నేడు జీవోఎం తుది భేటీ
* నివేదిక, టీ ముసాయిదా బిల్లుకు లాంఛనంగా ఆమోదం
* రేపు లేదా ఎల్లుండి కేబినెట్ పరిశీలన?
* జీవోఎం నివేదికపై సర్వత్రా ఉత్కంఠ
* ‘రాయల’కు మొగ్గితే బిల్లుకు ఆమోదం కష్టమేనంటున్న కాంగ్రెస్ ముఖ్యులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం.
గత వారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల మేరకు.. నివేదిక, బిల్లులో చేయాల్సిన చివరి మార్పుచేర్పులు పూర్తిచేసి జీవోఎం సభ్యులు వాటిని లాంఛనంగా ఆమోదిస్తారని హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌కు సమర్పించాల్సిన విభజన నివేదికపై సభ్యులందరూ సంతకాలు చేయటంతో జీవోఎంకు అప్పగించిన పని పూర్తవుతుందని, ఆ తర్వాత ఈ నివేదిక కేబినెట్ ముందుకు వెళ్తుందని వారు చెప్పారు.
సిఫారసులు ఎలా ఉంటాయో..!
జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
జీవోఎం లాంఛనంగా ఆమోదించేవరకు నివేదికలోని ఏ అంశాన్నయినా ఫైనల్ అని పేర్కొనటం కుదరదని, రాజకీయ నిర్ణయం ప్రకారం ఆఖరి క్షణాల్లో ఏ మార్పులైనా జరగవచ్చని హోంశాఖ వర్గాలు సోమవారం ‘సాక్షి’కి వివరించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో మొత్తం 69 పేజీలుంటాయని ప్రచారం జరుగుతోంది. చివరి క్షణాల్లో జరిగే మార్పులతో ఈ బిల్లు స్వరూపం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.
రేపు లేదా ఎల్లుండి కేబినెట్?
జీవోఎం ఆమోదముద్రతో విభజన నివేదిక, బిల్లును కేంద్ర కేబినెట్ బుధ లేదా గురువారం జరిపే సమావేశంలో పరిశీలించవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీ 4వ తేదీన బుధవారం ఉంటుందని షిండే కొద్ది రోజుల కింద చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం బుధవారం కేబినెట్ సమావేశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రతివారం ఆనవాయితీగా గురువారం కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నందున ఈసారి కూడా 5వ తేదీ గురువారమే కేబినెట్‌ను సమావేశపరుస్తారని చెప్తున్నారు. ఏ రోజున కేబినెట్ భేటీ జరిగినా తప్పకుండా జీవోఎం నివేదిక, విభజనపై ముసాయిదా బిల్లును అందులో చర్చించి ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలూ గట్టిగా చెప్తున్నాయి. కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటు నుంచి రాష్ట్ర శాసనసభకు వెళ్తుంది.
‘రాయల’కు మొగ్గితే ఆమోదమెలా?
విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్రకారం రాయల తెలంగాణ ఏర్పాటుకు జీవోఎం సిఫారసు చేస్తుందా? లేదా తెలంగాణ, రాయల తెలంగాణ రెండు ప్రతిపాదనలనూ కేబినెట్ ముందుంచి చేతులు దులుపుకుంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. జీవోఎం ఒకటి కాకుండా రెండు ప్రతిపాదనలతో నివేదిక సమర్పించిన పక్షంలో కేబినెట్ సమావేశంలో గరంగరం చర్చ తప్పదని తెలుస్తోంది. కేబినెట్ హోదా మంత్రుల్లో జైపాల్‌రెడ్డి, కిశోర్‌చంద్రదేవ్‌లు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. యూపీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన మంత్రులు కూడా రాయల తెలంగాణకు అనుకూలంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రాయల తెలంగాణవైపే మొగ్గితే పార్లమెంటులో విభజన బిల్లుకు ఆమోదం సాధించడం ఎలాగన్నది కాంగ్రెస్ వ్యూహకర్తలకు తలనొప్పిగా మారింది.
యూపీఏ నుంచి అనేక పార్టీలు, మరీ ముఖ్యంగా డీఎంకే నిష్ర్కమించిన దరిమిలా పార్లమెంటు ఉభయసభల్లో ప్రభుత్వానికి మెజారిటీ కొరవడి ఎలాగో నెట్టుకొస్తున్న తరుణంలో విభజన బిల్లు వంటి అతి ముఖ్యమైన బిల్లుకు, అందునా ఇతర పక్షాలు వ్యతిరేకించే అంశాలతో ఉన్న బిల్లుకు ఆమోదం పొందటం తేలిక కాదన్నది వారి అంతరంగంగా ఉన్నట్లు ఏఐసీసీ కీలక నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకే ఆమోదం కష్టమనుకుంటున్న తరుణంలో రాయల తెలంగాణగా మారిస్తే ఉభయసభల సమ్మతి సంపాదించడం గగనమేనని, ఈ బిల్లు కూడా పెండింగ్ జాబితాలో చేరిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.