..ఇంకా ఉంది | GoM on Telangana fails to finalise report, to meet tomorrow | Sakshi
Sakshi News home page

..ఇంకా ఉంది

Published Wed, Dec 4 2013 2:02 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

..ఇంకా ఉంది - Sakshi

..ఇంకా ఉంది

* అసంపూర్తిగా ముగిసిన జీవోఎం భేటీ
* నేటి రాత్రి 8 గంటలకు మళ్లీ మంత్రుల బృందం సమావేశం
* రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదంటూ లీకులు
* పరిణామాలను అంచనా వేసేందుకే?..  రేపు కేంద్ర మంత్రివర్గ భేటీ
* అప్పటిదాకా నాన్చి, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం
* 371డీ పై చర్చ, ఇరు రాష్ట్రాలకూ వర్తింపజేసే దిశగా యోచన?
* రాయల తెలంగాణ గురించి తెలియదన్న షిండే
 
సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) సమావేశం మంగళవారం అసంపూర్ణంగా ముగిసింది. కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించే ముందు ఇదే చివరి భేటీ అని భావించినప్పటికీ ఆ నివేదిక తుది రూపు సంతరించుకోనందున బుధవారం మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదన తాలూకు పరిణామాలను అంచనా వేసేందుకు, గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగేదాకా విషయాన్ని నాన్చడానికే జీవోఎం తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం.

చర్చలు అసంపూర్ణంగా ముగిశాయని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సమావేశానంతరం విలేకరులకు వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటలకు జీవోఎం మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. అదే ఆఖరు సమావేశం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం కసరత్తు చేస్తోంది. అయితే ఆలోగా పరిష్కరించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి’’ అని చెప్పారు.

జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మాత్రం... బిల్లు ముసాయిదా సిద్ధమైందని, చట్టపరమైన అడ్డంకులు రాకుండా భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపారు. విభజన ప్రక్రియలో కీలకమైన అంకంగా అంతా భావిస్తున్న 371డీ అధికరణను రెండు రాష్ట్రాలకూ వర్తింపజేసే మార్గాంతరాలపై భేటీలో లోతుగా చర్చ జరిగిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అందుకు వీలుగా ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు’ను ‘ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిల్లు’గా మార్చాలని, అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం కూడా ఉండదని భావిస్తున్నట్టు కూడా తెలిపింది.

‘‘హైదరాబాద్ శాంతిభద్రతలు, రెవెన్యూ అంశాలను కేంద్రంచేతికి అప్పగించడంపై కూడా మల్లగుల్లాలు పడ్డారు. బిల్లు, జీవోఎం నివేదిక కలిపి 70 పేజీల దాకా ఉంటాయని జీవోఎం వర్గాలు తెలిపాయి’’ అని వివరించింది. మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో షిండే అధ్యక్షతన జరిగిన జీవోఎం భేటీలో సభ్యులు పి.చిదంబరం, ఎ.కె.ఆంటోనీ, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. జీవోఎం ఏర్పాటయ్యాక ఇలా మొత్తం సభ్యులు సమావేశం కావడం ఇదే తొలిసారి! జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా భేటీలో పాల్గొన్నారు.

గంటన్నర పాటు సాగిన సమావేశంలో తెలంగాణ, రాయల తెలంగాణలతో పాటు జీవోఎం సిఫార్సులను ముసాయిదా బిల్లులో ఎలా చేర్చాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై స్పందనను బట్టి పరిణామాలను అంచనా వేయడానికి వీలుగా నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకున్నట్టు సమాచారం. అంతిమంగా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాల అమలును ఖరారు చేయడానికే జీవోఎం పరిమితమవుతుందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు సాగించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానించిన తెలంగాణ, తాజాగా తెర మీదకు తెచ్చిన రాయల తెలంగాణల్లో దేనిపైనా తుది నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం వరకు నాన్చి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని జీవోఎం సభ్యులు భావిస్తున్నారు.

రెండు ప్రతిపాదనలనూ కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లి అక్కడ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ముగించకుండా, విరామమిచ్చి జనవరి వరకు పొడిగించడానికి సమాయాత్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాగే సాగతీత ధోరణి కొనసాగిస్తే తెలంగాణ బిల్లును 2014లోనే పార్లమెంటు ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. అదే జరిగితే రాయల తెలంగాణపైనా హడావుడిగా ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయం తీసుకోకుండా ఆఖరు నిమిషం దాకా సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావూరి సాంబశివరావు తదితర సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాటలను బట్టి చూస్తుంటే రాయల తెలంగాణపై జీవోఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ మేరకే ముసాయిదా బిల్లు తయారవుతోందని కూడా చెబుతున్నారు.

జీవోఎం నివేదిక కూర్పుపై కసరత్తు
సిఫార్సులను ముసాయిదా బిల్లులో పొందుపరచడంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జీవోఎం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రత, జన వనరుల పంపిణీ పర్యవేక్షణకు బోర్డులు, శాంతిభద్రతల సమస్య, మావోయిస్టులను ఎదుర్కోవడానికి ఉమ్మడి కార్యాచరణ తదితరాలు ముసాయిదాలో ఎలా ఉండాలనే దానిపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. వాటిపై సభ్యుల సూచనల మేరకు జైరాం సాంకేతిక కసరత్తు చేస్తున్నారు. సాయంత్ర 6.20కి జీవోఎం భేటీ ముగిశాక కూడా ముసాయిదా బిల్లు రూపకల్పన కసరత్తులో షిండే, జైరాం తనమునకలుగా గడిపారు. ఈ కసరత్తు భేటీ తర్వాత రెండు గంటలకు పైగా సాగింది. అంతకుముందు బిల్లు ముసాయిదా ప్రతిలో పొందుపరిచిన భాష, వాక్య నిర్మాణం సముచితంగా లేవని చిదంబరం అభిప్రాయపడ్డట్టు తెలిసింది.

అంతకుముందు విభజన అనంతరం తెలంగాణ శాంతిభద్రతల అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులతో ఉదయం 11 గంటలకు షిండే సమీక్ష జరిపారు. రాష్ట్ర ఐపీఎస్ అధికారి శశిధర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలతో పాటు నక్సలిజం పెరిగే అవకాశాలు, మతపరమైన ఘర్షణలకు సంబంధించిన అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. అనంతరం జైరాంతో గంట పాటు షిండే భేటీ అయ్యారు. నివేదికకు తుదిరూపు ఇవ్వడంపై తర్జనభర్జనలు పడ్డారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, శాంతిభద్రతలు, న్యాయపరమైన చిక్కులను దాటడం, జల వనరుల బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించారు.

అనంతరం న్యాయ, జలవనరుల శాఖల అధికారులను జైరాం పిలిపించుకుని మాట్లాడారు. 371డి, 371ఇ అధికరణాలపై కూడా చర్చ జరిపారు. 371ను ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రాయల తెలంగాణ గురించి తనకు తెలియదని జైరాంతో భేటీ అనంతరం షిండే విలేకరులతో అన్నారు. ‘విభజనపై ఇదే చివరి భేటీ. ఈ రోజు జీవోఎం నివేదికను ఆమోదిస్తాం. 5న కేబినెట్ సమావేశం ఉంటుంది. నివేదికను కేబినెట్‌కు అందించాక అంతా ప్రధానే చూసుకుంటారు’ అంటూ వెళ్లిపోయారు.
 
 సీమాంధ్ర మంత్రుల ‘యూటీ’ యత్నాలు
 సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాద్‌పై తాము కోరుతున్న మేరకు ఆంక్షలు విధించేలా చేసేందుకు తుది ప్రయత్నాలు చేశారు. జీవోఎం సమావేశానికి ముందు షిండేను కేంద్ర మంత్రి చిరంజీవి ఆయన కార్యాలయంలో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను శాశ్వత యూటీ చేయాలని మరోసారి ప్రతిపాదించారు. మరో మంత్రి జేడీ శీలం కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్‌ను కలిసి, హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్‌ను పరిగణించాలని కోరినట్టు తెలిసింది. కానీ వారి విజ్ఞప్తికి సానుకూల స్పందన రాలేదని సమాచారం.

‘యూటీతో ఏ ప్రాంతానికీ పెద్దగా లాభం ఉండకపోవచ్చు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతికి అప్పగించే కసరత్తు చేస్తున్నాం’ అని షిండే, సిబల్ చెప్పారంటున్నారు. ఇక జీవోఎం భేటీ అనంతరం షిండే, జైరాంలతో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, శీలం సమావేశమై, ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని కోరారు. అనంతరం బయటికొచ్చిన కావూరి, మీడియాతో మాట్లాడేందుకు ఆస్తకి చూపలేదు. కేంద్రం రాయల తెలంగాణ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోందంటూ వెళ్లిపోయారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని శీలం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement