రాయల కలకలం | Rayala Telangana proposal a tactful move of Congress? | Sakshi
Sakshi News home page

రాయల కలకలం

Published Tue, Dec 3 2013 3:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాయల కలకలం - Sakshi

రాయల కలకలం

* కొత్త చిచ్చు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం
* మొదటి నుంచీ 10 జిల్లాల తెలంగాణ అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్
* ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంటూ జోరుగా ప్రచారం
* దీనికి మన్మోహన్, సోనియా ఓకే చెప్పారంటూ వార్తలు
* ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్న మెజారిటీ పార్టీలు
* రాజకీయ లాభం కోసమే ‘రాయల టీ’ ఎత్తుగడ?
* జీవోఎం సిఫార్సులపై నేడో రేపో కేంద్ర కేబినెట్ తుది నిర్ణయం
* అసెంబ్లీ సమావేశాలపై నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
 
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. రాయల తెలంగాణకు ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారన్న ప్రచారం నేతల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాయల తెలంగాణ కేంద్రంగానే కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే విభజన తుది నిర్ణయం కావచ్చన్న అభిప్రాయమూ కాంగ్రెస్ నేతల  నుంచి వ్యక్తమవుతోంది. మెజారిటీ ప్రజలు, పార్టీలు వ్యతిరేకిస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెరముందుకు తేవడం వెనుక ఆంతర్యంపై పలురకాల ఊహాగానాలు సాగుతున్నాయి. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనే ప్రచ్ఛన్న ఎజెండాను కాంగ్రెస్ ఇప్పుడు ముందుకు తె చ్చిందని అభిప్రాయపడుతున్నారు.

మొదటి నుంచీ 10 జిల్లాల తెలంగాణ అని..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ మాత్రమే. సీడబ్ల్యూసీ తీర్మానం ఆధారంగా కేంద్ర హోం శాఖ కేబినెట్‌కు అందించిన నోట్‌లో కూడా పది జిల్లాల తెలంగాణను మాత్రమే ప్రతిపాదించారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే కేంద్ర హోం శాఖ పదకొండు అంశాలను జీవోఎం పరిశీలనకు పంపింది. మంత్రుల బృందం కూడా గత కొద్దిరోజులుగా ఈ దిశగానే కసరత్తు సాగించింది. మధ్యలో రాయల తెలంగాణ గురించి ఒకరిద్దరు నేతలు ప్రస్తావన తెచ్చినా దానికి అంతప్రాధాన్యం కూడా ఇవ్వలేదు.

ఈ ప్రతిపాదనలకు ఆదిలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి విముఖత వచ్చింది. సీమాంధ్ర నేతలు, ప్రజలు తాము రాష్ట్ర సమైక్యాన్నే కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. రాయలసీమను విభజిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆప్రాంత ప్రజలు తీవ్రంగానే స్పందించారు. ఇక తెలంగాణ ప్రాంత  ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నేతలు రాయల తెలంగాణను అంగీకరించేది లేదని కరాఖండీగా ప్రకటించారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఈ ప్రతిపాదన ను ఆమోదించబోమని, పార్లమెంటులో, అసెంబ్లీలో దీన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంచేశాయి. ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ ప్రాతిపాదననే కాంగ్రెస్, కేంద్రం ఇప్పుడు తెరపైకి తేవడం వేరే రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.

నేడు కేబినెట్ భేటీ ఉంటుందా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిదో తేదీ నుంచి ప్రారంభం కానున్నందున మూడో తేదీనే ప్రత్యేక కేబినెట్ భేటీని నిర్వహించాలని కేంద్రం పెద్దలు ఇదివరకు భావించారు. జీవోఎం అదే రోజు తుది నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ షెడ్యూల్‌లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుండడం, కీలక నేతలు దానిపై దృష్టి సారించాల్సి ఉండడంతో మంగళవారం కేబినెట్ భేటీ ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇది బుధవారానికి వాయిదా పడవచ్చంటున్నారు.

రాజకీయ ప్రయోజనానికేనా..
సొంత ప్రయోజనాలతో పాటు రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కర్నూలు, అనంతపురంలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇరురాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు 147 చొప్పున, లోక్‌సభ స్థానాలు 21 చొప్పున సరిసమానంగా ఉంటాయి. పైగా కృష్ణా జలాలకు సంబంధించి కీలక సమస్యగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధిష్టానం పెద్దలు పైకి చెబుతున్నారు.

అంతేకాకుండా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలపడమన్న కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. నిజానికి ఆ వాదనలో బలం లేదని అన్ని పార్టీల నేతలూ చెబుతున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమన్న టార్గెట్‌తోనే అధిష్టానం ముందుకు పోతోందని చెబుతున్నారు.

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ..
రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం జరగనుంది. రాష్ట్ర విభజనపై జీవోఎం తుది నివేదికను ఖరారు చేయనుండటం, కేంద్ర కేబినెట్ దానికి ఆమోదముద్ర వేయనున్నట్లు వస్తున్న వార ్తల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక, రాయల తెలంగాణ, అసెంబ్లీ సమావేశాల తేదీలకు సంబంధించి ప్రధాన చర్చ సాగవచ్చని తెలుస్తోంది.

కేబినెట్ భేటీకి హాజరవ్వాల్సి ఉండడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కొందరు రాష్ట్ర మంత్రులు సోమవారం నాటి తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై తెలంగాణ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో కేబినెట్ భేటీలో ఏం జరగబోతుందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement