GoM report
-
లాక్డౌన్ సడలింపులు : మంత్రుల బృందం కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను సడలించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల బృందం శనివారం ఉదయం జరిగే భేటీలో విస్తృతంగా చర్చించనుంది. మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నుంచి ఎలా బయటకు రావాలనే వ్యూహాలపై ఈ భేటీలో మంత్రుల బృందం సమీక్షించనుంది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఆరోసారి సమావేశమవుతున్న మంత్రుల బృందం లాక్డౌన్ నియంత్రణలను దశలవారీగా సడలించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి తమ నివేదికను అందచేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ను మరోసారి ప్రభుత్వం పొడిగిస్తుందా లేక హాట్‌స్పాట్స్‌కే లాక్డౌన్ నియంత్రణలను పరిమితం చేస్తుందా అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ప్రధాని మోదీ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. హోంమంత్రి అమిత్ షా, పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌లతో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇక రెడ్‌జోన్స్‌ను మినహాయించి ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు నియంత్రణలతో కూడిన సడలింపులను ప్రకటిస్తారని భావిస్తున్నారు. చదవండి : 3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా.. -
బిల్లు సారాంశమిదీ..
-
తెలంగాణ జోష్
ఊరూరా ఉప్పొంగిన సంబురాలు జోరుగా ర్యాలీలు స్వీట్ల పంపిణీ ఎరుపెక్కిన అమరవీరుల స్థూపాలు సాక్షి, నెట్వర్క్: పదిజిల్లాల తెలంగాణ ఏర్పాటుకు సిఫార్సు చేసిన జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడం పట్ల తెలంగాణవాదులు సంబురాలు చేసుకున్నారు. జనం రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఉప్పొంగిన ఉత్సాహంతో డప్పు చప్పుళ్లు, బాణసంచాలు కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. అమరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. దశాబ్దాల కల సాకారమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో తెలంగాణవాదుల సంబురాలు మిన్నంటాయి. ఉదయం బాష్పవాయు గోళాలతో దద్దరిల్లిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో..రాత్రి బాణాసంచా పేలుళ్లు మార్మోగాయి. వందలాది మంది విద్యార్థుల జై తెలంగాణ నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. బ్యాండు మేళాలు,నృత్యాలతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. నాంపల్లిలోని గన్‌పార్క్ వద్ద వివిధ పార్టీల ముఖ్య నాయకులు, తెలంగాణ ప్రజా సంఘాల నేతలు,తెలంగాణవాదులు పెద్దఎత్తున తరలివచ్చి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటు అమరుల త్యాగఫలితమేనని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, చేవెళ్ల, పరిగి, ఇబ్రహీం పట్నం, శంషాబాద్, తాండూరు, మేడ్చల్‌లలో వివిధ పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి సంబరాలు మిన్నంటాయి. టీ జేఏసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోనియాగాంధీ తెలంగాణ అంశంపై ఇచ్చిన మాట నిలుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజలు ఏకమై చేపట్టిన ఉద్యమం ఫలితంగానే తెలంగాణ కల సాకారమైందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తన ఇంట్లో కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు. తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు బాణాసంచా కాల్చారు. మహబూబాబాద్ నెహ్రూ సెంటర్, జనగామ బస్టాండ్ సెంటర్లలో తెలంగాణవాదులు, తెలంగాణ జేఏసీ నేతలు స్వీట్లు పంచుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. పరకాలలో ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆధర్యంలో తెలంగాణ సంబరాలు జరిగాయి. విద్యార్థుల జై తెలంగాణ నినాదాలతో కాకతీయ యూనివర్సీటీ ప్రాంగణం మార్మోగింది. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు ఇంటివద్ద, తెలంగాణ చౌక్‌లో స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా సం ఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో కరీంనగర్లో మిఠాయిలు పంచిపెట్టారు. గోదావరిఖనిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, హుజూరాబాద్, హుస్నాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీజేఏసీ నాయకులు వేడుకలు జరిపారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోందని, పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగొండలో టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి, సీపీఐ, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, స్వీట్లు పంచిపెట్టారు. భువనగిరిలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట, సూర్యాపేటలలో సంబరాలు జరుపుకొన్నారు. -
బిల్లు సారాంశమిదీ..
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి నదీ జలాలు, సహజ వనరుల పంపకాలు, హైదరాబాద్‌లో శాంతి భద్రతల వరకు అనేక అంశాలను పొందుపరిచారు. ఆ వివరాలివీ.. ఒకటో అంశం: సరిహద్దులు, నియోజకవర్గాలు... 1. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటాయి. అవి.. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది శాసనసభ సభ్యులు, 40 మంది శాసనమండలి సభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటాయి. అవి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది శాసనసభ సభ్యులు, 50 మంది శాసనమండలి సభ్యులు, 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. 2. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో రాజ్యాంగంలోని 214వ అధికరణ కింద కొత్త హైకోర్టు ఏర్పడే వరకూ.. ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. 3. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)ని కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగంలోని 315 అధికరణ కింద కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసే వరకూ.. రాష్ట్రపతి అనుమతితో ఆర్టికల్ 315(4) కింద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలంగాణ రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా వ్యవహరిస్తుంది. 4. ప్రస్తుతం మొత్తం 90 మంది సభ్యులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని పునర్వ్యవస్థీకరించటం జరుగుతుంది. తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 50 మంది సభ్యులు ఉంటారు. రెండోది: పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 1. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకూ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి గవర్నర్ ఉంటారు. 2. హైదరాబాద్ నగరం పదేళ్లకు మించని కాలం ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ప్రస్తుతమున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ప్రాంతం ఉమ్మడి రాజధాని ప్రాంతమవుతుంది. 3. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పరిధిలో నివసించే ప్రజలందరి ప్రాణ, స్వేచ్ఛ, ఆస్తుల భద్రతకు సంబంధించిన ప్రత్యేక బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ప్రత్యేకించి.. గవర్నర్ బాధ్యత శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల భద్రతకు సంబంధించిన అంశాలకు విస్తరించి ఉంటుంది. గవర్నర్ ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదించి.. తన సొంత నిర్ణయంతో నిర్వర్తించవచ్చు. గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సలహాదారులు గవర్నర్‌కు సాయం చేస్తారు. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ బాధ్యత గవర్నర్దే. ఈ ఏర్పాటు పదేళ్ల తర్వాత నిలిచిపోతుంది. మూడో అంశం: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి బదిలీ 1. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయటానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజులలోగా ఈ నిపుణుల కమిటీ సిఫారసులు చేస్తుంది. 2. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేయటానికి కేంద్రం సాయం చేస్తుంది, అవసరమైన పక్షంలో వినియోగంలో లేని (డిగ్రేడెడ్) అటవీ భూమిని డీనోటిఫై చేయటం ద్వారా తోడ్పాటునందిస్తుంది. 3. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యలయాలు, సిబ్బంది క్వార్టర్లు, ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లతో సహా అవసరమైన సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందిస్తుంది. నాలుగో అంశం: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి 1. రెండు కొత్త రాష్ట్రాల్లోనూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం.. భౌతిక, సామాజిక మౌలికవసతుల విస్తరణ, ఇతర కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. 2. రెండు కొత్త రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని పెంపొందించటానికి పన్ను రాయితీ ప్రోత్సాహకాలతో సహా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. ఐదో అంశం: శాంతిభద్రతలు, పోలీసు దళాలు... 1. రెండు రాష్ట్రాలూ శాంతిభద్రతల నిర్వహణ కోసం అదనపు పోలీసు బలగాలను సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. హైదరాబాద్‌లో ఐదేళ్ల పాటు అదనంగా ఒక యూనిట్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరిస్తారు. 2. హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం మూడేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి శిక్షణా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సమయంలో ఈ శిక్షణాకేంద్రం కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో ఉంటుంది, దీనికి కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తుంది. ఈ మూడేళ్లలో ఆంధ్ర ప్రదేశ్‌లో తగిన ప్రాంతంలో సరికొత్త అత్యాధునిక గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుంది. మూడేళ్లు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించటం జరుగుతుంది. 3. గ్రేహౌండ్స్ దళాల కార్యకలాపాల కేంద్రాల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకూ ఆర్థిక సాయం చేస్తుంది. 4. ప్రస్తుతమున్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలకు చెందిన సిబ్బంది నుంచి వారి అభీష్టాలను తీసుకున్న తర్వాత.. రెండు రాష్ట్రాల మధ్యా విభజిస్తారు. విభజన తర్వాత ఈ రెండు దళాలూ రెండు రాష్ట్రాల సంబంధిత డీజీపీల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. 5. అవసరమైన పక్షంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో అదనపు కేంద్ర సాయుధ బలగాలను మోహరిస్తుంది. ఆరో అంశం.. నదీ జలాలు, జల వనరులు, సహజ వనరుల పంపిణీ.. కృష్ణా నది జలాల పంపిణీపై ఏర్పాటు చే సిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే బాధ్యతను ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్‌కు అప్పగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిర్దిష్ట గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, నిర్వహణకు రెండంచెల వ్యవస్థ ఉంటుంది. అవి 1.కృష్ణా, గోదావరి జలాల ఉన్నత మండలి. 2. కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ బోర్డులు. 1. ఉన్నత మండలి కూర్పు, విధులు ఇవీ.. * కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్‌గా కృష్ణా, గోదావరి జల మండలిని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అంతర్రాష్ట్ర జల నిర్వహణ బోర్డులను ఈ మండలి పర్యవేక్షిస్తుంది. * కృష్ణా, గోదావరి బేసిన్లో కొత్త ప్రాజెక్టు కట్టాలంటే అందుకు మండలి ఆమోదముద్ర తప్పనిసరి. * రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏర్పడితే సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు మండలి తోడ్పడుతుంది. * భవిష్యత్తులో నదీ జలాలపై ఏర్పడే సమస్యలేవైనా కృష్ణా, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ పరిధిలోకి రాకుంటే.. వాటిని కేంద్రం ఏర్పాటు చేసే కొత్త ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. 2. కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ బోర్డు పనితీరు ఇదీ.. * ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోపు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ బోర్డులను ఏర్పాటు చేస్తుంది. * కృష్ణా జల వనరుల బోర్డు ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. గోదావరి జల వనరుల బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉంటుంది. * రెండు బోర్డులకు ఒక్కో చైర్మన్ ఉంటారు. వీరిని (కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి/అదనపు కార్యదర్శి హోదా ఉన్న అధికారులు) కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరేసి అధికారులను సభ్యులుగా నియమిస్తుంది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉన్న ఇద్దరు అధికారులను ఈ రెండు బోర్డులకు పూర్తిస్థాయి కార్యదర్శిగా నియమిస్తారు. * కృష్ణా, గోదావరిపై ఉన్న జలాశయాలు, ప్రాజెక్టులు, కాలువలు, హైడల్ ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ తదితర బాధ్యతలను ఈ బోర్డులు పర్యవేక్షిస్తాయి. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీని పర్యవేక్షిస్తాయి. * పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రాజెక్టును నిర్మిస్తుంది. * బోర్డుల నిర్వహణకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తాగునీరు, సాగునీటి మధ్య డిమాండ్ తలెత్తితే తొలి ప్రాధాన్యం తాగునీటికే ఇవ్వాలి. * జల మండలి, బోర్డులు తీసుకున్న నిర్ణయాలను పాటించని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ జరిమానాలు విధిస్తుంది. బొగ్గు పంపకాలు ఇలా.. * సింగరేణి కాలరీస్ కంపెనీలో 51 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానికి, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. * సింగరేణి బొగ్గు కేటాయింపులు యథాతథంగా ఉంటాయి. * కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బొగ్గు పంపిణీ విధానానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు కొత్త బొగ్గు కేటాయింపులు ఉంటాయి. సహజ వాయువు.. * కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశాల ప్రకారం సహజ వాయువు కేటాయింపు ఉంటుంది. * చమురు, సహజవాయువు ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అయితే దానిపై రాయల్టీ అదే రాష్ట్రానికి చెందుతుంది. ఏడో అంశం: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా 1. ఏపీ జెన్కో యూనిట్లను భౌగోళిక ప్రాంతాల ఆధారంగా విభజిస్తారు. 2. ప్రస్తుతం ఆయా డిస్కమ్‌లతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. నడుస్తున్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కొనసాగుతాయి. 3. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆరు నెలల వరకూ ఉమ్మడి నియంత్రణ మండలిగా కొనసాగుతుంది. ఆ కాలంలో రెండు రాష్ట్రాలూ తమకు ప్రత్యేకంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు ఏర్పాటు చేసుకోవాలి. 4. ప్రస్తుతం ఉన్న స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) రెండేళ్ల పాటు ఇరు రాష్ట్రాల కు ఉమ్మడిగా కొనసాగుతుంది. ఆ సమయంలోగా ఇరు ప్రాంతాల్లోనూ ఎస్ఎల్డీసీలను ఏర్పాటుచేసుకోవాలి. రెండేళ్ల కాలవ్యవధి సమయంలో ప్రస్తుత ఎస్ఎల్డీసీ బెంగళూరులో ఉన్న ఆర్ఎల్డీసీ నేతృత్వంలో పనిచేస్తుంది. 5. ఇరు రాష్ట్రాల్లోనూ ట్రాన్స్మిషన్ కేంద్రాలు నిర్మాణం అయ్యే అంతవరకు ఏపీ ట్రాన్స్‌కో రెండింటి అవసరాలను తీర్చేందుకు పనిచేస్తుంది. ఇరు రాష్ట్రాల్లోని 132 కేవీ, అంతకుమించిన విద్యుత్ లైన్లను అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐటీఐఎస్)గా పరిగణించటం జరుగుతుంది. పూర్తిగా ఏదైనా ఒక ప్రాంతంలోనే ఉన్న ట్రాన్స్మిషన్ లైన్లు ఆ రాష్ట్రానికే చెందుతాయి. వాటి నిర్వహణను సంబంధిత రాష్ట్రాలే చేపట్టాల్సి ఉంటుంది. 6. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి విద్యుత్ ఉత్పత్తిని గత ఐదేళ్ల సగటు విద్యుత్ వాడకం ఆధారంగా పంపిణీ చేస్తారు. 7. కర్నూలు, అనంతపురం జిల్లాలను ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ పంపిణీ సంస్థకు కేటాయిస్తారు. ఎనిమిదో అంశం: ఆస్తులు, అప్పుల విభజన... రాష్ట్ర సంస్థల ఆస్తులు, అప్పుల విభజన ఇలా ఉంటుంది... (1) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా వాణిజ్య, పారిశ్రామిక సంస్థకు చెందిన ఆస్తులు, అప్పులు.. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నదనే అంశంతో సంబంధం లేకుండా.. ఆ సంస్థ లేదా అందులోని ఒక భాగం ప్రత్యేకించి ఒక స్థానిక ప్రాంతంలో ఉన్నట్లయితే; లేదా ఆ సంస్థ కార్యకలాపాలు ఒక స్థానిక ప్రాంతానికి పరిమితమైనట్లయితే.. ఆ ప్రాంత రాష్ట్రానికే చెందుతాయి. ఆ సంస్థ కార్యకలాపాలు అంతర్రాష్ట్రంగా మారేట్లయితే.. (ఎ) ఆ సంస్థకు సంబంధించి పనిచేస్తున్న యూనిట్లను అవి ఉన్న ప్రాంతం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకూ పంచాలి. (బి) ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంచాలి. ఆస్తులు, అప్పుల విభజన తర్వాత.. వాటిని ఉమ్మడి అంగీకారంతో చెల్లింపులు, సర్దుబాట్ల ద్వారా లేదా అంగీకరించిన మరేదైనా పద్ధతిలో గానీ భౌతికంగా బదిలీ చేయాలి. 2. పెన్షన్లకు సంబంధించిన అంశాలు జనాభా ప్రాతిపదికన ఉంటాయి. 3. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెలకొల్పిన రిజిస్టర్డ్ సొసైటీలు, సహకార సంఘాలు, ఆర్గనైజేషన్లు, కార్పొరేషన్లు, కంపెనీలు, ట్రస్టుల ఆస్తులు, అప్పుల విభజన అవి ఉన్న ప్రాంతాల ప్రాతిపదికగా ఉండాలి. ఇవి రెండు రాష్ట్రాలోనూ ఉన్నట్లయితే విభజన జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఉంటుంది. 4. (రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజున..) ఆర్బీఐ, ఎస్బీఐలలో ఉన్న ప్రభుత్వ ఖాతా, నగదు నిల్వలను రెండు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంచాలి. 5. ప్రభుత్వ అప్పులను జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంచాలి. 6. ఏదైనా వాణిజ్య సంస్థకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించే స్వల్పకాలిక రుణానికి సంబంధించిన బాధ్యత.. ఆ సంస్థ నెలకొని ఉన్న ప్రాంతానికి చెందిన రాష్ట్రానిదే అవుతుంది. అలా లేని పక్షంలో.. దానిని జనాభా నిష్పత్తి ప్రాతిపదికన విభజించాలి. 7. భవిష్యనిధి బాధ్యత సంబంధిత ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఏ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ రాష్ట్రానిదే అవుతుంది. 8. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడో ఆర్థిక సంఘం చేసిన కేటాయింపులను.. కొత్త రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం విభజిస్తుంది. 9. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించి.. కేంద్రం తగిన కేటాయింపులు చేయవచ్చు. 10. కాంట్రాక్టులకు సంబంధించి.. ఆయా కాంట్రాక్టుల ప్రయోజనం ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రత్యేకమైనట్లయితే.. ఆ బాధ్యత ఆ రాష్ట్రానికే చెందుతుంది. అలా కాని పక్షంలో.. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాలూ బాధ్యత వహించాలి, ఆయా రాష్ట్రం తన వంతు మొత్తాన్ని చెల్లించాలి. 11. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులను విభజించిన తర్వాత.. కొత్త రాష్ట్రానికి కేటాయించాల్సిన వాటిని, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రానికి అందించాల్సిన మొత్తాన్ని.. కేంద్ర ప్రభుత్వం భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్‌ను సంప్రదించిన తర్వాత ఆదేశిస్తుంది. దీనికి సంబంధించి ఏ వివాదాన్నయినా ఉమ్మడి అంగీకారంతో పరిష్కరించుకోవాలి. లేనిపక్షంలో కాగ్‌ను సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పరిష్కరిస్తుంది. తొమ్మిదో అంశం.. సబార్డినేట్, అఖిల భారత సర్వీసుల్లోని ఉద్యోగుల పంపిణీ పరిపాలన కొనసాగేందుకు వీలుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులందరూ చివరి కేటారుుంపులు జరిగేంతవరకు తాత్కాలికంగా తమ తమ పోస్టుల్లో కొనసాగాలి. పాలన సాఫీగా సాగేందుకు ఇటు అఖిల భారత సర్వీసు అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను (సచివాలయం, డెరైక్టరేట్లు, హెచ్ఓడీలు సహా) కేటాయించే అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయంలో సహాయ పడేందుకు కేంద్రం ఒకటి లేదా అంతకుమించి సలహా మండళ్లను ఏర్పాటుచేస్తుంది. అరుుతే కేటారుుంపులను నిర్ధారించిన తర్వాత ఏదైనా లోటును అధిగమించేందుకు వీలుగా అఖిల భారత సర్వీసులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఒక రాష్ర్టం నుంచి మరో రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై పంపవచ్చు. లోకల్, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు సంబంధించినంత వరకు.. ఉద్యోగులు నియమిత తేదీన, లేదా ఆ తర్వాత ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారో అక్కడే, అలాగే యధాతథంగా కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013లోని నిబంధనల మేరకు పరిశీలనానంతరం.. తాను ఇచ్చిన ఉత్తర్వుల సవరణ సహా మిగతా వాటిని కూడా సమీక్షించే అధికారాలు కేంద్రానికి ఉండాలి. ఆంధ్రప్రదేశ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 చట్టరూపం దాల్చినప్పుడు లేదా ఆ తర్వాత కేంద్రం ప్రత్యేకంగా ఈ కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయూలి. సలహామండళ్ల సిఫారసుల మేరకు కేంద్రం ఉద్యోగుల ఆప్షన్‌ను కోరిన తర్వాత మాత్రమే ఉద్యోగుల వాస్తవ కేటాయింపు జరగాలి. సలహా మండలి లేదా మండళ్లను.. బిల్లు చట్ట రూపం దాల్చిన 30 రోజుల్లోగా నియమించాలి. నియమిత తేదీ, అలాగే ఆ తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు అఖిల భారత సర్వీసుల కేడర్లు ఏర్పాటు చేయూలి. కొత్తగా నియమించేవారిని విభజనానంతరం తక్షణమే వేర్వేరు కేడర్లకు కేటాయించాలి. పాలన కొనసాగేందుకు వీలుగా.. విధుల్లో ఉన్న అధికారులను కేడర్లకు కేటాయించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయూలి. రాష్ట్ర ప్రభుత్వరంగ, కార్పొరేషన్లు, అటానమస్ సంస్థలకు చెందిన ఉద్యోగులు నియమిత తేదీ నుంచి ఏడాది పాటు ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారో అక్కడే, అలాగే పనిచేయూలి. పదో అంశం: 371 డి విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన 371 (డీ) రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది. ఈ విషయమై తగిన రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ కోసం రెండు రాష్ట్రాలూ ప్రతిపాదనలు సమర్పించాలి. పదకొండో అంశం.. విద్య: రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యావకాశాలు కల్పించేందుకు.. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్ వృత్తి విద్యా కళాశాలలు, సంస్థల్లో ఐదేళ్లకు మించకుండా ప్రస్తుతమున్న ప్రవేశ కోటాలనే కొనసాగించాలి. ఈ సమయంలో ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ కూడా కొనసాగాలి. 12, 13 ప్రణాళికా కాలాల్లో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ప్రాధాన్యమున్న సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీటిలో ఒక ఐఐటీ, ఒక ఎన్ఐటీ, ఒక ఐఐఎం, ఒక ఐఐఎస్ఈఆర్, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ వర్సిటీ, ఒక ట్రిపుల్ ఐటీ కూడా ఉండాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ టీచింగ్ ఇనిస్టిట్యూషన్‌ను ఏర్పాటు చేయూలి. తెలంగాణలో ఓ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి. మౌలికసదుపాయాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుగ్గిరాజుపట్నం వద్ద భారీ ఓడ రేవును అభివృద్ధి చేయూలి. మొదటి దశ 2018 చివరికల్లా పూర్తికావాలి. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ‘సెయిల్’ తరహా ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ అభివృద్ధి అవకాశాలను ఐఓసీ/హెచ్‌పీసీఎల్ పరిశీలించాలి. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లోని ప్రస్తుత విమానాశ్రయాలను విస్తరించేందుకున్న అవకాశాలను పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్రంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు అవకాశాలను ఎన్టీపీసీ పరిశీలించాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కొత్త రైల్వేజోన్ ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లను మెరుగుపరిచేందుకు నేషనల్ హైవే అథారిటీ తగు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించాలి. రైలు సౌకర్యాలు మెరుగుపరచాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు రాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. -
ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయ్యింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక తదితర అంశాలపై చర్చ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కానున్న విషయం తెలిసిందే. కాగా జీవోఎం సభ్యులు మాత్రం పూటకో రకమైన ప్రకటనలతో సీమాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. రాయల తెలంగాణను కాదనలేమని జైరాం రమేష్ అంటుంటే..... చిదంబరం మాత్రం రాయల తెలంగాణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్ఎస్తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి అజిత్ సింగ్ తెలిపారు. -
ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభం అయ్యింది. రాష్ట్ర విభజనపై జీవోఎం తుది నివేదికను ఖరారు చేయనుండటం, కేంద్ర కేబినెట్ దానికి ఆమోదముద్ర వేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక, రాయల తెలంగాణ, అసెంబ్లీ సమావేశాల తేదీలకు సంబంధించి ప్రధాన చర్చ సాగవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీకి హాజరవ్వాల్సి ఉండడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కొందరు రాష్ట్ర మంత్రులు సోమవారం నాటి తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై తెలంగాణ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో కేబినెట్ భేటీలో ఏం జరగబోతుందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. -
రాయల తెలంగాణ గురించి నాకు తెలియదు: షిండే
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. అయితే దీనిపై జీవోఎం సభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతుండటం గమనార్హం. తాజాగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే .... రాయల తెలంగాణ ప్రతిపాదన గురించి తనకు ఏమీ తెలియదన్నారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుందని... జీవోఎం నివేదికను ఆరోజే ఆమోదిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదిక అంశం చర్చకు వస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు షిండేతో ఈరోజు ఉదయం జైరాం రమేష్ భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన మంతనాల్లో జీవోఎం తుది నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి కూడా షిండేతో సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. కాగా రాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, లేక రాయల తెలంగాణ అనేది స్ఫష్టత లేకపోవటంతో పాటు ఢిల్లీ నుంచి రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో గందరగోళం నెలకొంది. -
సోనియా గాంధీకి తెలంగాణపై జిఓఎం నివేదిక
న్యూఢిల్లీ: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) తెలంగాణపై ఒక నివేదిక సమర్పించింది. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జయరామ్, ఎకె ఆంటోనీ సోనియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిగ్విజయ్ సింగ్, చిదంబరం కూడా పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల బృందం ఇంతకాలం కసరత్తు చేసిన తయారు చేసిన నివేదికను ఆమెకు అందజేశారు. సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చిస్తారు. తెలంగాణ బిల్లు డ్రాప్ట్‌కు తుది రూపం ఇచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి జిఓఎం తుది సమావేశం జరుగనుంది. ఆ రోజు నివేదిక తుదిరూపం దాల్చుతుంది. అందు కోసం సోనియా గాంధీ సూచనలు, సలహాలు ఇస్తారు. -
ముహూర్తం మార్పు?
-
సీఎం కిరణ్ ఉత్తి పోషయ్యే!: ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తి పోషయ్యే అని తేలిపోయిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం అబద్ధాలకోరుగా చరిత్రలో మిగిలిపోతున్నారన్నారు. జీవోఎంకు ఇచ్చిన 89 పేజీల నివేదికలో పచ్చి అబద్దాలు, అవాస్తవాలను పేర్కొన్నారని ఈటెల విమర్శించారు. తెలంగాణను ఆపి తీరుతానని మూడు నెలలుగా చెబుతూ ఉంటే తెలంగాణ ప్రజలే కాదు, సీమాంధ్ర ప్రజలు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌ను చేతకాని పోషయ్య అని అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు కిరణ్‌కుమార్‌రెడ్డిపై విశ్వాసమే లేదని, అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హతలేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలతో అమెరికా ప్రతినిధుల భేటీ రాష్ట్రం విడిపోయిన తర్వాత వివిధ అంశాలపై తెలంగాణ ప్రభుత్వ విధివిధానాలను తెలుసుకునేందుకు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు తమను కలిశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధులు స్ట్రావెస్ సోవరీ, మరియా గురువారం కేటీఆర్, శ్రవణ్‌తో భేటీ అయ్యారు. -
ముహూర్తం మార్పు?
తెలంగాణ బిల్లు, నివేదిక ఖరారు.. మేడం ఓకే అన్నాకే కేబినెట్‌కు! నేడు కోర్‌కమిటీ ముందుకు బిల్లు, నివేదిక తూతూ మంత్రంగా ముగిసిన జీవోఎం భేటీ 27న మరో సమావేశం.. చిదంబరం, ఆజాద్ లేనందుకేనన్న షిండే జీవోఎం నివేదిక ‘గోవిందా....గోవిందా’ అని నవ్వుతూ వెళ్లిపోయిన జైరాం వారి వ్యాఖ్యల లోగుట్టుపై సర్వత్రా చర్చ ప్రధాని లేక కేబినెట్ భేటీ వాయిదా న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును, జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టేందుకు ముందుగా అనుకున్న ముహూర్తం కాస్తా తాజాగా మారిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం పొందాకే బిల్లును, నివేదికను కేబినెట్ ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నిర్ణయించింది. అందులో భాగంగా వాటిని శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశానికి పంపి అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం కోసం ప్రయత్నించనున్నారు. గురువారం జరగాల్సిన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ జైపూర్ పర్యటన కారణంగా వాయిదా పడింది. ఈ నెల 28న తిరిగి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నందున ఆ రోజైనా తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదికలను ప్రవేశపెడతారా, లేక మరికొంత కాలం వాయిదా వేస్తారా అనే దానిపై జీవోఎం సభ్యులు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం వల్లే ప్రస్తుతానికి వాయిదా మంత్రం పఠించాలన్న నిర్ణయానికి వచ్చారని, 28న కేబినెట్ భేటీ ఉన్నందున అందుకు సరిగ్గా ఒకరోజు ముందు 27న జీవోఎం సభ్యులంతా సమావేశమై విభజన బిల్లును, నివేదికను ఆమోదిస్తారని ప్రచారం జరుగుతోంది. పట్టుమని పది నిమిషాలు మరోవైపు గురువారం జరిగిన జీవోఎం భేటీ తూతూ మంత్రంగా ముగిసింది. ఉదయం 11.30 గంటలకు నార్త్‌బ్లాక్‌లో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణసామి పదంటే పది నిమిషాలే గడిపి వెళ్లారు. ఈ సందర్భంగా జీవోఎం నివేదిక అంశాన్ని విలేకరులు ప్రస్తావించినా,‘షిండే మాట్లాడతారు’అని మంత్రులంతా ముక్తసరిగా బదులిస్తూ వెళ్లిపోయారు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన జైరాం కూడా అదే మాట చెప్పారు. ఇంతకూ జీవోఎం నివేదిక ఖరారైందా, మళ్లీ సమావేశాలేమైనా ఉంటాయా, లేక ఇదే చివరిదా అని విలేకరులు రెట్టించి అడగడంతో, ‘జీవోఎం రిపోర్టా.. గోవిందా.. గోవిందా...!’ అని బదులిస్తూ, విలేకరులకు ఓ నమస్కారం పెడుతూ వెళ్లిపోయారు. దాంతో ఆయన మాటలు, హావభావాలే సర్వత్రా చర్చనీయంగా మారాయి. వాస్తవానికి గురువారం నాటి జీవోఎం భేటీకి సభ్యులంతా హాజరై, నివేదికను ఆమోదించి కేబినెట్‌కు పంపుతామని బుధవారం జైరామే మీడియాకు చెప్పడం తెలిసిందే. అలాంటిది ఆయనిలా నిర్వేదం వ్యక్తం చేయడం వెనక మతలబేమిటన్నది ఆసక్తికరంగా మారింది. జైరాం వెళ్లిన 20 నిమిషాలకు బయటకొచ్చిన షిండే నేరుగా విలేకరుల వద్దకు వస్తూ, ‘మీటింగ్ అయిపోయింది. చిదంబరం, ఆజాద్ ఈ రోజు సమావేశానికి రాలేదు. అందుకే భేటీని వచ్చే వారానికి వాయిదా వేశాం. విదేశాల నుంచి చిదంబరం ఎప్పుడొస్తారో తెలుసుకుని సమావేశ తేదీని ఖరారు చేస్తాం. సాధ్యమైనంత తొందర్లో నివేదికను ఖరారు చేస్తాం’’ అని బదులిచ్చారు. ఆపై విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. షిండే వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కేంద్ర మంత్రి విదేశీ పర్యటన ఎంతో ముందుగానే ఖరారవుతుంది. చిదంబరం విదేశాలకు వెళ్తున్నట్టు షిండేకు తెలియకపోయే ఆస్కారముండదు. అయినా ఆ విషయం గురువారం నాటి భేటీ దాకా తెలియదన్నట్టుగా షిండే వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతా వ్యూహాత్మకమే! కాంగ్రెస్ వర్గాలు మాత్రం తాము అడుగడుగునా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నామని చెబుతున్నాయి. అంతా సోనియా ఆదేశాల మేరకే జరుగుతోందని పేర్కొన్నాయి. అయితే విభజన నిర్ణయం అమలుపై కాంగ్రెస్ గట్టిగా ఉన్నా ఆ మేరకు రాజకీయ లబ్ధి మాత్రం కలగడం లేదని వాపోతున్నాయి. దీనికి తోడు సీమాంధ్రలో పార్టీ బలోపేతానికి తాము వేసిన ఎత్తులు ఫలవంతం కాకపోవడంవల్లే విభజన బిల్లు, జీవోఎం నివేదికలను జాప్యం చేయాల్సి వస్తోందంటున్నాయి. తెలంగాణ నిర్ణయం తీసుకున్నాక కూడా ఆ ప్రాంతంలో పార్టీ ఆశించిన స్థాయిలో బలపడకపోవడం ఏఐసీసీ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తోందని చెబుతున్నాయి. ఇక తెలంగాణ ఏర్పాటు కొత్త సవాళ్లకు దారి తీస్తుందంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చేసిన వ్యాఖ్యల వెనుక కూడా కాంగ్రెస్ ఎత్తుగడలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సొంత పార్టీతో పాటు ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా, మరెన్ని ఇబ్బందులు పెట్టినా పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా విభజన బిల్లును సోనియా పట్టుదలగా ముందుకు తీసుకెళ్తున్నారనే భావన కలిగించి, రాబోయే ఎన్నికల్లో లబ్ధ్ది పొందేందుకే విషయాన్ని కొద్దిగా జాప్యం చేస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా కొత్త ఏడాది ఆరంభంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కేంద్రం ఎంత గట్టిగా చెబుతున్నా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే పరిస్థితి కన్పించడం లేదని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి విభజన బిల్లును ఆమోదింపజేసుకుని తెలంగాణ ప్రజలందరినీ తమవైపు ఆకర్షించుకోవాలనే ఎత్తుగడలో ఉన్నట్టు చెబుతున్నాయి! నార్త్ బ్లాక్‌లో కావూరి, జేడీ శీలం విభజన నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై రూపొందించిన 10 పేజీల నివేదికను కేబినెట్ భేటీలో ప్రవేశపెడతారన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నార్త్ బ్లాక్‌కు వచ్చి జీవోఎం సభ్యులను కలిశారు. గంటపాటు జీవోఎం సభ్యులతో సమావేశమయ్యారు. జీవోఎం నివేదికను ఈ వారం కేబినెట్లో ప్రవేశపెట్టడం లేదని తెలుసుకుని.. నార్త్ బ్లాక్ వెనక నుంచి మీడియా కంటబడకుండా వెళ్లిపోయారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయకుంటే రాజీనామా చేస్తామని మంత్రులు హెచ్చరించారని వారి సన్నిహితులు చెబుతున్నారు. వారి ప్రత్యర్థులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. యూటీ ప్రతిపాదనను జీవోఎం సభ్యులు తిరస్కరించడమే గాక మంత్రులను ఏ మాత్రమూ పట్టించుకోలేదని, అందుకే మీడియాకు ఏం చెప్పాలో తెలియక వెనుక గేటు గుండా వెళ్లిపోయారని అంటున్నారు! -
విభజన నివేదిక ఖరారుపై కొనసాగుతున్న కసరత్తు
న్యూఢిల్లీ : నార్త్‌బ్లాక్‌లో జీవోఎం సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజనపై తుది నివేదిక విషయంలో జీవోఎం చర్చలు జరుపుతోంది. శుక్రవారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన విధివిధానాలపై.. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రిలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేసిన జీవోఎం.. గురువారం కూడా విభజన నివేదిక ఖరారుపై కసరత్తు కొనసాగింది. నివేదిక వచ్చేవారం కేంద్ర కేబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే కేంద్రమంత్రి చిదంబరం సింగపూర్ వెళ్లడంతో తుది నివేదిక విషయంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం జీవోఎం సభ్యులు కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరాం రమేష్‌తో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం భేటీ అయ్యారు. కాగా జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకోవటంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్యాకేజీల కోసం తాము చేసిన డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. -
జీవోఎం అసమగ్ర నివేదికిస్తే సుప్రీంను ఆశ్రయిస్తాం
బెంగళూరు, న్యూస్‌లైన్: జీవోఎంలో అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే నివేదిక ఇవ్వాలని, లేకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని యూపీఏ భాగస్వామ్య పార్టీలను కోరుతున్నామని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని మాజీ ప్రధాని దేవెగౌడను కోరడానికి బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు డ్రామాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 11 అంశాలపై సమగ్రమైన చర్చ జరగకుండానే జీవోఎం నివేదికను సిద్ధం చేస్తోందని ధ్వజమెత్తారు. విద్య, ఉద్యోగాలు, నీటి పంపకం, రాష్ర్ట సరిహదులపై చర్చించకుండానే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రవాసాంధ్రులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీ రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రైవేటు విద్యా సంస్థల అధ్యక్షుడు చిరంజీవిరెడ్డి, ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ గంగప్ప, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి, సీపీ. బ్రౌన్ సేవా సమితి అధ్యక్షుడు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రస్తుత సరిహద్దుల మేరకే విభజించాలి: సురవరం సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పరిధిలో ప్రస్తుతమున్న సరిహద్దుల ప్రకారమే యథాతథంగా విభజించాలంటూ సీపీఐ మంగళవారం కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) నివేదిక సమర్పించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నివేదికను ఖరారు చేసి మెయిల్ ద్వారా పంపారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ కోరినట్టుగా 11 అంశాలపై సూచనలు చేశారు. ప్రస్తుతమున్న సరిహద్దుల ప్రకారమే ఉభయ ప్రాంతాలను విభజించాలని, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా యధాతథంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారిలో భయాందోళనలను తొలగించేలా శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికలకు సమాయత్తం కండి: సురవరం పొత్తులు, ఎత్తులు ఎలా ఉన్నా, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ధన, కుల, మత ప్రభావం పెరిగినప్పటికీ సానుకూల అంశాలతో ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సూచించారు. మూడు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం హైదరాబాద్ శివార్లలోని యాప్రాల్‌లో ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా రాష్ట్ర సమితి సమావేశాలను సురవరం సుధాకర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు అవకాశవాద వైఖరిని అవలంభిస్తున్నాయని సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానన్న చంద్రబాబు ప్రస్తుతం అదే పార్టీ వైపు చూస్తున్నారంటూ ఉదహరించారు.