ఆ రెండు జిల్లాలను కలిపినా అది తెలంగాణే
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపినా కూడా.. తెలంగాణ తెలంగాణగానే ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రాయల తెలంగాణపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయాన్ని తాను ఖండించదలచుకోలేదని బదులిచ్చారు. ‘సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.. కానీ సీమలోని రెండు జిల్లాలు అనంతపురం, కర్నూలులను కూడా తెలంగాణతో కలిపితే అది రాయల తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినట్లవుతుంది కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘ముందు జీవోఎం నివేదికలో ఏముందో బహిర్గతం కానివ్వండి. దాని సిఫారసుల కోసం వేచిచూద్దాం’’ అని ఆయన బదులిచ్చారు.
జీవోఎం సిఫారసుల ఆధారంగా ముసాయిదా బిల్లు తయారవుతుందని, ఆ తర్వాత దాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారని, ఆ తర్వాతే దీనిపై తాను స్పందిస్తానని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఈ విషయమై తాము జరుపుతున్న ప్రైవేటు చర్చల వివరాలను బహిరంగపరచలేమన్నారు. ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే అభిప్రాయం కోరుతూ రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందన్నారు.