GOM on Telangana
-
18న పార్లమెంట్లో బిల్లు!
-
18న పార్లమెంట్లో బిల్లు!
* టీబిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం * రోజూ సభ వాయిదాపై బీజేపీ అసహనం * బీజేపీ సూచన మేరకు ముహూర్తం మార్పు * ఆలోపు ఆర్థిక బిల్లులు, ఓటాన్ అకౌంట్ పరిపూర్తి * సోనియాతో షిండే, జైరాం రమేశ్ భేటీ న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముహూర్తం మారింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రక్రియ ముగిసిన తరువాతే దాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఏఐసీసీ వర్గాల సమాచారం మేరకు... ఫిబ్రవరి 18న టీ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. ఈలోపు సభ ముందున్న ఇతర బిల్లులను ఆమోదించుకోవడంతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అలాగే బిల్లును తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టాలా, లేక రాజ్యసభలోనా అనే దానిపై కూడా కసరత్తు చేస్తోంది. తెలంగాణ బిల్లును ఈ నెల 10న రాజ్యసభలో ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఇటీవల ప్రకటించినా, అది సాధ్యం కాదని తేలిపోయింది. ఇప్పటిదాకా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకే రాలేదు. కేబినెట్ ఆమోదం పొంది, ఆ తర్వాత అది రాష్ట్రపతి వద్దకు వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలూ బిల్లును తిరస్కరించిన నేపథ్యంలో, అత్యంత వివాదాస్పదమైన ఈ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే ఆమోద ముద్ర వేసే అవకాశాలు కన్పించడం లేదు. ఆయనపై ఒత్తిడి తెచ్చి ఆమోదముద్ర వేయించుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో కాంగ్రెస్ పెద్దలు ఈ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగకపోవడంపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విపక్ష పార్టీల సీమాంధ్ర ఎంపీలతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టిస్తున్నప్పుడు టీ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు తాము అనుకూలమైనప్పటికీ జరుగుతున్న ప్రక్రియ మాత్రం అస్సలు సమంజసంగా లేదని చెబుతున్నారు. ఇదే విషయంపై బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ పార్లమెంట్ సెంట్రల్ హాలులో గురువారం తనను కలిసిన కొందరు ఎంపీలతో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును ఎండగట్టినట్టు తెలిసింది. సొంత పార్టీ ఎంపీలను అదుపులో పెట్టుకోకుండా తెలంగాణ బిల్లును ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించినట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలంటే తెలంగాణ బిల్లును తరవాత ప్రవేశపెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా తొలుత వివాదాస్పదం కాని బిల్లులతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోవాలని, చివర్లో తెలంగాణ బిల్లును సభ ముందుకు తెస్తే మేలని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధానికి, ఇతర కేంద్ర పెద్దలకు చెప్పానని, వాళ్లు కూడా సానుకూలంగా ఉన్నారని అద్వానీ పేర్కొన్నారు. అద్వానీ సూచనను పరిగణనలోకి తీసుకున్న పార్టీ పెద్దలు పార్లమెంట్లో పెండింగ్ బిల్లులను ఆమోదించుకోవాలంటే వివాదాస్పదమైన తెలంగాణ బిల్లును చివర్లో ప్రవేశపెట్టడమే మేలనే భావనకు వచ్చారు. గురువారం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రివర్గ సంఘం (జీఓఎం) సభ్యులు నార్త్ బ్లాక్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లులో చేయాల్సిన మార్పుచేర్పులపై కసరత్తు చేశారు. బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు, అటు నుంచి రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్‌కు తేవడానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై చర్చించారు. బిల్లును 18న పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అనంతరం షిండేతోపాటు గులాంనబీ ఆజాద్, నారాయణస్వామి బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. టీ బిల్లు గురువారం కేంద్ర కేబినెట్ ముందుకు రాదని చెప్పారు. సభలో బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారని ప్రశ్నిస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు అని బదులిచ్చారు. మరోవైపు ఈనెల 10న జరిగే రాజ్యసభ బీఏసీ ఎజెండాలో తెలంగాణ అంశాన్ని చేర్చారు! సోనియాతో భేటీ జీవోఎం సమావేశానంతరం షిండే, జైరాం రమేశ్ ఒకే వాహనంలో టెన్ జన్‌పథ్‌కు వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సూచన మేరకు తెలంగాణ బిల్లులో పొందుపర్చిన సవరణలపై చర్చించారు. బిల్లును 18న సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. అందుకు సోనియా ఆమోదముద్ర వేసిందీ లేనిదీ తెలియరాలేదు. -
జీవోఎం... ఇంకావుంది!
-
జీవోఎం... ఇంకావుంది!
* సీమాంధ్ర కేంద్రమంత్రులతో భేటీ * వారు కోరిన 9 సవరణలను పరిశీలిస్తామని హామీ * ఇక భేటీలుండవన్న మర్నాడే మళ్లీ సమావేశమైన జీవోఎం * అసంపూర్తిగా ముగింపు.. నేడు మళ్లీ మంత్రుల బృందం భేటీ * నేడు కేబినెట్‌కు బిల్లు వెళ్లడం అనుమానమే * ఇప్పుడే చెప్పలేమన్న షిండే, చూడాలన్న జైరాం రమేశ్ * హైదరాబాద్ ఆదాయం పంపకం, సీమాంధ్రకే భద్రాచలం! * కొత్త రాజధాని, రాయలసీమ ప్యాకేజీకీ సానుకూలం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంకం దేశ రాజధానిలో రకరకాల మలుపులు తిరుగుతూ అందరిలోనూ ఉత్కంఠ పెంచుతోంది. ‘ఇదే చివరి భేటీ. ఇక మా పని ముగిసింది’ అని మంగళవారం ప్రకటించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం), ఆ మర్నాడే మరోసారి సమావేశమై విభజన కసరత్తును కొనసాగించింది! బుధవారం సాయంత్రం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పలు ప్రతిపాదనలతో జీవోఎం సభ్యులతో సమావేశమయ్యారు. ఇక్కడి హోం శాఖ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు జరిగిన ప్రత్యేక భేటీలో మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్, చిరంజీవి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రెండు నెలల క్రితమే చేసిన ప్రతిపాదనలనే జీవోఎం వారి నుంచి మరోసారి తీసుకుంది. చివరికి భేటీ అసంపూర్తిగా ముగిసింది. గురువారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం నిర్ణయించింది. ‘మంత్రులు ఎనిమిది, తొమ్మిది కీలకమైన సవరణలు చేశారు. నేడు మరోసారి జీవోఎం సమావేశం ఉంటుంది. వాటిని మరోసారి పరిశీలించాల్సి ఉంది’ అని భేటీ తర్వాత జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు. ముందుగా ప్రకటించిన విధంగా విభజన బిల్లు గురువారం కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందా అని ప్రశ్నించగా, ‘చూడాలి. ప్రయత్నించాలి’ అని బదులిచ్చారు. ఈ విషయమై తానేమీ చెప్పలేనని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా భేటీ అనంతరం అభిప్రాయపడ్డారు. ‘‘అందుకే, సమయం పడుతుందని నేనెప్పటి నుంచో చెబుతున్నా’ అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5.30కు జరిగే కేబినెట్ భేటీ ఎజెండాలో విభజన బిల్లు ఉండటం అనుమానంగానే మారింది. ఎందుకంటే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జీవోఎం భేటీ కానుంది. దానికీ, కేబినెట్ భేటీకీ మధ్య సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినా, దానికి ఆమోదముద్ర పడటం కష్టమేనని తెలుస్తోంది. అయితే కేవలం ఆర్థికాంశాలకు సంబంధించిన సవరణలను మాత్రమే జీవోఎం ప్రతిపాదించి కేబినెట్లో పెడితే మాత్రం అవి ఆమోదం పొందే అవకాశాలున్నాయి. అంతకు మించిన సవరణలైతే బిల్లు గురువారం కేబినెట్‌కు రావడం కష్టమేనంటున్నారు. మీరు సిద్ధమైతే మేమూ ఓకే జీవోఎంతో భేటీ అనంతరం చిరంజీవి, శీలం మీడియాతో మాట్లాడారు. తాము సవరణ ప్రతిపాదనలను వివరించామని, వాటిని బిల్లులో చేరిస్తే తమ ప్రాంత ప్రజలను ఊర డించే శక్తి తమకొస్తుందని చెప్పారు. ‘నిన్న (మంగళవారం) సాయంత్రం అధిష్టానం మాతో వార్ రూమ్‌లో సంప్రదింపులు జరిపింది. మేం విభజన వద్దన్నాం. రెండు నెలల క్రితం ఇచ్చిన మా ప్రతిపాదనలను పట్టించుకోనందున ససేమిరా అన్నాం. అయితే ఇప్పుడు అధిష్టానం స్పందించింది. పునరాలోచనలో పడింది. మా ప్రజల ఆవేదన, వ్యథ, ఆవేశం అర్థం చే సుకుంది. అప్పటి మా ప్రతిపాదనలను పరిశీలిస్తోం ది. వాటిని అమలు చేస్తే చివరకు తెలుగు వారందరినీ విజయం వరిస్తుంది’ అని శీలం అన్నారు. వారే పిలిచారు: చిరంజీవి ఈ సమావేశం తాము కోరితే జరగలేదని, వారే పిలిచారని చిరంజీవి చెప్పారు. ‘‘భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను సీమాంధ్రలో కలపడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, హైదరాబాద్ ఆదాయాన్ని పంచడం, ఆస్తులు- అప్పులను తేటతెల్లం చేయడం, విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా.. పదేళ్లు అనే నిబంధన కాకుండా అసలు కాలపరిమితినే తీసేయడం వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. ఇవన్నీ పట్టించుకోనందుకే బిల్లు తిరస్కరణకు గురయ్యే పరిస్థితికి వెళ్లింది. దాంతో వారిప్పుడు ఆలోచనలో పడ్డారు. పునఃసమీక్షిస్తున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఇవన్నీ ఉంటాయని భావిస్తున్నాం. మాకు 100 శాతం నమ్మకముంది. ఏం జరుగుతుందనే దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఏ సవరణలకు అంగీకరించారన్న ప్రశ్నకు, అవన్నీ చెప్పలేమని శీలం బదులిచ్చారు. ‘‘సమస్య పరిష్కారం కావాలి. ఇది సున్నితమైన, మనోభావాలకు చెందిన అంశం. తెలుగు వారంతా బాగుండాలి’ అన్నారు. విశాఖను కొత్త రాజధానిగా చే యాలని, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కూడా కోరినట్టు కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. సవరణ అంశాలివే...! ముఖ్యంగా భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్‌ను కచ్చితంగా అమలు చేయాలని జీవోఎంకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇది బిల్లులో ఉండాల్సిందేనన్నారు హైదరాబాద్‌పై పెట్టిన ప్రతి పైసా రాష్ట్రం మొత్తం ఆదాయంలోంచేనని, ఇప్పుడు ఆ ఆదాయాన్ని పంచడంలో ఉన్న అభ్యంతరమేమిటని పట్టుబట్టారు మిగతా అంశాలెలా ఉన్నా భద్రాచలం, హైదరాబాద్ ఆదాయం పంపకం డిమాండ్లపై తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎలాంటి అడ్డంకులూ ఉండబోవన్నారు. ‘హైదరాబాద్‌ను యూటీ చేయడం వంటి డిమాండ్లను జీవోఎం తీర్చేలా కన్పించడం లేదు. యూటీని పోలిన అధికారాలనైనా వర్తింపజేయాలని కోరాం గానీ అదీ చేసేలా లేరు. కనీసం మాకు కొత్త రాజధాని ఏర్పడేదాకానైనా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరాం గానీ దానికీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సమ్మతంగానే ఉంది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశముంది. అలాగే సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే విద్యాసంస్థలన్నింటికీ ఖర్చును కేంద్రమే భరిస్తానంది’ అని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. -
10న రాజ్యసభలో బిల్లు.. లోక్‌సభలో 11న?
-
కేబినెట్‌కు అదే టీ
-
కేబినెట్‌కు అదే 'టీ'
* బిల్లులో ఎలాంటి మార్పులు, సవరణలు చేయని జీవోఎం * ఆర్థిక ప్యాకేజీలపై మాత్రం కేబినెట్‌కు ప్రతిపాదనలు? * అరగంటలో ముగిసిన మంత్రుల బృందం భేటీ * కేబినెట్ నోట్ సిద్ధం.. సవరణల భారం మంత్రిమండలికే * సాంకేతిక అంశాలపైనే దృష్టిపెట్టిన జీవోఎం * బిల్లు అమలులో సమస్యలు వచ్చే అంశాలపైనే చర్చ * రేపు భేటీ కానున్న కేబినెట్.. నేటి నుంచి పార్లమెంటు * 10న రాజ్యసభలో బిల్లు.. లోక్‌సభలో 11న? * బీజేపీ వైఖరిని బట్టబయలుచేసే వ్యూహంలో భాగంగానే ముందుగా రాజ్యసభలో విభజన బిల్లు * ఆ పార్టీ వైఖరి తేలిన తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై స్పష్టత వచ్చే అవకాశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణలు ఉంటాయా? రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు చేసిన సూచనల్లో వేటిని చేరుస్తారు? బిల్లులో ఉన్న వాటిలో వేటిని తొలగిస్తారు? రాష్ట్రం యావత్తూ ఎదురుచూసిన ఈ అంశంపై ఎటూ తేల్చకుండానే కేంద్ర మంత్రుల కమిటీ (జీవోఎం) మమ అనిపించింది. కొత్త రాజధాని ఏర్పాటుకు ఆర్థిక ప్యాకేజీపై ప్రతిపాదనలను మాత్రమే చేస్తూ.. సాంకేతిక సవరణలతో బిల్లును యథాతథంగా ఖరారు చేస్తూ కేబినెట్ నోట్‌కు ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రిమండలికి పంపనుంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే భారాన్ని కేంద్ర కేబినెట్‌కే వదిలేసింది. తెలంగాణ బిల్లుపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన జీవోఎం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు షిండే, ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్, జైరాం రమేశ్లతోపాటు హోంశాఖ సహాయ మంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో బిల్లు ఆమోదానికి, అమలుకు తలెత్తే న్యాయపరమైన సమస్యలు, సాంకేతిక అంశాలపైనే దృష్టి పెట్టినట్టు తెలిసింది. బిల్లుతో పాటు ఉండాల్సిన ఫైనాన్షియల్ మెమోరాండం, ఇతర అంశాలపై చర్చించింది. రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు ప్రతిపాదించిన 9,072 సవరణలను పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రధాన డిమాండ్లయిన పోలవరం ముంపు బాధిత ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ ఇవ్వడం వంటి అంశాలపై చర్చ జరిగినా.., వీటిపై నిర్ణయం తీసుకొనే భారాన్ని కేంద్ర మంత్రివర్గానికి వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పోలవరం ముంపు బాధిత ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంవల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు ఉండవన్న వాదన మినహా ఇతరత్రా ప్రయోజనం ఉండదని, అందువల్ల దీనిపై మార్పులు తగవని అభిప్రాయపడినట్లు తెలిసింది. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక ప్యాకేజీపై మాత్రమే బిల్లులో అదనంగా చేరే అవకాశం కనిపిస్తోంది. ప్యాకేజీ ఎంత అనేది కూడా కేబినెట్ నిర్ణయానికే వదిలేసినట్టు సమాచారం. ఇప్పుడు ఏ సవరణలు చేసినా డిమాండ్లకు అంతం ఉండదని, పార్లమెంటులో వచ్చే సవరణలకే బిల్లులో స్థానం కల్పించాలని జీవోఎం భావిస్తున్నట్టు తెలిసింది. చివరకు బిల్లులో సాంకేతిక అంశాలు మినహాయించి ఎలాంటి మార్పులు లేకుండానే ముగిస్తూ కేబినెట్ నోట్‌ను ఆమోదించినట్టు సమాచారం. అరగంటలోనే సమావేశం ముగియగా, జైరాం రమేశ్ తప్ప మిగతా మంత్రులందరూ వెళ్లిపోయారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ బిల్లు సిద్ధమైందని తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిని మంత్రిమండలి ఆమోదిస్తుందని, తర్వాత పార్లమెంటుకు వెళుతుందని చెప్పారు. జీవోఎం భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి జీవోఎం సభ్యులను కలిశారు. వీరు బిల్లుకు పలు సవరణలు సూచించినట్టు సమాచారం. కేబినెట్ భేటీ రేపు.. 10న రాజ్యసభలో బిల్లు బిల్లుపై జీవోఎం రూపొందించిన కేబినెట్ నోట్‌కు తుది రూపం ఇచ్చి, ఆమోదించడానికి కేంద్ర మంత్రి మండలి గురువారం సమావేశం కానుంది. అక్కడి నుంచి బిల్లు రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు చేరుతుంది. మరోవైపు బుధవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బిల్లును ఈనెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. అలాగే లోక్‌సభలో ఈనెల 11న బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముందుగానే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తన వైఖరిని వెల్లడించాల్సిన పరిస్థితిని కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. బీజేపీ వైఖరిని అనుసరించి మరునాడే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలా అన్నది నిర్ణయించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నెల 12న రైల్వేబడ్జెట్, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నందున, సభ సజావుగా సాగేందుకు సొంత పార్టీ నేతలు సహకరించేలా ఒప్పించేందుకు కాంగ్రెస్ వార్‌రూంలో అధిష్టానం చర్చలు జరిపింది. మరోవైపు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఇరుప్రాంతాల ఎంపీలతో సమావేశం కానున్నారు. మూజువాణి ఓటుతో ఆమోదించాలి: కేసీఆర్ రాష్ట్ర విభజన బిల్లును ఓటింగ్ లేకుండా మూజువాణి ఓటుతోనే ఆమోదించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అఖిలపక్ష సమావేశంలో కోరారు. ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మం త్రులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను ఇదే తరహాలో ఆమోదించారు. ఇప్పుడు కూడా అలాగే జరగాలి’’ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రికల క్లిప్పింగులను మంత్రి కమల్‌నాథ్‌కు అందజేశారు. టీ బిల్లును తెస్తున్నాం: ప్రధాని ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కీలకమైన తెలంగాణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తున్నాం. సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత తెలంగాణ బిల్లు లోక్‌సభకు వస్తోంది. సభ సజావుగా జరిగి బిల్లు పాస్ అవుతుందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. అవినీతి నిరోధం, మహిళా రిజర్వేషన్ బిల్లు, మత హింస బిల్లు వంటి ముఖ్యమైన చాలా అంశాలు పెండింగులో ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ, ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది, సభ సజావుగా జరిగేందుకు సహకరించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి సభ్యుడి విధి. సభ్యుడు లేవనెత్తే ఏ అంశం పైనయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందుతుందన్న విశ్వాసముందని ప్రధాని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
హోంశాఖ కార్యాలయం వద్ద టీడీపీ హడావుడి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) భేటీకి ముందు పయ్యావుల కేశవ్ నేతృత్వంలో సీమాంధ్ర టీడీపీ నేతలు హోంశాఖ కార్యాలయం ముందు కొద్దిసేపు హడావుడి చేశారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్‌ను ఘెరావ్ చేశారు. ఓ కార్యకర్త జైరాం రమేశ్ కాళ్లపై పడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి నారాయణస్వామిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పయ్యావుల ఏకంగా మంత్రి కారు ఎర్రబుగ్గను తీసి నేలకు కొట్టారు. హోంశాఖ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు వీరందరినీ బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేకుండా పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టడం చట్ట విరుద్ధమని పయ్యావుల కేశవ్ అన్నారు. పార్లమెంటుకు ఈ అధికారంలేదని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు రెండూ సమానమైనవేనని అన్నారు. -
విభజన దిశగా ముందడుగు
-
10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఓకే
* విభజన దిశగా ముందడుగు * ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013 ముసాయిదాకు ఆమోదం * 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు * పదేళ్ల పాటు జీహెచ్ఎంసీ ఉమ్మడి రాజధాని.. శాంతిభద్రతలు టీ-గవర్నర్‌కు * ప్రజల ప్రాణ, స్వేచ్ఛ, ఆస్తుల రక్షణ బాధ్యతలు కూడా.. సాయంగా ఇద్దరు కేంద్ర సలహాదారులు * ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని 45 రోజుల్లో ఖరారు.. ఎంపికకు నిపుణుల కమిటీ * కృష్ణా, గోదావరి నదీ జలాలపై పర్యవేక్షణ బోర్డులు.. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం * బొగ్గు, విద్యుత్, చమురు, గ్యాస్, ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై బిల్లులో నిర్దేశాలు * రెండు రాష్ట్రాల్లోనూ 371-డి కొనసాగింపు.. ప్రత్యేక హోదాతో సమాన అవకాశాల కల్పన * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనమండళ్లు కొనసాగింపు * విద్యా సంస్థల్లో ప్రస్తుత ప్రవేశ విధానాలే ఐదేళ్ల పాటు కొనసాగింపు * రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు * నేడు లేదా రేపు రాష్ట్రపతికి ముసాయిదా బిల్లు.. ఆర్టికల్ - 3 కింద రాష్ట్ర అసెంబ్లీకి * అసెంబ్లీ నుంచి బిల్లు తిరిగి రాష్ట్రపతికి.. అక్కడినుంచి మళ్లీ ప్రభుత్వానికి * మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో చర్చించి తెలంగాణ తుది బిల్లు ఖరారు * శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు వస్తుందని భావిస్తున్నామన్న షిండే * సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీ.. చర్చకురాని రాయల తెలంగాణ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013’ ముసాయిదాను గురువారం ఆమోదించింది. హైదరాబాద్ నగరాన్ని జీహెచ్ఎంసీ పరధిలో పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా చేస్తూ.. అందులో శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగిస్తూ.. కృష్ణా, గోదావరి నదులపై నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేస్తూ.. ఆస్తులు, అప్పుల పంపకానికి సవివరమైన విధివిధానాలను నిర్దేశిస్తూ రూపొందించిన ఈ బిల్లును శుక్ర, శనివారాల్లో రాష్ట్రపతికి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించారు. బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తీసుకోవాలని రాష్ట్రపతిని కోరతామని.. ఆయన ఆ బిల్లును అసెంబ్లీకి పంపిస్తారని ఆయన చెప్పారు. అసెంబ్లీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత తిరిగి కేంద్ర కేబినెట్లో చర్చించి తుది బిల్లును ఖరారు చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. బిల్లు విషయంలో అసెంబ్లీకి రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారనేది తనకు తెలియదని.. అయితే ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కేబినెట్‌కు ముందే ‘రాయల’ తొలగింపు... గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశానికి.. కేంద్రమంత్రులైన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా హాజరుకాలేదు. కేబినెట్ భేటీకి ముందు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో.. రాయల తెలంగాణ ప్రతిపాదనను నివేదిక నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రివర్గం ముందుకు వెళ్లిన జీవోఎం నివేదికలో రాయల తెలంగాణ ప్రస్తావనే లేదు. మంత్రివర్గం భేటీలో రాష్ట్ర విభజనపై జీవోఎం రూపొందించిన నివేదిక, ముసాయిదా బిల్లులపై కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా భద్రాచలం డివిజన్ మీదే దాదాపు 50 నిమిషాల పాటు చర్చ జరిగింది. భేటీ ముగిసిన తర్వాత హోంమంత్రి షిండే మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర విభజనపై తన అధ్యక్షతన ఏర్పాటయిన జీవోఎం ఏడు సార్లు సమావేశమైందని.. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో కూడా చర్చలు జరిపిందని పేర్కొన్నారు. జీవోఎంకు 11 అంశాలపై వచ్చిన 18 వేల వినతులను పరిశీలించామని తెలిపారు. తమకు ఇచ్చిన 11 మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గానికి సిఫారసులు చేశామని చెప్పారు. ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించిందని ప్రకటిస్తూ.. అందులోని ముఖ్యాంశాలు చదివి వినిపించారు. పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధాని... విభజన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలు, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉంటాయని షిండే ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రాంతం ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల కాలానికి మించకుండా ఉంటుందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి ప్రాణ, ఆస్తి, స్వాతంత్య్రాల భద్రతను కాపాడే ప్రత్యేక బాధ్యతను తెలంగాణ గవర్నర్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంలో గవర్నర్‌కు సహకారం అందించడానికి ఇద్దరు సలహాదారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు. విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిని గుర్తించటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఇది 45 రోజుల్లో సిఫారసులు సమర్పిస్తుందని వెల్లడించారు. కొత్త రాజధాని నిర్మాణానికి, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వనరుల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రమేయంతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఆస్తులు, అప్పులతో పాటు బొగ్గు, విద్యుత్, చమురు, సహజవాయువుల పంపిణీకి అనుసరించాల్సిన విధానాలను రూపొందించామన్నారు. విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పనకు వీలుగా రాజ్యాంగంలోని 371డీ అధికరణ రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే ఐదేళ్ల పాటు కొనసాగించనున్నామన్నారు. ఇరు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ముసాయిదా బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రపతికి పంపించనున్నట్లు షిండే చెప్పారు. (అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళుతున్నారు. తిరిగి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎప్పుడు బిల్లు సమర్పిస్తారో తెలియాల్సి ఉంది.) ..పార్లమెంటు స్తంభనకే సీమాంధ్ర ఎంపీల నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలను అడ్డుకోవాలని, మెజార్టీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విభజనను జాతీయ పార్టీల పెద్దల దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. పార్లమెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరాదని ఇప్పటికే టీడీపీ సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించగా, కాంగ్రెస్ ఎంపీలు సైతం అదే నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఇక రాష్ట్ర విభజన బిల్లు కేబినెట్ ముందుకు రావడానికి ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు.. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సుదీర్ఘ సమాలోచనలు సాగించారు. ఈ భేటీలో పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి పాల్గొన్నారు. -
కార్టూన్
జీవోఎం నివేదికలు అలానే సిద్ధం చేస్తారట! -
..ఇంకా ఉంది
* అసంపూర్తిగా ముగిసిన జీవోఎం భేటీ * నేటి రాత్రి 8 గంటలకు మళ్లీ మంత్రుల బృందం సమావేశం * రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదంటూ లీకులు * పరిణామాలను అంచనా వేసేందుకే?.. రేపు కేంద్ర మంత్రివర్గ భేటీ * అప్పటిదాకా నాన్చి, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం * 371డీ పై చర్చ, ఇరు రాష్ట్రాలకూ వర్తింపజేసే దిశగా యోచన? * రాయల తెలంగాణ గురించి తెలియదన్న షిండే సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) సమావేశం మంగళవారం అసంపూర్ణంగా ముగిసింది. కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించే ముందు ఇదే చివరి భేటీ అని భావించినప్పటికీ ఆ నివేదిక తుది రూపు సంతరించుకోనందున బుధవారం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదన తాలూకు పరిణామాలను అంచనా వేసేందుకు, గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగేదాకా విషయాన్ని నాన్చడానికే జీవోఎం తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సమావేశానంతరం విలేకరులకు వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటలకు జీవోఎం మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. అదే ఆఖరు సమావేశం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం కసరత్తు చేస్తోంది. అయితే ఆలోగా పరిష్కరించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి’’ అని చెప్పారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మాత్రం... బిల్లు ముసాయిదా సిద్ధమైందని, చట్టపరమైన అడ్డంకులు రాకుండా భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపారు. విభజన ప్రక్రియలో కీలకమైన అంకంగా అంతా భావిస్తున్న 371డీ అధికరణను రెండు రాష్ట్రాలకూ వర్తింపజేసే మార్గాంతరాలపై భేటీలో లోతుగా చర్చ జరిగిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అందుకు వీలుగా ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు’ను ‘ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిల్లు’గా మార్చాలని, అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం కూడా ఉండదని భావిస్తున్నట్టు కూడా తెలిపింది. ‘‘హైదరాబాద్ శాంతిభద్రతలు, రెవెన్యూ అంశాలను కేంద్రంచేతికి అప్పగించడంపై కూడా మల్లగుల్లాలు పడ్డారు. బిల్లు, జీవోఎం నివేదిక కలిపి 70 పేజీల దాకా ఉంటాయని జీవోఎం వర్గాలు తెలిపాయి’’ అని వివరించింది. మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో షిండే అధ్యక్షతన జరిగిన జీవోఎం భేటీలో సభ్యులు పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. జీవోఎం ఏర్పాటయ్యాక ఇలా మొత్తం సభ్యులు సమావేశం కావడం ఇదే తొలిసారి! జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా భేటీలో పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలో తెలంగాణ, రాయల తెలంగాణలతో పాటు జీవోఎం సిఫార్సులను ముసాయిదా బిల్లులో ఎలా చేర్చాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై స్పందనను బట్టి పరిణామాలను అంచనా వేయడానికి వీలుగా నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకున్నట్టు సమాచారం. అంతిమంగా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాల అమలును ఖరారు చేయడానికే జీవోఎం పరిమితమవుతుందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు సాగించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానించిన తెలంగాణ, తాజాగా తెర మీదకు తెచ్చిన రాయల తెలంగాణల్లో దేనిపైనా తుది నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం వరకు నాన్చి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని జీవోఎం సభ్యులు భావిస్తున్నారు. రెండు ప్రతిపాదనలనూ కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లి అక్కడ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ముగించకుండా, విరామమిచ్చి జనవరి వరకు పొడిగించడానికి సమాయాత్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాగే సాగతీత ధోరణి కొనసాగిస్తే తెలంగాణ బిల్లును 2014లోనే పార్లమెంటు ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. అదే జరిగితే రాయల తెలంగాణపైనా హడావుడిగా ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం దాకా సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావూరి సాంబశివరావు తదితర సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాటలను బట్టి చూస్తుంటే రాయల తెలంగాణపై జీవోఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ మేరకే ముసాయిదా బిల్లు తయారవుతోందని కూడా చెబుతున్నారు. జీవోఎం నివేదిక కూర్పుపై కసరత్తు సిఫార్సులను ముసాయిదా బిల్లులో పొందుపరచడంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జీవోఎం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రత, జన వనరుల పంపిణీ పర్యవేక్షణకు బోర్డులు, శాంతిభద్రతల సమస్య, మావోయిస్టులను ఎదుర్కోవడానికి ఉమ్మడి కార్యాచరణ తదితరాలు ముసాయిదాలో ఎలా ఉండాలనే దానిపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. వాటిపై సభ్యుల సూచనల మేరకు జైరాం సాంకేతిక కసరత్తు చేస్తున్నారు. సాయంత్ర 6.20కి జీవోఎం భేటీ ముగిశాక కూడా ముసాయిదా బిల్లు రూపకల్పన కసరత్తులో షిండే, జైరాం తనమునకలుగా గడిపారు. ఈ కసరత్తు భేటీ తర్వాత రెండు గంటలకు పైగా సాగింది. అంతకుముందు బిల్లు ముసాయిదా ప్రతిలో పొందుపరిచిన భాష, వాక్య నిర్మాణం సముచితంగా లేవని చిదంబరం అభిప్రాయపడ్డట్టు తెలిసింది. అంతకుముందు విభజన అనంతరం తెలంగాణ శాంతిభద్రతల అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులతో ఉదయం 11 గంటలకు షిండే సమీక్ష జరిపారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారి శశిధర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలతో పాటు నక్సలిజం పెరిగే అవకాశాలు, మతపరమైన ఘర్షణలకు సంబంధించిన అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. అనంతరం జైరాంతో గంట పాటు షిండే భేటీ అయ్యారు. నివేదికకు తుదిరూపు ఇవ్వడంపై తర్జనభర్జనలు పడ్డారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, శాంతిభద్రతలు, న్యాయపరమైన చిక్కులను దాటడం, జల వనరుల బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించారు. అనంతరం న్యాయ, జలవనరుల శాఖల అధికారులను జైరాం పిలిపించుకుని మాట్లాడారు. 371డి, 371ఇ అధికరణాలపై కూడా చర్చ జరిపారు. 371ను ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రాయల తెలంగాణ గురించి తనకు తెలియదని జైరాంతో భేటీ అనంతరం షిండే విలేకరులతో అన్నారు. ‘విభజనపై ఇదే చివరి భేటీ. ఈ రోజు జీవోఎం నివేదికను ఆమోదిస్తాం. 5న కేబినెట్ సమావేశం ఉంటుంది. నివేదికను కేబినెట్‌కు అందించాక అంతా ప్రధానే చూసుకుంటారు’ అంటూ వెళ్లిపోయారు. సీమాంధ్ర మంత్రుల ‘యూటీ’ యత్నాలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాద్‌పై తాము కోరుతున్న మేరకు ఆంక్షలు విధించేలా చేసేందుకు తుది ప్రయత్నాలు చేశారు. జీవోఎం సమావేశానికి ముందు షిండేను కేంద్ర మంత్రి చిరంజీవి ఆయన కార్యాలయంలో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను శాశ్వత యూటీ చేయాలని మరోసారి ప్రతిపాదించారు. మరో మంత్రి జేడీ శీలం కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్‌ను కలిసి, హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్‌ను పరిగణించాలని కోరినట్టు తెలిసింది. కానీ వారి విజ్ఞప్తికి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ‘యూటీతో ఏ ప్రాంతానికీ పెద్దగా లాభం ఉండకపోవచ్చు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతికి అప్పగించే కసరత్తు చేస్తున్నాం’ అని షిండే, సిబల్ చెప్పారంటున్నారు. ఇక జీవోఎం భేటీ అనంతరం షిండే, జైరాంలతో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, శీలం సమావేశమై, ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని కోరారు. అనంతరం బయటికొచ్చిన కావూరి, మీడియాతో మాట్లాడేందుకు ఆస్తకి చూపలేదు. కేంద్రం రాయల తెలంగాణ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోందంటూ వెళ్లిపోయారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని శీలం అన్నారు. -
కార్టూన్
మీటింగ్‌కి ఇంకా రెండు నిమిషాల టైముంది.. ఈ లోగా మరో రెండు ప్రతిపాదనలు చేరిస్తే పోలా..! -
ఆ రెండు జిల్లాలను కలిపినా అది తెలంగాణే
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపినా కూడా.. తెలంగాణ తెలంగాణగానే ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాయల తెలంగాణపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయాన్ని తాను ఖండించదలచుకోలేదని బదులిచ్చారు. ‘సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.. కానీ సీమలోని రెండు జిల్లాలు అనంతపురం, కర్నూలులను కూడా తెలంగాణతో కలిపితే అది రాయల తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినట్లవుతుంది కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘ముందు జీవోఎం నివేదికలో ఏముందో బహిర్గతం కానివ్వండి. దాని సిఫారసుల కోసం వేచిచూద్దాం’’ అని ఆయన బదులిచ్చారు. జీవోఎం సిఫారసుల ఆధారంగా ముసాయిదా బిల్లు తయారవుతుందని, ఆ తర్వాత దాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారని, ఆ తర్వాతే దీనిపై తాను స్పందిస్తానని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఈ విషయమై తాము జరుపుతున్న ప్రైవేటు చర్చల వివరాలను బహిరంగపరచలేమన్నారు. ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే అభిప్రాయం కోరుతూ రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందన్నారు. -
రాయల కలకలం
* కొత్త చిచ్చు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం * మొదటి నుంచీ 10 జిల్లాల తెలంగాణ అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ * ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంటూ జోరుగా ప్రచారం * దీనికి మన్మోహన్, సోనియా ఓకే చెప్పారంటూ వార్తలు * ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్న మెజారిటీ పార్టీలు * రాజకీయ లాభం కోసమే ‘రాయల టీ’ ఎత్తుగడ? * జీవోఎం సిఫార్సులపై నేడో రేపో కేంద్ర కేబినెట్ తుది నిర్ణయం * అసెంబ్లీ సమావేశాలపై నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. రాయల తెలంగాణకు ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారన్న ప్రచారం నేతల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాయల తెలంగాణ కేంద్రంగానే కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విభజన తుది నిర్ణయం కావచ్చన్న అభిప్రాయమూ కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది. మెజారిటీ ప్రజలు, పార్టీలు వ్యతిరేకిస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెరముందుకు తేవడం వెనుక ఆంతర్యంపై పలురకాల ఊహాగానాలు సాగుతున్నాయి. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనే ప్రచ్ఛన్న ఎజెండాను కాంగ్రెస్ ఇప్పుడు ముందుకు తె చ్చిందని అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచీ 10 జిల్లాల తెలంగాణ అని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ మాత్రమే. సీడబ్ల్యూసీ తీర్మానం ఆధారంగా కేంద్ర హోం శాఖ కేబినెట్‌కు అందించిన నోట్లో కూడా పది జిల్లాల తెలంగాణను మాత్రమే ప్రతిపాదించారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే కేంద్ర హోం శాఖ పదకొండు అంశాలను జీవోఎం పరిశీలనకు పంపింది. మంత్రుల బృందం కూడా గత కొద్దిరోజులుగా ఈ దిశగానే కసరత్తు సాగించింది. మధ్యలో రాయల తెలంగాణ గురించి ఒకరిద్దరు నేతలు ప్రస్తావన తెచ్చినా దానికి అంతప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. ఈ ప్రతిపాదనలకు ఆదిలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి విముఖత వచ్చింది. సీమాంధ్ర నేతలు, ప్రజలు తాము రాష్ట్ర సమైక్యాన్నే కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. రాయలసీమను విభజిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆప్రాంత ప్రజలు తీవ్రంగానే స్పందించారు. ఇక తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నేతలు రాయల తెలంగాణను అంగీకరించేది లేదని కరాఖండీగా ప్రకటించారు. టీఆర్ఎస్, బీజేపీ ఈ ప్రతిపాదన ను ఆమోదించబోమని, పార్లమెంటులో, అసెంబ్లీలో దీన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంచేశాయి. ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ ప్రాతిపాదననే కాంగ్రెస్, కేంద్రం ఇప్పుడు తెరపైకి తేవడం వేరే రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. నేడు కేబినెట్ భేటీ ఉంటుందా? పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిదో తేదీ నుంచి ప్రారంభం కానున్నందున మూడో తేదీనే ప్రత్యేక కేబినెట్ భేటీని నిర్వహించాలని కేంద్రం పెద్దలు ఇదివరకు భావించారు. జీవోఎం అదే రోజు తుది నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుండడం, కీలక నేతలు దానిపై దృష్టి సారించాల్సి ఉండడంతో మంగళవారం కేబినెట్ భేటీ ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇది బుధవారానికి వాయిదా పడవచ్చంటున్నారు. రాజకీయ ప్రయోజనానికేనా.. సొంత ప్రయోజనాలతో పాటు రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కర్నూలు, అనంతపురంలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇరురాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు 147 చొప్పున, లోక్‌సభ స్థానాలు 21 చొప్పున సరిసమానంగా ఉంటాయి. పైగా కృష్ణా జలాలకు సంబంధించి కీలక సమస్యగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధిష్టానం పెద్దలు పైకి చెబుతున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలపడమన్న కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. నిజానికి ఆ వాదనలో బలం లేదని అన్ని పార్టీల నేతలూ చెబుతున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమన్న టార్గెట్‌తోనే అధిష్టానం ముందుకు పోతోందని చెబుతున్నారు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ.. రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం జరగనుంది. రాష్ట్ర విభజనపై జీవోఎం తుది నివేదికను ఖరారు చేయనుండటం, కేంద్ర కేబినెట్ దానికి ఆమోదముద్ర వేయనున్నట్లు వస్తున్న వార ్తల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక, రాయల తెలంగాణ, అసెంబ్లీ సమావేశాల తేదీలకు సంబంధించి ప్రధాన చర్చ సాగవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీకి హాజరవ్వాల్సి ఉండడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కొందరు రాష్ట్ర మంత్రులు సోమవారం నాటి తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై తెలంగాణ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో కేబినెట్ భేటీలో ఏం జరగబోతుందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. -
నేడు జీవోఎం తుది భేటీ
* నివేదిక, టీ ముసాయిదా బిల్లుకు లాంఛనంగా ఆమోదం * రేపు లేదా ఎల్లుండి కేబినెట్ పరిశీలన? * జీవోఎం నివేదికపై సర్వత్రా ఉత్కంఠ * ‘రాయల’కు మొగ్గితే బిల్లుకు ఆమోదం కష్టమేనంటున్న కాంగ్రెస్ ముఖ్యులు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం. గత వారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల మేరకు.. నివేదిక, బిల్లులో చేయాల్సిన చివరి మార్పుచేర్పులు పూర్తిచేసి జీవోఎం సభ్యులు వాటిని లాంఛనంగా ఆమోదిస్తారని హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌కు సమర్పించాల్సిన విభజన నివేదికపై సభ్యులందరూ సంతకాలు చేయటంతో జీవోఎంకు అప్పగించిన పని పూర్తవుతుందని, ఆ తర్వాత ఈ నివేదిక కేబినెట్ ముందుకు వెళ్తుందని వారు చెప్పారు. సిఫారసులు ఎలా ఉంటాయో..! జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. జీవోఎం లాంఛనంగా ఆమోదించేవరకు నివేదికలోని ఏ అంశాన్నయినా ఫైనల్ అని పేర్కొనటం కుదరదని, రాజకీయ నిర్ణయం ప్రకారం ఆఖరి క్షణాల్లో ఏ మార్పులైనా జరగవచ్చని హోంశాఖ వర్గాలు సోమవారం ‘సాక్షి’కి వివరించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో మొత్తం 69 పేజీలుంటాయని ప్రచారం జరుగుతోంది. చివరి క్షణాల్లో జరిగే మార్పులతో ఈ బిల్లు స్వరూపం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. రేపు లేదా ఎల్లుండి కేబినెట్? జీవోఎం ఆమోదముద్రతో విభజన నివేదిక, బిల్లును కేంద్ర కేబినెట్ బుధ లేదా గురువారం జరిపే సమావేశంలో పరిశీలించవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీ 4వ తేదీన బుధవారం ఉంటుందని షిండే కొద్ది రోజుల కింద చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం బుధవారం కేబినెట్ సమావేశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రతివారం ఆనవాయితీగా గురువారం కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నందున ఈసారి కూడా 5వ తేదీ గురువారమే కేబినెట్‌ను సమావేశపరుస్తారని చెప్తున్నారు. ఏ రోజున కేబినెట్ భేటీ జరిగినా తప్పకుండా జీవోఎం నివేదిక, విభజనపై ముసాయిదా బిల్లును అందులో చర్చించి ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలూ గట్టిగా చెప్తున్నాయి. కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటు నుంచి రాష్ట్ర శాసనసభకు వెళ్తుంది. ‘రాయల’కు మొగ్గితే ఆమోదమెలా? విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్రకారం రాయల తెలంగాణ ఏర్పాటుకు జీవోఎం సిఫారసు చేస్తుందా? లేదా తెలంగాణ, రాయల తెలంగాణ రెండు ప్రతిపాదనలనూ కేబినెట్ ముందుంచి చేతులు దులుపుకుంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. జీవోఎం ఒకటి కాకుండా రెండు ప్రతిపాదనలతో నివేదిక సమర్పించిన పక్షంలో కేబినెట్ సమావేశంలో గరంగరం చర్చ తప్పదని తెలుస్తోంది. కేబినెట్ హోదా మంత్రుల్లో జైపాల్‌రెడ్డి, కిశోర్‌చంద్రదేవ్‌లు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. యూపీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన మంత్రులు కూడా రాయల తెలంగాణకు అనుకూలంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రాయల తెలంగాణవైపే మొగ్గితే పార్లమెంటులో విభజన బిల్లుకు ఆమోదం సాధించడం ఎలాగన్నది కాంగ్రెస్ వ్యూహకర్తలకు తలనొప్పిగా మారింది. యూపీఏ నుంచి అనేక పార్టీలు, మరీ ముఖ్యంగా డీఎంకే నిష్ర్కమించిన దరిమిలా పార్లమెంటు ఉభయసభల్లో ప్రభుత్వానికి మెజారిటీ కొరవడి ఎలాగో నెట్టుకొస్తున్న తరుణంలో విభజన బిల్లు వంటి అతి ముఖ్యమైన బిల్లుకు, అందునా ఇతర పక్షాలు వ్యతిరేకించే అంశాలతో ఉన్న బిల్లుకు ఆమోదం పొందటం తేలిక కాదన్నది వారి అంతరంగంగా ఉన్నట్లు ఏఐసీసీ కీలక నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకే ఆమోదం కష్టమనుకుంటున్న తరుణంలో రాయల తెలంగాణగా మారిస్తే ఉభయసభల సమ్మతి సంపాదించడం గగనమేనని, ఈ బిల్లు కూడా పెండింగ్ జాబితాలో చేరిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. -
కొలిక్కిరాని జీవోఎం సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) సంప్రదింపుల కొలిక్కి రాలేదు. ఒకట్రెండు రోజుల్లో మరోసారి జీవోఎం సభ్యులు భేటీ కానున్నారు. ఈ సాయంత్రం పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో జీవోఎం కీలక సమావేశం జరిగింది. గులాంనబీ ఆజాద్ మినహా మిగతా సభ్యులందరూ భేటీకి హాజరయ్యారు. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో కీలక శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల బృందం విడివిడిగా చర్చలు జరిపింది. ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్ ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు జీవోఎం వరుస భేటీలు నిర్వహిస్తోంది. అయితే కీలకమైన హైదరాబాద్ విషయంలో పీటముడి వీడకపోవడంతో మంత్రులు జుట్టు పీక్కుంటున్నారు. హైదరాబాద్‌పై పరిమిత ఆంక్షలతో తెలంగాణ ఏర్పాటు దిశగా జీవోఎం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
2014లోపే తెలంగాణ: తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం(జీజోఎం) ఎదుట తెలంగాణ కేంద్ర మంత్రులు తమ వాదనలు వినిపించారు. ఎస్. జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ ఈ ఉదయం జీఓఎంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన పూర్తి తెలంగాణ కావాలని జీఓఎంను కోరామని భేటీ అనంతరం ఎస్ జైపాల్‌రెడ్డి విలేకరులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరామన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని సూచించామన్నారు. కృష్ణా జలాలకు ట్రిబ్యునల్ అవసరమే కానీ, గోదావరికి అవసరం లేదన్నారు. 2014లోపే రాష్ట్ర విభజన జరుగుతుందని జైపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాచలం తెలంగాణలో భాగమని మరో కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉంచాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ వెల్లడించారు. డిసెంబర్ చివరినాటికి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని జీఓఎంను కోరినట్లు మరో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా ఉమ్మడి రాజధాని లేదని గుర్తు చేశారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలన్నారు. జీఓఎంకు12 పేజీలతో కూడిన నివేదిక సమర్పించామని తెలిపారు. అయితే దీన్ని మీడియాకు విడుదల చేసేందుకు మంత్రులు నిరాకరించారు. -
జైపాల్ రెడ్డి నివాసంలో టి.కాంగ్ నేతల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందానికి(జీఓఎం)కు వినిపించాల్సిన అంశాలపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రాంరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ బిల్లుకు తుది రూపం ఇచ్చే పనిలో జీవోఎం నిమగ్నమై ఉండటంతో సదరు బిల్లులో ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడి తేవాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఇక్కడకు వచ్చారు. దీంతోపాటు సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించాలని భావించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసి జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని హస్తినకు విచ్చేశారు. -
చివరియత్నం చేస్తాం: పురందేశ్వరి
విశాఖపట్టణం: సమైక్యాంధ్ర కోసం జీవోఎమ్ సమావేశంలో చివరియత్నం చేస్తామని కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. జీవోఎమ్ ముందు తమ వాదనలు సమర్థవంతంగా విన్పిస్తామని ఆమె అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాదనలు విన్పిస్తామన్నారు. గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, ఇక చేయాల్సింది ఏమీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. బ్రస్ట్ కేన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో నిర్వహించిన పింక్ రిబ్బన్ వాక్‌ను ఈ ఉదయం పురందేశ్వరి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వచ్చారు.. వెళుతున్నారు!
-
వచ్చారు.. వెళుతున్నారు!
* ఢిల్లీ వచ్చి ఎవరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టిన టీ-కాంగ్రెస్ నేతలు * జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో జానారెడ్డి సహా పలువురు నేతల తిరుగుపయనం న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. కేంద్ర మంత్రివర్గ బృంద(జీవోఎం) సభ్యులతోపాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని శుక్రవారం ఢిల్లీ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టారు. హైకమాండ్ పెద్దలు, జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడం, ఆదివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలియడంతో చేసేదేమీలేక వెళ్లిపోయారు. వాస్తవానికి తెలంగాణ బిల్లుకు తుది రూపం ఇచ్చే పనిలో జీవోఎం నిమగ్నమై ఉండటంతో సదరు బిల్లులో ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడి తేవాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా నిర్ణయించారు. దీంతోపాటు సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించాలని భావించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసి జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని షెడ్యూల్ రూపొందించుకుని పనులన్నీ వాయిదా వేసుకుని మరీ ఢిల్లీ వచ్చారు. జైపాల్‌రెడ్డి ఇంట్లో భేటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డీకే అరుణ, పి.సుదర్శన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పి.బలరాం నాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటర మణారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్, భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ సహా పలువురు నేతలు శుక్రవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. వారంతా నేరుగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కేంద్ర మంత్రులతో జీవోఎం సమావేశం కానున్న నేపథ్యంలో ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై కొద్దిసేపు చర్చించారు. తర్వాత జీవోఎం సభ్యులతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఇతర హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఫోన్లో ప్రయత్నించగా, వారెవరూ ఢిల్లీలో అందుబాటులో లేరని తెలిసింది. దీంతో ఆయా నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఉన్నారని తెలియడంతో కనీసం ఆయననైనా కలవాలనే ఉద్దేశంతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. మరోవైపు శని, ఆది వారాల్లో కూడా జీవోఎం సభ్యులు, హైకమాండ్ పెద్దలు హస్తినలో అందుబాటులో ఉండే అవకాశాల్లేవని తేల డంతో ఇక అక్కడ ఉండటం అనవసరమనే భావనకు వచ్చా రు. జానారెడ్డి, డీకే అరుణ, సుదర్శన్‌రెడ్డి, భిక్షమయ్య గౌడ్ సహా పలువురు నేతలు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జీవోఎంకు నివేదిక అందజేసే బాధ్యతను జైపాల్‌రెడ్డి, రాజనర్సింహకు అప్పగించినట్లు సమాచారం. అహ్మద్‌పటేల్ అపాయింట్మెంట్ కోసం యత్నం.. కొందరు నేతలు మాత్రం పనులన్నీ వాయిదా వేసుకుని ఎలాగూ ఢిల్లీ వచ్చామని, రెండ్రోజులు ఇక్కడే ఉండి సొంత పనులు చక్కదిద్దుకుంటామని చెప్పారు. సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ఢిల్లీలోనే ఉన్నారని సమాచారం ఉండటంతో ఆయన అపాయింట్మెంట్ కోసం యత్నిస్తున్నారు. మంత్రులంతా హైదరాబాద్ వెళ్లిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో ఢిల్లీకి రావడం గమనార్హం. మరోవైపు హస్తినలోనే ఉండిపోయిన నేతలకు కేంద్ర మంత్రి బలరాం నాయక్ విందునిచ్చారు. నేడు రాహుల్‌తో డిప్యూటీ సీఎం భేటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు శనివారం రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. -
సీఎం హిట్ వికెట్
-
సీఎం హిట్ వికెట్
* సమైక్యవాది అనిపించుకునే యత్నంలో సీఎం సెల్ఫ్‌గోల్ * విభజనకు నిరసనగా ఢిల్లీ పర్యటన వాయిదా అంటూ సొంత చానల్లో ప్రచారం * అధిష్టానాన్ని ధిక్కరించి జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ కథనాలు * బాలల దినోత్సవంలో పాల్గొనాల్సి ఉండడం వల్లే సీఎం ఢిల్లీ రాలేదని బయటపెట్టిన షిండే హోంమంత్రి ప్రకటనతో ఫెయిలైన సీఎం ప్లాన్ సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మట్టికరవనున్న సీమాంధ్రలో సమైక్య హీరో అనిపించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ దఫా తన మంత్రివర్గ సహచరుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసి పావులు కదిపారు. గురువారం సీఎం జీవోఎం ముందు హాజరై ప్రభుత్వ పరంగా విభజనపై పలు అంశాలను వివరించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ బాలల చలనచిత్ర కార్యక్రమ ప్రారంభోత్సవం ఉన్న కారణంగా కేంద్ర మంత్రికి సమాచారం ఇచ్చి ఆయన పర్యటన 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే సమైక్యం కోసం కట్టుబడి ఉన్నందునే సీఎం జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ తన సొంత టీవీ చానల్లో ప్రచారం మొదలుపెట్టారు. భేటీకి రాకుండా అధిష్టానాన్ని ధిక్కరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌ను మార్చి ఆ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణను కూర్చోబెట్టాలని పెద్దలు నిర్ణయించారంటూ ఆయన సన్నిహితులతో లీకులిప్పించారు. తద్వారా కన్నాను దెబ్బతీయడంతోపాటు తనకుతానుగా సమైక్యం కోసం కట్టుబడి ఉన్నట్టుగా చిత్రీకరించుకునే వ్యూహంతో కిరణ్‌కుమార్ రెడ్డి ముందుకువెళ్లారు. అయితే ముఖ్యమంత్రి జీవోఎం ముందు హాజరుకాకపోవడానికి బాలల చలనచిత్రోత్సవ కార్యక్రమమే కారణమని స్వయంగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన చేయడంతో కిరణ్ ప్లానంతా ఫెయిలైంది. షిండే ప్రకటనతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిని ఇదంతా కిరణ్ ఒక ఎత్తుగడ ప్రకారం చేసిన డ్రామాయేనని సాయంత్రానికి తేల్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రందాకా లీకులే లీకులు.. రాష్ట్ర విభజనపై తమ ముందుకు రావలసిందిగా కిరణ్‌ను జీవోఎం ఆదేశించినట్లు, గురువారం రాత్రి 8 గంటలకు సమయాన్ని ఖరారు చేసినట్లు బుధవారమే సీఎం కార్యాలయవర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నట్లు కూడా బుధవారం ప్రకటించారు. అయితే గురువారం ఉదయానికే సీన్ మారిపోయింది. సీఎం కిరణ్ జీవోఎం ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడం లేదని టీవీ చానళ్లకు లీకులు అందాయి. దాంతో పాటు సొంత చానల్లో అదే విషయాన్ని ఊదరగొట్టారు. మంత్రుల బృందం రాష్ట్ర విభజన సమస్యలపై ఏర్పడినందున దాని ముందు హాజరుకావడమంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని, అందుకే సీఎం కిరణ్ ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారని వ్యూహాత్మకంగా ప్రచారం చేయించారు. సమైక్యవాదం కోసం అధిష్టానాన్ని, కేంద్రమంత్రుల బృందాన్నీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎదిరించి నిలబడుతున్నారన్న కలరింగ్ ఇప్పించారు. ఒకే దెబ్బకు ‘కన్నా’ వికెట్ కూడా.. కన్నా లక్ష్మీనారాయణ మూడు రోజుల కిందట సోనియాగాంధీని కలిసిన నేపథ్యంలో దీనిపైనా సీఎం ప్రచారాన్ని సాగించారు. సమైక్యవాదిగా సీఎం ధిక్కారస్వరం తీవ్రమైందని, అందుకే జీవోఎంకు వెళ్లడం లేదని, ఆయన్ను మార్చాలన్న ఆలోచనతోనే సోనియాగాంధీ స్వయంగా కన్నాను పిలిచి మాట్లాడారన్న కథనాలు ప్రసారమయ్యేలా చేశారు. నిజంగానే సీఎం అధిష్టానాన్ని, కేంద్రాన్ని ధిక్కరించే ఢిల్లీకి వెళ్లడం లేదా? అన్న అనుమానం వచ్చిన కొంతమంది తెలంగాణ నేతలు దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. ఈనెల 25వ తేదీకి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్య వాదం వినిపిస్తున్న కారణంగానే కిరణ్‌ను మార్చాలన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టుగా ఆయనకు ఆయనే ప్రచారంలో పెట్టించడంతో పాటు ఇటీవలి కాలంలో తనకు దూరమైన కన్నా లక్ష్మీనారాయణను విభజన వాదిగా ముద్రవేయాలన్న ప్రణాళికబద్ధంగా ఇదంతా చేశారని కాంగ్రెస్‌లో గుప్పుమంటోంది. జీవోఎం సమయమే కేటాయించలేదు: యాదవరెడ్డి మంత్రుల బృందం కిరణ్‌కు గురువారం సమయమే కేటాయించలేదని జీవోఎం అధికారులు తమకు చెప్పారని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ యాదవరెడ్డి మీడియాకు చెప్పారు. మరికొందరు నేతలూ ఇదే అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు కేంద్రమంత్రి మనీష్ తివారీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున సీఎం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు వీలుగా భేటీని వాయిదా వేయాలని కేంద్ర మంత్రే జీవోఎంకు లేఖ రాశారని, ఆ కారణంగానే సీఎం ఢిల్లీ పర్యటన 18కి వాయి దా పడిందని సాయంత్రానికి సీఎంవో మీడియాకు వివరణ ఇచ్చింది. సీఎం మార్పు ఉండదు: మంత్రులు తాజా కథనాలపై సీఎం సన్నిహిత మంత్రులు కూడా వేర్వేరుగా స్పందించారు. సీఎంను మార్చడం అంత సులభమైన విషయం కానేకాదని, విభజన నిర్ణయంతో ఇప్పటికే ఒక తప్పుచేసిన పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుతో మరో తప్పు చేయబోదని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగానైనా తప్పుకోవాలని, శాసనసభాపక్ష సమావేశం పెట్టయినా నిర్ణయం తీసుకోవలసి ఉందని అన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో ఏక వాక్య తీర్మానంతో సీఎం ఎంపిక కుదరబోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఈ సమయంలో ఎవరు ఢిల్లీకి వెళ్లినా సీఎం మార్పు జరుగుతుందనే ప్రచారం సాధారణమైపోయిందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మనీష్ తివారీ హైదరాబాద్‌కు రావడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని మరో మంత్రి శైలజానాథ్ తెలిపారు. ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ప్రచారం మీడియాలోనే జరుగుతోందని, తమకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని స్పష్టంచేశారు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే: కన్నా తనపై జరిగిన ప్రచారాన్ని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. తాను సమైక్యవాదినేనని, అధిష్టానంతో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివెనుక ఎవరున్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇదంతా జరిగిందన్నారు. -
రావణ కాష్టాన్ని ఆర్పండి: సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాష్ట్రం రావణకాష్ఠంలా మారింది. దీన్నిలా తగలబడనివ్వొద్దు. వెంటనే పరిష్కారం చూపాలి. విభజన వల్ల పరిష్కారమయ్యే సమస్యలకన్నా ఉత్పన్నమయ్యేవే చాలా ఎక్కువ. కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి’’ అని కేంద్ర మంత్రుల బృందాన్ని సీపీఎం కోరింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డిలతో కూడిన బృందం బుధవారం ఉదయం జీవోఎం సభ్యులతో భేటీ అయింది. అనంతరం రంగారెడ్డితో కలిసి రాఘవులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, మంత్రులు జైరాం రమేశ్, వీరప్ప మొయిలీలకు తమ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ఇవ్వడంతో పాటు వివరించామన్నారు. ‘‘నాలుగేళ్లుగా సమస్యను నానబెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పాలన స్తంభించింది. మంత్రివర్గం రెండు ముఠాలై యుద్ధ శిబిరాల్లా నడుస్తోంది. ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించే నాథుడు కనబడటం లేదు. అభివృద్ధి కుంటుపడింది. ఇంకా మీరు ఈ సమస్యని సాగదీసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటే ప్రజలు క్షమించరని జీవోఎంకు చెప్పాం. ఏదో ఒక నిర్ణయం చెబుతామని గతంలో చెప్పి కూడా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈసారైనా నాటకాలు కట్టిపెట్టి పరిష్కారం చూపుతారా లేదా అని నిలదీశాం’’ అన్నారు. రెండే అడిగారు... పోలవరం, భద్రాచలం డివిజన్‌ను విడదీయడంపై జీవోఎం తమను అభిప్రాయం కోరిందని రాఘవులు వెల్లడించారు. ‘ప్రస్తుత డిజైన్‌లో పోలవరం ప్రాజెక్టు గిరిజనులను, విలువైన భూముల్ని ముంచేస్తుంది. కాబట్టి డిజైన్ మార్చాలన్నాం. ఇక రాష్ట్రాన్నే విడదీయొద్దని మేమంటున్నప్పుడు ఖమ్మం జిల్లాను విడదీయాలని కోరబోమని చెప్పాం. జీవోఎం ముందు నాలుగు ప్రధాన సమస్యల్ని లేవనెత్తాం. సమైక్యంగా ఉన్నా, విభజించినా వెనకబడిన ప్రాంతాలు, జిల్లాల సమస్య ముఖ్యమైనది. అందుకే సమైక్య రాష్ట్రంలో కూడా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్ట సూచనలు చేశాం. వాటిని జీవోఎం సభ్యులు సావధానంగా విన్నారు’ అని చెప్పారు. " సీపీఎం లేవనెత్తిన నాలుగు అంశాలు... 1. సాగునీటి సౌకర్యాలకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు ప్రాతిపదికగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు వర్తించే ప్రాజెక్టుల పరిపూర్తికి అయ్యే ఖర్చునంతా కేంద్రం భరించాలి. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లిలను కేంద్ర నిధులతో పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులనూ త్వరగా పూర్తి చేయాలి. 2. సామాజిక తరగతులు, దళితులు, ముస్లింలు, గిరిజనుల వెనకబాటే పలు ప్రాంతాల వెనకబాటుతనానికి ముఖ్య కారణం. వారి అభ్యున్నతికి, విద్యాపరంగా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 3. చిత్తూరు నుంచి ఆదిలాబాద్ దాకా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న పశ్చిమ ప్రాంత మండలాల్లో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్ని అదనంగా ఏర్పాటు చేయాలి. 4. కోస్తా తీరంలో ఓడరేవులకు పనికొచ్చే కేంద్రాలెన్నో ఉన్నా ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలి. రాయలసీమలో కూడా అన్ని సదుపాయాలతో ఒకట్రెండు ప్రాంతాల్లో పారిశ్రామికంగా, విద్యాపరంగా, సేవాపరంగా అభివృద్ధికి ప్రభుత్వరంగంలో కాంప్లెక్సుల స్థాపనకు చర్యలు తీసుకోవాలి జీవోఎంకు సీపీఎం బృందం సమర్పించిన నాలుగుపేజీల వినతిపత్రంలోని ఇతర ముఖ్యాంశాలివి... * కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు రాష్ట్రానికి సరైన న్యాయం చేయలేదు. అందుకే న్యాయమైన పద్ధతిలో రాష్ట్రానికి అదనపు నికర జలాలను కేటాయించేలా ఎగువ రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందాలు కుదర్చాలి * అక్షరాస్యతలో బాగా వెనకబడిన ప్రతి మండలంలోనూ కనీసం రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో విద్యా కాంప్లెక్సులు ఏర్పాటు చేయాలి * హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పరిశోధనా సంస్థలన్నింటినీ అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలి * ముస్లిం ప్రాబల్య పట్టణాల్లో వారికోసం ఆధునిక, లౌకిక విద్యనందించే విద్యా కాంప్లెక్సులు నెలకొల్పాలి * అభివృద్ధిని ఉత్తర తెలంగాణ, రాయలసీమల్లోని పలు జిల్లాలకు వికేంద్రీకరించాలి. ఆయా కేంద్రాలను మార్కెట్లతో సంధానిస్తూ ఆధునిక రవాణా మార్గాలు నిర్మించాలి * రాష్ట్రంలోని గ్యాస్, బొగ్గు ఉత్పత్తుల్లో రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యమిస్తూ కేటాయింపులను కేంద్రం తిరిగి నిర్ణయించాలి -
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి
* జీవోఎంతో సమావేశం * 21న కేంద్ర మంత్రివర్గానికి టీ-బిల్లు * ఆ రోజే ఆమోదం, రాష్ట్రపతికి నివేదన * బిల్లును అసెంబ్లీకి పంపనున్న ప్రణబ్ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. తెలంగాణ బిల్లు చకచకా సిద్ధమవుతోందని, దాన్ని నవంబర్ 21న కేంద్ర మంత్రివర్గానికి సమర్పించనున్నారని సమాచారం. అదే రోజున బిల్లుకు మంత్రివర్గం ఆమోదం కూడా తెలుపుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విభజన విధి విధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తాను కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదికకు ఇప్పటికే తుది రూపునిస్తోంది. రాష్ట్రానికి చెందిన పార్టీలతో భేటీలు పూర్తి చేసిన జీవోఎం, కేంద్ర శాఖల కార్యదర్శులతో సమావేశాలను కూడా గురువారంతో ముగించనుంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రితో కూడా సమావేశమయ్యాక నివేదిక కసరత్తును అది వేగవంతం చేయనుంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో ఈ నెల 18న జరిపే భేటీతో జీవోఎం పని పూర్తవుతుంది. ఆ వెంటనే అది నివేదికను పూర్తి చేసి ఈ నెల 21న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించనుంది. జీవోఎం నివేదికతో పాటే తెలంగాణ బిల్లు కూడా సిద్ధమవుతుందని, దానికి 21నే మంత్రివర్గం ఆమోదం కూడా తెలుపుతుందని చెబుతున్నారు. అనంతరం తెలంగాణ బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. బిల్లును పరిశీలించే క్రమంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించే ఆస్కారముంది. అవసరమనుకుంటే మరింత స్పష్టత, వివరణ వంటివి కోరుతూ బిల్లును మంత్రివర్గానికి ఆయన తిప్పి పంపవచ్చు. అనంతరం బిల్లుపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుతూ శాసనసభకు ఆయన పంపుతారు. అభిప్రాయం తెలిపేందుకు అసెంబ్లీకి ఎంత గడువివ్వాలన్నది కూడా రాష్ట్రపతి విచక్షణకు లోబడే ఉంటుంది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయనందున, మూడు రోజుల ముందు నోటీస్ జారీ చేసి దాన్ని సమావేశపరిచే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. రాష్ట్రపతి నుంచి బిల్లు అందిన మూడు నాలుగు రోజుల్లోనే అసెంబ్లీని స్పీకర్ సమావేశపరుస్తారని జీవోఎం వర్గాలంటున్నాయి. అంతా కేంద్రం అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ 5న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. అంతేగాక మొత్తం ప్రక్రియనూ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామన్నాయి. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఓడరేవులు, రైల్వే, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శులతో జీవోఎం గురువారం భేటీ కానుంది. కార్యదర్శులతో దాని చర్చలు అక్కడితో ముగుస్తాయి. రాత్రి 8 గంటలకు జీవోఎం ముందు హాజరవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆహ్వానం అందింది. దాంతో గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. విభజనకు సంబంధించి సీమాంధ్రలో చేపట్టాల్సిన అంశాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవోఎంకు సవివరంగా నివేదిక సమర్పించడం తెలిసిందే. ఈ తరుణంలో కిరణ్ కూడా తన అభిప్రాయాలను జీవోఎం ముందుంచనున్నారు. ఆ భేటీ అనంతరం కేంద్రంలోని ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ కానున్నారు. తరువాత నేరుగా విశాఖ జిల్లాకు చేరుకుని, అక్కడ జరిగే రచ్చబండ కార్యక్రమాలకు హాజరవుతారని సీఎంవో వర్గాలు వివరించాయి. పూర్తయిన మొక్కుబడి మరోవైపు నివేదిక రూపకల్పనలో జీవోఎం బిజీగా ఉంది. జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి తదితరులు తమ రోజువారీ కార్యక్రమాలను పక్కనబెట్టి మరీ కొద్ది రోజులుగా పనుల్లోనే తలమునకలుగా ఉన్నారు. రాష్ట్ర పార్టీలతో జీవోఎం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు బుధవారం ముగిశాయి. ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, టీఆర్ఎస్లతో మంగళవారం, విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎం, వైఎస్సార్సీపీలతో బుధవారం జీవోఎం చర్చలు జరిపింది. ఇక విభజనపై వైఖరిని ఎటూ తేల్చకుండా గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న టీడీపీ మాత్రం జీవోఎం ముందుకు రాలేదు. విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీలను ప్రధానంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, ఉమ్మడి రాజధాని పరిధి, ఆదాయ పంపిణీ గురించే జీవోఎం ప్రశ్నించింది. యూటీ ప్రతిపాదనను అవన్నీ తిరస్కరించడం, హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పడం తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం యథాప్రకారంగా తన డబుల్ గేమ్‌ను కొనసాగించింది. ఆ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విభజనకు అనుకూలంగా, మంత్రి వట్టి వసంతకుమార్ వ్యతిరేకంగా వాదన వినిపించారు. వైఎస్సార్సీపీతో జరిపిన 20 నిముషాల భేటీలో మాత్రం జీవోఎం సభ్యులు ఏ అంశాన్నీ ప్రస్తావించకుండా మౌనముద్ర దాల్చారు. పార్టీ ప్రతినిధులు ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు. పైగా వారడిగిన పలు ప్రశ్నలకు సభ్యులు తెల్లమొహాలు వేసినట్టు సమాచారం. ఇక సీపీఎంతో భేటీని 10 నిమిషాల్లో ముగించారు. పైగా మంగళవారం ఐదు పార్టీలతో చర్చలకు జీవోఎం సభ్యుల్లో దాదాపు అందరూ హాజరవగా బుధవారం సీపీఎం, వైఎస్సార్సీపీలతో చర్చలకు మాత్రం ముగ్గురే వచ్చారు! మొత్తంమీద పార్టీలతో చర్చలను తూతూమంత్రంగా ముగించారు. అన్ని పార్టీలతోనూ చర్చించామని నివేదికలో పేర్కొనడానికి మినహా వీటితో జీవోఎం సాధించిందంటూ ఏమీ లేదు. పార్టీలు పేర్కొన్న అభిప్రాయాలను నివేదికలో యథాతథంగా పొందుపరచనున్నారు. -
ఏకపక్షం.. నిరంకుశం
* రాష్ట్ర విభజన నిర్ణయంపై జీవోఎం ముందు వైఎస్సార్ సీపీ స్పష్టీకరణ * సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలి * సరైన హేతుబద్ధత, ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విడదీయడం సమంజసం కానేకాదు * జగన్ రాసిన 8 పేజీల లేఖను జీవోఎంకు అందజేసిన మైసూరా * మైసూరాతోపాటు జీవోఎం సభ్యులతో భేటీ అయిన గట్టు * ఓట్ల కోసమో, సీట్ల కోసమో విభజన దురదృష్టకరమన్నాం: మైసూరా * నదీ జలాల సమస్యను, అన్నిటికీ కార్యక్షేత్రమైన హైదరాబాద్ గురించి వివరించాం * ఏదైనా బిల్లు తెచ్చి సోనియాను దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారని అడిగాం * మా ప్రశ్నలకు జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు * కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది సాక్షి, న్యూఢిల్లీ: ఏకపక్షంగా, నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సుస్పష్టంగా చెప్పింది. సరైన హేతుబద్ధత, గట్టి ప్రాతిపదిక లేకుండా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించడం సమంజసం, సమర్థనీయం కానే కాదని తెలిపింది. సమైక్యాంధ్రప్రదేశ్ అనే తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని పేర్కొంది. సమైక్యాంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. జీవోఎం ఆహ్వానం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు బుధవారం ఉదయం హోం శాఖ కార్యాలయంలో జీవోఎం సభ్యులతో భేటీ అయ్యారు. విభజనపై పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్, కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రనే కొనసాగించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన ఎనిమిది పేజీల లేఖను మైసూరా వారికి అందజేశారు. జీవోఎం సభ్యుల్లో ముగ్గురు మాత్రమే.. సుశీల్‌కుమార్‌షిండే, జైరాం రమేశ్, వీరప్పమొయిలీ పాల్గొన్న ఈ భేటీ 20 నిమిషాల పాటు కొనసాగింది. వీరు కూడా మైసూరా బృందం చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు తప్ప ఏమీ మాట్లాడలేదని తెలిసింది. చివర్లో షిండే మాత్రం ‘మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. జీవోఎంతో భేటీ అనంతరం మైసూరా విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్టీ, ప్రభుత్వం మధ్య ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలాగా వ్యవహరిస్తోంది. అంతా వాళ్ల సొంతింటి వ్యవహారంలా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పార్టీలతో ఈ భేటీలు కూడా కంటితుడుపు చర్య మాత్రమే. వాళ్లు చేయదల్చుకున్నదేదో చేస్తూ ఏదో రికార్డు కోసం ఇదంతా సాగిస్తున్నారు. పేరుకు పార్టీలను సంప్రదించినా అవి చెప్పేదేం చేయడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలి ఆదేశాల ప్రకారమే వారు నడుచుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. జీవోఎం స్పందన ఏమిటని అడగ్గా.. ‘‘వాళ్లకు 112 ప్రశ్నలు సంధించాం. వాటికి జవాబు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు..’’ అని మైసూరా చెప్పారు. పార్టీ తరఫున జీవోఎం ముందు చేసిన వాదనను ఆయన వివరించారు. నదీ జలాలు చాలా క్లిష్టమైన సమస్య ‘‘కొందరు ప్రత్యేక రాష్ట్రం సోనియాగాంధీ బర్త్‌డే గిఫ్ట్ అని అన్నారు. అదేనా విభజనకు మీ ప్రాతిపదిక? దేశంలో మరెన్నో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకంత స్పీడ్‌గా వెళుతున్నారు? విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ఆలోచించడం లేదు. 70 శాతం మంది ప్రజల అభిప్రాయాలను మీరు గుర్తించడం లేదు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నదీజలాలు చాలా క్లిష్టమైన సమస్య. ఇప్పటికే ఎన్నో ట్రిబ్యునళ్లు ఉన్నాయి. ఆ ట్రిబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను ఏ రాష్ట్రమూ పాటించడం లేదు, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తే మీరేం చేయగలిగారు?’’ అని అడిగినట్లు మైసూరా తెలిపారు. మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి ‘‘ సోనియాగాంధీ మనదేశ పౌరసత్వం తీసుకుని 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు ఏదైనా బిల్లు తెచ్చి ఈ పౌరసత్వం చెల్లదని.. దేశం విడిచి వెళ్లమంటే మీరెంత బాధపడతారు? అలాగే 60 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్నవారిని ఒక్కసారే వెళ్లిపోమంటే ఎంత సెంటిమెంట్‌గా ఫీలవుతారో.. ఎంత బాధ పడతారో మీరు అర్థం చేసుకుంటున్నారా?’’ అని లేఖలో ప్రశ్నించినట్టు చెప్పారు. జీవోఎంకు నిర్దేశించిన 11 విధివిధానాలపై తమ అభిప్రాయాల్ని అడగలేదని, తాము సమైక్యంగా ఉండాలని చెప్తున్నం దున వాటిపై అభిప్రాయం అడిగేదేముంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. జగన్ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తారు అధికారంలో ఉన్న పార్టీ బలహీనంగా ఉన్నచోట రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుంటే అది దేశ సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ.. దేశ ప్రయోజనాల కోసం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణార్థం విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలనూ కలుస్తారని మైసూరా తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయాన్ని కూడగడతారన్నారు. విభజనపై తమ నిరసనలు, పోరాటం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటివరకు అధికార పార్టీ ఇష్టానుసారం చేసింది. ఇకమీదట కుదరదు. మేమైతే బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగడతాం’’ అని చెప్పారు. హైదరాబాద్ విషయంలోనూ కేంద్రం ఆలోచన సరికాదని, శాంతిభద్రతలు, రెవెన్యూ తదితర అంశాలను గవర్నర్‌కి ఇవ్వడమో లేదా కేంద్రం చేతిలోకి తీసుకోవడమో సబబు కాదని, ఇది ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల అధికారాలను ఈ తరహాలో ఆక్రమించడం సమర్థనీయం కాదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అప్పుడు, ఇప్పుడు సమైక్యమే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న మాటను లోగడ ఎందుకు కేంద్రానికి చెప్పలేదన్న ప్రశ్నకు మైసూరా స్పందిస్తూ.. ‘‘ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని మాపై పెత్తనం చేయొద్దు. మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి. అందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు మీ ఆలోచన ఉండాలని మేం చెప్పాం. ఆ రోజున మేం చెప్పినదాని అర్థం విభజన చేయాలని కాదు. సమస్యను పరిష్కరించలేరు కనుక యథాతథంగా ఉంచాలని అర్థం స్ఫురించేలా మేం మా వైఖరి చెప్పాం. దానికి మీరు వక్రభాష్యం చెప్పడం సరికాదు. మేం ఆ రోజున చెప్పింది సమైక్యమే.. ఇప్పుడు చెప్తున్నదీ సమైక్యమే’’ అని స్పష్టం చేశారు. నేరుగా సమైక్యమని అప్పుడు ఎందుకు చెప్పలేదని అడగ్గా.. ‘‘అప్పటి పరిస్థితుల్లో వారు అడిగినదానికి మేం అది చెప్పాం. ఇప్పుడు విభజిస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అంటే విభజన వద్దు, సమైక్యంగా ఉంచండని కోరుతున్నాం.. ఇందులో డొంక తిరుగుడు ఏం లేదు.’’ అని ఆయన వివరించారు. ‘‘సెంటిమెంట్ వేరు, అభివృద్ధి వేరు. విభజిస్తే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగదని, నష్టపోతారని మేం చెప్తున్నాం. సెంటిమెంట్‌ని గౌరవించడం వేరు, విభజన వేరు. విభజన అనేది పరిష్కారం కాదు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అనేది మా పార్టీ అభిప్రాయం’’ అని కొన్ని ప్రశ్నలకు జవాబుగా మైసూరా చెప్పారు. సమైక్యంగా ఉంటే అభివృద్ధి జరిగే పరిస్థితి తప్పకుండా ఉందన్నారు. తెలుగుజాతికి పట్టిన తెగుళ్లు టీడీపీ, కాంగ్రెస్‌లు: గట్టు విభజన పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలుగు ప్రజలను హింసిస్తున్నాయని గట్టు అన్నారు. ఆ రెండు పార్టీలు తెలుగు జాతికి పట్టిన తెగుళ్లుగా ఆయన అభివర్ణించారు. జీవోఎంతో భేటీ అనంతరం ఏపీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన విషయంలో ఆ రెండు పార్టీలు డబుల్‌గేమ్ ఆడుతూ, ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. తెలంగాణపై ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ కార్యాలయాన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించాలని సూచించారు. వెనుకబాటుతనానికి విభజన ఏమాత్రం పరిష్కారం కాదని అన్నారు. సమర్థ పరిపాలన, అభివృద్ధి ద్వారా వెనుకబాటుతనాన్ని అధిగమించవచ్చని తెలిపారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు విభజనను కోరుకోవడం లేదన్నారు. -
విభజన రాజికీయంతో వేడెక్కిన హస్తిన
-
జీవోఎం ఏం చెప్తుందో చూద్దాం!
* మంత్రుల బృందంతో భేటీకి ఢిల్లీ వెళ్తున్న బీజేపీ * సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ముగ్గురు * 12, 13 తేదీల్లో సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో సమావేశమయ్యేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. బీజీపీ, సీపీఎంల నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ పార్టీల ప్రతినిధులు జీవోఎంతో భేటీ అవుతారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీమాంధ్ర నుంచి డాక్టర్ కె.హరిబాబును ఈ నెల 12న ఈ సమావేశానికి పంపాలని బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ నిర్ణయించింది. సీపీఐ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్, సీమాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ విల్సన్ 12న ఢిల్లీ వెళతారు. సీపీఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి 13న ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, జీవోఎంకు ఇచ్చిన లేఖకు అనుగుణంగానే వచ్చే సమావేశంలోనూ మంత్రుల బృందం ఏం చెబుతుందో విని, దానికనుగుణంగా స్పందించాలని ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ భేటీలో పార్టీ నేతలు కిషన్‌రెడ్డి బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, టి.ఆచారి, వి.రామారావు, శేఖర్జీ, రవీంద్రరాజు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర వైఖరేమిటో చెప్పకుండా తమ అభిప్రాయాల్ని అడిగితే స్పందించకూడదని భేటీలో నిర్ణయించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూనే సీమాంధ్రుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని జీవోఎంను కోరాలని నిర్ణయించారు. అలాగే, ఈ నెల 20 తర్వాత నాలుగు రథాలతో యాత్రలు నిర్వహించాలని బీజేపీ తీర్మానించింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో జరిగే ఈ యాత్రలకు ఆయా ప్రాంతాల నేతలే సారథ్యం వహిస్తారు. జీవోఎంతో భేటీలో గతంలోలాగానే సమైక్య వాదాన్నే వినిపించాలని సీపీఎం నిర్ణయించింది. విభజన అనివార్యమయితే సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించమని డిమాండ్ చేసే అవకాశం ఉంది. బీజేపీలోకి కెప్టెన్ కరుణాకర్.. బోధన్‌కు చెందిన కెప్టెన్ కరుణాకర్ సోమవారం హైదరాబాద్‌లో బీజేపీలో చేరనున్నారని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
వేడెక్కిన హస్తిన
* తుది అంకానికి విభజన చర్చలు * అధికారులతో జీవోఎం భేటీ నేడు.. హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగులపై చర్చ * ఈ చర్చల ఆధారంగానే ముసాయిదా బిల్లుకు తుదిరూపం * రేపు, ఎల్లుండి రాష్ట్రానికి చెందిన పార్టీలతో సమావేశం * 18వ తేదీన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో భేటీలు * 21 నాటికి టీ-బిల్లు ముసాయిదాను కేబినెట్‌కు సమర్పించే అవకాశం * జీవోఎంతో భేటీకి కాంగ్రెస్ నుంచి దామోదర, వట్టి పేర్లు ఖరారు * దానం నాగేందర్, ముఖేశ్గౌడ్లు ఢిల్లీ రావాలంటూ దిగ్విజయ్ పిలుపు * పోటాపోటీగా హస్తిన యాత్రకు రెండు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు * హైదరాబాద్ ‘యూటీ’ డిమాండ్‌తో నేడు ప్రధాని వద్దకు సీమాంధ్ర కేంద్రమంత్రులు * రెండు రోజుల్లో సోనియాను కలిసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కసరత్తు దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర విభజన రాజకీయం వేడెక్కుతోంది. విభజన అంశంపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) చర్చల్లో సోమవారం నుంచి తుది అంకం మొదలుకానుంది. కేంద్ర అధికారులతో జీవోఎం చివరి భేటీ నిర్వహించనుంది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ కానుంది. నాలుగు రోజుల తర్వాత ఈ నెల 18వ తేదీన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనుంది. మొత్తం మీద రాబోయే వారం, పది రోజుల్లో రాష్ట్ర విభజన కసరత్తును ఓ కొలిక్కి తీసుకొచ్చి 21వ తేదీకల్లా ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తుందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నుంచీ కాంగ్రెస్ నేతలు హస్తిన యాత్రకు సిద్ధమవుతున్నారు. నేటి భేటీ ప్రాతిపదికగా బిల్లుకు తుదిరూపం జీవోఎం సోమవారం నిర్వహిస్తున్న సమావేశంలో కేంద్ర ప్రభుత్వంలోని తొమ్మిది కీలక శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు పాల్గొంటున్నారు. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర ప్రాం తాల వారి హక్కులు, జన వనరులు, విద్యుత్ కేటాయిం పులు, ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, హైదరాబాద్ ఆదాయం ఇరు రాష్ట్రాలకు పంపిణీ.. తదితర అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు శాఖల వారీగా జీవోఎంకు ఇప్పటికే నివేదికలు సమర్పించారు. వివిధ అంశాలపై తమకున్న తాజా సమాచారాన్ని జీవోఎం సభ్యులతో సోమవారం నాటి భేటీలో వివరించటంతో పాటు.. వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచించనున్నారు. అలాగే, వివిధ వర్గాలు, పార్టీల నుంచి వ్యక్తమయిన అభ్యంతరాలు, అనుమానాలపై కూడా కార్యదర్శులు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. జీఓఎంకు అందిన 18 వేల వినతులను శాఖల వారీగా క్రోడీకరించే బాధ్యతను ఇప్పటికే కార్యదర్శులకు అప్పగించిన విషయం విదితమే. ఆయా వినతుల్లో పేర్కొన్న అంశాలను కూడా క్రోడీకరించిన వివిధ శాఖల కార్యదర్శులు సమగ్ర నివేదికలను జీవోఎం ముందు ఉంచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీలో చర్చల ఆధారంగానే తెలంగాణ ఏర్పాటుపై ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా బిల్లుకు తుదిరూపం కల్పించే అవకాశాలున్నాయి. రేపు, ఎల్లుండి పార్టీల ప్రతినిధులతో భేటీలు... అలాగే.. ఈ నెల 12, 13 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీఓఎం ‘అఖిలపక్ష’ సమావేశం నిర్వహించనుంది. రెండు రోజుల పాటు విడతల వారీగా జరిగే ఈ చర్చలకు రావాలని రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆహ్వానాలు పంపించిన విషయం తెలిసిందే. జీవోఎంను వ్యతిరేకించని ఐదు పార్టీలు-కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐకి మంగళవారం జీఓఎం 20 నిమిషాల చొప్పున సమయం కేటాయించింది. ఇక విభజనను గట్టిగా వ్యతిరేకించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంతో పాటు రెండుకళ్ల సిద్ధాంతంతో నడుస్తున్న టీడీపీకి బుధవారం హోంశాఖ సమయం కేటాయించింది. వచ్చిన పార్టీల నాయకులతో జీఓఎం క్లుప్తంగా విభజనపై చర్చిస్తుందని, ఎవరైనా రాకపోతే రాలేదని రికార్డుల్లో రాసుకుంటుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. పార్టీలతో జరిపే చర్చల్లో అంతకుమించి పెద్దగా ఏమీ ఉండదని, విభజనకు సంబంధించిన ప్రక్రియ తెరవెనుక చకచకా సాగిపోతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలను కూడా బిల్లులో పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులతో ఈ నెల 18న జీఓఎం సమావేశం కానుంది. వారి సలహాలు, సూచనలను పరిశీలించిన తర్వాత ముసాయిదా బిల్లుకు తుదిరూపమిచ్చి ఈ నెల 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణ నేతల పోటాపోటీ విభజనకు అభ్యంతరం లేదని చెప్తూ విభజన నేపధ్యంలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించాలంటున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు జీఓఎంకు ఇప్పటికే ఒక నివేదికను అందజేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధితో కూడిన హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రధాన ప్రతిపాదనతో పాటు.. విభజన సరిహద్దులు, సీమాంధ్రలో భద్రాచలం డివిజన్ విలీనం, నదీ జలాల సమస్య పరిష్కారం వంటి అంశాలను అందులో ప్రస్తావించారు. ఇవే అంశాలపై ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి వివరించేందుకు సోమవారం ఉదయం 11.50 గంటలకు అపాయిట్మెంట్ కూడా తీసుకున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన అంశాలను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మరింత అప్రమత్తమయ్యారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తమకు సమ్మతమని వారు స్పష్టం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గితే తెలంగాణలో మళ్లీ ఉద్యమం పెచ్చరిల్లే ప్రమాదముందని, అదే జరిగితే తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు ఫలితం దక్కే అవకాశాల్లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని భావిస్తున్నారు. అనంతరం ఈ నెల 13 లేదా 14న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని, సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధాతథంగా అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తరఫున డిప్యూటీ సీఎం, మంత్రి వట్టి విభజన దిశగా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలంతా హస్తిన యాత్రకు సిద్ధమవుతున్నారు. అఖిలపక్ష భేటీకి పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వస్తే తప్ప ఢిల్లీ వెళ్లరాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్లు చెప్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. జీఓఎం ముందు పార్టీ తరఫున ఎవరు హాజరుకావాలన్న విషయంలో హైకమాండ్ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నందున సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని యధాయథంగా వినిపించేందుకు పీసీసీ అధ్యక్షుడిని ఒక్కరినే పంపితే సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. చివరకు హైకమాండ్ పెద్దలతో సంప్రదింపుల అనంతరం పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులను జీఓఎం ముందుకు పంపాలని నిర్ణయించారు. ఆ మేరకు తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కోస్తా నుంచి మంత్రి వట్టి వసంతకుమార్ పేర్లను ఖరారు చేశారు. దానం, ముఖేశ్‌లకు దిగ్విజయ్ పిలుపు రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాద్ అంశం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్గౌడ్లకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఇరువురు మంత్రులకు ఫోన్ చేసి ఢిల్లీ రావాలని ఆదేశించడంతో వారు ఆదివారం హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు గట్టిగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వీరిని హైకమాండ్ పెద్దలు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రల రక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నట్లు తెలిసింది.