెప్పారు. తమ పార్టీ అభివృద్ధి చేయడమే తప్పా... చిల్లర ప్రచారం చేసుకనే అలవాటు లేదని ఎస్ జైపాల్‌రెడ్డి ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చురక అంటించారు. అల్లరి చేసే కంటే ప్రజలకు పనులు చేయడంపైనే శ్రద్ధ చూపాలని ఈతరం నేతలకు ఎస్. జైపాల్‌రెడ్డి హితవు పలికారు. -
ఎందుకు సార్ అపశకునం మాటలు?
పార్లమెంటులో ఏం జరిగింది-39 (నిన్నటి తరువాయి) స్పీకర్ చాంబర్స్లోంచి లోక్ సభలోకి వచ్చేశారు... టి. కాంగ్రెస్ ఎంపీలు, జైపాల్‌రెడ్డి. ఎవ్వరూ మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. జైపాల్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అతి తీవ్రంగా నడిచిన 1969 లో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ వైపే నిలబడిన చరిత్ర జైపాల్‌రెడ్డి గారిది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినా, కాంగ్రెస్ ఎంపీలందరూ హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నా, ఈ విషయంలో ఆయన అభిప్రాయం తెలిపే ప్రయత్నమే చేయలేదు... 9.12.2009 వరకూ! ఒక ఎంపీ: సార్... మీరు చెప్పినట్లు స్పీకర్ చేస్తుందంటారా?! జైపాల్‌రెడ్డి: చేస్తుంది... బిల్ పాసవుతుంది... తెలంగాణ ఏర్పడుతుంది... మనకొచ్చే లాభం?! ఎంపీ: అదేంటి సార్, రేపటి ఎన్నికల్లో ‘స్వీప్’ చేస్తాం... అన్ని స్థానాలూ మనమే గెలుస్తాం. జైపాల్‌రెడ్డి: మనమే అంటే, కాంగ్రెస్ అభ్యర్థులమా... తెలంగాణ వాదులమా?! మరో ఎంపీ: రెండిటికీ తేడా ఏముంది సార్. ఇప్పు డు తెలంగాణ వచ్చిందంటే అది మన వల్లనే కదా... మేమెంత ప్రయత్నించినా మొహం మొహం చూసుకోవడానికే ఇష్టపడని సుష్మాస్వరాజ్, కమల్‌నాథ్‌లు స్పీకర్ ఎదురుగా గంటసేపు కూర్చుండి పోయారు గదా...! మీరు చెప్తుంటే వాళ్ల ముగ్గురే కాదు, మేమంతా కూడా నిశ్చేష్టులయిపోయాం. ఇంకో ఎంపీ: ‘లాస్ట్ బాల్’ వరకూ ఆడతామన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డే కాదు, మీరు బౌల్ చేసిన ‘లాస్ట్ బాల్’తో అందరూ కలసి అడ్డంగా నిలబడ్డా క్లీన్‌బౌల్డ్ అవ్వాలసిందే. జైపాల్‌రెడ్డి: మనం స్పీకర్ దగ్గరకు వెళ్తున్నట్లు కేసీఆర్‌కి తెలుసా? ఎంపీ: ఇందాకా కమల్‌నాథ్ దగ్గరకు మీరు మమ్మ ల్ని పంపినప్పుడు ‘లాబీ’లో కలిశాడు సార్! మొత్తం జరుగుతున్నదంతా చెప్పాం... జైపాల్‌రెడ్డి: ఆయనేమన్నాడు? ఎంపీ: మొత్తం విన్నాడు సార్... ఆయన్ని కూడా రమ్మని పిలిచాం. జైపాల్‌రెడ్డి: మరి ఏడి?! మరో ఎంపీ: వస్తానని చెప్పలేదు గానీ, వస్తానన్నట్టే మొహం పెట్టాడు. వస్తాడనే అనుకున్నాం. జైపాల్‌రెడ్డి: మరెందుకు రాలేదంటావ్?! మరో ఎంపీ: బహుశా ఇక్కడ మనం ‘సక్సెస్’ అవ్వ మేమోనని వచ్చి ఉండడు... అయినా మనకేం నష్టం సార్! ఆఖరుగా మనం వెళ్లకపోతే ‘తెలంగాణ’ రాష్ట్రమే లేదు కదా!! తెలంగాణ రాష్ట్రమే లేకపోతే, మనమూ లేము- కేసీఆర్ లేరు... జైపాల్‌రెడ్డి: తెలంగాణ రాష్ట్రం లేకపోతే కాంగ్రెస్, అంటే మనం లేము... రాష్ట్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా కేసీఆర్ మాత్రం ఉంటాడు. చదరంగం ఆటలో ఆటగాడు జాగ్రత్తగా చూసుకోకపోతే, ప్రత్యర్థి గుర్రంతో ‘చెక్’ పెడతాడు. ఆ ఎత్తుగానీ ప్రత్యర్థికి దొరికిందా, ఆటకట్టు... లేదా మంత్రి (క్వీన్) ఎగిరిపోవటం ఖాయం! కేసీఆర్ మనకి గుర్రంతో ‘చెక్’ పెట్టాడయ్యా!! ఇందాక వస్తానన్నట్టుగా మొహం పెట్టాడన్నావు... అతనెందుకు వస్తాడు, చిద్విలాసంగా నాటకమంతా చూస్తూ కూర్చుంటాడు. ఎంపీ: అదేమిటి సార్, తెలంగాణ రావటం మన కెంత అవసరమో ఆయనకీ అంతే అవసరం గదా...! జైపాల్‌రెడ్డి: ఈ రోజు తెలంగాణ బిల్లు పాసయితే కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి! పాసవ్వక పోతే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి!! అతని ఆటలో అతనికి పూర్తి ‘క్లారిటీ’ ఉంది. మనమాడుతున్న ఆటే ఎందుకాడుతున్నామో మనకి తెలియకుండా ఆడు తున్నాం... ఎంపీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు సార్? సీమాంధ్ర వారు తెలంగాణ మనిషికి ముఖ్య మంత్రి పదవిస్తారా?! జైపాల్‌రెడ్డి: ఖచ్చితంగా ఇస్తారు. సమైక్యం కోరుకునే వారు, తెలంగాణకి ముఖ్యమంత్రి ఇవ్వమని ఎలా అనగలరు? బిల్లు పాసవ్వకపోతే, కేసీఆర్ తెలంగాణలో, జగన్ సీమాంధ్రలో గెలుస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, జగన్ ఉపముఖ్యమంత్రి... ఎంపీ: ఎందుకు సార్ అపశకునం మాటలు? మీరు చేసిన కౌన్సిలింగ్ వృథా పోదు. స్పీకర్ మీరు చెప్పింది చెప్పినట్లు అమలు చేస్తుంది... బిల్లు పాసవుతుంది: ఆఖరి గంటలో మీరే స్పీకర్ చాంబర్కి రాకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రమే లేదన్న విషయం మేము గట్టిగా ప్రచారం చేస్తాం... ముఖ్యమంత్రి మీరా, కేసీఆర్... అవుతారా అనేది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తేలుస్తుంది. జైపాల్‌రెడ్డి: (అసహనంగా) శకునాలు, దశలు, జాతకాలు, రాహుకాలం చూసుకుని మీరు పని చేస్తారు. సాధ్యాసాధ్యాలూ, వాస్తవిక పరిస్థితులూ బేరీజు వేసుకుని నేను పనిచేస్తాను. ఆఖరి గంటలో నేను మాట్లాడిన ఏమాట మీరు ‘పబ్లిగ్గా’ చెప్పినా, నేను ఖండిస్తాను. స్పీకర్ గదిలో జరిగిన మొత్తం మర్చిపోండి... ఆ మాటలు నేను అనలేదు - మీరు వినలేదు. ఇకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రో, కాదో కాంగ్రెస్ పార్టీ తేలుస్తుందంటున్నావు.. కేసీఆర్ కాంగ్రెస్‌లో చేరారా?! టీఆర్ఎస్ని విలీనం చేస్తారా?! ఎంపీ: తెలంగాణ బిల్లు పాసయిన మరుక్షణం కాంగ్రెస్‌లో కలిసిపోతానని మాటిచ్చాకే కదా... వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. జైపాల్‌రెడ్డి: చూశావా... నువ్వే చెప్పేస్తున్నావు... తెలంగాణ తీర్మానం, కేసీఆర్ మాటివ్వటం వల్లనే జరిగిందని...! ఇదే రేపు కేసీఆర్ చెప్తాడు... ‘‘నేను మాటివ్వకపోతే కాంగ్రెస్ వారు తెలంగాణ ఇవ్వమన్నారు... అందుకే మాటిచ్చాను... తెలంగాణ తెచ్చాను’’ అంటాడు. ఇంకో ఎంపీ: సార్ కన్ఫ్యూజ్ చెయ్యకుండా చెప్పండి సార్... మనం చేస్తున్నది రైటా... తప్పా.. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు : a_vundavalli@yahoo.com -
రూల్స్‌ని పాటించడం ‘మనిష్టం!’
పార్లమెంటులో ఏం జరిగింది-37 (నిన్నటి తరువాయి) రూల్స్, రాజ్యాంగం, చట్టాలు మనం తయారు చేసుకున్నాం. మనకి ఎలా వీలుగా ఉంటే అలా పాటించుకుంటాం. అధికార ప్రతిపక్షాలు కలిసిపోయాయి. మిగిలినవి అన్నీ చిన్న చిన్న పార్టీలు. వాళ్లు అరుస్తూనే ఉంటారు. మీరు బిల్లు పాస్ చేసేయండి. ‘పాస్’ అని ప్రకటించటమే గదా...! జైపాల్‌రెడ్డి: ఈ గొడవ ఇంక మానండి. మొత్తం సభ్యులెవ్వరూ మా మాట వినరు... అంటూ నాయకులిద్దరూ తేల్చేశారుగా... ఇంకో ఎంపీ: నిజమే సార్... ఒవైసీ పెట్టిన సవరణలు మేము చూడలేదు. నిజంగా ప్రాణహిత-చేవెళ్లకి, హైకోర్టుకి వ్యతిరేకంగా ఓటు వేసి హైద్రాబాద్ వెళ్లగలమా...!? ఇంతా జరిగి తెలంగాణ సాధించకుండా కూడా హైద్రాబాద్ వెళ్లలేం... జైపాల్‌రెడ్డి: మీరు ఆగండి బాబూ... ఎందుకంత భయపడ్తారు. తెలంగాణ బిల్లు పాసవుతుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. కమల్‌నాథ్: నో చాన్స్... జైపాల్‌జీ, ఎన్ని సవరణలు పాసయిపోతాయో తెలీదు... ఒవైసీ, సౌగత్ రాయ్‌లు పెట్టిన ఒక్క సవరణ పాసు అయినా బిల్లు రూపమే మారిపోతుంది. సీమాంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం... ఇద్దరూ వ్యతిరేకిస్తే ఇంక ఈ బిల్లు ఎవరికోసం తెచ్చినట్టు...? సుష్మాస్వరాజ్: నేనూ అదే చెప్తున్నాను. బిల్లు వీగిపోతే మేమే కారణమని ప్రచారం చెయ్యాలను కుంటున్నారు... మాకు వచ్చిన నష్టమేమీ లేదు. రెండు ప్రాంతాల్లోనూ మా బలం అంతంత మాత్రం! కానీ కాంగ్రెస్ ఎన్ని అనర్థాలు సృష్టించిందో ప్రజలముం దుంచుతాం. తెలంగాణ పేరుతో ఎన్ని రోజులు పార్లమెంట్ స్తంభించారో జనానికి చెప్తాం. జైపాల్‌రెడ్డి: రేపు ఎన్నికలయ్యాక మళ్లీ అదే మొదలవుతుంది. మేము పదేళ్లు రాజ్యం చేశాం. రేపు వచ్చేది ఎన్డీయే. ప్రారంభం రోజు నుంచీ సభ జరగనివ్వరు. ఈ గొడవను ఈ ‘టర్మ్’లోనే ఎలా పూర్తి చేసేయాలో ఆలోచించమంటున్నాను. స్పీకర్: మీరే చెప్పండి. ఈ సమస్యకు పరిష్కారముందా? ఉంటే అదేమిటో చెప్పండి. జైపాల్‌రెడ్డి: నేనొక మార్గం చెప్తాను. (ఎంపీల వైపు చూస్తూ) మీరు కొంచెం సేపు నిశ్శబ్దంగా వినండి. ఇంతసేపూ మీరు బిల్లు ఓటింగ్‌లో గట్టెక్కటం ఎలా... అని తర్జనభర్జనలు పడుతున్నారు. దీనికోసం ఇంత టైం వేస్ట్ చెయ్యడం అనవసరం... ఓటింగ్ జరిగితే ఈ బిల్లు పాసవ్వటం జరగదు. ఇక్కడ మీరెవ్వరూ బుర్రపెట్టని యాంగిల్ ఒకటుంది... అసలు ఓటింగ్ ఎందుకు పెట్టాలి! స్పీకర్: నాకర్థం కాలేదు... ఓటింగ్ పెట్టాలి... అదే రాజ్యాంగం చెప్పింది. అదే లోక్‌సభ రూల్స్‌బుక్‌లో ఉంది. కమల్‌నాథ్: ఓటింగ్, డివిజన్ చేసి ఎటువైపు ఎంత మంది ఓటు వేశారో, ఎంత మంది తటస్థంగా ఉన్నారో ప్రకటించకుండా బిల్లు పాసయ్యిందని ఎలా డిక్లేర్ చేస్తారు? జైపాల్‌రెడ్డి: అదే చెప్తున్నాను. ‘వాయిస్ ఓటు’తో బిల్లు పాసయినప్పుడు ఓటింగ్ ఉండదు కదా..! సుష్మాస్వరాజ్: అదెలా సాధ్యం... మంత్రులే ‘వెల్’లో నినాదా లిస్తుంటే, వాయిస్ ఓటుతో పాసయిపోయిందని ఎలా క్లోజ్ చేస్తారు? ఇదేమైనా సీక్రెట్ మీటింగా... ప్రపంచమంతా చూస్తుంటుంది!? జైపాల్‌రెడ్డి: నేను చెప్పేది కాస్సేపు నిశ్శబ్దంగా వినండి. ఓటింగ్ జరపకుండా, డివిజన్ చెయ్యకుండా బిల్లు పాస్ చెయ్యటానికి ప్రొవిజన్ ఉంది. మీ ప్రధాన కార్యదర్శిని పిలిచి రూల్ 367(3) చూడ మనండి. స్పీకర్ అనవసరమనుకుంటే డివిజన్ నిరాకరించవచ్చు. స్పీకర్: అవును... నేను చూశాను. దాని మీద చర్చించాం. ఎప్పుడో 1956 ముందొకసారి ఆ ‘ప్రొవిజో’ వాడినట్లు రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత ఎప్పుడూ ఏ స్పీకరూ ఓటింగ్ నిరాకరించలేదు. జైపాల్‌రెడ్డి: రూల్ ఉందిగదా... ఎవరు వాడారు, ఎప్పుడు వాడారు అనేది కాదు ప్రశ్న! ఇప్పుడు వాడండి. ‘నో’ డివిజన్ అనండి. రూల్ చదవండి., బిల్లు పాసయ్యిందని ప్రకటిం చింది. దీనికెందుకింత చర్చ... స్పీకర్: సాధ్యం కాదు జైపాల్గారూ... ‘కౌల్ అండ్ షక్దర్’లో స్పష్టంగా వ్రాశారు. ‘పనికిమాలిన’ కారణాల వల్ల ఓటింగ్ అడుగు తున్నారని స్పీకర్ భావిస్తే, డివిజన్ నిరాకరించవచ్చు... అని! కానీ ఒక పెద్ద రాష్ట్ర విభజన, అసెంబ్లీ వ్యతిరేకించినా, పార్లమెంటు చేబట్టినప్పుడు... ఓటింగ్ అడగటం పనికిమాలిన కారణంగా స్పీకర్ ఎలా భావించగలరు! స్పీకర్ ఆఫీసు గౌరవం పోతుంది జైపాల్‌జీ... మీరు ఒప్పించి సవరణల మీద ఒత్తిడి తేకుండా, ఓటింగ్ అడగ కుండా సరిచేయండి. అంతేగానీ ఏదో క్లాజుకున్న అనుబంధ వాక్యాలని ఆసరాగా తీసుకుని ఇంత అఘాయిత్యం చేయలేము. జైపాల్‌రెడ్డి: ‘రూల్’లో ఏది ‘పనికిమాలిన’ కారణమో చెప్ప లేదు. స్పీకర్ ఇష్టం! అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పుడు, అది చదివి, ఎంతమంది బలపరుస్తున్నారో లెక్కపెట్టి, యాబైమంది లేకపోతే, నోటీసు తిరస్కరించి, అప్పుడు తర్వాత అంశంలోకి వెళ్లాలి. ఇదీ ‘కౌల్ అండ్ షక్దర్’లో రాసి ఉంది. శీతాకాల సమావేశాల్లో, ఈ సమావేశాల్లో... ప్రతిరోజూ అవిశ్వాసం నోటీసు ఇస్తూనే ఉన్నారు. ఒక్క రోజైనా రూల్ ప్రకారం మీరు వ్యవహరించారా?! అవిశ్వాసం చదవటానికి మాత్రం మీకు సభలో ‘ఆర్డర్’ కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదని అడిగితే, సీమాంధ్ర ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, శివసేన... యాభైకన్నా ఎక్కువ మందే అవిశ్వాసాన్ని సమర్థిస్తారు కనుక, ఈ నాల్రోజుల్లో అవిశ్వాసం చర్చ మొదలు పెట్టడం ఇష్టం లేదు కనుక... వంద మంది కాంగ్రెస్ ఎంపీలు, రాజ్‌బబ్బర్, అజారుద్దీన్ లాంటి సెలబ్రిటీలు, వెల్‌లోకి వచ్చి యుద్ధం చేస్తే, వారు మీకు కనిపించరు... ఆంధ్రప్రదేశ్ ఎంపీలని మాత్రమే సస్పెండ్ చేస్తారు... ఎందుకంటే అది మీ ఇష్టం కనుక. 13వ తారీఖున షిండేగారు బిల్లు ప్రవేశపెట్టేశారని మీరంటారు. సుష్మాస్వరాజ్ గారికి వినబడలేదు, పక్కనే ఉన్న మంత్రులకీ వినబడ లేదు, మీకు మాత్రమే వినబడుతుంది... ఎందుకంటే మీకిష్టం కాబట్టి మీకు వినబడింది. ఇన్ని అఘాయిత్యాలూ మీకు అఘాయిత్యాలుగా కనబడలేదు కాని ఈ రోజు రూల్ 367(3) అమలు చేస్తే మీకు అఘాయిత్యంగా కనిపిస్తోంది... ఎందుకంటే, మీకిష్టం లేదు కనుక! మేడమ్, రూల్స్, రాజ్యాంగం, చట్టాలు మనం తయారు చేసు కున్నాం. మనకి ఎలా వీలుగా ఉంటే అలా పాటించుకుంటాం. ప్రతిపక్షం వారు అడ్డుపడతారు - అల్లరి చేస్తారు - జరగనివ్వరు అనే ప్రశ్నే లేదు! అధికార ప్రతిపక్షాలు కలిసిపోయాయి. మిగిలినవి అన్నీ చిన్న చిన్న పార్టీలు. వాళ్లు అరుస్తూనే ఉంటారు. మీరు బిల్లు పాస్ చేసేయండి. ‘పాస్’ అని ప్రకటించటమే గదా... స్పీకర్: ఎంత తేలిగ్గా చెప్తున్నారు జైపాల్‌రెడ్డి గారూ... ఓటింగ్ నిరాకరించినా, ఎంత మంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరే కమో లెక్కపెట్టి, సంఖ్య ప్రకటించి, బిల్లు పాసయ్యింది అని ప్రకటిం చాలి... ఇది సాధ్యమేనా?! ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు : a_vundavalli@yahoo.com -
'బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోంది'
హైదరాబాద్ : భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ప్రతిష్టను తగ్గించేందుకు కుట్ర జరగుతోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. జైపాల్‌రెడ్డి ఆరోపించారు. నెహ్రు సిద్ధాంత స్ఫూర్తి దేశానికే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో నెహ్రు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... అధికారంలో ఉన్న ఏ ప్రధాని అయినా నెహ్రు బాటలోనే పయనించాలన్నారు. గురువారం లండన్‌లో కూడా నరేంద్ర మోదీ అదే స్ఫూర్తిలో మాట్లాడారని ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి గుర్తు చేశారు. నవభారత నిర్మాణానికి ఆధ్యుడు, బాధ్యుడు నెహ్రునే అని చెప్పారు. నెహ్రు ఫొటో లేకుండా బాలల దినోత్సవం నిర్వహించడం ఆరెస్సెస్‌కే చెల్లిందన్నారు. బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రాజ్యమేలుతోందని జైపాల్‌రెడ్డి విమర్శించారు. -
'కేసీఆర్‌కి పరాభవం తప్పదు'
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ జైపాల్‌రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం వరంగల్‌లో జైపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌ది అహంకార పాలన అని ఆయన అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి.. దళితులను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. 16 నెలల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం అయినట్లే... తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కూడా వరంగల్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమతమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి వరంగల్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం
-
'టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం'
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మంగళవారం తెలంగాణ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ క్యాసినో పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఎవరూ చేయనన్ని వాగ్దానాలు ఆయన చేశారని, రాజకీయాల్లో ఇన్ని హామీలు ఇచ్చిన వారిని తాను చూడలేదని జైపాల్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు, రుణమాఫీ, పేదలకు ఇళ్లు విషయంలో హేతుబద్దత లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
'తెలంగాణను డిస్టర్బ్ చేయడం మంచిదికాదు'
న్యూఢిల్లీ: వ్యక్తిగతంగా రాయలతెలంగాణకు తాను వ్యతిరేకమని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు గాని, కర్నూలు- అనంతపురం జిల్లాల ప్రజలకుగానీ మంచిది కాదన్నారు. అన్ని స్థాయిల్లోనూ తాను దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చానని వెల్లడించారు. చాలారోజులనుంచి ఈ ప్రతిపాదన వస్తూనే ఉందన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానంలోగాని, కేబినెట్ నోట్లోగాని రాయల తెలంగాణ అంశం లేదని తెలిపారు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయమే కొలబద్దకావాలన్నారు. లేదంటే విభజన ప్రక్రియకు అంతరాయం కలిగించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ దశలో రాయల తెలంగాణ అంటే తెలంగాణ, రాయలసీమ ప్రజలు ఆవేశానికి లోనయ్యే అవకాశముందన్నారు. 10 జిల్లాల తెలంగాణను డిస్టర్బ్ చేయడం మంచిదికాదన్నారు. తనకు తెలిసిన ఏ కాంగ్రెస్ నేతా రాయల తెలంగాణకు అనుకూలంగాలేరని జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవాల్సిన అవసరంలేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు నదీజలాల విషయంలో అన్యాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని, ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ: జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేయడానికి వంద శాతం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై న్యాయపరమైన అంశాల గురించి షిండేతో చర్చించినట్టు తెలిపారు. రాయల తెలంగాణపై తమ ప్రాంత నేతలతో మాట్లాడి చెప్తానని అన్నారు. డిసెంబర్ 20 కల్లా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కొద్ది రోజుల్లోనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అవకాశముందని జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
2014లోపే తెలంగాణ: తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం(జీజోఎం) ఎదుట తెలంగాణ కేంద్ర మంత్రులు తమ వాదనలు వినిపించారు. ఎస్. జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ ఈ ఉదయం జీఓఎంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన పూర్తి తెలంగాణ కావాలని జీఓఎంను కోరామని భేటీ అనంతరం ఎస్ జైపాల్‌రెడ్డి విలేకరులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరామన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని సూచించామన్నారు. కృష్ణా జలాలకు ట్రిబ్యునల్ అవసరమే కానీ, గోదావరికి అవసరం లేదన్నారు. 2014లోపే రాష్ట్ర విభజన జరుగుతుందని జైపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాచలం తెలంగాణలో భాగమని మరో కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉంచాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ వెల్లడించారు. డిసెంబర్ చివరినాటికి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని జీఓఎంను కోరినట్లు మరో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా ఉమ్మడి రాజధాని లేదని గుర్తు చేశారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలన్నారు. జీఓఎంకు12 పేజీలతో కూడిన నివేదిక సమర్పించామని తెలిపారు. అయితే దీన్ని మీడియాకు విడుదల చేసేందుకు మంత్రులు నిరాకరించారు. -
గోదావరి జలాలకు ట్రిబ్యునల్ అవసరం లేదు: జైపాల్
న్యూఢిల్లీ: భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన పూర్తి తెలంగాణ కావాలని కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు.తెలంగాణలో భద్రాచలం, హైదరాబాద్ అందర్భాగమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం)తో సమావేశం ముగిశాక బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల వరకు విద్యుత్ సమస్య వచ్చే అవకాశముందని, దీన్ని అధిగమించే వరకు ప్రస్తుతమున్న విద్యుత్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఆర్టికల్ 371డీ కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. రెండు ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేయాలన్నారు. విభజన బిల్లులో ఈ అంశం పొందుపరచాలని సూచించారు. కృష్ణాకు ట్రిబ్యునల్ అవసరమే కానీ, గోదావరికి అవసరం లేదన్నారు. గోదావరికి బోలెడు మిగులు జలాలు ఉన్నాయన్నారు. జీఓఎంకు ఇచ్చిన నివేదికను మీడియాకు వెల్లడించబోమని జైపాల్ రెడ్డి అన్నారు. -
జైపాల్ రెడ్డి నివాసంలో టి.కాంగ్ నేతల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందానికి(జీఓఎం)కు వినిపించాల్సిన అంశాలపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రాంరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ బిల్లుకు తుది రూపం ఇచ్చే పనిలో జీవోఎం నిమగ్నమై ఉండటంతో సదరు బిల్లులో ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడి తేవాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఇక్కడకు వచ్చారు. దీంతోపాటు సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించాలని భావించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసి జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని హస్తినకు విచ్చేశారు. -
వచ్చారు.. వెళుతున్నారు!
-
వచ్చారు.. వెళుతున్నారు!
* ఢిల్లీ వచ్చి ఎవరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టిన టీ-కాంగ్రెస్ నేతలు * జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో జానారెడ్డి సహా పలువురు నేతల తిరుగుపయనం న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. కేంద్ర మంత్రివర్గ బృంద(జీవోఎం) సభ్యులతోపాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని శుక్రవారం ఢిల్లీ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టారు. హైకమాండ్ పెద్దలు, జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడం, ఆదివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలియడంతో చేసేదేమీలేక వెళ్లిపోయారు. వాస్తవానికి తెలంగాణ బిల్లుకు తుది రూపం ఇచ్చే పనిలో జీవోఎం నిమగ్నమై ఉండటంతో సదరు బిల్లులో ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడి తేవాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా నిర్ణయించారు. దీంతోపాటు సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించాలని భావించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసి జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని షెడ్యూల్ రూపొందించుకుని పనులన్నీ వాయిదా వేసుకుని మరీ ఢిల్లీ వచ్చారు. జైపాల్‌రెడ్డి ఇంట్లో భేటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డీకే అరుణ, పి.సుదర్శన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పి.బలరాం నాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటర మణారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్, భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ సహా పలువురు నేతలు శుక్రవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. వారంతా నేరుగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కేంద్ర మంత్రులతో జీవోఎం సమావేశం కానున్న నేపథ్యంలో ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై కొద్దిసేపు చర్చించారు. తర్వాత జీవోఎం సభ్యులతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఇతర హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఫోన్లో ప్రయత్నించగా, వారెవరూ ఢిల్లీలో అందుబాటులో లేరని తెలిసింది. దీంతో ఆయా నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఉన్నారని తెలియడంతో కనీసం ఆయననైనా కలవాలనే ఉద్దేశంతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. మరోవైపు శని, ఆది వారాల్లో కూడా జీవోఎం సభ్యులు, హైకమాండ్ పెద్దలు హస్తినలో అందుబాటులో ఉండే అవకాశాల్లేవని తేల డంతో ఇక అక్కడ ఉండటం అనవసరమనే భావనకు వచ్చా రు. జానారెడ్డి, డీకే అరుణ, సుదర్శన్‌రెడ్డి, భిక్షమయ్య గౌడ్ సహా పలువురు నేతలు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జీవోఎంకు నివేదిక అందజేసే బాధ్యతను జైపాల్‌రెడ్డి, రాజనర్సింహకు అప్పగించినట్లు సమాచారం. అహ్మద్‌పటేల్ అపాయింట్మెంట్ కోసం యత్నం.. కొందరు నేతలు మాత్రం పనులన్నీ వాయిదా వేసుకుని ఎలాగూ ఢిల్లీ వచ్చామని, రెండ్రోజులు ఇక్కడే ఉండి సొంత పనులు చక్కదిద్దుకుంటామని చెప్పారు. సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ఢిల్లీలోనే ఉన్నారని సమాచారం ఉండటంతో ఆయన అపాయింట్మెంట్ కోసం యత్నిస్తున్నారు. మంత్రులంతా హైదరాబాద్ వెళ్లిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో ఢిల్లీకి రావడం గమనార్హం. మరోవైపు హస్తినలోనే ఉండిపోయిన నేతలకు కేంద్ర మంత్రి బలరాం నాయక్ విందునిచ్చారు. నేడు రాహుల్‌తో డిప్యూటీ సీఎం భేటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు శనివారం రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. -
పవర్ఫుల్ సీఎం వైఎస్ఆర్: జైపాల్‌రెడ్డి
ప్రధాని 2004లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామన్నారమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. ప్రధాని హామీనే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో రాష్ట్ర ప్రజలకు తెలిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పవర్ఫుల్ సీఎం వైఎస్ఆర్ అని జైపాల్‌రెడ్డి అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో మెజారిటీ లేకున్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయరాదని ఆయన అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు విచ్చేశారు. ఈద్గా ప్రాంతంలో జరిగే సమావేశంలో ఆయన పాల్గొన్నారు.