రాయల తెలంగాణ గురించి నాకు తెలియదు: షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. అయితే దీనిపై జీవోఎం సభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతుండటం గమనార్హం.
తాజాగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే .... రాయల తెలంగాణ ప్రతిపాదన గురించి తనకు ఏమీ తెలియదన్నారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుందని... జీవోఎం నివేదికను ఆరోజే ఆమోదిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదిక అంశం చర్చకు వస్తాయని ఆయన తెలిపారు.
మరోవైపు షిండేతో ఈరోజు ఉదయం జైరాం రమేష్ భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన మంతనాల్లో జీవోఎం తుది నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి కూడా షిండేతో సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. కాగా రాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, లేక రాయల తెలంగాణ అనేది స్ఫష్టత లేకపోవటంతో పాటు ఢిల్లీ నుంచి రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో గందరగోళం నెలకొంది.