2014లోపే తెలంగాణ: తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం(జీజోఎం) ఎదుట తెలంగాణ కేంద్ర మంత్రులు తమ వాదనలు వినిపించారు. ఎస్. జైపాల్రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ ఈ ఉదయం జీఓఎంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది.
భద్రాచలం, హైదరాబాద్తో కూడిన పూర్తి తెలంగాణ కావాలని జీఓఎంను కోరామని భేటీ అనంతరం ఎస్ జైపాల్రెడ్డి విలేకరులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరామన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని సూచించామన్నారు. కృష్ణా జలాలకు ట్రిబ్యునల్ అవసరమే కానీ, గోదావరికి అవసరం లేదన్నారు. 2014లోపే రాష్ట్ర విభజన జరుగుతుందని జైపాల్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
భద్రాచలం తెలంగాణలో భాగమని మరో కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉంచాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ వెల్లడించారు.
డిసెంబర్ చివరినాటికి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని జీఓఎంను కోరినట్లు మరో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా ఉమ్మడి రాజధాని లేదని గుర్తు చేశారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలన్నారు. జీఓఎంకు12 పేజీలతో కూడిన నివేదిక సమర్పించామని తెలిపారు. అయితే దీన్ని మీడియాకు విడుదల చేసేందుకు మంత్రులు నిరాకరించారు.